మావాళ్ళ మరణాల గురించి రాయడానికి నేను ప్రయత్నించిన ప్రతిసారీ, శరీరం నుండి శ్వాస వదిలి వెళ్ళిపోయినట్లుగా నా మనసంతా ఒక్కసారిగా ఖాళీ అవుతుంది.

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, మన సమాజం మాత్రం తమ శరీరాన్ని ఉపయోగించి పనిచేసే పారిశుద్ధ్య శ్రామికుల జీవితాలను అసలు పట్టించుకోదు. వీరి మరణాలు సంభవిస్తున్నాయని కూడా ప్రభుత్వం ఒప్పుకోదు. అయితే, ఈ ఏడాది లోక్‌సభ సమావేశంలో ఒక ప్రశ్న కు సమాధానంగా, 2019-2023 మధ్య “మురుగు కాలువలను, సెప్టిక్ ట్యాంకులను శుభ్రంచేసే ప్రమాదకరమైన పని వల్ల” 377 కంటే ఎక్కువమంది పారిశుద్ధ్య శ్రామికులు మరణించినట్లు సామాజిక న్యాయం, సాధికారత శాఖా మంత్రి రామ్‌దాస్ ఆఠవలే తెలియజేశారు.

గత ఏడేళ్ళలో నేను మ్యాన్‌హోల్‌లో పనిచేస్తూ మరణించిన లెక్కలేనంతమంది పారిశుద్ధ్య శ్రామికుల అంత్యక్రియలకు హాజరయ్యాను. 2022 నుండి, ఒక్క చెన్నై జిల్లాలోని ఆవడిలోనే ఇటువంటి 12 మరణాలు సంభవించాయి.

ఆగస్టు 11న, ఆవడిలో నివాసముండే అరుంధతియర్ సముదాయానికి చెందిన 25 ఏళ్ళ హరి అనే కాంట్రాక్ట్ కార్మికుడు, మురుగుకాల్వను శుభ్రం చేస్తూ, ఆ మురుగునీటిలో మునిగి చనిపోయారు.

పన్నెండు రోజుల తరువాత, హరి అన్న మరణవార్తను రిపోర్టు చేయడానికి నేను వెళ్ళాను. అతని మృతదేహాన్ని ఆయన ఇంటిలోనే ఒక ఫ్రీజర్ బాక్స్‌లో పెట్టివుండటం కనిపించింది. అతని భార్య తమిళ్ సెల్విని, ఒక భర్తను కోల్పోయిన మహిళ చేయాల్సిన అంతిమ ఆచారాలన్నిటినీ నిర్వహించమని ఆమె కుటుంబం అడిగింది. ఆమె పొరుగింటివారి బంధువులు ఆమె తాళి ని తెంచడానికి ముందు, ఆమెకు పసుపు రాసి స్నానం చేయించారు. ఈ ఆచారాలు జరుగుతున్నంత సేపూ ఆవిడ గంభీరంగా, మౌనంగా ఉండిపోయారు.

PHOTO • M. Palani Kumar

పారిశుద్ధ్య పని వల్లే హరి మరణించారు. అతను, అంగవైకల్యం ఉన్న అతని భార్య తమిళ్ సెల్వి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అతని మృతదేహం ఎదుట కన్నీరుమున్నీరుగా విలపిస్తోన్న తమిళ్ సెల్వి, వారి కూతురు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: దీపక్క చనిపోయిన గోపి భార్య. తన ప్రేమను వ్యక్తపరచేందుకు భర్త పేరును తన కుడిచేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారామె. కుడి: ఆగస్టు 11, 2024న గోపి మరణించారు. ఆగస్టు 20న వారి వివాహ వార్షికోత్సవం కాగా, ఆగస్టు 30న వారి కుమార్తె (ఇక్కడ చూడవచ్చు) పుట్టినరోజు

ఆవిడ బట్టలు మార్చుకోవడానికి వేరే గదిలోకి వెళ్ళినప్పుడు, ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఉత్త ఎర్ర రంగు ఇటుకలతో కట్టిన ఆ ఇంటి నిర్మాణంలో సిమెంట్‌ను ఉపయోగించలేదు. అక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క ఇటుక తినేసిపోయి, పొడి రాలుతున్నాయి. ఆ ఇల్లు కూలిపోయే దశలో ఉన్నట్లు కనిపిస్తోంది.

చీర మార్చుకుని తిరిగి వచ్చిన తమిళ్ సెల్వి అక్క ఒక్కసారిగా అరుస్తూ ఫ్రీజర్ బాక్స్ వైపుకు పరిగెత్తారు. దాని పక్కనే కూర్చుని ఏడుస్తూ, మొత్తుకోవటం మొదలుపెట్టారు. ఆ గదంతా నిండిపోయిన ఆమె రోదనతో, అక్కడి జనం నిశ్శబ్దమైపోయారు..

“ఓయ్! లే! నన్ను చూడు, మామా (ప్రేమగా పిలిచే పదం). వీళ్ళు నన్ను చీర కట్టుకునేలా చేస్తున్నారు. కానీ నేను చీర కట్టుకోవడం నీకిష్టం లేదు కదా? లేచి, నన్ను బలవంతం చేయొద్దని వీళ్ళకి చెప్పు.”

ఇప్పటికీ ఆ మాటలు నాలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. తమిళ్ సెల్వి అక్క కు ఒక చెయ్యి లేదు. చీర పవిటకు భుజం దగ్గర పిన్ను పెట్టుకోవడం ఆమెకు కష్టంగా ఉంటుంది. అందుకే ఆవిడ చీర కట్టుకోరు. అలా నిలిచిపోయిన ఈ జ్ఞాపకం, ప్రతిరోజూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

నేను హాజరైన ప్రతి మరణం నాలో అలా నిలిచిపోయింది.

ప్రతి ఒక్క మోరీ (మ్యాన్‌హోల్) మరణం వెనుక ఎన్నో కథలు దాగి ఉంటాయి. ఆవడిలో ఇటీవల సంభవించిన మరణాలలో, 22 ఏళ్ళ దీప తన భర్త గోపిని కోల్పోయారు. పది లక్షల రూపాయల నష్టపరిహారం తన కుటుంబం కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాలను తిరిగివ్వగలదా అని ఆమె ప్రశ్నించారు. “ఆగస్టు 20 మా పెళ్ళి రోజు. ఆగస్టు 30 మా కూతురి పుట్టినరోజు. అదే నెలలో అతను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు,” అన్నారామె. డబ్బు రూపంలో వారికిచ్చే నష్టపరిహారం వారి ఆర్థిక అవసరాలన్నిటినీ తీర్చలేదు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: గోపి మృతదేహాన్ని తమ వీధిలోకి తీసుకురావడానికి ముందు, ఎండిన ఆకులతో మంట వెలిగించిన అతని కుటుంబ సభ్యులు. కుడి: అంత్యక్రియలలో భాగంగా నేలపై ఇలా పూలు పెడతారు

PHOTO • M. Palani Kumar

గోపి మృతదేహాన్ని ఐస్ బాక్స్‌లో ఉంచుతున్నారు. మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధిస్తూ 2013లో ఒక చట్టం అమలులోకి తెచ్చినప్పటికీ, ఆ పద్ధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారులు తమను బలవంతంగా మోరీలలోకి దిగమంటున్నారనీ, అందుకు నిరాకరిస్తే తమకు జీతాలివ్వమని బెదిరిస్తున్నారనీ కార్మికులు చెబుతున్నారు

PHOTO • M. Palani Kumar

తన భర్త గోపి మృతదేహాన్ని వదలకుండా పట్టుకున్న దీపక్క

మోరీ మరణాలు సంభవించిన కుటుంబాలలోని స్త్రీలను, పిల్లలను తరచూ బాధితులుగా పరిగణించరు. విల్లుపురం జిల్లాలోని మాదంపట్టు గ్రామంలో, తన భర్త మారి మ్యాన్‌హోల్‌లో మరణించినప్పుడు, ఎనిమిది నెలల గర్భవతి అయిన అనుసుయ అక్క ఏడుపును బయటికి రానివ్వలేదు. ఆ దంపతులకు అప్పటికే ముగ్గురు కూతుళ్ళున్నారు. పెద్ద కుమార్తెలిద్దరూ ఏడ్చారు, కానీ ఏం జరుగుతున్నదో అర్థంచేసుకోలేని వారి మూడవ కూతురు మాత్రం, తమిళనాడు తూర్పువైపు అంచున ఉన్న తమ ఇంటి చుట్టూ పరుగులుపెడుతూ ఉండిపోయింది.

అదీగాక, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని రక్తపు సొమ్ముగా చూస్తారు. “నేను ఈ డబ్బును ఖర్చు పెట్టలేకపోతున్నాను. దీన్ని ఖర్చు చేయడమంటే నా భర్త రక్తాన్ని తాగుతున్నట్లుగా అనిపిస్తోంది,” అన్నారు అనుసుయ అక్క .

తమిళనాడులోని కరూర్ జిల్లాలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణన్ కుటుంబం గురించి నేను ఆరా తీసినప్పుడు, అతని భార్య తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాను. పని చేస్తున్నప్పుడు తరచూ తన పరిసరాలను కూడా మర్చిపోతుంటానని, తన స్థితిని గ్రహించడానికి కొంత సమయం పడుతుందని ఆవిడ తెలిపారు.

ఈ కుటుంబాల జీవితాలు మొత్తం తల్లకిందులైపోయాయి. మనకి మాత్రం ఈ మరణాలన్నీ వార్తలే తప్ప మరింకేమీ కావు!

PHOTO • M. Palani Kumar

విల్లుపురం జిల్లాలోని మాదంపట్టు గ్రామంలో, మాన్యువల్ స్కావెంజింగ్ కారణంగా మారి మరణించారు. ఆయన తన భార్య, ఎనిమిది నెలల గర్భవతి అనుసుయను విడిచి వెళ్ళిపోయారు

PHOTO • M. Palani Kumar

అతని ఇంటి నుండి వారి సముదాయం కోసం ప్రత్యేకించి ఏర్పాటుచేసిన శ్మశానవాటికకు తరలించిన మారి మృతదేహం

ఆవడిలోని భీమానగర్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మోజెస్ సెప్టెంబర్ 11, 2023న మరణించారు. పెంకుల పైకప్పు ఉన్నది అతని ఇల్లు ఒక్కటి మాత్రమే. అతని కుమార్తెలిద్దరూ అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు. అతని మృతదేహం రావడానికి ఒక రోజు ముందు నేను వారింటికి వెళ్ళినప్పుడు, అతని కూతుళ్ళిద్దరూ ‘నాన్న నన్ను ప్రేమిస్తాడు’, ‘నాన్న చిన్నారి రాకుమారి’ అని రాసి ఉన్న టి-షర్టులను ధరించివున్నారు. వాళ్ళలా వేసుకోవటం యాదృచ్ఛికమని నాకు అనిపించలేదు.

వారు రోజంతా ఎడతెగకుండా ఏడుస్తూనే ఉన్నారు. మిగతావాళ్ళు ఎంత ఓదార్చినప్పటికీ వారు శాంతించలేదు.

ఈ ఘటనలన్నిటినీ ప్రధాన స్రవంతికి తెలిసేలా డాక్యుమెంట్ చేయడానికి మేం ప్రయత్నించినా, ఈ మరణాలను కేవలం వార్తలుగా పరిగణించే ధోరణి మన సమాజంలో ఎప్పటినుండో కొనసాగుతోంది.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: చెన్నై, అవడిలోని భీమానగర్‌లో జరిగిన మరో అంత్యక్రియల కార్యక్రమంలో, మోజెస్ మృతదేహంపై పువ్వులుంచుతున్న కలవరంలో మునిగివున్న ఆయన కుటుంబం. కుడి: అతని శరీరం ముందు ప్రార్థనలు చేస్తోన్న కుటుంబం

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: ఆవడి మోజెస్ మృతదేహం నుండి దుర్వాసన రావడం మొదలవ్వడంతో, జనం దానిని అక్కడి నుండి త్వరత్వరగా తరలించారు. కుడివైపు: మరణించిన ఆవడి మోజెస్ ఇల్లు

వారం రోజుల క్రితం, శ్రీపెరుంబుదూర్‌లోని కంజిపట్టు కుగ్రామం సమీపంలో, ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు – నవీన్ కుమార్ (25), తిరుమలై (20), రంగనాథన్ (50) – మరణించారు. తిరుమలైకి కొత్తగా పెళ్ళయింది. రంగనాథన్ ఇద్దరు పిల్లల తండ్రి. చనిపోయిన కార్మికులలో చాలామంది కొత్తగా పెళ్లయినవాళ్ళే కావటంతో, ఆశలన్నీ అడియాశలైన వారి భార్యలను చూడటం ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది. భర్త చనిపోయిన కొన్ని నెలల తరువాత ముత్తులక్ష్మికి కొంతమంది సీమంతం జరిపించారు..

మన దేశంలో, మాన్యువల్ స్కావెంజింగ్ అనేది చట్టవిరుద్ధమైన పని . అయినప్పటికీ, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ చనిపోయేవారి సంఖ్యను తగ్గించలేక పోతున్నాం. ఈ సమస్యను ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలియదు. నా రచనలు, ఛాయాచిత్రాలు మాత్రమే నాకు తెలిసిన ఏకైక మార్గం. వీటి ద్వారానే ఈ దారుణమైన పనికి ముగింపు పలకగలగాలని నేను ఆశిస్తున్నాను.

ఈ మరణాలలో ప్రతి ఒక్కటీ నా మనసుని కలచివేస్తుంటుంది. వారి అంత్యక్రియలలో నేను ఏడవచ్చో లేదోనని తరచూ అడుగుతుంటాను. వృత్తిపరమైన దుఃఖం అంటూ ఏదీ ఉండదు కదా! ఇది ఎప్పుడూ వ్యక్తిగతమే. అయితే, ఈ మరణాలే లేకపోతే గనుక నేను ఫోటోగ్రాఫర్‌ని అయి ఉండేవాడిని కాను. మరో మోరీ మరణాన్ని ఆపడానికి నేనింకా ఏం చేయాలి? మనమందరం ఏం చేయాలి?

PHOTO • M. Palani Kumar

ఆగస్టు 2, 2019న, చెన్నైలోని పులియాన్‌దొప్పులో జరిగిన మోరీ ఘటనలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడు మోజెస్. నీలం రంగు చీరలో కనిపిస్తున్నవారు అతని భార్య మేరీ

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: రంగనాథన్ ఇంటి వద్ద, అంత్యక్రియల ఆచారాలలో భాగంగా అతని బంధువులు బియ్యాన్ని పంచారు. తమిళనాడు, శ్రీపెరంబుదూర్ సమీపంలోని కంజిపట్టు గ్రామంలో, 2022 దీపావళికి వారం రోజుల ముందు, సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ రంగనాథన్, నవీన్ కుమార్‌లు మృతి చెందారు. కుడి: శ్రీపెరంబుదూర్‌లోని సెప్టిక్‌ ట్యాంక్‌ను క్లీన్‌ చేస్తూ ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో, రద్దీగా ఉన్న శ్మశానవాటిక

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమవైపు: ఉద్యోగాల క్రమబద్ధీకరణను, జీతాల పెంపును కోరుతూ అక్టోబరు 2024లో చెన్నై మునిసిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. వారు దీనదయాళ్ అంత్యోదయ యోజన-దేశీయ పట్టణ జీవనోపాధి మిషన్ (DAY-NULM) కింద పనిచేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాల కోసం, జీతాలు పెంచాలన్న డిమాండ్లతో, వామపక్ష ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఎల్‌టియుసి) సభ్యుల ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. కుడి: కోవిడ్‌ తరువాత, ఘన వ్యర్థాల నిర్వహణను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 5, 6, 7 జోన్‌లకు చెందిన వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టినప్పుడు, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

M. Palani Kumar

एम. पलनी कुमार २०१९ सालचे पारी फेलो आणि वंचितांचं जिणं टिपणारे छायाचित्रकार आहेत. तमिळ नाडूतील हाताने मैला साफ करणाऱ्या कामगारांवरील 'काकूस' या दिव्या भारती दिग्दर्शित चित्रपटाचं छायांकन त्यांनी केलं आहे.

यांचे इतर लिखाण M. Palani Kumar
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

यांचे इतर लिखाण PARI Desk
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

यांचे इतर लिखाण Y. Krishna Jyothi