ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

పొలమైతే ఉంది, కానీ పనిచేస్తున్నవారిలో ఇది, ఏ ఒక్కరి సొంతమూ కాదు

భూ యజమానికి తనను ఫోటో తీయడం గర్వంగా ఉంది. అతని పొలంలో పనిచేస్తున్న తొమ్మిది మంది మహిళా కూలీలు నడుము వంచి నాట్లు వేస్తుండగా, అతను నిటారుగా నిలబడి ఉన్నాడు. వారికి రోజుకు రూ. 40 చెల్లిస్తానని అతనన్నాడు. ఆ తర్వాత మాతో మాట్లాడిన మహిళలు, అతనిచ్చింది రూ. 25 అని చెప్పారు. వారంతా ఒడిశాలోని రాయగడకు చెందిన భూమిలేని కూలీలు.

భారతదేశంలో భూస్వామ్య కుటుంబాలకు చెందిన స్త్రీలకు కూడా భూమిపై హక్కు లేదు. వారి తల్లిదండ్రుల ఇంట్లోనే కాదు; వారి భర్త, అత్తమామల ఇంట్లో కూడా. ఒంటరి మహిళలు, భర్తను కోల్పోయినవారు లేదా విడాకులు తీసుకున్న మహిళలు చివరకు వారి బంధువులకు చెందిన పొలాల్లో కూలీలుగా మారిపోవచ్చు.

వీడియోను చూడండి : ' లెన్స్ లోంచి చూస్తూవుంటే , నాకు చటుక్కున తోచింది ఏమిటంటే : భూ యజమాని ఒక్కడే నిటారుగా నిలబడి ఉన్నాడు , మహిళలు మాత్రం వంగిపోయి పనిచేస్తున్నారు ,' అన్నారు పి . సాయినాథ్

అధికారిక లెక్కల ప్రకారం, 63 మిలియన్ల మంది మహిళా కార్మికులు ఉన్నారు. వీరిలో 28 మిలియన్లు, అంటే 45 శాతం మంది వ్యవసాయ కూలీలు. ఈ అస్థిరమైన సంఖ్య కూడా తప్పుదారి పట్టించేదిగానే ఉంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపాధి దొరకని వారిని ఇది లెక్కలోకి తీసుకోలేదు. ఇది చాలా ముఖ్యమైనది. దీని అర్థం, లక్షలాది మంది మహిళలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు సహకరించే కార్మికులుగా పరిగణించబడరు. వ్యవసాయం కాకుండా గ్రామీణ మహిళలు చేసే పనిని చాలా వరకు ‘ఇంటి పని’ అని కొట్టిపారేస్తారు.

అధికారికంగా 'ఆర్థిక కార్యకలాపం'గా పరిగణించబడే ఆ పనిలో కూడా, అతి తక్కువ వేతనాలతో కూడిన వ్యవసాయపు పనులే మహిళల కోసం తెరచివున్న ఏకైక అతిపెద్ద మార్గం. ఇప్పుడు భూమిలేని కూలీలకు పనిదినాలు పడిపోతున్నాయి. ఆర్థిక విధానాలు ఆ ప్రక్రియను నడిపిస్తాయి. పెరుగుతున్న యాంత్రీకరణ దానిని మరింత ప్రోత్సహిస్తుంది. వాణిజ్య పంటలకు మారడం దానిని తీవ్రతరం చేస్తుంది. కొత్త కాంట్రాక్టు వ్యవస్థలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని ఒక పొలంలో ఈ ఇద్దరు చిన్నారులు తెగుళ్ళ కారకాలయిన పురుగుల కోసం (కింద) వేట సాగిస్తున్నారు. ఈసారి అవి, ఎర్రటి వెంట్రుకలున్న గొంగళి పురుగులు. వారి గ్రామంలో ప్రస్తుతం డబ్బులు సంపాదించే పని ఇదే. ప్రతి కిలో గొంగళి పురుగులకు, భూమి యజమానుల నుండి 10 రూపాయలు దొరుకుతాయి. అంటే, అంత సంపాదించాలంటే ఈ పిల్లలు వెయ్యికి పైగా పురుగులను పట్టుకోవాలి.

భూమి వంటి వనరులపై ప్రత్యక్ష నియంత్రణ లేకపోవడం, సాధారణంగా పేదవారినీ, మహిళలందరి స్థితినీ కూడా బాగా బలహీనపరుస్తుంది. యాజమాన్యం, సామాజిక స్థితి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే భూవసతినీ, లేదా భూమిపై అజమాయిషీని కలిగి ఉంటారు. భూమిపై హక్కులు ఖాయమయ్యాకే పంచాయతీరాజ్‌లో వారి భాగస్వామ్యం బాగా పనిచేస్తుంది.

PHOTO • P. Sainath

భూమి లేనివారిలో దళితులు ఇంత పెద్ద సంఖ్యలో ఉండడం యాదృచ్ఛికమేమీ కాదు. మహిళా వ్యవసాయ కూలీల్లో దాదాపు 67 శాతం మంది దళితులే. అత్యంత దోపిడీకి గురవుతున్న ఈ సామాజిక విభాగాలు వర్గం, కులం, జెండర్ అనే మూడు ప్రపంచాలనించి అత్యంత దుర్మార్గమైన దోపిడీని ఎదుర్కొంటున్నాయి.

భూమిపై హక్కును కలిగివుంటే పేద, కింది కులాలకు చెందిన మహిళల స్థాయి మెరుగుపడుతుంది. వారికి ఇతరుల భూముల్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మెరుగైన వేతనం కోసం చేసే బేరసారాల్లో వారికిది సాయం చేస్తుంది. ఇది వారి ఋణ పరపతిని మెరుగుపరుస్తుంది.

ఇది వారి స్వంత బీదరికాన్నీ, తద్వారా కుటుంబ బీదరికాన్నీ కూడా తగ్గిస్తుంది. మగవాళ్ళు తాము సంపాదించినదానిలో ఎక్కువ భాగాన్ని తమకోసమే ఖర్చుపెట్టుకుంటారు. మహిళలు దాదాపుగా తమ ఆదాయంలో మొత్తాన్నీ కుటుంబం కోసమే ఖర్చుపెడతారు. అందువలన ఇది పిల్లలకు చాలా మేలుచేస్తుంది.

PHOTO • P. Sainath

అంటే ఇది ఆమెకూ, పిల్లలకూ, ఆమె కుటుంబానికీ కూడా మంచిదే. ఒక్క మాటలో, భారతదేశంలో పేదరికంపై విజయం సాధించాలంటే భూమికి సంబంధించిన మహిళల హక్కుల్ని నిర్ధారించాలి. పశ్చిమబెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు 400,000 కేసులలో తిరిగి పంచబడిన భూములకు ఉమ్మడి పట్టాలను ఇవ్వడం ద్వారా దీనిని ప్రారంభించాయి. అయినా ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది.

భూమిని దున్నే పని మహిళలను చేయనీయంగా పోవడం వలన, "దున్నేవాడికే భూమి" అనే పాత నినాదం స్థానంలో "పొలం పని చేసేవారికే భూమి" అనే నినాదంపై పనిచేయాలి.

PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sudhamayi Sattenapalli