కార్‌చుంగ్ మొన్పా పెళ్ళిళ్ళలో పాడినప్పుడు, ఆయన సేవలకు గాను ఆయనకు ఒక భాగం వండిన గొర్రెపిల్ల మాంసాన్ని ఇస్తారు. ఆయన సంగీత విన్యాసం వివాహ వేడుకను గౌరవించటంగా చెప్తారు. వధువు కుటుంబం ఆయన్ని ఆహ్వానిస్తుంది.
మొన్పా సముదాయానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినపుడు, వరుడు వధువు ఇంటికి వెళ్ళటంతో రెండు రోజుల పెళ్ళి వేడుక మొదలవుతుంది. వారక్కడ స్థానికంగా కాచే ఆరా అనే మద్యాన్ని తాగుతారు, కుటుంబ సభ్యులంతా గొప్ప విందు చేసుకుని అందులో ఆడి పాడతారు. ఇక్కడే ఎలాంటి వాద్య సహాకారం లేకుండా కార్‌చుంగ్ తన పాటను ప్రదర్శిస్తారు. ఆ మరుసటి రోజు వరుడు తన వధువును తీసుకొని తన ఇంటికి తిరిగి వెళ్తాడు.
కార్‌చుంగ్ అసలు పేరు రించిన్ తాశీ, కానీ 'కార్‌చుంగ్' పేరుతోనే ఆయన అందరికీ తెలుసు. ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా, చాంగ్‌పా రోడ్‌లో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన పనిచేసుకుంటుండగా రేడియోలో వినిపిస్తుండే ప్రజాదరణ పొందిన పాటలు సంగీతం పట్ల అతనికున్న మక్కువను చాటుతాయి. కార్‌చుంగ్ ఆరా గురించి కూడా పాట పాడతారు. "పొలంలో పని చేసేటప్పుడూ లేదా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడూ నేను ఆ పాటను పాడతాను," చెప్పారాయన.
53 ఏళ్ళ కార్‌చుంగ్ తన భార్య పేమ్ జొంబాతో కలిసి నివసిస్తున్నారు. తన కుటుంబానికి తన భార్యే 'బాస్' అని ఆయన అంటారు. సారవంతమైన లోయలో వారికున్న సుమారు ఎకరం భూమిని పేమ్ సాగుచేస్తుంటారు. "మేం ధాన్యం, మొక్కజొన్న, వంకాయలు, చేదు వంకాయలు, లాయ్ సాగ్ (ఆవ ఆకులు), ఉల్లిపాయలు, కాలీఫ్లవర్ పండిస్తాం," అని ఆయన చెప్పారు. వారు పండించే ధాన్యం, చిరుధాన్యాలు, కూరగాయలలో అధికభాగాన్ని ఆ కుటుంబమే తమ తిండి కోసం వాడుకుంటుంది. కొన్నిసార్లు ఏమైనా పంటలు మిగిలితే, వాటిని దిరాంగ్ బ్లాక్‌లోని రామా కాంప్ వారపు సంతలో అమ్ముకుంటారు.
ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు - ఇద్దరు కూతుళ్ళు, ముగ్గురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళయిన రించిన్ వాంగ్‌మూ, సాంగ్ ద్రేమాలకు పెళ్ళిళ్ళయ్యాయి, వారు అప్పుడప్పుడూ వచ్చిపోతుంటారు. ముంబైలోని ఒక హోటల్లో వంటవాడిగా పనిచేస్తోన్న వారి పెద్ద కొడుకు పేమ్ దోండుప్ ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఇంటికి వచ్చిపోతుంటాడు. సంగీతకారుడైన నడిపి కొడుకు లీయ్‌కీ ఖండూ, లోయలోని పర్యావరణ అనుకూల పర్యాటకంలో భాగంగా ఉన్నాడు. చిన్న కొడుకు నిమ్ తాశీ దిరాంగ్ పట్టణంలో పనిచేస్తున్నాడు.
మొన్పా సముదాయం తమ మూలాలను టిబెట్‌కు చెందినవిగా గుర్తిస్తారు. కొయ్య పని, నేత పని, చిత్రకళలో నైపుణ్యమున్న వీరిలో ఎక్కవమంది బౌద్ధులు. 2013 నాటి ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం వారి సంఖ్య 43,709.
కార్‌చుంగ్ కేవలం సంగీతకారుడే కాకుండా, తన ఖాళీ సమయంలో తాళ వాయిద్యాలను తయారుచేస్తుంటారు. "స్థానికంగా చిలింగ్ అని పిలిచే ఒక డోలు ధర మార్కెట్లో 10,000 రూపాయలుంటుంది. నా ఖాళీ సమయాల్లో నేను ఒక డోలును తయారుచేసుకోగలను," ఆయన PARIతో చెప్పారు.
తమ దుకాణం పెరటిలో, చుట్టూ తాము పెంచుతోన్న కూరగాయలు, మొక్కజొన్న మధ్య కూర్చొని ఉన్న ఆయన, మేం పాడమని అడగిన వెంటనే పాడటం మొదలుపెట్టారు. తరతరాలుగా మౌఖిక రూపంలో అందిన ఈ పాటలలో ఉన్న టిబెట్ మూలాలకు చెందిన మాటల అర్థాలను మాకు వివరించటానికి ఆయన కష్టపడ్డారు.
మొన్పా పెళ్ళి పాట:
మెరిసే బంగారు కళ్ళ అమ్మాయి
ఆమె పట్ల ఆదరంతో ఉండే ఆమె తల్లి
అందరి కన్నుల మణి ఆ అమ్మాయి
చక్కని దుస్తులు ధరించి వచ్చింది
ఆమె చేపట్టిన దదర్ [ఆచార సంబంధమైన బాణం]
ఆమెను మరింత బంగారంలా మెరిపించింది
లోహ దేవత ఇచ్చిన దదర్ లోహం,
ఆమె భూషణాలలో మెరుస్తోంది
లాసా (టిబెట్) నుండి తెచ్చిన వెదురు
ఆ దదర్‌లో
యెషి ఖంద్రోమా దేవత పాలు
ఆ దదర్ పైనున్న రాయిలో
శీర్షాన ఉన్న తూలిక
థంగ్ థంగ్ కార్మో పక్షి** ఈక
*దదర్ అనేది ఆచారాలలో ఉపయోగించే ఒక బాణం. జీవ శక్తులను, దీర్ఘాయువును, అదృష్టాన్ని, శ్రేయస్సును పిలువనంపేందుకు దానిని ఉపయోగిస్తారు. దీనికి కట్టివున్న అయిదు రిబ్బన్లు పంచమూలకాలకు, ఐదు డాకినీలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆచారాలలో, బుద్ధ దేవాలయాలలో దదర్‌ను సవ్యదిశలో తిప్పుతారు
**థంగ్ థంగ్ కార్మో లేదా నల్లటి మెడ ఉన్న కొంగ ఈక - ఇది ఎత్తైన ప్రదేశాలలో అనేక దూరాలు ఎగరగల హిమాలయ పక్షి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి