గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని తన తోటి రైతులు తమ పొలాల్లోని మర్రి చెట్లను ( ఫైకస్ బెంఘలెన్సెస్ ) అమ్మేస్తున్నప్పుడు 60 ఏళ్ళ వయసున్న సుబ్బయ్యకు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. రెండు దశాబ్దాల క్రితం సుబ్బయ్య కూడా తనకున్న రెండెకరాల పొలంలో ఒక మర్రి కొమ్మను నాటారు. అది ఒక పెద్ద చెట్టుగా విస్తరించి, ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎంతో చల్లని నీడను, ఆశ్రయాన్ని ఇచ్చేది.
ఇప్పుడు తన మర్రి చెట్టును కేవలం రూ.8,000కు అమ్మేయాల్సిన అవసరం సుబ్బయ్యకు వచ్చింది. తన భార్య చికిత్స కోసం ఆయన దానిని ఇష్టం లేకపోయినా అమ్మేశారు. రెండేళ్ల క్రితం, గౌరీ-గణేశ హబ్బా (కర్నాటకలో ఒక పండుగ)కు ముందు, సుబ్బయ్య భార్య 56 ఏళ్ళ మహదేవమ్మ మేకలను మేపుతూ ఒక రాయి మీద కాలు జారి పడిపోవడంతో, ఆమె తుంటి విరిగింది.
“మంద నుంచి తప్పిపోయిన మేకపిల్లను వెంబడిస్తూ ఆ కంగారులో రాయిని చూసుకోలేదు. కిందపడిపోయాక నేనింక పైకి లేవలేకపోయాను,” అని మహదేవమ్మ ఆ దురదృష్టకరమైన రోజును గుర్తు చేసుకున్నారు. “నేను చాలా తీవ్రమైన బాధను అనుభవించాను. అదృష్టవశాత్తు, అటుగా వెళుతున్న కొంతమంది నన్ను చూసి నేను ఇంటికి చేరుకోవడానికి సహాయం చేసారు."
ఈ సంఘటన అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ పరిస్థితులను తలక్రిందులు చేసింది.
సుబ్బయ్య, మహదేవమ్మలు మైసూరు-ఊటీ హైవేకి దూరంగా నంజనగూడు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుణసనాలు గ్రామంలో నివసిస్తున్నారు. వారు కర్నాటకలో షెడ్యూల్డ్ కులాల జాబితాలోని ఆది కర్నాటక (ఎకె) సముదాయానికి చెందినవారు. వారికి 20 ఏళ్ళ కుమార్తె పవిత్ర, 18 ఏళ్ళ కుమారుడు అభిషేక్ ఉన్నారు.
పవిత్ర 8వ తరగతి వరకు చదువుకుంది. అభిషేక్ వినికిడి లోపంతో జన్మించడంతో, అతనికి రెండు చెవులూ సరిగా వినిపించవు. పక్కనే ఎవరైనా మాట్లాడినప్పుడు అతనికేమీ వినిపించదు, దాంతో అతను మాట్లాడటం నేర్చుకోలేకపోయాడు. అభిషేక్ సైగలతోనే సంభాషిస్తాడు. అతనికి వాహనాల కదలికలు గానీ హారన్ శబ్దాలు గానీ వినపడవు కాబట్టి బయటికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సుబ్బయ్య తన కొడుకును మాండ్య జిల్లా, పాండవపుర తాలూకా లోని చినకురళి గ్రామంలో ఉన్న జ్ఞాన వికాస స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్లో చేర్పించారు. అభిషేక్ ఇప్పటికి 12వ తరగతి పూర్తి చేశాడు. అతనిప్పుడు ఇంట్లోనే ఉండి ఆవును చూసుకుంటూ, ఇల్లు గడవడంలో కుటుంబానికి సహకరించేందుకు సమీపంలోని నగరాలలో, పట్టణాలలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నాడు.
కాలక్రమేణా, మహదేవమ్మ చికిత్సకు అయ్యే వైద్య ఖర్చుల కారణంగా వాళ్ళు పొదుపుచేసిన సొమ్ము కరిగిపోవడం ప్రారంభించింది. సుబ్బయ్య తన మర్రి చెట్టును అమ్మిన తర్వాత, తన రెండు ఎకరాల మెట్ట భూమిని గ్రామంలోని మరో రైతు స్వామికి మూడేళ్ళ పాటు రూ. 70,000కు గుత్తకు ఇచ్చారు.
అనేకసార్లు వైద్య పరీక్షలు చేసిన తరువాత, మైసూరులోని కె.ఆర్. ఆసుపత్రి వైద్యులు మహదేవమ్మకు శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. అయితే ఆమెకున్న రక్తహీనత, థైరాయిడ్ కారణంగా అది చాలా కష్టమయ్యేలా ఉంది. 15 రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసి, కొన్ని మందులు రాసిచ్చి, ఆరు వారాల తర్వాత శస్త్రచికిత్స కోసం తిరిగి రమ్మని వాళ్ళు సలహా ఇచ్చారు. అప్పటికి ఆ దంపతులకు ప్రయాణాలు, తిండి ఖర్చులు, ఎక్స్రేలు, రక్త పరీక్షలు, మందులకు దాదాపు రూ. 40,000 ఖర్చు అయ్యాయి.
మహదేవమ్మ ఆ అసౌకర్యాన్ని, నొప్పిని భరించలేకపోయారు. దానితో ఆ దంపతులు తమ ఊరికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉన్న సింగిరిపాళయం గ్రామంలో శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సను ఎంచుకున్నారు. సింగిరిపాళయం సంప్రదాయక ఎముకల వైద్యం, చికిత్సలకు ప్రసిద్ధి చెందింది. చికిత్సలో మహదేవమ్మ కాలుకు తుంటి నుండి చీలమండ వరకు ఒక వెదురు బద్దీ కట్టి, విరిగిన తుంటి మీద మూలికల తైలం పోశారు. కానీ దానికి కూడా తక్కువ ఖర్చేమీ కాలేదు. సుబ్బయ్య, మహదేవమ్మలు అద్దె కారులో ప్రతి 15 రోజులకోసారి నాలుగుసార్లు సింగిరిపాళయం వెళ్ళొచ్చారు. వెళ్ళిన ప్రతిసారీ చికిత్సకు రూ. 6,000, ఆపై అదనంగా సింగిరిపాళయం వెళ్ళి రావడానికి కారు అద్దెకు రూ. 4,500 ఖర్చయ్యేది.
కానీ ఆ చికిత్స ఇతర సమస్యలకు దారితీసింది. వెదురు బద్దీ అంచు మహదేవమ్మ పాదంలోకి వెళ్లి, ఆ రాపిడి వల్ల ఆమె చర్మం కోసుకుపోయింది. ఆ వెదురు బద్దీ ఆమె ఎముక వరకు వెళ్లడంతో గాయం మరింత తీవ్రమైంది. దీంతో సుబ్బయ్య మహదేవమ్మను నంజనగూడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ చికిత్స కోసం మరో రూ. 30,000 ఖర్చయింది కానీ ఆమె పాదం మాత్రం నయం కాలేదు.
గాయమైన కాలితోనే ఇంట్లో తిరిగేందుకు ప్రయత్నించిన మహదేవమ్మ మరో రెండుసార్లు కింద పడిపోయారు. ఆ పడిపోవడం వల్ల ఆమె మోకాలికి తీవ్ర గాయమైంది. సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం వెళితే మరో రూ. 4,000 ఖర్చు అయ్యాయి. చికిత్స చేసినా, ఆమె తన మోకాలిని పూర్తిగా వంచలేకపోతున్నారు.
తన రెండెకరాల పొలాన్ని గుత్తకు ఇవ్వడంతోనే సుబ్బయ్య వర్షాధార పంటలైన పత్తి, మొక్కజొన్న, ఉలవలు, పెసలు, కాయ ధాన్యాలు, అలసందలు వంటి పంటలను సాగు చేసి, వాటి ద్వారా సంపాదించే ఆదాయాన్ని కోల్పోయారు. దాంతో స్థానిక స్వయం సహాయక బృందం నుండి 4 శాతం వడ్డీ రేటుతో రూ. 100,000 అప్పు చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి నెలకు రూ. 3,000లను తీసుకున్న అప్పుకోసం కడుతున్నారు, ఆయన మరో 14 నెలల పాటు ఈ వాయిదాలను చెల్లించాల్సివుంది. తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరో రూ. 70,000 లీజు మొత్తాన్ని ఒక సంవత్సరంలోపు ఆయన తిరిగి చెల్లించాలి.
పని దొరికినప్పుడు సుబ్బయ్య రోజుకు రూ. 500 సంపాదిస్తారు, ఈ పని సాధారణంగా నెలలో దాదాపు 20 రోజులు ఉంటుంది. ఆయన ఆ ప్రాంతంలోని పొలాల్లో కూలీగానే కాక గ్రామంలోని ఇంటి నిర్మాణాల పనులలో సహాయకుడిగా కూడా పనిచేస్తారు. చెరకు పంట కోతలకాలంలో సుబ్బయ్య చక్కెర కర్మాగారాల్లో చెరకును నరికేవారు. ఒకప్పుడు ఇంటి పనులు చేసి, పొరుగున ఉన్న పొలాల్లో గడ్డి కోసి, కలుపు తీసి రోజుకు రూ. 200 సంపాదించి ఇంటి నిర్వహణలో సహాయపడుతూవుండే మహదేవమ్మ ఇప్పుడు ఆదాయం మాట అటుంచి, ఆసరా లేకుండా నడవలేకపోతున్నారు.
నెలకు 200 లీటర్ల పాలను ఇచ్చి, ప్రతి నెలా దాదాపు రూ. 6,000 సంపాదించి పెట్టే వాళ్ళ ఆవు గత రెండేళ్ళుగా దూడల్ని కనలేదు, దాంతో వాళ్ళకున్న ఆదాయ వనరుల్లో మరొకటి తగ్గిపోయింది.
హుణసనాలు గ్రామం చివరన ఇరుకైన సందులో సున్నం కొట్టి ఉన్న ఒంటిగది ఇల్లు మాత్రమే ఇప్పుడు ఆ కుటుంబానికి మిగిలింది.
ఈ వరుస దుర్ఘటనలకు ముందు, కొడుకును వినికిడి లోపం ఉన్నవారి కోసం నడిపే ప్రత్యేక పాఠశాలలో చదివించిన సుబ్బయ్య అతని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. "వాడు చాలా తెలివైనవాడు. కేవలం మాట్లాడలేడంతే,” ఆయన కొడుకు గురించి ఎంతో గర్వంగా చెప్పారు. కొడుకుకు మరింత సహకరించలేకపోతున్నందుకు ఆయన బాధపడుతున్నారు.
వారి కుమార్తె పవిత్ర వంట పని, ఇల్లు శుభ్రంచేయటం వంటి పనులు చేసి, ఇంటిని చక్కబెడుతుంది. పెళ్ళితోపాటు వచ్చే ఖర్చులను ఆ కుటుంబం భరించలేనందున, పవిత్రకు పెళ్లయ్యే అవకాశాలు తక్కువని ఆమె తండ్రి అన్నారు.
“ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నేను ఒక వైపు ఛార్జీలకే రూ. 500 ఖర్చు చేయాలి. ఆపైన మందుల, ఎక్స్-రేల ఖర్చులుంటాయి. నేను ఇప్పటికే మా జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని చికిత్స కోసం ఖర్చు చేశాను. నాకింక డబ్బెక్కడ దొరుకుతుంది,” నిస్సహాయంగా అన్నారు సుబ్బయ్య.
ఆయన ఇప్పటికీ చెట్టును పోగొట్టుకోవడం వల్ల కలిగిన నష్టం గురించి చింతిస్తుంటారు. “అది నేను నాటి, పెంచిన చెట్టు. నేను దానిని అమ్మకుండా ఉండాల్సింది. కానీ నాకు వేరే దారి ఏముంది?”
మహదేవమ్మకు అవసరమైన దీర్ఘకాల చికిత్సకు అయ్యే ఖర్చు ఆ కుటుంబం భరించగలిగింది కాదు. ఆమెకు మంచి వైద్య చికిత్సను ఇప్పించడానికీ, అందుకోసం అయ్యే ఖర్చుల కోసం వాళ్ళకు డబ్బు కావాలి. వాళ్ళ భూమిని వాళ్ళు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, వారి ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు తిరిగి నిలబడేందుకు వాళ్ళకింకా చాలా డబ్బు కావాలి.
"ఏ సాయమూ లేకుండా నేను కనీసం ఇంటి ముంగిట కూడా నడవలేను," మహదేవమ్మ బాధపడుతూ చెప్పారు.
“నలుగురు మనుషులున్న కుటుంబాన్ని పోషించడానికి పనిచేయగలిగింది నేనొక్కడిని మాత్రమే. నేను సంపాదించేది కూడా మాకు ఎప్పుడూ సరిపోదు. నా శత్రువులకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటాను. మా సమస్యలకు అంతమే కనిపించడం లేదు," బేలగా చూస్తూ అన్నారు సుబ్బయ్య.
అనువాదం: రవి కృష్ణ