మోహన్‌లాల్ లోహార్‌కు గుర్తున్నంత వరకు, సుత్తె దెబ్బల శబ్ద మాధుర్యానికి మోహితుడయ్యేవారు. లయబద్ధమైన ఆ గణగణమనే చప్పుడును వింటూ, వాటిని రూపొందించడమే తన జీవితకాల అభిరుచిగా మారుతుందని తెలుసుకుని మరీ పెరిగారు.

మోహన్‌లాల్ రాజస్థాన్‌లోని బార్‌మేర్ జిల్లాలో ఉన్న నంద్ గ్రామంలో ఒక లోహార్‌ల (కమ్మరులు) ఇంటిలో పుట్టారు. తనకు ఎనిమిదేళ్ళ వయసులో తన తండ్రి, గతించిన భవ్రారామ్ లోహార్‌కు సుత్తెలు, ఇంకా ఇతర ఉపకరణాలను అందిస్తూ ఈ పనిని ప్రారంభించారు. "నేనెన్నడూ బడికి వెళ్ళలేదు. ఈ సామగ్రితో ఆడుకుంటూ ఉండేవాడిని," అని ఆయన చెప్పారు.

ఈ కుటుంబం రాజస్థాన్‌లో ఇతర వెనుకబడిన కులాల జాబితా కింద నమోదైన గడులియా లోహార్ సముదాయానికి చెందినది. వీరు మార్వాడీ, హిందీ భాషలను మాట్లాడుతారు. మోహన్‌లాల్ ఐదు దశాబ్దాల క్రితం 1980ల ప్రారంభంలో మరింత పనికోసం వెదుక్కుంటూ జైసల్మేర్‌కు వచ్చినప్పుడు యుక్తవయసులో ఉన్నారు. అప్పటినుంచీ ఆయన వివిధ రకాలైన అల్యూమినియం, వెండి, స్టీల్ లోహాలతోనే కాకుండా ఇత్తడిని కూడా ఉపయోగించి మోర్చంగ్‌లను తయారుచేశారు.

"అలా లోహపు ముక్కను తాకటంతోనే, అది మంచి ధ్వనిని ఇస్తుందో లేదో నేను చెప్పగలను," అని జైసల్మేర్ ఇసుక తిన్నెల మీదుగా సంగీతాన్ని వినిపించే మోర్చంగ్‌లను రూపొందించేందుకు 20,000 గంటలకు పైగా ఎర్రగా కాలిన ఇనుముతోనూ సుత్తెతోనూ గడిపిన మోహన్‌లాల్ చెప్పారు.

"మోర్చంగ్‌ను తయారుచేయటం కష్టమైన పని," అన్నారు 65 ఏళ్ళ మోహన్‌లాల్. ఇప్పటివరకూ తాను ఎన్ని మోర్చంగ్‌లను చేసి వుంటానో తనకు గుర్తులేదని అంటారాయన: " గిన్‌తీ సే బాహర్ హైఁ వో [లెక్కకు మించి ఉంటాయి]."

మోర్సింగ్ అని కూడా పిలిచే ఈ మోర్చంగ్ సుమారు 10 అంగుళాల పొడవుండి గుర్రపుడెక్క ఆకారపు లోహపు రింగుకు రెండు సమాంతర ఫోర్కులతో జతచేసి ఉంటుంది. వాటి మధ్య ట్రిగ్గర్ అని పిలిచే ఒక లోహపు నాలుక ఉంటుంది, దాని ఒక చివర కదలకుండా స్థిరంగా బిగించి ఉంటుంది. వాద్యకారుడు దానిని తన ముందు పళ్ళతో బిగించి పట్టుకొని దాని గుండా ఊపిరి పీల్చి వదులుతుంటారు. ఒక చేతితో మోర్చంగ్ నాలుకను కదిలించటం ద్వారా సంగీత స్వరాలను పలికిస్తూ, రెండవ చేతిని లోహపు కమ్మీని బిగించి పట్టుకోవడానికి ఉపయోగిస్తారు.

Mohanlal Lohar is a skillful instrument maker as well as a renowned morchang player who has spent over five decades mastering the craft. Morchang is a percussion instrument heard across Jaisalmer’s sand dunes
PHOTO • Sanket Jain
Mohanlal Lohar is a skillful instrument maker as well as a renowned morchang player who has spent over five decades mastering the craft. Morchang is a percussion instrument heard across Jaisalmer’s sand dunes
PHOTO • Sanket Jain

నైపుణ్యం కలిగిన వాయిద్య తయారీదారుడు, ఐదు దశాబ్దాలకు పైగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించిన ప్రఖ్యాత మోర్చంగ్ వాద్యకారుడు మోహన్‌లాల్ లోహార్. మోర్చంగ్ జైసల్మేర్ ఇసుక తిన్నెల మీదుగా మధురమైన సంగీతాన్ని వినిపించే ఒక తాళ వాయిద్యం

ఈ వాయిద్యం కనీసం 1500 ఏళ్ళ పాతది. "పశువులను మేతకు తీసుకువెళ్ళే పశుల కాపరులు మోర్చంగ్‌ను వాయిస్తారు," అన్నారు మోహన్‌లాల్. ఆ సంగీతం, ఆ వాయిద్యం కూడా దానిని వాయిస్తూ అనేక దూరాలను కలియదిరిగే పశులకాపరులతో పాటు ప్రయాణం సాగించటంతో, దాని పేరు కూడా విస్తరించి రాజస్థాన్ వ్యాప్తంగా, ప్రత్యేకించి జైసల్మేర్, జోధ్‌పుర్ జిల్లాలలో ప్రజాదరణ పొందింది.

ఇప్పుడు 60ల వయసులో ఉన్న మోహన్‌లాల్‌కు ఒక మోర్చంగ్ తయారుచేయటానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. అయితే, ఇంతకుముందు ఆయన రోజుకు రెండు మోర్చంగ్‌లను సులభంగా చేయగలిగేవారు. "నేను రోజుకు ఒక్క మోర్చంగ్‌నే తయారుచేస్తున్నాను, ఎందుకంటే నేను దాని నాణ్యత గురించి రాజీ పడదల్చుకోలేదు," అంటూ, "ఇప్పుడు నా మోర్చంగ్‌లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి," అని కూడా చెప్పారాయన. పర్యాటకులు అమితంగా ఇష్టపడే సూక్ష్మరూపంలో ఉండే మోర్చంగ్ పతకాలను (లాకెట్స్) చేయటంలో కూడా ఆయన నైపుణ్యం సాధించారు.

తగిన లోహాన్ని (ఇనుము) గుర్తించడం కష్టం, ఎందుకంటే "ఒక మంచి మోర్చంగ్‌ను తయారుచేయటానికి అన్ని లోహాలూ పనికిరావు," అని చెప్పారాయన. ఉత్తమమైన ఇనుమును కనిపెట్టే నైపుణ్యాన్ని సాధించడానికి ఆయనకు ఒక దశాబ్దకాలానికి పైగా పట్టింది. ఆయన జైసల్మేర్ నుంచి ఇనుమును కిలో సుమారు 100 రూపాయలకు కొంటారు; ఒక మోర్చంగ్ బరువు 150 గ్రాములకు మించదు, వాద్యకారులు కూడా తక్కువ బరువున్న వాటికి ప్రాధాన్యమిస్తారు.

మోహన్‌లాల్ కుటుంబం ఇప్పటికీ సంప్రదాయ కమ్మరి కొలిమినే ఉపయోగిస్తోంది, దీనిని మార్వాడీ భాషలో ధామన్ అని పిలుస్తారు. "జైసల్మేర్ నగరం మొత్తంలో మరెక్కడా మీకు ఇలాంటి కొలిమి కనిపించదు," అని ఆయన చెప్పారు. "ఇది నూరేళ్ళకు పైగా వయసున్నది, ఇప్పటికీ బాగా పనిచేస్తోంది."

Mohanlal’s family uses a traditional blacksmith forge called dhaman (left) to shape metals . The dhaman is 'at least 100 years old and works perfectly,' he says. With rising temperature, the forge produces a lot of smoke (right), which causes breathing and coughing problems, says Mohanlal
PHOTO • Sanket Jain
Mohanlal’s family uses a traditional blacksmith forge called dhaman (left) to shape metals . The dhaman is 'at least 100 years old and works perfectly,' he says. With rising temperature, the forge produces a lot of smoke (right), which causes breathing and coughing problems, says Mohanlal
PHOTO • Sanket Jain

లోహాలకు ఆకృతిని ఇవ్వడానికి మోహన్‌లాల్ కుటుంబం ఉపయోగించే సంప్రదాయ కమ్మరి కొలిమి ధామన్ (ఎడమ). 'ఈ ధామన్ నూరేళ్ళకు పైగా వయసున్నది, ఇప్పటికీ బాగా పనిచేస్తోంది,' అన్నారతను. ఉష్ణోగ్రత పెంచినపుడు కొలిమి నుంచి ఎక్కువగా పొగ వస్తుంది (కుడి), అది శ్వాస, దగ్గు సమస్యలను తెస్తుందని మోహన్‌లాల్ చెప్పారు

Heating the iron in a forge is challenging as it can cause severe burns, says Mohanlal. Kaluji (right), Mohanlal’s son-in-law, helping him hammer the red-hot iron
PHOTO • Sanket Jain
Heating the iron in a forge is challenging as it can cause severe burns, says Mohanlal. Kaluji (right), Mohanlal’s son-in-law, helping him hammer the red-hot iron
PHOTO • Sanket Jain

కొలిమిలో ఇనుమును వేడిచేయటం సవాళ్ళతో కూడుకున్న పని అనీ, అది తీవ్రమైన కాలిన గాయాలను చేస్తుందనీ మోహన్‌లాల్ అన్నారు. ఎర్రగా కాలిన ఇనుముపై సుత్తెతో కొట్టడంలో మోహన్‌లాల్‌కు సాయం చేస్తోన్న ఆయన అల్లుడు కాలూజీ (కుడి)

కొలిమికి గాలి కొట్టడానికి ఆయన మేక తోలుతో చేసిన రెండు తిత్తులను ఉపయోగిస్తారు. గాలి వెళ్ళే కొయ్య గొట్టాన్ని రోహిదా ( టేకోమెలా అండ్యులేటా - ఎడారి టేకు) చెట్టు నుండి తయారుచేస్తారు. కనీసం మూడు గంటల పాటు నిరంతరాయంగా తిత్తి కొట్టడం ద్వారా ఇనుము వేడెక్కి ఎర్రగా మారుతుంది. ఇది చాలా కష్టమైన పని. శారీరకశక్తిని ఉపయోగించి తిత్తి కొట్టడం వల్ల వీపులోనూ భుజాలలోనూ తీవ్రమైన నొప్పి వస్తుంది. పనిచేసే ప్రదేశంలో ధారాళంగా గాలి వచ్చే సౌకర్యం లేకపోవడం వల్ల ఈ పని చేస్తున్నవారికి శరీరమంతా చెమటతో తడిసిపోతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.

మోహన్‌లాల్ భార్య గిగీదేవి తిత్తికొట్టడంలో ఆయనకు తరచుగా సహాయం చేసేవారు, కానీ వయసు పైబడుతుండటంతో ఇప్పుడు మానేశారు. "మోర్చంగ్‌ను తయారుచేసే మొత్తం ప్రక్రియలో మహిళలు చేయగలిగిన పని ఇదొక్కటే. మిగిలిన పనినంతా సంప్రదాయకంగా మగవాళ్ళే చేస్తారు," అన్నారు 60 ఏళ్ళ వయసున్న గిగీదేవి. వారి కుమారులైన రణ్‌మల్, హరిశంకర్‌లు - ఆరవ తరం లోహార్లు - కూడా మోర్చంగ్‌లను తయారుచేస్తారు.

తిత్తికొట్టడం పూర్తికాగానే, మోహన్‌లాల్ ఒక సండసీ (కమ్మరి పట్టకారు) సాయంతో ఎర్రగా కాలిన ఇనుమును పట్టుకొని, దానిని ఎత్తుగా ఏర్పాటుచేసిన ఒక ఇనుప దిమ్మ - ఆరణ్ - మీద ఉంచుతారు. వెంటనే తన కుడిచేతిలో ఒక సుత్తెను పట్టుకొని, ఎడమచేతితో ఆ ఇనుప ముక్కను కదలకుండా జాగ్రత్తగా పట్టుకుంటారు. మరోక లోహార్ ఒక ఐదు కిలోల బరువున్న సుత్తెను ఉపయోగించి ఆ ఇనుప ముక్కపై కొడుతుండగా, మోహన్‌లాల్ కూడా తన చేతిలోని సుత్తెతో, ఇద్దరూ కలిసి, దానిపై కొడతారు.

లోహార్లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు సుత్తె కొట్టే లయబద్ధమైన చప్పుడు, " ఢోలకి (డోలక్) వాయించినప్పుడు వచ్చే శబ్దాలలాగా వినిపించి మోర్చంగ్‌లు చేయటంపై నన్ను ప్రేమలో పడేలా చేస్తాయి," అంటారు మోహన్‌లాల్.

Some of the tools Mohanlal uses to make a morchang: ( from left to right) ghan, hathoda, sandasi, chini, loriya, and khurpi . 'It is tough to make a morchang ,' says the 65-year-old and adds that he can’t recall how many morchangs he’s made to date: ' g inti se bahar hain woh [there is no count to it]'
PHOTO • Sanket Jain
Some of the tools Mohanlal uses to make a morchang: ( from left to right) ghan, hathoda, sandasi, chini, loriya, and khurpi . 'It is tough to make a morchang ,' says the 65-year-old and adds that he can’t recall how many morchangs he’s made to date: ' g inti se bahar hain woh [there is no count to it]'
PHOTO • Sanket Jain

మోర్చంగ్‌లు తయారుచేయడానికి మోహన్‌లాల్ ఉపయోగించే కొన్ని ఉపకరణాలు: (ఎడమ నుండి కుడికి) ఘన్, హథోడా, సండసీ, ఛేనీ, లోరియాఁ, ఖుర్పీ. 'మోర్చంగ్‌ను తయారుచేయటం కష్టమైన పని,' అంటారు 65 ఏళ్ళ మోహన్‌లాల్. ఇప్పటివరకూ తాను ఎన్ని మోర్చంగ్‌లను చేసి వుంటానో తనకు గుర్తులేదని అంటారాయన: 'గిన్‌తీ సే బాహర్ హైఁ వో [లెక్కకు మించి ఉంటాయి]'

Left: Ranmal, Mohanlal's elder son and a sixth generation lohar, playing the instrument . 'Many people have started using machines for hammering, but we do it using our bare hands even today,' he says.
PHOTO • Sanket Jain
Right: Besides morchangs , Mohanlal has taught himself to craft alghoza, shehnai, murli, sarangi, harmonium and flute
PHOTO • Sanket Jain

ఎడమ: మోర్చంగ్‌ను వాయిస్తోన్న మోహన్‌లాల్ పెద్ద కుమారుడు, ఆరవ తరం కమ్మరి రణ్‌మల్. 'ఇనుమును సాగగొట్టడానికి చాలామంది ఇప్పుడు యంత్రాలను ఉపయోగించడం మొదలుపెట్టారు, కానీ మేం మాత్రం ఈ రోజుకి కూడా మా చేతుల్ని ఉపయోగించే చేస్తాం' అని చెప్పారాయన. కుడి: మోహన్‌లాల్ మోర్చాంగ్ తయారుచేయడమే కాకుండా అల్‌గోజా, షెహనాయి, మురళి, సారంగి, హార్మోనియం, వేణువులను తయారుచేయడంలో కూడా మెళకువలు నేర్చుకున్నారు

మూడు గంటలపాటు సాగే ఈ 'సంగీతం' ఆయన చేతుల్ని వాచిపోయేలా చేస్తుంది. ఈ మూడుగంటల్లో ఆయన 10,000సార్లకు పైగా సుత్తెను ఎత్తి కొట్టాల్సి ఉంటుంది, అది ఏమాత్రం పక్కకు జారినా వేళ్ళకు గాయాలవుతాయి. "గతంలో ఇది నా గోళ్ళను కూడా విరగగొట్టింది. ఈ రకమైన పనిలో గాయాలు కావటం సర్వసాధారణం," నొప్పిని నవ్వుతూ తోసేస్తూ చెప్పారు మోహన్‌లాల్. గాయాలతో పాటు చర్మం కాలిపోవటం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 'ఇనుమును సాగగొట్టడానికి చాలామంది ఇప్పుడు యంత్రాలను ఉపయోగించడం మొదలుపెట్టారు, కానీ మేం మాత్రం ఈ రోజుకి కూడా మా చేతుల్ని ఉపయోగించే చేస్తాం' అని మోహన్‌లాల్ పెద్ద కొడుకు రణ్‌మల్ పేర్కొన్నారు.

సుత్తె కొట్టడం అయ్యాక మోర్చంగ్ చేయటంలోని అతి కష్టమైన భాగం - వేడి ఇనుమును జాగ్రత్తగా ఆకృతిలోకి మలచటం - వస్తుంది. సంక్లిష్టమైన ఆకృతులను చెక్కే ఈ ప్రక్రియకు మరో రెండు గంటల సమయం పడుతుంది. ఆకురాతితో వాయిద్యపు ఉపరితలాన్ని నునుపుగా చేయడానికి రెండు గంటల ముందు దానిని ఒక గంట లేదా రెండు గంటలు చల్లబడటానికి వదిలివేస్తారు. "ఈ ఆకురాయితో రుద్దే ప్రక్రియ మాయాజాలాన్ని సృష్టిస్తుంది. ఇది మోర్చంగ్‌ను అద్దమంత నునుపుగా చేస్తుంది," అని రణ్‌మల్ చెప్పారు.

ప్రతి నెలా మోహన్‌లాల్ కుటుంబానికి కనీసం 10 మోర్చంగ్‌ల కోసం ఆర్డర్‌లు వస్తాయి. మోర్చంగ్ ఒక్కొక్కటి రూ. 1,200 నుండి రూ. 1,500 వరకు అమ్ముడవుతాయి. పర్యాటకులు ఎక్కువగా తరలివచ్చే శీతాకాలంలో ఆ సంఖ్య తరచుగా రెట్టింపు అవుతుంటుంది. "చాలామంది పర్యాటకులు ఇమెయిల్ ద్వారా కూడా ఆర్డర్లు చేస్తారు" అన్నారు రణ్‌మల్. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, అమేరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇంకా అనేక ఇతర దేశాల నుండి ఆర్డర్లు వస్తాయి. మోహన్‌లాల్, ఆయన కుమారులు కూడా రాజస్థాన్ అంతటా జరిగే వివిధ సాంస్కృతిక ఉత్సవాలకు వెళతారు. అక్కడ అమ్మకాలు జరపటంతో పాటు ప్రదర్శనలు కూడా ఇస్తారు.

'ఒకరు రోజంతా పనిచేయాల్సి ఉంటుంది, ఆపైన కొనేవారు దొరికితే వారు 300 నుండి 400 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. ఇది పోషించగలిగేంత ఉండదు,' అని మోహన్‌లాల్ అన్నారు

వీడియో చూడండి: జైసల్మేర్‌కు చెందిన మోర్చంగ్ శిల్పి

తన కుమారులు ఈ కళను ఎంచుకున్నందుకు మోహన్‌లాల్ సంతోషంగా ఉన్నప్పటికీ, జైసల్మేర్‌లో చేతితో మోర్చంగ్‌ను రూపొందించగల కళాకారుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. "ఇంత [మంచి] నాణ్యమైన మోర్చంగ్ కోసం ప్రజలు వెయ్యి రూపాయలు కూడా చెల్లించడానికి ఇష్టపడరు," అని ఆయన చెప్పారు. మోర్చంగ్‌లను రూపొందించడానికి చాలా ఓపిక, శ్రమశక్తి అవసరం, అందుకే చాలామంది దీనిని చేపట్టడానికి ఇష్టపడరు. "ఒకరు రోజంతా పనిచేయాల్సి ఉంటుంది, ఆపైన కొనేవారు దొరికితే వారు 300 నుండి 400 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. ఇది పోషించగలిగేంత ఉండదు," అని మోహన్‌లాల్ అన్నారు

దీన్ని తయారుచేసేటప్పుడు వచ్చే పొగ తమ చూపును దెబ్బతీస్తోందని చాలామంది లోహార్లు ఫిర్యాదు చేస్తారు. "కొలిమి చాలా పొగను వెలువరిస్తుంది, అది తరచుగా కళ్ళల్లోకీ, ముక్కులోకి వెళుతుంది, దీని వలన దగ్గు వస్తుంది," అని రణ్‌మల్ చెప్పారు. "మేం మండిపోయే వేడిమిలో కొలిమి దగ్గర కూర్చోవాలి, ఊపిరాడనట్టుగా అనిపిస్తుంది." ఇది విన్న మోహన్‌లాల్ తన కొడుకుతో ఇలా అన్నారు, "నువ్వు గాయాల మీదే దృష్టిపెడితే, ఎలా నేర్చుకుంటావు?"

మోర్చంగ్‌తో పాటు మోహన్‌లాల్‌కు అల్గోజా (డబుల్ ఫ్లూట్ అని కూడా పిలుస్తారు), షెహనాయ్ , మురళి , సారంగి , వేణువు, హార్మోనియం వంటి సంగీత వాయిద్యాలను తయారుచేయటం కూడా తెలుసు. "నాకు సంగీత వాయిద్యాలు వాయించడమంటే చాలా ఇష్టం, కాబట్టి నేను వాటిని ఎలా తయారుచేయాలో నేర్చుకుంటాను." ఆయన తాను తయారుచేసిన చాలా వాయిద్యాలను ఒక లోహపు పెట్టెలో ఉంచారు. “ యే మేరా ఖజానా హైఁ [ఇదే నా నిధి]," ఆయన నవ్వుతూ చెప్పారు.

సంకేత్ జైన్ గ్రామీణ కళాకారులపై రూపొందించిన సిరీస్‌లో ఈ కథనం ఒక భాగం. దీనికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ సహకారం ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Editor : Siddhita Sonavane

Siddhita Sonavane is Content Editor at the People's Archive of Rural India. She completed her master's degree from SNDT Women's University, Mumbai, in 2022 and is a visiting faculty at their Department of English.

Other stories by Siddhita Sonavane
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli