నడుము కింది భాగం పట్టేసి, నొప్పి భరించలేనంతగా ఉండటంతో తనూజ హోమియో వైద్యుని వద్దకు వెళ్ళారు. "నాకు కాల్షియం, ఐరన్ సమస్య (లోపం) ఉందనీ, నేనింకెప్పుడూ నేలపై కూర్చోకూడదనీ ఆయన నాకు చెప్పాడు."
పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన బీడీ కార్మికురాలైన తనూజ, రోజుకు 8 గంటలపాటు నేలపై కూర్చొని బీడీలను చుడుతుంటారు. "నాకు జ్వరం వచ్చినట్టుగానూ, బలహీనంగానూ అనిపిస్తోంది. విపరీతమైన వెన్ను నొప్పి," అంటారు దాదాపు ఏభయ్యేళ్ళ వయసున్నఈ కార్మికురాలు. "నాకోసం ఒక కుర్చీ, బల్లా కొనగలిగే స్థోమతే ఉంటేనా..."
అవి నవంబర్ నెల చివరిరోజులు. హరేక్‌నగర్ మొహల్లాలో ఉన్న ఆమె ఇంటి గట్టి సిమెంటు గచ్చు మీద వెచ్చని సూర్యకిరణాలు వాలుతున్నాయి. ఒక తాటాకుల మాదూర్ (ౘాప)పై కూర్చొని ఉన్న తనూజ ఒక బీడీ వెనుక మరొకటి చుడుతూవున్నారు. కెందూ (తునికి) ఆకును మెలితిప్పినపుడు, ఆమె వేళ్ళు నేర్పుగా కదిలి, మోచేతులు ఒక దగ్గరకు వచ్చి, భుజాలు పైకి లేచి, తల ఒకవైపుకు వాలుతోంది. "నా వేళ్ళు ఎంతగా మొద్దుబారిపోయాయంటే, ఒకోసారి నా చేతికసలు వేళ్ళున్నాయా అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది," అన్నారామె ఏదో హాస్యానికన్నట్టు.
ఆమె చుట్టూ బీడీలు తయారుచేయడానికి అవసరమైన ముడిపదార్థాలు పడివున్నాయి: కెందూ ఆకులు, పొగాకు పొడి, దారపుండలు. పదునైన చిన్న చాకు, జత కత్తెరలు ఆమె వ్యాపారానికి సాధనాలు
ఇంట్లోకి అవసరమైన సరుకులను కొనడం కోసం మాత్రమే బయటకు వెళ్ళే తనూజ, వంట చేస్తారు, నీళ్ళు మోసుకొస్తారు, ఇంటి లోపల, బయటి ఆవరణనంతా శుభ్రం చేసి, మిగిలిన ఇంటి పనులన్నీ పూర్తిచేస్తారు. కానీ ఇవన్నీ చేసేటప్పుడు కూడా రోజుకు 500-700 బీడిలు చుట్టకపోతే, తనకు వచ్చే మూడువేల రూపాయల నెలసరి ఆదాయం తగ్గిపోతుందనే తెలివిడితోనే ఉంటారామె.
















