“ఏ బేటీ తనీ ఏక్ ఖోదా చిన్హా లే లే
మర్‌తో జీతో మేఁ సాథ్ హోయెలా...
జైసన్ ఆయెలా హై తైసన్ అకేలే నా జా...

[హే అమ్మాయీ, నీకోసం ఒక ఆనవాలు తీసుకో...
జీవితంలోనూ మరణంలోనూ అది నీతోనే ఉంటుంది.
ఒంటరిగా వచ్చిన నువ్వు ఒంటరిగా వెళ్ళవు...]”

రాజ్‌పతి దేవి మండర్ బ్లాక్‌లోని గ్రామాలలో పై విధంగా పాడుతూ ఇంటింటికీ తిరుగుతుంటారు. ఒక ప్లాస్టిక్ సంచిని భుజానికి తగిలించుకొని, కొన్ని పాత్రలనూ, ఒక సూదుల పెట్టెనూ ఆమె తనతో తీసుకువెళ్తారు. రాజ్‌పతి గోద్నా (పచ్చబొట్టు) కళాకారిణి. కొంత రుసుము తీసుకొని సిరాతో పువ్వులను, చంద్రుడిని, తేళ్ళను, చుక్కలను చిత్రీకరిస్తారు. ఇప్పటికీ ఈ పురాతన కళను సాధన చేస్తూ గ్రామం నుండి గ్రామానికి తిరిగే చివరి మహిళా కళాకారులలో 45 ఏళ్ళ రాజ్‌పతి కూడా ఒకరు.

" మాయి సంగే జాత్ రహీ త దేఖత్ రహీ ఉహన్ గోదత్ రహాఁ, త హమ్‌హు దేఖ్-దేఖ్ సీఖత్ రహీ. కర్తే కర్తే హమ్‌హు సీఖ్ గయిలీ [నేను మా అమ్మ వెంట వెళ్ళి ఆమె గోద్నా వేయటాన్ని చూసేదాన్ని. చివరికి నేను కూడా నేర్చుకున్నాను]." ఐదవ తరం పచ్చబొట్టు కళాకారిణి అయిన రాజ్‌పతి అన్నారు.

శతాబ్దాల నాటి జానపద కళ అయిన గోద్నా , మలార్ సముదాయానికి (రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతిగా జాబితా చేయబడింది) తరం నుంచి తరానికి అందించబడుతూ వస్తోంది. రాజ్‌పతి ఈ సముదాయానికి చెందినవారే. శరీరంలోని వివిధ భాగాలపై సిరాతో ఆకృతులను రూపొందిస్తారు. ప్రాంతాలనూ, సముదాయాలనూ బట్టి విభిన్నమైన చిహ్నాలు, అర్థాలు ఉంటాయి. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఈ గోద్నా ను ఎంచుకుంటారు

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: భర్త శివనాథ్ మలార్, కుమారుడు సోను, మనవడు అతుల్‌తో కలిసి తన ఇంటి ముందు కూర్చొనివున్న రాజ్‌పతి దేవి. కుడి: తన చేతులపై ఉన్న రెండు పచ్చబొట్లను - పోథీ (పైన), డంకా ఫూల్ (క్రింద)- చూపిస్తోన్న రాజ్‌పతి

అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలయింది. రాజ్‌పతి గత ఆరు గంటలుగా ఝార్ఖండ్‌, రాంచీ జిల్లాలోని గ్రామాల గుండా నడుస్తూన్నారు. ఆమె మండర్ గ్రామ శివార్లలోని ఖర్గే బస్తీలో ఉండే మలార్ సముదాయానికి చెందిన చిన్న సెటిల్‌మెంట్‌లోని తన రెండు గదుల కచ్చా ఇంటికి తిరిగి వస్తారు. కొన్నిసార్లు ఆమె 30 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించి, ఇంట్లో తాము తయారుచేసే పాత్రలను అమ్మడంతో పాటు గోద్నా వేయించుకోమని జనాన్ని అడుగుతూ తిరుగుతుంటారు.

ఆ పాత్రలను ఆమె భర్త, 50 ఏళ్ళ శివనాథ్ డోక్రా అనే సంప్రదాయ లోహపు పని సాంకేతికతను ఉపయోగించి తయారుచేశారు. ఈ అల్యూమినియం, ఇత్తడి వస్తువులను తయారుచేసేది ప్రధానంగా ఇంటిలోని పురుషులైన ఆమె కుమారులు, భర్త అయినప్పటికీ, ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఈ పనిలో పాలుపంచుకుంటారు. ఇంటిలోని మహిళలైన రాజ్‌పతి, ఆమె కుమార్తె, కోడలు ఇతర ఇంటి పనులతో పాటు ఈ వస్తువుల అచ్చులను తయారుచేసి ఎండలో ఆరబెడతారు. వారు నిత్యావసర వస్తువులైన కిరోసిన్ దీపాలు, పూజా పాత్రలు, పశువుల గంటలు, కొలపాత్రలు, మొదలైన వస్తువులను తయారుచేస్తారు.

"ఈ చిన్న వస్తువు 150 రూపాయలకు అమ్ముడుపోతుంది," తమ నాగపురి భాషలో తాము పైలా అని పిలిచే పాత్రను చూపిస్తూ చెప్పారు రాజ్‌పతి. "ఇది బియ్యాన్ని కొలవటం కోసం; దీన్నిండా బియ్యం పోస్తే అది పావుకిలో బరువు తూగుతుంది," చెప్పారామె. పైలా ను ఈ ప్రాంతంలో శుభప్రదమైనదిగా భావిస్తారని ఆమె చెప్పారు. అది ఉన్న ఇంట్లో తిండికి కొరత ఉండదనేది వారి నమ్మకం.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: శివనాథ్ డోక్రా అనే సంప్రదాయ లోహపు పని సాంకేతికతను ఉపయోగించి పాత్రలను తయారుచేస్తారు. కుడి: వారి ఇంటి బయట ఉన్న పాత్రలను తయారుచేసే కార్యశాల

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: రాంచీ జిల్లా మండర్ బ్లాక్‌లో గ్రామం నుంచి గ్రామానికి తిరుగుతూ పాత్రలను అమ్మే రాజ్‌పతి. కుడి: బియ్యం కొలవడానికి ఉపయోగించే పైలాను చూపిస్తోన్న ఛిపాదోహర్ గ్రామానికి చెందిన గోహమణి దేవి.

*****

ఒక చిన్న పసుపురంగు పెట్టెను చూపిస్తూ, "ఇందులో సూదులు, ఇందులో జర్జరీ కాజల్ [కాటుక] ఉన్నాయి," ఆ పచ్చబొట్టు కళాకారిణి మాతో చెప్పారు.

ప్లాస్టిక్ సంచి నుంచి ఒక కాగితాన్ని బయటకు లాగి, తాము తయారుచేసే డిజైన్లను మాకు చూపించారు.

" ఇస్‌కో పోథీ కహతే హైఁ, ఔర్ ఇస్‌కో డంకా ఫూల్ [దీన్ని పోథీ అని, దీనిని డంకా ఫూల్ అనీ అంటారు," తన చేతిపై ఉన్న, కుండలో విచ్చుకుంటోన్న పువ్వును పోలిన డిజైన్‌ను చూపిస్తూ చెప్పారామె. " ఇస్‌కో హసూలీ కహతే హైఁ, యే గలే మేఁ బన్‌తా హై [దీన్ని హసూలీ అంటారు, దీన్ని మెడ చుట్టూ వేస్తారు," చంద్రవంక ఆకారంలో ఉన్న డిజైన్‌ను చూపిస్తూ చెప్పారు రాజ్‌పతి.

రాజ్‌పతి వాడుకగా శరీరంలోని ఐదు భాగాలలో పచ్చబొట్టు పొడుస్తారు: చేతులు, పాదాలు, చీలమండలు, మెడ, నుదురు. ప్రతి భాగానికీ ఒక ప్రత్యేక డిజైన్ ఉంటుంది. చేతులపై సాధారణంగా పువ్వులు, పక్షులు, చేపలు ఉంటాయి. మెడపైన వంపు తిరిగిన రేఖలతో, చుక్కలతో ఒక వర్తులాకార నమూనా ఉంటుంది. నుదిటి పచ్చబొట్టు ప్రతి తెగకూ ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది.

"వివిధ ఆదివాసీ సమూహాలకు వేర్వేరు పచ్చబొట్టు సంప్రదాయాలు ఉంటాయి. ఉరాఁవ్‌లకు మహాదేవ్ జట్ [స్థానికపుష్పం], ఇతర పుష్పాలు ఉంటాయి; ఖరియాలకు మూడు సరళ రేఖలు, ముండాలకు చుక్కల గోద్నా ఉంటాయి,” అని రాజ్‌పతి వివరించారు. గతంలో, వారి నుదిటిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా ఆ వ్యక్తులను గుర్తించడం సాధారణమని కూడా ఆమె చెప్పారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: రాజ్‌పతి వాడుకగా శరీరంలోని ఐదు భాగాలలో పచ్చబొట్టు పొడుస్తారు: చేతులు, పాదాలు, చీలమండలు, మెడ, నుదురు. ప్రతి భాగానికీ ఒక ప్రత్యేక డిజైన్ ఉంటుంది. నుదిటి పచ్చబొట్టు ప్రతి తెగకూ ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. కుడి: మరొక గోద్నా కళాకారిణి మొహారీ దేవితో రాజ్‌పతి దేవి

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: సునీతా దేవి చేతి పైభాగాన స్థానికంగా మహాదేవ్ జట్ అని పిలిచే పువ్వు పచ్చబొట్టు. కుడి: ఆమె పాదాల మీద సుపలి (ధాన్యాన్ని తూర్పారబట్టే వెదురుబుట్ట) పచ్చబొట్లు ఉన్నాయి. అది ఆమె దళిత సమాజంలో స్వచ్ఛతను సూచిస్తాయి. ఇవి ఉండటం వలన ఆమె అగ్రకులాల భూస్వాముల క్షేత్రాలలో పని చేయడానికి వీలవుతుంది

సునీతా దేవి కాళ్ళ మీద సుపలి (ధాన్యాన్ని తూర్పారబట్టే వెదురుబుట్ట) పచ్చబొట్లు ఉన్నాయి. పలామూ జిల్లాలోని చెచెరియా గ్రామానికి చెందిన 49 ఏళ్ళ సునీత, తన పచ్చబొట్టు స్వచ్ఛతను సూచిస్తుందని చెప్పారు. “ఇంతకుముందు ఇది లేకపోతే, పొలాల్లో పని చేయడానికి వీలుండేది కాదు. మమ్మల్ని అపవిత్రులుగా భావించేవారు, కానీ పచ్చబొట్లు వేయించుకున్న తర్వాత మేం పవిత్రులమయ్యాం,” అని దళిత సముదాయానికి చెందిన ఈ కౌలు రైతు చెప్పారు.

" గోద్నా కళ మూలాలను కొత్తరాతియుగం (నియోలిథిక్) కాలం నాటి గుహ చిత్రాల నుండి గుర్తించవచ్చు. గుహల నుండి అది ఇళ్ళకు, శరీరాలకు తరలివచ్చింది,” అని రాయ్‌పూర్‌లోని పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయంలోని ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు పురావస్తు విభాగంలో పరిశోధకురాలిగా ఉన్న అంశు టిర్కీ వివరించారు.

గోహమణి దేవి వంటి చాలామంది గోద్నా కు రోగాలను నయంచేసే శక్తి కూడా ఉందని నమ్ముతారు. 65 ఏళ్ళ ఈమె జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలోని ఛిపాదోహర్ గ్రామ నివాసి. ఐదు దశాబ్దాలకు పైగా గోద్నా సాధన చేస్తోన్న ఈమె, వ్యాధులను నయం చేస్తుందని చెప్పే తన జహర్ గోద్నా (విషపు పచ్చబొట్టు)కు ప్రసిద్ధి చెందారు.

"నేను గోద్నా ద్వారా వేలాదిమందికి గ్రంథివాపు వ్యాధి(goitre)ని నయం చేసాను," తనకున్న గ్రంథివాపును తగ్గించేందుకు తన తల్లి వేసిన పచ్చబొట్టును చూపిస్తూ గర్వంగా చెప్పారామె. ఛత్తీస్‌గఢ్, బీహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఆమె వద్దకు వైద్యం కోసం వస్తారు.

గ్రంథివాపు వ్యాధి మాత్రమే కాకుండా, గోహమణి మోకాలి నొప్పి, పార్శ్వ నొప్పులు, ఇంకా ఇతర దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేశారు. అయితే త్వరలోనే ఈ కళ కనుమరుగవుతుందని ఆమె భయపడుతున్నారు. “ఇప్పుడు ఎవరూ ఎక్కువగా పచ్చబొట్టు వేయించుకోవటంలేదు; మేం గ్రామాలకు వెళ్ళినప్పుడు, సంపాదన ఉండదు [...] మా తర్వాత, ఇక ఎవరూ ఈ పనిని చేయరు,” అని గోహమణి చెప్పారు

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: గోద్నా వేయటానికి ఉపయోగించే సూదులు, సిరా ఉన్న పెట్టెతో తన ఇంటిబయట కూచొనివున్న గోహమణి దేవి. కుడి: ఇక్కడ ఆమె తన మండపై వేసుకున్న తీపా ఖోడా (పై మీద), పోథీ పచ్చబొట్టులను చూపిస్తున్నారు

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: కడుపునొప్పిని తగ్గించటానికి తన తల్లి వేసిన జహర్ గోద్నాను చూపిస్తోన్న గోహమణి కుమారుడు, బిహారీ మలార్. కుడి: తన కాలిపై వేసిన జహర్ గోద్నాను చూపిస్తోన్న గోహమణి భర్త. పచ్చబొట్టులకు రోగాలను నయంచేసే శక్తి ఉందని ఈ ప్రాంతంలో చాలామంది నమ్ముతారు

*****

పచ్చబొట్టు వేయడానికి, ఒక గోద్నా కళాకారిణికి లల్కొరీ కే దూద్ (బిడ్డకు పాలిచ్చే తల్లి పాలు), కాజల్ (కాటుక), పసుపు, ఆవ నూనె అవసరమవుతాయి . గోద్నా లను పితర్‌ముహీ సూయి అని పిలిచే ఇత్తడి సూదులను ఉపయోగించి వేస్తారు. ఇవి తుప్పును నిరోధించి, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించే ఇత్తడి మొనతో ఉంటాయి. "మేం సొంతంగా కాజల్‌ ను తయారుచేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మేం దాన్ని కొంటున్నాం," అని రాజ్‌పతి చెప్పారు.

పచ్చబొట్టు డిజైన్‌ను బట్టి, కనిష్టంగా రెండు సూదుల నుంచి గరిష్టంగా పదకొండు సూదుల వరకూ అవసరమవుతాయి. గోద్నా కళాకారిణి ముందుగా పాలు, కాజల్‌ లో కొద్దిగా ఆవనూనె వేసి ఒక ముద్దగా చేస్తారు. తర్వాత ఒక పెన్నునో, పెన్సిల్‌నో ఉపయోగించి డిజైన్ ఆకారరేఖ (outline)ను గీస్తారు. డిజైన్ ఆధారంగా, సన్నని నమూనా అయితే రెండు లేదా మూడు సూదులు, మందపు అంచు కోసం ఐదు లేదా ఏడు సూదులు ఎంచుకుంటారు. "మా గోద్నా అంతగా బాధపెట్టదు," రాజ్‌పతి ఆటపట్టిస్తున్నట్టుగా అన్నారు.

పచ్చబొట్టు పరిమాణాన్ని బట్టి, "చిన్నదైతే కొద్ది నిముషాలు, పెద్దదైతే కొన్ని గంటలపాటు కూడా," సమయం తీసుకుంటాయని రాజ్‌పతి చెప్పారు. పచ్చబొట్టు పొడిచాక, అక్కడ ముందుగా ఆవు పేడతోనూ ఆ తర్వాత పసుపుతోనూ కడుగుతారు. ఆవు పేడ చెడును దరిచేరనీయదని నమ్ముతారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు దానిపై పసుపునూ ఆవనూనెనూ పూస్తారు.

"గతంలో గోద్నా వేసేటప్పుడు స్త్రీలు పాటలు పాడేవారు, కానీ ఇప్పుడెవరూ పాడటంలేదు," గోద్నా కోసం ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు కూడా వెళ్ళే రాజ్‌పతి అన్నారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: పచ్చబొట్టు వేయడానికి, ఒక గోద్నా కళాకారిణికి లల్కొరీ కే దూద్ (బిడ్డకు పాలిచ్చే తల్లి పాలు), కాజల్ (కాటుక), పసుపు, ఆవ నూనె అవసరమవుతాయి. గోద్నాలను తుప్పును నిరోధించి, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని నమ్మే, పితర్‌ముహీ సూయి అని పిలిచే ఇత్తడి సూదులను ఉపయోగించి వేస్తారు. కుడి: గోద్నా వేసేందుకు ప్రధానంగా ఉపయోగించే సిరా అయిన జర్జరీ కాజల్ ఉన్న పెట్టె

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: చేతిపై తిపా ఖోడా పచ్చబొట్టు వేసుకున్న చింతా దేవి. ఇది మూడు అంశాలతో తయారవుతుంది: చుక్క, సరళ రేఖ, వక్ర రేఖ. కుడి: వివాహితకు గుర్తుగా తన చేతిపై వేసివున్న పచ్చబొట్టును చూపిస్తోన్న చింతా దేవి స్నేహితురాలు చాందీ దేవి

"ఈ మూడు చుక్కలున్న పచ్చబొట్టు ధర 150 రూపాయలు, ఈ పువ్వు నమూనా ధర 500," తన మండపైనున్న గోద్నా ను చూపిస్తూ అన్నారు రాజ్‌పతి. "కొన్నిసార్లు మాకు డబ్బులొస్తాయి, కొన్నిసార్లు జనం బియ్యం, నూనె, కూరగాయలు, చీర వంటివాటి రూపంలో చెల్లిస్తారు," అన్నారామె.

ఆధునిక పచ్చబొట్టు యంత్రాలు సంప్రదాయ గోద్నా కళాకారుల ఆదాయాన్ని విశేషంగా దెబ్బకొట్టాయి. "చాలా కొద్దిమంది ఇప్పుడు గోద్నా కోసం అడుగుతున్నారు," అన్నారు రాజ్‌పతి, "అమ్మాయిలిప్పుడు యంత్రంతో వేసే పచ్చబొట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్ళు తమ ఫోనుల్లో డిజైన్లను చూపించి వాటిని వేయమని అడుగుతున్నారు."

జనం ఇంతకుముందులా ఒళ్ళంతా గోద్నా వేయించుకోవటంలేదని రాజ్‌పతి అన్నారు. "వాళ్ళిప్పుడు ఒక చిన్న పువ్వునో, తేలునో వేయించుకుంటున్నారు."

ఈ కళ ద్వారా వచ్చే సంపాదన కుటుంబ పోషణకు సరిపోదు కాబట్టి, వాళ్ళు ఎక్కువగా పాత్రలను అమ్మటం పైనే ఆధారపడుతున్నారు. ఇలా వచ్చే ఆదాయంలో అధికభాగం, రాంచీలో జరిగే వార్షిక సంత నుంచే వస్తుంది. "సంతలో మేం 40-50 వేల రూపాయలు సంపాదించినప్పుడు, అదే చాలా మంచి సంపాదనగా అనిపిస్తుంది. లేదంటే, రోజుకు 100-200 రూపాయలు మాత్రమే," అన్నారు రాజ్‌పతి.

"పచ్చబొట్లు శుభప్రదమైనవి," ఆమె కొనసాగించారు, "చనిపోయిన తర్వాత కూడా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేవి అవి మాత్రమే. మిగిలినవన్నీ వెనకే మిగిలిపోతాయి."

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం అందించింది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ashwini Kumar Shukla

अश्विनी कुमार शुक्ला झारखंड स्थित मुक्त पत्रकार असून नवी दिल्लीच्या इंडियन इन्स्टिट्यूट ऑफ मास कम्युनिकेशन इथून त्यांनी पदवी घेतली आहे. ते २०२३ सालासाठीचे पारी-एमएमएफ फेलो आहेत.

यांचे इतर लिखाण Ashwini Kumar Shukla
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

यांचे इतर लिखाण Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

यांचे इतर लिखाण Sudhamayi Sattenapalli