2023 మాకు తీరికలేని సంవత్సరం.
భారత దేశం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు ప్రతి రోజూ ప్రకృతి ప్రకోప సంఘటనలను ఎదుర్కొంది. లోక్‌సభ, రాష్ట్రాల విధానసభలలోకి ఎక్కువ మంది మహిళలను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కానీ ఈ బిల్లు 2029లో మాత్రమే అమలుకానుంది! ఇదిలా ఉండగా, 2022లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 445,256గా దేశీయ నేర నమోదుల బ్యూరో విడుదల చేసిన డేటా చూపించింది. ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్ట్ బెంచ్ స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపునివ్వడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ, లింగ మూస పద్ధతులను ఎదుర్కోవడంపై సుప్రీంకోర్టు ఒక కరదీపిక (హ్యాండ్‌బుక్)ను ఆగస్టులో విడుదల చేసింది. అందులో కొన్ని 'మూసపద్ధతుల ప్రమోటింగ్' నిబంధనలకు ప్రత్యామ్నాయాలను సూచించింది. తొమ్మిది రాష్ట్రాలు తమ రాష్ట్ర విధానసభలకు ఎన్నికలు నిర్వహించాయి. మతపరమైన, కులాలవారీగా చెలరేగిన మంటలు వార్తల వలయంలో ఆధిపత్యం చెలాయించాయి. మార్చి 2022 నుండి జూలై 2023 మధ్య, భారతదేశంలో కోట్లకు పడగలెత్తినవారి సంఖ్య 166 నుండి 174కి పెరిగింది. 15-29 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులలో సగటు నిరుద్యోగం రేటు ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 17.3 శాతంగా ఉంది.








