గంగు బాయి చవాన్ కొద్దిపాటి తాగు నీటి కోసం అడుక్కోవాలి. “ సర్కార్ ! వాచ్‌మన్ సాహిబ్ ! దయచేసి మాకు తాగడానికి నీళ్ళివ్వండి. నేను ఇక్కడే ఉంటున్నాను సార్."
అయితే కేవలం అడుక్కుంటే సరిపోదు. "నేను మీ పాత్రలను తాకను," అని ఆమె వారికి హామీ ఇవ్వాలి.
గంగుబాయి (అసలు పేరు కాదు) ఇళ్ళల్లో, భవనాలలో ఉండే కుళాయిలు, టీ కొట్లు, కల్యాణ మండపాలలో దొరికే నీటిపై ఆధారపడతారు. నాందేడ్ నగరంలోని గోకుల్‌నగర్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై ఉన్న తన ‘ఇంటి'కి ఎదురుగా ఉన్న హోటల్ వంటి భవనాల కాపలాదారులను ఆమె నీటి కోసం వేడుకుంటారు. ప్రతిరోజూ, నీళ్లు అవసరమైన ప్రతిసారీ ఆమె ఇలాగే చేస్తారు..
నీటిని వెతుక్కోవడం అనేది రోజువారీ పని. ఒకప్పుడు 'నేరచరిత్ర కలిగిన తెగ'గా ముద్రపడిన ఫాసేపార్ధీ తెగకు చెందిన వ్యక్తిగా ఆమె ఎదుర్కొనే అపవాదు ప్రతిరోజూ నీటి కోసం ఆమె చేసే వెతుకులాటలో ఆమె వెన్నంటే ఉంటుంది. బ్రిటిష్ వలసవాద యుగానికి చెందిన ఈ పరిభాషను 1952లో భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, 70 సంవత్సరాల తర్వాత కూడా, గంగుబాయి వంటి వ్యక్తులు తమ కనీస హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు; తాను దొంగను కానని ఆమె ఇతరులను ఒప్పించగలిగిప్పుడే ఆమెకు డ్రమ్ము నిండుగా నీళ్ళు దొరుకుతాయి.
"మీరిక్కడ ఉంచిన వస్తువులను మేమెన్నడూ ముట్టుకోలేదని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు మాకు నీళ్ళిస్తారు," అని గంగుబాయి చెప్పారు. ఒకసారి అనుమతి పొందిన తర్వాత ఆమె చిన్న పాత్రల్లో, ప్లాస్టిక్ బిందెల్లో, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో, నీళ్ళ సీసాలలో- వీలైనంత ఎక్కువ నీటిని నింపుకుంటారు. ఒక హోటల్‌వాళ్ళు ఒప్పుకోకపోతే, వాళ్ళ మొరటుతనాన్ని తోసేసుకొని, మరొక చోట ప్రయత్నిస్తారు. ఎవరైనా జాలిపడి నీళ్ళు ఇచ్చేంతవరకూ అలా ఆమె నాలుగైదు ప్రదేశాలలో అడగవలసి వస్తుంది. అప్పుడే ఆమెకు తాగడానికి, వంట చేయడానికి, తన ఇంటి అవసరాలకు నీళ్ళు దొరుకుతాయి.
గంగుబాయి వంటి వలసదారులు మహారాష్ట్రలోని గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి నాందేడ్‌కు వస్తారు. "మేం ఎనిమిది నెలలు ఇక్కడ (నాందేడ్‌లో) ఉంటాం, వర్షాకాలం ప్రారంభమైన తర్వాత మా గ్రామానికి తిరిగి వెళ్తాం," అని ఆమె వివరించారు. నగరంలోని మైదానాలు, ఫుట్‌పాత్‌లు, ఓవర్‌హెడ్ నీటి ట్యాంక్‌ల కింద ఉండే ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, రైల్వే స్టేషన్‌లలో వీరి కుటుంబాలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న కాలానికి పనిని వెతుక్కోవడమూ, తరువాత అవసరమైన విధంగా తరలిపోవడం వారి ఉద్దేశం.
నగరంలో ఎక్కడా వలసదారులకు, ట్రాన్స్‌వ్యక్తుల సముదాయాలకు నీటి సౌకర్యం కల్పించే శాశ్వత వ్యవస్థ లేదు. పిల్లలు, మహిళలు, ముఖ్యంగా యువతులు నీటి కోసం చేసే వెతుకులాటలో అవమానాలనూ హింసనూ భరించవలసి ఉంటుంది.
మరో నగరానికి వెళ్ళే వరకు, లేదా స్వగ్రామాలకు తిరిగి వెళ్ళేవరకు ఎక్కువగా గోకుల్‌నగర్, దెగ్లూర్ నాకా, వజేగావ్, సిడ్‌కో రోడ్, హుజూర్ సాహిబ్ రైల్వే స్టేషన్ సమీపంలో, వారు పని కోసం వెతుకుతారు.
ఇక్కడికి వలస వచ్చినవారిలో ఫాన్సేపార్ధీ, ఘిసాడీ, వడార్ తెగలకు చెందినవారు, అలాగే ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, కర్ణాటకలోని బీదర్ నుండి వచ్చినవారు ఉన్నారు; తెలంగాణ నుంచి ముస్లిమ్‌లు, చమార్లు, జోగీలు కూడా ఇక్కడికి వలస వస్తుంటారు. వారు తమ సంప్రదాయ, కుల ఆధారిత వృత్తులను అనుసరిస్తూ కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. చేతితో తయారుచేసిన ఇనుప పనిముట్లు, పెన్నులు, బెలూన్లు, చాపలు, గాజుసామాను, బొమ్మలను అమ్ముతారు. కొన్నిసార్లు సిగ్నల్స్ వద్ద అడుక్కుంటారు లేదా భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తారు. బ్రతకటానికి ఏదో ఒకటి చేస్తారు.
సిడ్‌కో ఎంఐడిసి రోడ్‌లో నివాసముందే ఘిసాడీ కుటుంబానికి చెందిన కాజల్ చవాన్ తామెప్పుడూ నీటి కోసం వెతుకుతూనే ఉంటామని చెప్పారు. “కొన్నిసార్లు మేం రోడ్డు మీద తిరిగే వాటర్ ట్యాంకర్లవాళ్ళను నీళ్ళు అడుగుతాం. అందుకు బదులుగా మేం వారి కోసం పని చేయాలి,” అని ఆమె చెప్పారు. ఆమె మాత్రమే కాదు, మునిసిపల్ మైదానంలో నివసించేవారు కూడా నీరు ఇచ్చినందుకు బదులుగా ఇళ్ళల్లోని కొళాయి యజమానుల కోసం తాము తప్పనిసరిగా పనిచేయాల్సివుంటుందని చెప్పారు.
కొళాయి నీళ్ళు దొరకనప్పుడు వారు వేరే దారులు వెతకాలి. గోకుల్‌నగర్ ఫుట్‌పాత్‌పై మున్సిపల్ వాటర్ పైపులైన్‌కు చెందిన ఒక ఛాంబర్ (గది లాంటిది) ఉంది. ఛాంబర్ నుండి కారే నీరు దాని కింద ఉన్న గుంటలోకి చేరుతుంది. “ఛాంబర్‌కి వారానికి రెండుసార్లు (పైప్‌లైన్ నుండి) నీటి సరఫరా జరుగుతుంది. ఛాంబర్‌లో నీళ్ళుంటే ఇక ఆరోజు సంబరాలే," అని గోకుల్‌నగర్‌లోని స్థానిక చెరకు రసం వ్యాపారి చెప్పారు.
చిన్న పిల్లలయితే గుంటలోకి దిగి నీళ్ళు బయటకు తోడడానికి సరిపోతారు. మట్టి, సమీపంలోని హోటళ్ళ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో గుంటలోని నీళ్ళు కలుషితమవుతాయి. కానీ అవసరం కాబట్టి అక్కడి కుటుంబాలు స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఆ నీరు ఎలా ఉన్నా ఉపయోగించాల్సిందే. కనీసం 50 కుటుంబాలు నీటి కోసం ఈ ఫుట్‌పాత్ మీదున్న ఛాంబర్‌పై ఆధారపడి ఉన్నాయి; ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు, కానీ లెక్కించటం కష్టం.
2021 నాటి ఒక నివేదిక ప్రకారం నాందేడ్ నగరానికి ప్రతిరోజూ తలసరిన 120 లీటర్ల చొప్పున మొత్తం 80 ఎమ్ఎల్‌డిల నీరు అందుతుంది. కానీ రోడ్ల మీద నివసించేవారికి మాత్రం ఆ నీరు అందడంలేదు.
*****
ఖాన్ కుటుంబం దెగ్లూర్ నాకాలోని ఓవర్ హెడ్ నీటి ట్యాంక్ కింద నివాసముంటున్నారు. వీరు బీడ్ (బిడ్ అని కూడా పలుతారు) జిల్లాలోని పర్లీకి చెందినవారు. వీరు సంవత్సరంలో కొన్నిసార్లు నాందేడ్‌ను సందర్శిస్తారు, ముఖ్యంగా రంజాన్ సమయంలో వారు పక్షం రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు.
ఎత్తైన సిమెంట్ నీటి ట్యాంక్ వారికి ఆశ్రయాన్ని అందిస్తుంది. దగ్గరలోని హోటళ్ళ నుండి, దూరంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలోని తాగునీటి ఫిల్టర్ నుండి వాళ్ళు నీరు తెచ్చుకుంటారు. వైద్యశాల మూసివున్నపుడు ఫిల్టర్ నీళ్ళు కూడా దొరకవు. 45 ఏళ్ల జావేద్ ఖాన్ ఇలా అంటారు, “బోర్‌బావి నీరు, లేదా కొళాయి నీరు- ఏ నీరు దొరికినా మేం వాటిని తాగుతాం. ఒక్కోసారి ఓవర్ హెడ్ ట్యాంక్ కవాటం నుంచి కారుతున్న వ్యర్థ జలాలను కూడా తాగుతాం."
వలసదారులు నీటి కోసం కుస్తీలుపడుతూ ఉంటే, ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే వాటర్ ఫిల్టర్లు ప్రతిచోటా ఉన్నాయి - మీకు పది రూపాయలకు ఐదు లీటర్ల నీరు దొరుకుతుంది. పది రూపాయలకు చల్లని నీళ్ళు, ఐదు రూపాయలకు సాధారణ నీళ్ళు దొరుకుతాయి.
సోలాపూర్ జిల్లా నుండి వలస వచ్చిన నయన కాళే (32) పట్టణ త్రయమైన ముంబై-నాసిక్-పుణేల నుండి ప్రయాణించి నాందేడ్‌కు వచ్చారు. "10 రూపాయలకు కొనుగోలు చేసే ఐదు లీటర్ల నీళ్ళతోనే మా అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం," అని ఆమె చెప్పారు
ప్రతిరోజూ నీటిని కొనుక్కోలేని జనం రివర్స్ ఆస్మాసిస్ (RO) వడపోత పద్ధతి ద్వారా ఫిల్టర్ నుండి విడుదలయ్యే వ్యర్థజలాన్ని కొంటున్నారు. మనుషులు తాగడానికి గాని, ఇతర అవసరాలకు గాని పనికిరాని ఈ నీటిని వీరు వాడుతున్నారు.
"మేం హోటళ్ళవాళ్ళను నీళ్ళు అడగటమంటే, మేం వాటిని కొనుక్కోవాల్సిందే. లేకపోతే కస్టమర్ల కోసం కూడా నీళ్ళు లేవని హోటల్ నిర్వాహకులు చెప్తుంటారు. కస్టమర్లకే నీళ్ళు లేకపోతే వాళ్ళు మాకెలా ఇవ్వగలరు?" నాందేడ్ స్టేషన్ సమీపంలో నివసిస్తుస్తోన్న 30 ఏళ్ళ ఖాతున్ పటేల్ అన్నారు.
గోకుల్‌నగర్‌కు చెందిన ఒక వాచ్‌మెన్ మాట్లాడుతూ, “మా దగ్గర నీళ్ళున్నాయి, కానీ ఇవ్వం. లేవని చెప్పి వాళ్ళని వెళ్ళగొడతాం," అన్నాడు.
“మేం వారికి (వలసదారులు) రెండు డబ్బాల నీటిని తీసుకోవచ్చని చెప్పాం, అయినా వాళ్ళింకా ఎక్కువ అడుగుతూనే ఉంటారు. మాకు మీటర్ కొలత ప్రకారం నీరు సరఫరా అవుతుంది. అంతకంటే ఎక్కువ ఇవ్వలేం," పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక కల్యాణమండపం యజమాని అన్నారు.
*****
నీటిని తెచ్చే పనిని ఎక్కువగా మహిళలూ, బాలికలే చేస్తారు; వారే తిరస్కారాల భారాన్ని కూడా ఎదుర్కొంటుంటారు. అంతేకాదు, ఫుట్‌పాత్ మీద ఎప్పుడూ జనాల సందడి ఉంటుంది. ప్రజా స్నానశాలల ఏర్పాటు లేదు. “మేం మా బట్టల మీదనే స్నానం చేయాలి. త్వర త్వరగా స్నానం చేసేస్తాం. చుట్టూ చాలామంది మగవాళ్ళు ఉంటారు, మాకు సిగ్గుగా ఉంటుంది. జనం చూస్తూనే ఉంటారు. త్వరగా స్నానం ముగించి, బట్టలు తీసేసి ఉతుక్కుంటాం," అని సమీరా జోగి చెప్పారు. లక్నోకు చెందిన 35 ఏళ్ళ వయసున్న ఈమె, ఉత్తరప్రదేశ్‌లో ఒబిసిగా వర్గీకరించిన జోగి సముదాయానికి చెందినవారు.
దెగ్లూర్ నాకాలో నివాసముంటోన్న పార్ధీ కుటుంబాల మహిళలు తాము చీకటిపడిన తర్వాత స్నానం చేస్తామని చెప్పారు. ఆపి ఉన్న ట్రక్కుల వెనుక ఉండే స్థలాన్ని వారు ఉపయోగించుకుంటారు. చుట్టూ చీరలను కట్టి స్నానానికి ఒక మరుగును ఏర్పరచుకుంటారు.
“మేం రోడ్డు మీద నివాసముంటున్నాం. రోడ్డు పైన తిరిగేవారు చూస్తూనే ఉంటారు. అందుకే స్నానం చేయడానికి ఈ ఏర్పాటు చేసుకున్నాం. నాకు యుక్తవయసులో ఉన్న ఒక అమ్మాయి ఉంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి," అని సిడ్కో రోడ్ ప్రాంతంలో నివాసముంటోన్న కాజల్ చవాన్ మాతో చెప్పారు."
గోకుల్‌నగర్ నివాసి నయన కాళే ఉదయాన్నే చాలా త్వరత్వరగా స్నానం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే తనను ఎవరైనా చూస్తారేమోననే భయంతో ఆమె ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. "ఇక్కడ స్నానం చేయడానికి నీళ్ళు గానీ, సరైన ఏర్పాట్లు గానీ లేవు, కాబట్టి నేను వారానికి రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాను," దెగ్లూర్ నాకాలో నివాసముండే నలభై ఏళ్ళ ఇర్ఫానా షేక్ చెప్పారు.
“ప్రజా సదుపాయాలలో స్నానం చేయడానికి మేం ప్రతిసారీ రూ. 20 చెల్లించాలి. మా లాంటి చాలీచాలని బతుకుల వాళ్ళం, ప్రతి రోజూ అంత ఖర్చు ఎలా భరించగలం?” అని గంగుబాయి అడుగుతారు. "మా వద్ద అంత డబ్బు లేకపోతే, మేం ఆ రోజు స్నానం మానుకుంటాం." రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే ఖాతున్ పటేల్, “మా దగ్గర డబ్బు లేకపోతే, మేం స్నానం చేయడానికి నదికి వెళ్తాం. కానీ అక్కడ చాలామంది మగవాళ్ళు తిరుగుతూ ఉంటారు, దాంతో మాకు చాలా కష్టమవుతుంది," అంటారు.
గోకుల్‌నగర్‌లోని ఛాంబర్‌లో నీరు చేరినప్పుడు, చిన్న పిల్లలందరూ స్నానం చేయడానికి దాని చుట్టూ గుమిగూడుతారు. యుక్తవయస్సులో ఉన్న బాలికలు ఫుట్‌పాత్ దగ్గర బట్టల పైనే స్నానం చేస్తూ కనిపిస్తారు. మహిళలు తమ ఒంటిపై చీరలు కప్పుకుని నీళ్ళు పోసుకుంటారు. బహుశా ఎక్కడో ఒక నాసిరకం ఆవరణను వెతుక్కోవడం కంటే వారికి బట్టల మీదే స్నానం చేయడం సురక్షితం అనిపిస్తుందేమో.
రుతుక్రమం సమయంలో మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. “రుతుక్రమం సమయంలో నేను మరుగుదొడ్డిని వాడుకోవాలంటే, ఏదో ఒక సాకు చెప్పి ఆపైన అక్కడ నా ప్యాడ్ మార్చుకోవాలి. ఏడవ రోజు మేం తప్పనిసరిగా స్నానం చేయాలి. అప్పుడు నేను స్నానం చేయడానికి ప్రజా స్నానశాలను ఉపయోగించేందుకు 20 రూపాయలు చెల్లించాల్సిందే," అన్నారు ఇర్ఫానా."
“ఈ భయ్యాలు (ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు) ‘ఇక్కడ మరుగుదొడ్లను వాడొద్దని మీ వాళ్ళకు చెప్పండి’ అని అరుస్తూనే ఉంటారు. మా వాళ్ళకు కుండ/దొడ్డితొట్టె (కమోడ్)ను ఉపయోగించే అలవాటు లేదు. దాంతో వాళ్ళు కొన్నిసార్లు దానిని మురికి చేస్తారు. అందుకే వాళ్ళు మమ్మల్ని మరుగుదొడ్లను వాడొద్దని ఆంక్షలు పెడుతుంటారు," అంటారు గంగుబాయి.
ప్రజా మరుగుదొడ్డిని ఉపయోగిస్తే ఒక సారికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. పెద్ద కుటుంబంలోని వారికి అది భరించలేని ఖర్చుగా మారుతుంది. అంతకన్నా బహిర్భూమికి వెళ్ళడం చౌకగా ఉంటుంది. “రాత్రి 10 గంటల తర్వాత ప్రజా మరుగుదొడ్డిని మూసివేస్తారు. అలాంటప్పుడు మేం బహిర్భూమికి వెళ్లడం తప్ప ఇంకేమీ చేయగలం?" అని మున్సిపల్ మైదానంలో నివాసముంటున్న రమేశ్ పాతోడే (50) చెప్పారు.
“బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేస్తాం. రాత్రిపూట వెళ్లాలంటే భయంగా ఉంటుంది కాబట్టి మా వెంట ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను తోడుగా తీసుకెళ్తాం," అని గోకుల్‌నగర్‌లోని మున్సిపల్ గ్రౌండ్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న నయన కాళే చెప్పారు. “మేం బహిర్భూమికి వెళ్ళినప్పుడు, మగవాళ్ళు మమ్మల్ని పిలుస్తూ ఆటపట్టిస్తారు. ఒక్కోసారి మమ్మల్ని అనుసరిస్తారు కూడా. ఈపాటికి మేం ఒక వందసార్లైనా పోలీసులకు ఫిర్యాదు చేసుంటాం.”
ఇందుకున్న ఒక్కటే మార్గం, "రోడ్ల మూలమలుపుల్లోకి వెళ్ళడం," అని సిడ్కో రోడ్ ప్రాంతానికి చెందిన కాజల్ చవాన్ చెప్పారు.
నాందేడ్‌లో సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారం కింద 2011-12లో నగర పారిశుద్ధ్య ప్రణాళికను రూపొందించారు. ఆ సమయంలో నగర జనాభాలో దాదాపు 20 శాతం మంది బహిరంగ మలవిసర్జన చేసేవారు. 2014-15లో, నాందేడ్ నగరంలో కేవలం 214 సీట్లు ఉన్న 23 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయనీ, 4100 సీట్ల కంటే ఎక్కువ లోటు ఉందనీ ఒక నివేదిక పేర్కొంది. అప్పటి మున్సిపల్ కమీషనర్ నిపుణ్ వినాయక్ ప్రజా సంఘాల నేతృత్వంలోని సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం కింద మెరుగైన పారిశుద్ధ్యం, వ్యర్థ జలాలు, వ్యర్థాల నిర్వహణ కోసం ఒక భాగస్వామ్య ప్రాజెక్ట్‌ను అమలు చేశారు. 2021లో వాఘాళా మున్సిపల్ కార్పొరేషన్ ఒడిఎఫ్+ ఇంకా ఒడిఎఫ్++ (బహిరంగ మలవిసర్జన రహిత) సర్టిఫికెట్‌లను అందుకుంది.
ఏది ఏమైనప్పటికీ నగరంలోని అట్టడుగు వర్గాలకు చెందినవారికి, ట్రాన్స్‌వ్యక్తులకు తాగునీరు, పరిశుభ్రమైన, సురక్షితమైన పారిశుద్ధ్యం ఇప్పటికీ సుదూర స్వప్నంగానే మిగిలిపోయిందంటారు జావేద్ ఖాన్. "పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుందనే నమ్మకం మాకు లేదు.".
పుణేలోని SOPPECOM లో సభ్యులుగా ఉన్న సీమా కులకర్ణి, పల్లవి హర్షే, అనితా గోడ్బోలే, డాక్టర్ బోస్‌లకు ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ( IDS ) సహకారంతో చేసిన 'టువర్డ్స్ బ్రౌన్ గోల్డ్ రీ-ఇమాజినింగ్ ఆఫ్-గ్రిడ్ శానిటేషన్ ఇన్ రాపిడ్‌లీ అర్బనైజింగ్ ఏరియాస్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా' అనే శీర్షికపై వారి పరిశోధన ఆధారపడింది.
అనువాదం: నీరజ పార్థసారథి