ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.

“ఇలా చెపితే జనాలు నన్ను పిచ్చివాడంటారు,” అన్నారు 53 ఏళ్ళ దన్యను ఖారత్ ఒక మధ్యాహ్నం వేళ తన ఇటుకల  ఇంట్లో, మట్టి తో అలికిన నేలపై కూర్చుని. “ కానీ 30-40 సంవత్సరాల క్రితం, వానలకు  మా పొలాలు చేపలతో నిండిపోయేవి (పక్కనే పారుతున్న వాగు నుండి) . వాటిని నేను నా చేతులతో పట్టుకునేవాడిని.”

అప్పటికే జూన్ నెల సగం గడిచింది, మేము ఆయన ఇంటికి వెళ్ళే కొద్ది సేపటి ముందు,  ఒక 5,000 లీటర్ల  నీటి టాంకర్ ఖారత్ వస్తి గూడెం లోనికి వచ్చింది. ఖారత్, ఆయన భార్య ఫూల బాయ్ ఇంకా 12 మంది ఉన్న ఆ ఉమ్మడి కుటుంబంలోని వారందరూ అందుబాటులో ఉన్న అన్ని పాత్రలు, కుండలు, క్యాన్లు, డ్రమ్ముల్లో నీళ్ళు పట్టటంలో హడావిడిగా ఉన్నారు. టాంకర్ వారం రోజుల తర్వాత వచ్చింది. అందువలన నీటి కొరత తీవ్రంగా ఉంది.

“మీరు నమ్మరు, 50-60 ఏళ్ళ క్రితం, మాకు ఎంత పెద్ద వానలు కురిసేవంటే ఆ వానలో ఎవరూ  కళ్ళు తెరవలేక పోయేవారు.” అని గౌద్వాడి లో తన ఇంటికి దగ్గరగా ఉన్న వేప చెట్టు నీడలో కూర్చున్న 75 సంవత్సరాల గంగూబాయి గులిగ్ చెప్పారు.  3,200 మంది ప్రజలున్న గౌద్వాడి,  ఖారత్ వస్తికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగోలే తాలూకా లోని మరొక పల్లె.   “మీరు ఇక్కడికి వస్తూ ఉన్న దారిలో  తుమ్మ చెట్లు చూసారా? ఆ మొత్తం నేలలో  అద్భుతమైన తెల్ల పెసలు పండేవి. కంకర రాళ్ళు వాన నీటిని పట్టి ఉంచేవి.   నీటి జలలు మా పొలాల్లో నుండి మొదలయ్యేవి. ఒక ఎకరానికి ఒక్క నాలుగు వరసల సజ్జలకు  4-5 బస్తాల (2-3 క్వింటాళ్లు) దిగుబడి వచ్చేది. నేల అంత బాగుండేది!”

80 సంవత్సరాల హౌసా బాయ్ అల్దార్,  గౌద్వాడికి  పెద్దగా  దూరం లేని అల్దార్ వస్తి  గూడెంలోని  తన పొలంలో ఉన్న రెండు బావులను  గుర్తు చేసుకున్నారు. “వానాకాలంలో ఆ రెండు బావుల్లో పూర్తిగా నీళ్ళు వచ్చేవి (60 సంవత్సరాల క్రితం). ప్రతీ బావి కి రెండు గిలకలు ఉండేవి, నాలుగు గిలకల  మీద  ఒకేసారి  నీళ్ళు తోడేవారు. అది రాత్రయినా, పగలైనా, మా మామగారు నీళ్ళు తోడి అవసరమైన వారికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక్క కుండ కూడా నిండటం లేదు. అంతా తల్లకిందులు అయిపోయింది”

PHOTO • Sanket Jain

ఉమ్మడి ఖరత్ కుటుంబంతో, ద్యాను (ఎడమవైపు), ఫూలాబాయి (తలుపుకు ఎడమవైపు): గతకాలంలో పొలాల్లో తేలియాడే చేపలను ద్యాను గుర్తుచేసుకున్నాడు

ఈ ప్రాంతం మాన్ దేశ్ అంటారు, ఇది  ‘వర్షచ్ఛాయా’ ప్రదేశంలో ఉన్నా, మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలో సంగోలే తాలూకా నిండా ఇటువంటి కధలే. ఈ ప్రాంతంలో  సంగోలే (సంగోల అని కూడా అంటారు), మాల్శిరస్ అనే రెండు తాలూకాలు సోలాపూర్ జిల్లాలో ఉన్నాయి. సంగ్లీ జిల్లాలో  జట్, అట్పాడి, కవతేమహాంకాల్ తాలుకాలు ఉన్నాయి. మాన్, ఖతావ్ తాలూకాలు సతారా జిల్లాలో ఉన్నాయి.

మంచి వానలు, అనావృష్టి  ఒకదాని తరవాత ఒకటి రావటమనేది ఇక్కడ రివాజు. సంవృద్ధితో పాటే  కొరత కూడా ఇక్కడి వాళ్ళ  జ్ఞాపకాలలో పాతుకొని  ఉన్నాయి.  కానీ ప్రస్తుతం అంతా తల్లకిందులైన కధలతో  ఈ పల్లెలన్నీ నిండిపోతున్నాయి. ఇక్కడ సంవృద్ధి అనేది ఒకనాటి కాలానికి చెందినదిగా అయిపోయింది.  పాత  వాతావరణ క్రమాలు ధ్వంసం అయ్యాయి. ఎంతలా  అయిపోయిందంటే, “వానలు కలల్లోకి రావటం కూడా మానేశాయి” అన్నారు గౌద్వాడికి చెందిన నివృత్తి షెన్ డ్జి.

“ఈ భూమి, అదిగో, ఇప్పుడు పశువుల బస  ఉన్న చోటే, సజ్జలకి బాగా ప్రసిద్ధి. గతంలో నేను కూడా సజ్జలు పండించాను” అన్నారు  83 ఏళ్ళ  వితోబా సోమా గులిగ్, ఆయన్ని అభిమానంగా  తాత్యా అంటారు. ఆయన మే నెలలో మండే మధ్యాహ్నం వేళ గౌద్వాడి లో పశువుల బస  దగ్గర  తన కోసం కిళ్ళీ తయారు చేసుకుంటూ, “ఇప్పుడు అంతా మారిపోయింది” అన్నారు దిగులుగా, “వాన మా గ్రామం నుండి పూర్తిగా మాయమైపోయింది. "

తాత్యా దళిత హోలార్ కులానికి చెందినవారు. ఆయన ముందు 5-6 తరాల వాళ్ళలానే , తన జీవితం మొత్తం గౌద్వాడిలో గడిపేశారు. అది ఒక కష్టమైన జీవితం. 60 సంవత్సరాల క్రితం  ఆయన, ఆయన భార్య గంగు బాయ్, సంగ్లీ కొల్హాపూర్ కి చెరకు కోయటానికి వలస వచ్చారు. వారి గ్రామాలకు దగ్గర పొలాల్లో, ప్రభుత్వం వారి పనులలో  కూలీలుగా పని చేశారు. “మా ఈ నాలుగు ఎకరాల భూమి కేవలం 10-12 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాం. అప్పటివరకు కాయకష్టమే చేశాం”  అని చెప్పారు.

PHOTO • Sanket Jain

మే నెలలో గౌడ్‌వాడి గ్రామ సమీపంలో పశువుల శిబిరంలో, విఠోబా గులిగ్ లేదా ‘తాత్యా’ అన్నాడు, ‘మా ఊరి నుండి వర్షం అలా మాయమైపోయింది’

కానీ ఇప్పుడు తాత్యాని బాధపెడుతున్నది మాన్ దేశ్ లోని నిరంతర అనావృష్టి. సహజంగా ఉండే మంచి వానలు, దాని తరవాత  అనావృష్టి అనే క్రమం, 1972 తరవాత మరి మామూలుకు తిరిగి రాలేదు. “ప్రతీ సంవత్సరం తరిగిపోతున్న వర్షాలు. మాకు సరిపడినంత వాలివ్ (తొలకరి జల్లులు)  లేవు, వానాకాలం చివరిలో  ఉండే  వర్షాలూ లేవు. ఈ వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. చివరికి క్రితం సంవత్సరం (2018) లో మంచి తొలకరి వచ్చింది, కానీ ఈ  సంవత్సరం, ఇంత వరకు ఏమీ లేవు. నేల ఎలా చల్లబడుతుంది?”

గౌద్వాడి వాసుల్లో చాలామంది పెద్దవాళ్ళు 1972 అనావృష్టి తరవాత తమ ఊరిలో వర్షం ,ఆ తరవాత వర్షాభావం అన్న  చక్రం అంతా మారిపోయిందని  గుర్తు చేసుకుంటారు. ఆ సంవత్సరం సోలాపూర్ జిల్లాలో కేవలం 321 మిల్లీమీటర్ల వర్షం (భారతీయ జల పోర్టల్ యొక్క  భారత వాతావరణ విభాగం వారి డేటా నుండి) కురిసింది, 1901 నుండి చూస్తే ఇదే అతి తక్కువ వర్షపాతం.

1972 అనావృష్టి జ్ఞాపకాలు, గంగుబాయ్ పడిన మామూలుగా పడే కష్టం కంటే భారమైనవి, దానికి తోడు ఆకలి. “మేము రోడ్లు వేసాం, బావులు తవ్వాము, రాళ్ళు పగలగొట్టాము (కరువు సమయంలో వేతనాల కొరకు). శరీరానికి శక్తి ఉండేది, కడుపుకి ఆకలి ఉండేది. 100 క్వింటాళ్ల గోధుమ విసరటానికి 12 అణాల (75 పైసలు) కూలికి పనిచేశాను. ఆ తర్వాత (సంవత్సరం) నుండి పరిస్థితి మరీ దిగజారి పోయింది,” అని చెప్పారు.

PHOTO • Sanket Jain
PHOTO • Medha Kale

సంగోల్  భూగర్భ జలం, 2018లో, 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకుంది, తాలూకాలోని గ్రామాల్లో భూగర్భ జలాలు ఒక మీటర్ కంటే ఎక్కువ పడిపోయాయి

“అప్పుడు కరువు పరిస్థితి  ఎంత తీవ్రంగా ఉందంటే, నేను ఒక్కడినే,  నా 12 పశువులన్ని తీసుకుని 10 రోజులు నడిచాను,” పశువుల బస దగ్గర ఉన్న టీ కొట్టు దగ్గర కూర్చుని, అన్నారు 85 సంవత్సరాల దాదా గడదే. “మిరాజ్ రోడ్డులోని వేప చెట్లన్నీ బోడిగా అయిపోయాయి. ఆకులు, చిగుళ్ళు పశువులకి, గొర్రెలకి తినబెట్టారు. అవి నా జీవితంలో చాలా గడ్డు రోజులు. ఆ తరవాత నుండి ఏవీ  మామూలు కాలేదు.”

అలా కొనసాగిన కరువు పరిస్థితుల వల్ల , 2005 లో కరువు బారిన పడే సోలాపూర్ , సంగ్లీ , సతారా ఈ    మూడు జిల్లాలలోని ప్రాంతాలతో  ప్రత్యేక మాన్ దేశ్ జిల్లా కావాలనే డిమాండు కూడా వచ్చింది. (ఈ ఉద్యమం లోని కొందరు నాయకులు ఈ ప్రాంతంలోని సాగునీటి విషయాలపై దృష్టి పెట్టడంతో ఈ విషయం మరుగున పడిపోయింది)

1972 కరువు ముఖ్యమైన సంఘటనగా చాలామంది గౌద్వాడి వాసులు గుర్తుపెట్టుకున్నా సోలాపూర్ ప్రభుత్వ వెబ్ సైట్ డేటా ప్రకారం 2003లో ఈ జిల్లాలో  ఇంకా తక్కువ (278. 7 మి .మి) 2015 (251.18 మి .మి) వర్షపాతం నమోదయ్యింది.

2018లో కేవలం 241.6 మి .మి. వర్షపాతం మాత్రమే కురిసింది. ఇది  20 ఏళ్ళలో అతితక్కువ వర్షపాతం. అదికూడా కేవలం 24 రోజులే మాత్రమే కురిసిన వర్షాలు అని మహారాష్ట్ర లోని వ్యవసాయ విభాగం, ‘వర్షపాత నమోదు మరియు పరిశీలనా’ పోర్టల్ తెలియజేస్తోంది. ఈ ప్రాంతంలో  ‘సాధారణ’ వర్షపాతం 537 మి.మి. అని వాతావరణ విభాగం చెప్పింది.

అందువల్ల నీరు  సంవృద్ధిగా ఉండే కాలం  తగ్గిపోయింది  లేదా మాయం అయిపోయింది. ఇకపోతే పొడి రోజులు, వేడి, నెలల తరబడి నీటి కొరత - పెరిగిపోతూ ఉన్నాయి.

PHOTO • Medha Kale

ఉపరితలంలో పంట లేకపోవడం, పెరుగుతున్న వేడి, ఇవి కూడా నేల ఎండేందుకు కారణాలయ్యాయి

ఈ సంవత్సరం మే నెలలో గౌద్వాడిలోని పశువుల బస వద్ద ఉష్ణోగ్రత,  46 డిగ్రీలకు చేరుకుంది. విపరీతమైన వేడి వలన గాలి, నేల పొడారిపోయాయి. న్యూయార్క్ టైమ్స్ వారి వాతావరణ మార్పుల గురించి  సంభాషించే పోర్టల్ డేటా ప్రకారం, 1960 లో తాత్యా 24 ఏళ్ళ వయసప్పుడు సంగోలే లో  32 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రత, ఏడాదికి 144 రోజుల పాటు ఉండేది. ఈ రోజున ఆ సంఖ్య 177 కి చేరింది. తాత్యా 100 ఏళ్ళ వరకు బతికితే 2036 సంవత్సరంలో వేసవి రోజులు 193 గా మారడం కూడా  చూస్తారు.

పశువుల బస లో కూర్చుని తాత్యా జ్ఞాపకం చేసుకున్నారు, “ ఇంతకు  ముందు అన్నీ సమయానికి జరిగేవి. మృగశిర కార్తి జల్లులు ఎప్పుడూ జూన్ 7 కల్లా వచ్చేవి. వర్షాలు ఎంత చక్కగా కురిసేవంటే భివ్ ఘాట్ (ఏరు)లో  పుష్యమాసం (జనవరి) వరకు నీళ్ళు ఉండేవి. రోహిణిలో (ఇంచుమించు మే చివరి వారం)  విత్తనాలు మొలకెత్తాక మృగశిరలో  తొలకరితో పంటల్ని ఆకాశమే  కాపాడేది. ఆ పంట గింజలు ఎంతో పుష్టికరంగా ఉండేవి, అటువంటి గింజలు తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అది వరకులా లేవు రుతువులు.”

పశువుల బసలో కూర్చున్న మిగిలిన రైతులు ఆయనతో ఏకీభవించారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వర్షానికి సంబంధించిన సందిగ్ధత గురించి అందరూ కలవర  పడుతున్నారు. “క్రితం సంవత్సరం పంచాంగం ' ఘవీల్ తో పవీల్ '  - ఎవరు సరి అయిన సమయానికి విత్తుతారో వారికి మంచి దిగుబడి - అని చెప్పింది.   కానీ ఇప్పుడు వానలు అప్పుడప్పుడు పడుతున్నాయి, ఇది అన్ని పొలాలనీ తడపదు,” అని వివరించారు తాత్యా.

రోడ్డుకు అటువైపు బసలో తన గుడారంలో కూర్చున్న 50 ఏళ్ళ ఫులా బాయ్ ఖారత్,  ఖారత్ వస్తిలో ఉంటారు - ఆమె ధంగార్ (ఒక సంచార తెగ)కట్టుకి చెందినవారు, తనతో మూడు గేదెలు తీసుకొచ్చారు - “అన్నీ రాశుల్లోనూ సమయానికి వర్షాలు” పడటం గురించి గుర్తు చేసుకున్నారు. ఒక్క అధికమాసంలోనే వర్షం మౌనంగా  ఉండేది. తరవాత రెండు సంవత్సరాలు మాకు మంచి వర్షాలు కురిసేవి. కానీ గత రెండు సంవత్సరాలుగా వర్షం చప్పుడు లేకుండా పోయింది.”

ఈ మార్పులకు అలవాటు పడటానికి చాలామంది రైతులు తమ పంటల జాబితా  మార్చుకున్నారు. సంగోలే రైతుల పంటల  ప్రత్యేక క్రమం ఇలా ఉంటుంది.  ఖరీఫ్ లో  తెల్ల పెసర, ఉలవలు, సజ్జలు, కంది; రబీలో అయితే గోధుమ,  శెనగ , జొన్నలు. వేసవి రకాలైన మొక్క జొన్న, జొన్న ప్రత్యేకంగా పశుగ్రాసంగా పండిస్తారు.

“20 ఏళ్ళ నుండి  తెల్ల పెసలు సాగుచేసే రైతు ఒక్కరు కూడా నాకు కనిపించలేదు. దేశవాళీ కందులు, సజ్జలకు  కూడా ఇదే గతి. గోధుమల్లో ఖప్లి రకం ఎవ్వరూ వేయడం లేదు, అలానే హులాగే (నల్ల ఉలవలు) లేదు , నువ్వులూ  లేవు ,” అన్నారు ఆల్డర్ వస్తి గూడెం నుండి హౌసా బాయ్.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: ఫూలాబాయి ఖరత్, 'అయితే గత చాలా సంవత్సరాలుగా, వర్షం మౌనం దాల్చింది...' అని చెప్పింది. కుడి: గంగూబాయి గులిగ్ చెప్పారు, '1972 తర్వాత పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి’

వర్షాకాలం ఆలస్యంగా రావటం - జూన్ చివరిలోనో, ఒక్కొక్కప్పుడు జులై మొదట్లోనో - త్వరగా వెళ్ళిపోటం -సెప్టెంబర్లో చాలా తక్కువగా వానలు పడటం చూస్తున్నాం - ఇందువలన రైతులు తక్కువ కాలవ్యవధి ఉన్న సంకరజాతి రకాల పంటల వైపు వెళుతున్నారు. వీటిని నాటిన దగ్గర నుండి కోతలకు  2.5 నెలల సమయం సరిపోతుంది. “దేశీ 5 నెలల  (దీర్ఘ కాలపరిమితి) రకాలు అయిన సజ్జలు, తెల్ల పెసర, జొన్న, కంది నేలలో అవసరమైనంత తేమ  లేకపోటం వలన అంతరించి పోతున్నాయి,” అన్నారు నవంత్ మాలి. ఆయన కొల్హాపూర్ లోని అమికస్ ఆగ్రో గ్రూప్ లో సభ్యులు.  ఆయనతో పాటు ఇదే గ్రూప్ లో ఉన్న ఇంకా 20 మంది ఇతర గౌద్వాడి రైతులు, రుసుము తీసుకుని SMS ద్వారా ముందుగా వాతావరణ సూచనలు పంపుతారు.

వేరే పంటల్లో తమ అదృష్టం పరీక్షించు కోటానికి, 20 సంవత్సరాల క్రితం, కొంతమంది రైతులు దానిమ్మ సాగుకి మళ్ళారు. ప్రభుత్వ రాయితీలు సహాయం చేశాయి. కొంత కాలంగా దేశీ రకాలనుండి, సంకరాలు, దేశీ కానివాటికి రైతులు మళ్ళారు. “ మొదట్లో ఎకరానికి 2-3 లక్షలు సంపాదించాము (ఇంచుమించు 12 సంవత్సరాల క్రితం). కానీ 8-10  సంవత్సరాలుగా తోటలన్నిటికీ  తెల్య (ఒక రకం బాక్టీరియా) తెగులు సోకాయి. మారిపోతున్న వాతావరణం వల్ల ఇలా జరుగుతోందనుకుంటా.  గత సంవత్సరం మా పళ్ళని కేజీ 25-30 రూపాయలకి అమ్మవలసి వచ్చింది. మేము ఏం  చేయగలం వాతావరణం ఇలా మారిపోతుంటే?” అని అడిగారు మాలి.

వర్షాకాలం ముందు, ఆ  తరవాత వచ్చే జల్లులలో వచ్చిన మార్పులు ఏయే పంటలు వేయాలి అనే విషయం పై గణనీయమైన ప్రభావం చూపించాయి. వర్షాకాలం తరవాత వచ్చే వర్షపాతం - అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు - సంగోలే లో స్పష్టంగా తగ్గింది. 2018 లో ఈ ప్రాంతం లో వర్షాకాలం తర్వాత వర్షపాతం కేవలం 37.5 మి. మి. మాత్రమే కాగా  1998 నుండి 2018 వరకు  రెండు దశాబ్దాల సగటు వర్షపాతం 93.11 మి. మి. గా వ్యవసాయ విభాగ డేటా చూపెడుతోంది.

“మాన్ దేశ్ ప్రాంతం మొత్తంలో  చాల కలవరపరుస్తున్న ధోరణి ఏమిటంటే కనుమరుగవుతున్నవర్షాకాలపు -ముందు, తరవాత జల్లులు,” అని చేతనా సిన్హా అన్నారు. సిన్హా మాన్ దేశీ సంస్థ స్థాపకులు. ఈ సంస్థ గ్రామీణ మహిళలకు సంభంధించిన వ్యవసాయం, రుణాలు, వాణిజ్యం కోసం పనిచేస్తుంది. (ఈ సంస్థ మొట్ట మొదటి పశువుల బస ఈ సంవత్సరం జనవరి 1 న, సతారా జిల్లాలో  మన్ బ్లాక్ లో మ్హస్వద్లో మొదలు పెట్టి  8000 కంటే ఎక్కువ పశువులకు ఆశ్రయం ఇచ్చింది.) “వర్షాకాలం తిరిగి రావటం అనేది మాకు  ప్రాణం నిలిపినట్లు, ఎందుకంటే రబి పంటల సమయంలోనే మాకు  తిండిగింజలు, పశువులకు గ్రాసం పండటం జరుగుతుంది.  10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలగా మాకిక్కడ రుతుపవనాలు రాలేదు. దీని ప్రభావం మాన్ దేశ్ లోని ఇతర కట్టు  ప్రజల మీద, గ్రామీణ జీవన విధానం మీద పడుతోంది.”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

పశుగ్రాసం కొరతతో సంగోలులో తేమలేని నెలల్లో, పశువుల శిబిరాలు ఏర్పడ్డాయి

బహుశా చెరకు సాగు వ్యాప్తి  తరువాత మారిన సాగు పద్ధతులే అతి పెద్ద మార్పులై ఉండొచ్చు.  2016-17లో సోలాపూర్ జిల్లాలో 633,000 టన్నుల చెరకు 100,505 హెక్టార్ల భూమిలో పండింది అని మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక మరియు గణాంక సంచాలక కార్యాలయం తెలియచేసింది. కొన్ని కొత్త నివేదికల ప్రకారం, ఈ సంవత్సరంలో,  అక్టోబర్ లో మొదలైన  చెరకు నూర్పిడి నుండి ఈ జనవరి నాటికి, దిగుబడిలో  సోలాపూర్ చెరకు అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 10 మిలియన్ టన్నులకు మించిన  చెరకు 33 నమోదు కాబడిన పంచదార మిల్లులకు పంపారని పంచదార కమిషనరేట్ డేటా చెపుతోంది.

కేవలం ఒక టన్ను చెరకు పిప్పి చేయటానికి ఇంచుమించు 1,500లీటర్లు అవసరం అవుతాయని విలేకరి మరియు నీటి పరిరక్షణ కోసం పనిచేసే కార్యకర్త  రజనీష్ జోషి తెలిపారు. అంటే ఇదివరకు చెరకు పిప్పిచేసిన  కాలంలో - అంటే అక్టోబర్ 2018 నుండి జనవరి 2019 లోపల- ఒక్క సోలాపూర్ జిల్లాలోనే  15 మిలియన్ క్యూబిక్ మీటర్ల కు పైగా నీరు, చెరకు కోసం వాడారు.

ఒక్క వ్యాపార పంట మీద ఇంత భారీ నీటి వాడకం వల్ల, ఇతర పంటలకు దొరుకుతున్న నీరు   ఇంకా వేగంగా తగ్గిపోతోంది. అసలే తక్కువ వర్షపాతం, సాగు నీరు లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్న ప్రాంతం ఇది. 1,361హెక్టర్ల లో ఉన్న గౌద్వాడి  గ్రామం చాలా వరకు సాగులో ఉంది. కానీ, కేవలం 300 హెక్టార్లు మాత్రమే నీటి కట్టు మీద ఉంది, మిగిలినదంతా వర్షధారమే అని నవంత్ మాలి అంచనా వేశారు. సోలాపూర్ జిల్లా ప్రభుత్వ డేటా ప్రకారం మొత్తం సాగునీటి సామర్థ్యం ఉన్న భూమి 774,315 హెక్టార్లు, కానీ 2015 లో 39.49 శాతం భూమికి  మాత్రమే సాగునీరు అందింది.

ఈ పంటమార్పిడి వల్ల నష్టం, దానికి తోడు పెరుగుతున్న వేడి నేలని ఇంకా ఎండిపోయేలా చేస్తున్నాయి అంటున్నారు ఇక్కడి రైతులు. ఇప్పుడు నేలలో తడి, “కనీసం 6 అంగుళాల లోతు  వరకు కూడా లేదు,” అంటున్నారు హౌసా బాయ్.

PHOTO • Medha Kale

కేవలం గౌడ్‌వాడిలోనే 150 ప్రైవేట్ బోర్‌వెల్‌లు ఉన్నాయని, వాటిలో కనీసం 130 ఎండిపోయాయని నవనాథ్ మాలి అంచనా వేశారు

భూగర్భ జలాల స్థాయిలు  కూడా పడిపోతున్నాయి. 2018 లో భూగర్భ జలాల అవలోకనం మరియు అభివృద్ధి ఏజెన్సీ వారి ప్రాబబుల్ వాటర్ స్కేర్సిటీ రిపోర్ట్ ప్రకారం సంగోలే లోనే 102 పల్లెలన్నింటిలో భూగర్భ జలం ఒక మీటరు కంటే ఎక్కువ తగ్గిపోయింది. “నేను బోరు బావి తవ్వించేందుకు ప్రయత్నించాను, 750 అడుగులకి వెళ్లినా నీరు లేదు. ఈ నేల మొత్తం ఎండిపోయింది,” అని నాలుగు ఎకరాలు భూమి ఉండి, జుట్టు కత్తిరించే దుకాణం నడుపుతున్న   జోతిరామ్ ఖండగలే చెప్పారు. “గత కొన్ని సంవత్సరాలనుండి, అటు ఖరీఫ్ లో గానీ, ఇటు రబి లో గానీ మంచి దిగుబడి వస్తుందన్న పూచీ లేదు” అని అన్నారు. మాలి అంచనా ప్రకారం గౌద్వాడిలో ఉన్న 150 ప్రయివేట్ బోరు బావుల్లో కనీసం 130 బావులు ఎండి పోయాయి. నీళ్ళు కోసం ప్రజలు 1,000 అడుగుల క్రింద వరకు తవ్వుతున్నారు.

చెరకు పంట వేయడం అనే  భారీ మార్పు తిండి గింజల పంటల నుండి ఇంకా దూరం  జరిగిపోయాలా చేసింది. 2018-19 రబీ కాలంలో సోలాపూర్ లో జొన్న 41 శాతం, మొక్క జొన్న 46 శాతం పండించారని వ్యవసాయ విభాగం చెపుతోంది. మహారాష్ట్ర అంతటా జొన్న పండించడం 57 శాతానికి, మొక్క జొన్నపండించటం  65 శాతానికి  పడిపోయింది అని ప్రభుత్వ 2018-19 ఆర్ధిక సర్వే  చెపుతోంది. ఈ రెండు పంటల దిగుబడి కూడా ఇంచుమించు 70 శాతం పడిపోయింది.

ఈ రెండు పంటలు మనుషుల తిండి గింజలకి, పశువుల గ్రాసానికి ఎంతో అవసరం. పశుగ్రాసం కరువయిపోటంతో ప్రభుత్వానికి (మరియు ఇతరులకు) సంగోలే లో ఈ గడ్డు నెలల్లో పశువుల బస ఏర్పాటు చేయటం తప్పనిసరి అయింది. 2019 లో  ఇంచుమించు 105 బసల్లో 50,000 పశువుల ఉన్నాయని  అంచనా వేస్తున్నారు పోపట్ గడడే. ఈయన పాల సహకార సంస్థ సంచాలకులు, మరియు గౌద్వాడిలో పశువుల బస ప్రారంభించారు. ఈ బసల్లో పశువులు ఏం తింటాయి? హెక్టారుకు 29.7 మిలియన్ల(అంచనాలు చూపించినట్టుగా) నీళ్ళు కబళించిన ఆ చెరుకునే తింటాయి.

సంగోలే లో జరుగుతున్న ఎన్నో మార్పులు ఒక దానితో ఒకటి పెనవేసుకు పోయాయి, అవి ప్రకృతిలో భాగాలే, కానీ అంతకంటే ఎక్కువగా అవి మనుషుల వలెనే మొదలయ్యాయి. తగ్గుతున్న వర్షపాతం, వర్షం కురిసే  రోజులు తగ్గిపోవడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కనుమరుగవుతున్న వర్షఋతువు,  తేమ  కోల్పోతున్న నేల- ఇవన్నీ మనుషుల చర్య ఫలితాలే.  పంటలు వేసే  పద్ధతుల్లో మార్పుల వల్ల - తక్కువ సమయం పట్టే రకాలు, తద్వారా వచ్చిన పంట మార్పిడిలు, దేశీ రకాలు తక్కువగా వాడటం, జొన్న వంటి తిండి గింజల సాగుబడి తక్కువ అవటం, చెరుకు వంటి వ్యాపార పంటలు ఎక్కువ అవటం- వీటికి తోడు అతి తక్కువ సాగునీరు, భూగర్భ జలాల స్థాయి తగ్గిపోటం - ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఈ మార్పులకి కారణం ఏంటని మేము అడిగినప్పుడు, గౌద్వాడి పశువుల బస దగ్గర ఉన్న తాత్యా నవ్వి ఇలా చెప్పారు, “మనమే కనక వాన దేవుడి మనసు తెలుసుకోగలితేనా! అసలు మనుషులు  దురాశ పరులై పోయాక, వాన ఎక్కడ నుండి వస్తుంది? మనుషుల పద్ధతులు మారిపోతే ప్రకృతి తన పద్దతి  తాను ఎలా అనుసరించగలుగుతుంది?”

PHOTO • Sanket Jain

సంగోల్ నగరం వెలుపల ఎండిపోయిన మాన్ నదిపై పాత బ్యారేజీ

కార్యకర్తలు షాహాజి గడహిరే , దత్తా గులిగ్ లు  తమ సమయాన్ని, అమూల్యమైన అభిప్రాయాలు ఇచ్చినందుకు రచయిత  కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

కవర్ ఫోటో: సంకేత్ జైన్/PARI

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే రికార్డు చేయాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: కె. పుష్ప వల్లి

Reporter : Medha Kale

میدھا کالے پونے میں رہتی ہیں اور عورتوں اور صحت کے شعبے میں کام کر چکی ہیں۔ وہ پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) میں مراٹھی کی ٹرانس لیشنز ایڈیٹر ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز میدھا کالے
Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Series Editors : P. Sainath

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Series Editors : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : K. Pushpa Valli

K. Pushpa Valli is a Lecturer based in Nagaram, East Godavari district.

کے ذریعہ دیگر اسٹوریز K. Pushpa Valli