"మా శరీరాలకు రంగులు వెయ్యడం కష్టం. మేం రాత్రంతా లేచి ఉండాలి (రంగులు వేయించుకోవడానికి)," అంటాడు ఆయుష్ నాయక్, తన దేహానికి మొదటిసారిగా నూనె రంగులు రాసుకుంటూ. "నా శరీరం మండుతున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి, మేం ఈ రంగుని కుదిరినంత తొందరగా ఆరబెట్టాలి," అంటాడు పదిహేడేళ్ళ ఈ అబ్బాయి.
కోస్తా కర్ణాటకలో 'పిలి వేష' (లేక హులి వేష ), దసరా జన్మాష్టమి పండుగలప్పుడు చేసే ఒక జానపద నృత్యం. దీని కోసం శరీరాలకు మెరిసిపోయే రంగుల గీతలు వేసుకునే బాలబాలికలలో ఆయుష్ ఒకడు. ఈ ప్రదర్శన చేసేటప్పుడు చుట్టూ గట్టిగా డోళ్ళు మోగుతుంటే పులి ముసుగులు వేసుకుని గట్టిగా గాండ్రిస్తారు, కేకలు వేస్తారు.
కోస్తా కర్ణాటకలో మాట్లాడే తుళు భాషలో పిలి అంటే పులి, వేష అంటే వేషం. "ఎవరూ ఎవరి నించీ ఏమీ నేర్చుకోవక్కర్లేదు. ఇది మా ఆత్మలో ఉంటుంది." అంటారు గత ఇరవై రెండేళ్ళుగా పిలి వేష వేస్తోన్న వీరేంద్ర శెట్టిగార్. "ఆ డోలు చప్పుళ్ళతో పాటు చుట్టూ ఆవరించి ఉండే శక్తి తాళానికి అనుగుణంగా మీ చేత నాట్యమాడిస్తాయి." 30 ఏళ్ళ వయసున్న ఈయన అమెజాన్ పంపిణీదారుడిగా పనిచేస్తారు, తన గ్రామంలోని యువతను ఈ నృత్యం చేయమని ప్రోత్సహిస్తూ ఉంటారు.
నాట్యకారులు పులులలాగా, రకరకాల చిరుతపులులలాగా కనిపించడానికి శరీరమంతా అక్రీలిక్ రంగులతో పసుపు, మట్టి రంగు చారలు వేసుకుంటారు. ఇంతకుముందు రోజులలో పులివేషగాళ్ళు తమ ఒంటిపై వేసుకునే ప్రకాశవంతమైన రంగులకు బొగ్గు, మట్టి, వేర్లు, శిలీంధ్రాలు మూలకాలుగా ఉండేవి .
కొన్నేళ్ళుగా ఈ నాట్యం సంప్రదాయక అడుగులు మరిన్ని విన్యాసాలతో కూడుకున్నవిగా మారాయి. ఇప్పుడు ముందుకూ వెనక్కూ పల్టీలు కొట్టడం, తలతో కొబ్బరికాయల్ని పగులగొట్టడం, నోట్లోంచి మంటలను బయటికి ఊదటం వంటి తమాషా పనులు ఎక్కువయ్యాయి. ఈ కొరియోగ్రఫీకి ఎంత శక్తి కావలసి వస్తోందంటే, వయసుమళ్ళినవాళ్ళు ఈ నృత్యాన్ని చిన్న వయసువారికి వదిలేస్తున్నారు.
ప్రదర్శనకు ఒక రోజు ముందే ఈ సంప్రదాయ నృత్యం కోసం తయారవ్వడం మొదలవుతుంది. ముఖానికీ శరీరానికీ రంగులు వెయ్యడానికి చాలా గంటల కృషి అవసరం. ఆ రంగుల్ని పండుగ అయిపోయిన రెండు రోజుల తరవాత దాకా కూడా ఉంచుతారు. "మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. కానీ డోళ్ళ చప్పుడు వినిపించిన వెంటనే వాటి తాళానికి నృత్యం చెయ్యాలనిపిస్తుంది," అంటాడు పన్నెండవ తరగతిని పూర్తి చేస్తోన్న ఆయుష్.
తాసే (తుళు భాషలో డోలు) నించి ప్రతిధ్వనించే చప్పుడుకు పిలి వేషం వేసుకున్న జనాలు తమ భక్తిభావాన్ని చూపడానికి, ప్రజలను వినోదింపచేయడానికి నృత్యం చేస్తారు. అబ్బాయిలు పులుల్లాగ కనిపించటానికి తమ పూర్తి దేహాన్ని రంగులతో నింపుతారు, కానీ బాలికలు మాత్రం మొహానికి మాత్రమే రంగులు వేసుకొని పులిలా కనిపించే నూలు బట్టలను ధరిస్తారు. ఈ మధ్యకాలం నుంచే అమ్మాయిలు పిలి వేష వేయడం పెరిగింది..
ఇదివరకు ఈ నాట్యకారులకు బియ్యాన్ని, ధాన్యాన్ని - మామూలుగా కోస్తా కర్ణాటకలో పెరిగే పంటలు - బహుమతులుగా ఇచ్చేవారు. ఇవాళ తిండిగింజల చోటులో డబ్బు వచ్చిచేరింది. ప్రతి ప్రదర్శనకారుడు రెండు రోజులకు 2,500 రూపాయలు సంపాదిస్తారు. విన్యాసాలు చేసేవారికి ఉత్సవాలు జరిగే రెండు రోజులకి గాను మరో 6,000 రూపాయులు వస్తాయి. "ఇంతమంది నృత్యం చెయ్యడం చూసిన తర్వాత మీకు కూడా వెంటనే పిలి వేష వెయ్యాలనిపిస్తుంది," అని ఆయుష్ అంటాడు.
ఈ ప్రదర్శనలను మాములుగా గృహసముదాయాల కమిటీలు నిర్వహిస్తాయి. ఆయుష్, అతని బృందం ఉడుపిలోని మణిపాల్‌లో ఏడాది పాటు పిలి వేష వేడుకలకి డబ్బులు ఇచ్చే 'యువ టైగర్స్ మంచి' బృందానికి చెందినవారు. ప్రదర్శనల్ని నిర్వహించడానికి, నాట్యకారులకు, రంగులు వేసేవారికి చెల్లించేందుకు రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. ప్రయాణాలకు, భోజనాలకు, రంగులు కొనటానికి, దుస్తులకు కూడా ఈ డబ్బు నుంచే ఖర్చుపెట్టాలి.
వినోదాన్ని అందించటమే ఈ నాట్యకారులకు ప్రధానం అయినప్పటికీ, వందల ఏళ్ళ సంప్రదాయమైన ఈ కళ క్రమశిక్షణను కాపాడడానికి వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతా అయేసరికి "మా ఒళ్ళు చాలా నొప్పెడుతుంది, కానీ జనాల్ని సంతోషపెట్టటానికీ, ఈ కళను సజీవంగా ఉంచడానికీ మేం ఇదంతా చేస్తాం," అంటాడు ఆయుష్.
అనువాదం: సంహిత