"బ్యూటిపార్లర్‌కు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? బయట అంగడి వీధుల్లో తిరుగుతూ డబ్బు ఖర్చు పెట్టడానికి అది ఒక సాకు మాత్రమే."

తను బ్యూటిపార్లర్‌కు వెళ్ళడాన్ని తన అత్తమామలు అనుమానంతో చూస్తారని అంటుంది మోనికా కుమారి. నలుగురు సభ్యులున్న వీరి కుటుంబం తూర్పు బీహార్‌లోని జముయీ అనే చిన్న పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైర్మా అనే గ్రామంలో నివసిస్తోంది. 25 ఏళ్ల మోనికా, తన అత్తమామల మాటలు పట్టించుకోకుండా తన కనుబొమ్మల్ని తీర్చిదిద్దుకోవడానికి, పెదవిమీది అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి, ముఖాన్ని మర్దనా చేయించుకోవడానికి తరచుగా బూటిపార్లర్‌కు వెళ్తుంటుంది. పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఆమె భర్తకు పాతకాలం వారి అపనమ్మకాలు లేవు. పైగా, ఆమెను అతనే బూటిపార్లర్ వద్ద దిగబెడతాడు కూడా.

మోనికా మాత్రమే కాదు, జముయీ జిల్లాలోని జముయీ పట్టణం, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లోని ఎంతోమంది యువతులూ స్త్రీలూ తమ అందానికి మెరుగులు దిద్దుకోవటానికి దగ్గర్లోని బ్యూటిపార్లర్‌కు వెళ్తుంటారు.

పార్లర్ నడపడంలో తన పదిహేను సంవత్సరాల అనుభవంలో జముయీలో వృద్ధిచెందిన బ్యూటి వ్యాపారం గురించి చెబుతూ, "నేను మొదలుపెట్టినపుడు ఒక పది పార్లర్లు ఉండేవి. ఇప్పుడైతే ఒక వెయ్యికి పైగా ఉన్నట్టనిపిస్తుంది " అంటారు ప్రమీలా శర్మ.

ప్రమీల, 87,357 మంది జనాభా గల జముయీ పట్టణంలోని ప్రధాన రహదారిలో ఏర్పాటుచేసిన వివాహ్ బ్యూటిపార్లర్ యజమానురాలు. యిక్కడి ప్రజల్లో చాలామంది వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత రంగాల్లో పనిచేస్తారు.

Pramila Sharma owns and runs the Vivah Ladies Beauty Parlour in Jamui town.
PHOTO • Riya Behl
There is a notice pinned outside stating ‘only for women’
PHOTO • Riya Behl

ఎడమ: జముయీ పట్టణంలోని వివాహ్ బ్యూటి పార్లర్‌ను నడుపుతున్న ప్రమీలా శర్మ. కుడి:  బ్యూటి పార్లర్ బయట, "మహిళలకు మాత్రమే" అన్న సూచన అతికించి ఉంటుంది

ఈ పార్లర్ ఒక సైకిల్ షాపు, టైలర్ షాపు, ఒక మంగలి షాపుల మధ్యన ఉంటుంది. యిక్కడ చేసే హెయిర్ కట్, థ్రెడింగ్, మెహెంది (గోరింటాకు), వ్యాక్సింగ్, ఫేషియల్స్, మేకప్ లాంటి సేవలు అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే అలీగంజ్ బ్లాక్‌లోని లక్ష్మీపూర్, ఇస్లామ్‌నగర్ వంటి గ్రామాల నుంచి కూడా కస్టమర్లని ఆకర్షిస్తున్నాయి.

స్థానికంగా మాట్లాడే కొన్ని భాషలైన ఆంగిక, మైథిలి, మగహీలలో తనకున్న కొద్దిపాటి ప్రవేశం కస్టమర్లని సౌకర్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతారు ప్రమీల.

బీహార్ లోని ఈ మూలలో బ్యూటిపార్లర్ నడపడమనేది పురుషస్వామ్యంతో నిరంతర సవాళ్లను ఎదుర్కొనడంతో కూడుకొని ఉంటుంది. "(ఇక్కడి) అమ్మాయిలు పెళ్లికి ముందు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా జీవిస్తారు, పెళ్లి తర్వాత భర్త ఆకాంక్షలకు అనుగుణంగా జీవిస్తారు," అంటారు ప్రమీల. అందువలన, తన పార్లర్‌లోకి మగవారికి ప్రవేశం లేదు. 'మహిళలకు మాత్రమే' అన్న సూచన కూడా పార్లర్ బయట అతికించి ఉంటుంది. ఒకసారి లోపలికెళ్లిన తర్వాత అందరూ మహిళలే ఉండే ఆ వాతావరణం ఒక భద్రమైన భావనను మహిళలకు కలుగజేస్తుంది. యిక్కడ పిల్లలు, వంటకాల గురించిన రోజువారీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పెళ్లిసంబంధాల గురించి చర్చలుంటాయి. వైవాహిక జీవితంలోని అసంతృప్తులు గురించి కూడా సానుభూతితో పంచుకుంటారు. "మామూలుగా మహిళలు తాము ఇళ్ళల్లో అనుభవిస్తున్న విషయాలను ఎక్కడా పంచుకోలేరు. కానీ ఇక్కడ మాత్రం ఏవైనా పంచుకోవచ్చు." అంటారామె.

ఇక్కడి ఈ లక్షణమే కస్టమర్లలో నమ్మకాన్ని కలిగించి వారిని మళ్ళీ ఇక్కడికే వచ్చేలా చేస్తుంది. "జముయీలో పార్లర్‌కి వెళ్లాలనుకున్నపుడల్లా మేం ఇక్కడికే వస్తాం" అంటుంది ప్రియా కుమారి, తనకు బాగా పరిచయమున్న ఈ ప్రదేశాన్ని గురించి వివరిస్తూ. బ్యూటిపార్లర్ యజమాని చనువుగా మాట్లాడ్డం, అప్పుడప్పుడూ చిన్నగా మందలించడం వంటివి ఇక్కడి కుటుంబ వాతావరణాన్ని మరింత పెంచుతాయి. "ఆమెకు మా గురించి అంతా తెలుసు. అప్పుడప్పుడూ మాతో తమాషాలు చేస్తుంటారు" అంటుంది జముయీ బ్లాక్‌లోని ఖైర్మా గ్రామంలో నివసించే ఈ 22 ఏళ్ల యువతి.

Khushboo Singh lives in Jamui town and visits the parlour for a range of beauty services.
PHOTO • Riya Behl
Pramila in her parlour with a customer
PHOTO • Riya Behl

ఎడమ: జముయీ పట్టణంలో నివసించే ఖుష్బూ సింగ్ వివిధ సేవలు చేయించుకోవడం కోసం ఈ పార్లర్‌కు వస్తుంటారు. కుడి: తన పార్లర్‌లో ఒక కస్టమర్‌తో ప్రమీల

ప్రమీల నడుపుతోన్న పార్లర్ మహరాజ్‌గంజ్ ప్రధాన రహదారిలో రద్దీగా ఉండే ఒక వాణిజ్య సముదాయంలోని క్రింది అంతస్తులో ఉంటుంది. కిటికీలు లేని ఈ చిన్న గదికి ఆమె నెలకు 3500 రూపాయల అద్దె చెల్లిస్తున్నారు. మూడు గోడలకు పెద్దపెద్ద అద్దాలు వరసగా అమర్చివుంటాయి. అద్దాలపైన ఉన్న గాజు అల్మారాలలో పిగ్గీ బ్యాంక్‌లు, టెడ్డీబేర్లు, శానిటరీ పాడ్లు, యింకా వివిధ రకాల అలంకరణ వస్తువులు పేర్చివుంటాయి. పైకప్పు నుంచి ప్లాస్టిక్ పూలు వేలాడుతుంటాయి. ఆమె పూర్తిచేసిన బ్యూటీ కోర్సులకు సంబంధించిన సర్టిఫికేట్లు లేతగోధుమ రంగు, నారింజరంగు గోడలపై చక్కగా కనబడేలా ఫ్రేములలో అమర్చివుంటాయి.

ముందరి వాకిలికి ఉన్న పసుపురంగు పరదాను దాటి ఒక కస్టమర్ లోపలికి వచ్చారు. రాత్రిభోజనం కోసం బయటికెళ్తోన్న ఆ ముప్పైయేళ్ళ స్త్రీ తన కనుబొమ్మల ఆకృతిని సరిచేయించుకుని, పెదవిపైనున్న అవాంఛితరోమాల్ని తొలగించుకోవడం కోసం పార్లర్‌కు వచ్చారు. ఇది పార్లర్ మూసేసే సమయమయినప్పటికీ ఈ వ్యాపారంలో పనివేళల విషయంలో మరీ అంత నిక్కచ్చిగా ఉండడం కుదరదు. అలా చేస్తే కస్టమర్లు దూరమైపోతారు. ఆమె అలా కూర్చున్న తరువాత ప్రమీల ఆమె వెళ్ళే సందర్భం గురించి వాకబు చేస్తూ ఒక స్నేహపూర్వక సంభాషణ మొదలుపెడతారు. " హమ్ థోడా హసీ మజాక్ కరేంగే కి స్కిన్ మే అందర్ సే నిఖార్ ఆయే (మా క్లయింట్‌ని మేం కొంచెం నవ్వించగానే ఆమె చర్మపు లోలోపలి నిగారింపు బయటకు వస్తుంది.)" అని ప్రమీల తరువాత మాతో చెప్పారు.

"ఒక్కోసారి రోజుకి 25 మంది దాకా మహిళలు తమ కనుబొమ్మల ఆకృతి సరిచేయించుకోవడానికి పార్లర్‌కు వస్తుంటారు. కొన్ని రోజుల్లో 5 మంది కూడా రారు" అంటారు ప్రమీల, ఈ వ్యాపారంలోని అనిశ్చితిని గుర్తుచేస్తూ. పెళ్లికూతురికి ముస్తాబు చేసే పని లభిస్తే ఆమె ఒక్కరోజులో 5000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే సంపాదించగలుగుతారు. "మునుపు పెళ్లికూతురి మేకప్ కోసం చాలామంది మమ్మల్ని సంప్రదించేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు తమంతట తామే (ఫోన్లో వీడియోలు చూసి) చేసుకుంటున్నారు" అంటారామె. తన సేవల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రమీల, కనుబొమ్మలు సరిచేయడం, పైపెదవిపై అవాంఛిత రోమాల్ని తొలగించడం లాంటి రెండు సేవలనూ కలిపి ముప్పై రూపాయలకే అందించే ఆఫర్ తీసుకొచ్చారు.

పెద్దవయసు స్త్రీలను ఆకర్షించడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. తన తల్లి వయసున్న స్త్రీలు పార్లర్‌కు రావడం చాలా తక్కువగా చూశానని అంటోంది ప్రియ: "మా అమ్మ ఎప్పుడూ కనుబొమ్మల ఆకృతిని సరిచేసుకోవడం గానీ జుట్టు కత్తిరించుకోవడం గానీ చేయలేదు. మేం బాహుమూలాల్లో వ్యాక్సింగ్ ఎందుకు చేయించుకుంటామో ఆమెకు అర్థంకాదు. పైగా, 'నేను సహజంగా ఇలాగే ఉంటాను, దేవుడు నన్నిలాగే చేశాడు. దేన్నైనా నేనెందుకు మార్చాలి?' అంటారు."

The parlour is centrally located in a busy commercial complex in Jamui town.
PHOTO • Riya Behl
Pramila threading a customer's eyebrows
PHOTO • Riya Behl

ఎడమ: జముయీ పట్టణంలో బాగా రద్దీగా ఉండే ఒక వాణిజ్యసముదాయం మధ్యలో ఈ పార్లర్ ఉంది. కుడి: ఒక కస్టమర్ కనుబొమలను తీర్చిదిద్దుతున్న ప్రమీల

సమయం సాయంత్రం 5 గంటలవుతుండగా ఒక తల్లి తన ఇద్దరు టీనేజ్ పిల్లలతో కలిసి పార్లర్‌లోకి వచ్చారు. ఆమె కూతుళ్ళిద్దరూ హిజాబ్ తొలగించి నల్లని వినైల్ కవరున్న కుర్చీలలో కూర్చొన్న తర్వాత తబస్సిమ్ మాలిక్, ప్రమీల పక్కన కూర్చొన్నారు. నారింజరంగు బల్ల మీద కత్తెరలు, దువ్వెనలు, వ్యాక్స్ హీటరు, విజిటింగ్ కార్డుల కట్టలు రెండు, కనుబొమ్మల్ని తీర్చేందుకు వాడే దారాలు, టాల్కమ్ పౌడర్లు, యింకా రకరకాల లోషన్లు చక్కగా అమమర్చివున్నాయి.

"మీకు ముగ్గురు పిల్లలు కదా, ఒకరికి పెళ్లయిపోయిందా?" అని చనువుగా అడిగారు ప్రమీల, తన కస్టమర్ల జీవితాలు తనకు తెలుసన్న జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ.

"తనిప్పుడు చదువుకుంటోంది. చదువయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తాం" అన్నారు తబస్సిమ్..

సోఫాలో కూర్చొన్న ప్రమీల తలూపారు. ఒకవైపు తబస్సిమ్‌తో మాట్లాడుతూనే తన దగ్గర శిక్షణ పొందుతోన్న టున్ని, రాణిలు అమ్మాయిల జుట్టు కత్తిరించడానికి చేస్తోన్న ఏర్పాట్లను గమనిస్తున్నారు ప్రమీల. ఈ ఇద్దరు స్టైలిస్ట్‌లు పన్నెండేళ్ళ జాస్మిన్ తలను అటూఇటూ తిప్పుతున్నారు. జాస్మిన్‌కు ట్రెండీగా ‘U’ ఆకారంలో ఉండేలా జుట్టు కత్తిరింపు కావాలి. అందుకు 80 రూపాయలు ఖర్చవుతుంది. "U ఆకారం వచ్చేవరకు జుట్టుమీదనుంచి కత్తెర తీయకు" అన్నారు ప్రమీల. సరేనన్నట్టు తలూపింది టున్ని.

Pramila also trains young girls like Tuni Singh (yellow kurta) who is learning as she cuts 12-year-old Jasmine’s hair.
PHOTO • Riya Behl
The cut hair will be sold by weight to a wig manufacturer from Kolkata
PHOTO • Riya Behl

ఎడమ: పన్నెండేళ్ళ జాస్మిన్‌కు జుట్టు కత్తిరిస్తోన్న టున్ని సింగ్  (పసుపు కుర్తా) వంటి యువతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు ప్రమీల. కుడి: కత్తిరించిన జుట్టును బరువు తూచి కలకత్తాలో విగ్గులు తయారుచేసే వర్తకునికి అమ్ముతారు

ఒక జుట్టు కత్తిరింపును శిక్షణ పొందుతోన్న అమ్మాయిలు చేశారు, రెండోది ప్రమీల చేస్తారు. శిక్షణలో ఉన్న ఆ యువతి వద్దనుంచి బరువైన ఇనప కత్తెరను తన చేతిలోకి తీసుకుని తన ముందున్న అమ్మాయి జుట్టును కత్తిరించి సరైన ఆకృతిలోకి తీసుకురావడం మొదలుపెట్టారు ప్రమీల.

పదిహేను నిమిషాల్లో జుట్టు కత్తిరించడం పూర్తయ్యింది. కింద పడిన పొడవాటి జుట్టును వంగి తీసి జాగ్రత్తగా రబ్బరు బ్యాండు వేసింది రాణి. తరువాత ఈ జుట్టును కొల్‌కతాలోని ఒక విగ్గుల తయారీదారునికి బరువు ప్రకారం అమ్మేస్తారు. రైల్లో సగం రోజు ప్రయాణంతో యిక్కడినుండి కొల్‌కతా చేరుకోవచ్చు.

ఆ తల్లీకూతుళ్లు పార్లర్ నుండి బయటకు వెళ్తుండగా, "వాళ్ళను మళ్లీ సంవత్సరం తర్వాత చూస్తాను," అన్నారు ప్రమీల. "సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈద్ పండుగ ముందు వాళ్ళు ఇక్కడకు వస్తారు". కస్టమర్ల గురించి తెలుసుకోవడం, వాళ్ళ అభిరుచుల్ని గుర్తుంచుకోవడం, వారితో చనువుగా మాట్లాడ్డమూ ఇవన్నీ కూడా ప్రమీల వ్యాపార వ్యవహారాల్లో భాగమే.

అయితే, ఈ వ్యాపారంలో అంతా కాంతిమయమేనా అంటే కాదు. ఆమె ఉదయాన్నే నాలుగింటికి నిద్ర లేచి యింటిపని మొత్తం పూర్తిచేసుకుని తన పిల్లలు - ప్రియ, ప్రియాంశులను స్కూలుకు పంపుతారు. యింట్లోంచి బయటికొచ్చే ముందు 10 లీటర్ల నీటి క్యాన్ నింపి తనతోపాటే పార్లర్‌కు తీసుకుని రావాలి. ఎందుకంటే పార్లర్ ఉన్న వాణిజ్యసముదాయంలో కుళాయినీరు వచ్చే సౌకర్యం లేదు. "కుళాయినీరు వచ్చే సౌకర్యం లేకుండా బ్యూటిపార్లర్ ఎలా నడపగలరు?" అని అడుగుతారామె.

Pramila brings around 10 litres of water with her from home as there is no running water in the shopping complex where the parlour is located.
PHOTO • Riya Behl
Tunni and Pramila relaxing while waiting for their next customer
PHOTO • Riya Behl

ఎడమ: పార్లర్ ఉన్న వాణిజ్యసముదాయంలో కుళాయినీరు వచ్చే సౌకర్యం లేనందున, ప్రమీల తన యింటినుంచే పది లీటర్ల నీటిక్యాన్‌ను తీసుకుని వస్తారు. 'కుళాయినీరు వచ్చే సౌకర్యం లేకుండా పార్లర్‌ను ఎలా నడపగలం?' అని అడుగుతారామె. కుడి: తమ తర్వాతి కస్టమర్ కోసం వేచిచూస్తూ విశ్రాంతిగా కూర్చున్న టున్ని, ప్రమీల

వివాహ్ బ్యూటిపార్లర్ ఉదయం పదిగంటలకు తెరుచుకుని, పదకొండు గంటలపాటు పనిచేసిన తరువాత మూతపడుతుంది. ప్రమీలకు ఒంట్లో బాగా లేనప్పుడో లేదా యింట్లో అతిథులు ఉన్నప్పుడో మాత్రమే పార్లర్‌కు సెలవు. తన భర్త రాజేశ్‌తో కలిసి ఉదయం పదిగంటల కంటే ముందే ప్రమీల యిల్లు వదులుతారు. రాజేశ్ తన బైక్ మీద ఆమెను పార్లర్ దగ్గర దించేసి, అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్న తన షాపుకు వెళ్తారు. "నా భర్త ఒక కళాకారుడు," అని గర్వంగా చెప్తారు ప్రమీల. "సైన్‌బోర్డులమీద, వంతెనలమీద రంగుల చిత్రాలు వేయడం, గ్రానైట్ బండల మీద చెక్కడం, పెళ్ళి ఊరేగింపులకు, డిజె టెంపోలకు నేపథ్యాలను చిత్రించడం లాంటి చాలారకాల పనులు చేస్తారు" అంటారు ప్రమీల.

ప్రమీలకు ఆలస్యమయ్యే రోజులలో రాజేశ్ తన షాపు బయట స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఆమె కోసం వేచిచూస్తారు.

"ఈ వ్యాపారంలో ఆదివారాలుండవు. మా పొరుగువాళ్ళు పనిచేయించుకోవటం కోసం మా యింటికి వస్తే, వాళ్ల దగ్గర కూడా డబ్బు తీసుకుంటాను," అంటారు ప్రమీల. బేరమాడే కస్టమర్లతో, అసలు డబ్బులివ్వడానికే నిరాకరించే కస్టమర్లతో నిక్కచ్చిగా, కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. "ఒకవేళ కస్టమర్ అహంకారపూరితంగా ప్రవర్తిస్తే, వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం."

వివాహ్ బ్యూటిపార్లర్ యజమానురాలైన ఈమె, పశ్చిమబెంగాల్ లోని బొగ్గు పట్టణమైన దుర్గాపూర్‌లో జన్మించారు. ఈమె తండ్రి ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లొ ఫోర్‌మ్యాన్‌గా పనిచేసేవారు. తల్లి ఎనిమిది మంది సభ్యులు గల కుటుంబాన్ని చూసుకునేవారు. ప్రతిసంవత్సరం ప్రమీల తన అయిదుగురు తోబుట్టువులతో - ముగ్గురు సోదరులు ఇద్దరు సోదరిలు - కలిసి జముయీలోని తమ అమ్మమ్మ యింటికి వచ్చేవారు..

పన్నెండో తరగతి పూర్తయిన వెంటనే 2000వ సంవత్సరంలో ప్రమీలకు రాజేశ్ కుమార్‌తో వివాహమయి జముయీకి వచ్చారు. పెళ్లయిన తరువాత ఏడు సంవత్సరాలు తన భర్త పనికి వెళ్ళడం, పిల్లలు స్కూలుకు వెళ్లడంతోనే గడచిపోయిందని చెబుతారామె. ఇంటిదగ్గర ఒంటరిగా ఉండడం అలవాటుకాక బ్యూటిపార్లర్ తెరవాలనే ఆలోచన చేశారు. భర్త ప్రోత్సహించడం ఆమెకు ఎంతగానో సహాయపడింది. "ఇక్కడకు వచ్చే కస్టమర్లతో మాట్లాడుతూ, హాస్యాలాడుతూ ఉండడం వలన (ఒంటరితనం వల్ల కలిగే) ఒత్తిడి దూరమవుతుంది" అంటూ వివరిస్తారామె.

Pramila posing for the camera.
PHOTO • Riya Behl
Pramila's husband Rajesh paints signboards and designs backdrops for weddings and other functions
PHOTO • Riya Behl

ఎడమ: కెమెరాకు పోజిస్తోన్న ప్రమీల. కుడి: ప్రమీల భర్త రాజేశ్ సైన్‌బోర్డులకు చిత్రాలు వేయడం, పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు నేపథ్యాలను డిజైన్ చేయడం చేస్తుంటారు

2007లో ఆమె ఏదైనా నిపుణత కలిగిన పనిని నేర్చుకోవాలనుకున్నపుడు అందుబాటులో బ్యూటీ కోర్సులలో శిక్షణనిచ్చేవారు లేకపోయినప్పటికీ జముయీలోనే రెండిటి గురించి తెలుసుకోగలిగారు ప్రమీల. రెండింటికీ ఆమె కుటుంబం డబ్బు కట్టింది.  ఒకటి ఆకర్షక్ పార్లర్ దగ్గర రూ.6000 విలువ చేసే కోర్సు, రెండోది ఫ్రెష్ లుక్ దగ్గర రూ.2000 విలువ చేసే కోర్సు.

పదిహేనేళ్ల వ్యాపార అనుభవం తరువాత ఇప్పటికీ ఆమె బీహార్‌లో వివిధ కాస్మెటిక్ బ్రాండ్‌లు నిర్వహించే శిక్షణా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. పైపెచ్చు, "నేనే 50 మందికి పైగా స్త్రీలకు శిక్షణ ఇచ్చాను. వారిలో చాలామంది తమ సొంత పార్లర్లు స్థాపించుకున్నారు. కొంతమంది చుట్టుపక్కల గ్రామాల్లో పార్లర్లు ఏర్పాటు చేసుకున్నారు." అని చెబుతారామె.

మా ఇంటర్వ్యూ ముగుస్తుండగా ప్రమీలా శర్మ ఎర్రని లిప్‌స్టిక్‌తో టచప్ చేసుకున్నారు. ఒక కాటుక క్రేయాన్‌ను తీసుకొని కళ్ళకు రాసుకుని సిందూరపు రంగు కవర్ వేసివున్న సోఫాలో కూర్చున్నారు.

"నేను అందంగా ఉండను, కానీ మీరు నా ఫోటో తీసుకోవచ్చు" అన్నారామె.

అనువాదం: కె. నవీన్ కుమార్

Riya Behl

ریا بہل ملٹی میڈیا جرنلسٹ ہیں اور صنف اور تعلیم سے متعلق امور پر لکھتی ہیں۔ وہ پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) کے لیے بطور سینئر اسسٹنٹ ایڈیٹر کام کر چکی ہیں اور پاری کی اسٹوریز کو اسکولی نصاب کا حصہ بنانے کے لیے طلباء اور اساتذہ کے ساتھ کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Riya Behl
Devashree Somani

دیوشری سومانی ایک آزاد صحافی ہیں اور انڈیا فیلو پروگرام کی موجودہ ٹیم کے ساتھ کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Devashree Somani
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Translator : K. Naveen Kumar

K. Naveen Kumar is working as a Sericulture Officer in Anantapur, Andhra Pradesh. He is an aspiring poet and Telugu translator.

کے ذریعہ دیگر اسٹوریز K. Naveen Kumar