మధ్యాహ్నానికి ముందు, ఒక వ్యక్తి లౌడ్‌స్పీకర్‌లో తెలుగులో పిలుస్తున్నాడు. “పాండు నాయక్, మీ కూతురు గాయత్రి మాతో ఉంది. దయచేసి వెంటనే కంట్రోల్ రూంకి రండి”. మునుపటి రాత్రి నుండి పిల్లలతో పాటు పెద్దల కోసం కూడా ఇలాంటి ప్రకటనలు అనేకం చేయబడ్డాయి. అలుపెరుగక తిరుగుతున్న ఆ సమూహాలలో, సాధారణంగా కొంతమంది కుటుంబాలు, వారి సహచరుల నుండి విడిపోతారు - మళ్లీ కలుసుకోగానే వారి ఆందోళన తగ్గుతుంది.

యాత్రికులు, సందర్శకులు మునుపటి రాత్రి నుండి రావడం ప్రారంభించారు - వారు కనీసం 50,000 మంది ఉంటారని స్థానిక మీడియా అంచనా. మరుసటి రోజు సూర్యోదయం నాటికి, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా జనపహాడ్ గ్రామంలోని దర్గాకు వెళ్లే మార్గం దాదాపు నిండిపోయింది.

ఇది ఉర్సు, హజ్రత్ జనపక్ షహీద్ వర్ధంతి. మొదటి క్యాలెండర్ నెలలోని నాల్గవ శుక్రవారం జరుపబడుతుంది - ఈ సంవత్సరం జనవరి 24న జరుపుకున్నారు.

ఈ రోజు అనేక వర్గాల ప్రజలు ఇక్కడికి వస్తారు- ముస్లింలు; హిందువులు, లంబాడీలకు(షెడ్యూల్డ్ తెగ) ఇది ఒక ముఖ్యమైన పండుగ. ప్రధానంగా- తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మరియు మహబూబ్‌నగర్ జిల్లాల నుండి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుండి, సందర్శకులు వస్తుంటారు.

దాని లౌకిక ఆకర్షణతో పాటు, ఈ ఉర్సు తమ భూమి కోసం అదృష్టాన్ని కోరుకునే రైతులను కూడా రప్పిస్తుంది. “పంట, పైరు, పిల్లలు [దిగుబడి, పంట, పిల్లలు] బాగుంటుంది. అందుకే గంధం పండుగకు నిత్యం వస్తున్నాం’’ అని రజక (తెలంగాణలో వెనుకబడిన కులం)కు చెందిన రైతు మొయిలోళ్ల అంజమ్మ చెప్పారు. ఆమె తన భర్త మొయిలోల్ల బాలయ్యతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నుండి  పాలకీడు మండలంలోని  హజరత్ దర్గా కు 160 కిలోమీటర్ల దూరం నుండి వచ్చింది.

PHOTO • Harinath Rao Nagulavancha

ఎగువ ఎడమవైపు: మొయిలోల్ల అంజమ్మ మొయిలోల్ల బాలయ్య దశాబ్దాలుగా ఈ దర్గాలో భక్తులు. ఎగువ కుడివైపు: ప్రజలు ముందురోజు నుండి వస్తూనే ఉన్నారు ; చాలామంది దర్గా ముందు భాగంలో రాత్రి గడుపుతారు , కొందరు మొక్కు తీర్చుకోవడానికి ఉంటారు. దిగువ ఎడమవైపు: మరుసటి రోజు ఉదయం , ఉర్సు రోజున , పూజారులు లేదా కుటుంబ సభ్యులు , మందిరం లోపల పూజని నిర్వహిస్తారు. దిగువ కుడివైపు: ఉదయం 10 గంటలకు , అత్యంత ప్రజాదరణ పొందిన గంధం (గంధం) ఊరేగింపు ప్రారంభమవుతుంది

చాలామందిలాగే అంజమ్మ కూడా స్థానికులు జాన్ పహాడ్ సైదులుగా పిలవబడే హజ్రత్ జనపక్ షహీద్‌పై శాశ్వత విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. జాన్ పహాడ్ సైదులు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. దర్గా అధికారులు ప్రచురించిన పీపుల్స్ గాడ్ అనే బుక్‌లెట్, 19వ శతాబ్దంలో స్థానిక భూస్వామి ఆవులు ఎలా తప్పిపోయాయనే కథ గురించి చెబుతుంది. అన్ని చోట్ల వెతికినా అవి కనిపించలేదు. ఆ తర్వాత సైదులు దర్గా దగ్గరకు వచ్చి, అక్కడ ప్రార్థనలు చేసి, ఆ మందిరంలో వార్షిక ఉత్సవం జరుపుకుంటానని, యాత్రికులకు నీటి వసతి కల్పించేందుకు బావిని(ఇప్పుడు అక్కడ ఒక బావి ఉంది) నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇంటికి వెళ్లేసరికి పశువులు తిరిగి వచ్చాయి.

ఈ బుక్‌లెట్ ఇతర విషయాలను కూడా వివరిస్తుంది - పిల్లలు కావాలనుకున్న జంటలకు పిల్లలు ఆశీర్వదించబడడం, మద్యపాన వ్యసనం నయమవడం, అనారోగ్యాల నుండి ఉపశమనం పొందడం  మొదలైనవి. విశ్వాసం నిండిన ఈ కథల బలం,ఇప్పటి కాలానికి కూడా చేరుకుని అంజమ్మ వంటి అనేకమందిని ఉర్సుకు తీసుకువస్తుంది.

అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సాధువు పేరు పెట్టారు. సూర్యాపేటలోని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మాజీ హోంమంత్రి జానారెడ్డి పేర్లు కూడా జన్‌పహాడ్‌ సైదులు పేరు నుంచే తీస్కుని పెట్టారు అని కొందరు అంటున్నారు. ఉర్సుకు వచ్చే చాలా మంది సందర్శకులకు సైదులు, సైదమ్మ, సైదయ్య, సైదా వంటి పేర్లు ఉన్నాయి.

అంజమ్మ హాజరయ్యే ఆ గంధం ఊరేగింపు, జనవరిలోని చివరి శుక్రవారం ఉదయం 10 గంటలకు దర్గా నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న పూజారి ఇంటి నుండి ప్రారంభమవుతుంది. తరువాత మల్లెపూలు, గులాబీలతో అలంకరించబడిన స్టీలు పాత్రలలో గంధపు పేస్ట్‌ను, యాత్రికులు మోస్తున్న స్తంభాల పైన ఉన్న వస్త్రం (పందిరిగా మారుతుంది)కింద ఉంచి, సమీపంలోని వివిధ కుగ్రామాల గుండా తీసుకువెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఊరేగింపు దర్గాకు చేరుకుంటుంది. అక్కడ సమాధులకు చందన లేపనం పూస్తారు - హజ్రత్ జనపక్ షహీద్‌తో పాటు, అతని సోదరుడు మొయినుద్దీన్ షహీద్ సమాధి కూడా ఇందులో ఉంది.

గంధం ఆచారంలో భాగమైన పాత్రలు, వస్త్రం, పంఖం- చివరికి ఊరేగింపుకు నాయకత్వం వహించే గుర్రాన్ని కూడా భక్తితో తాకడానికి భక్తులు అన్ని ప్రయత్నాలు చేస్తారు. రోడ్లపై ఉన్న దుమ్ము, లేదా తొక్కిసలాట భయం కూడా వారిని ఆపలేదు.

గంధం ఆచారంలో భాగమైన పాత్రలు, వస్త్రం, పంఖం, గుర్రాన్ని కూడా భక్తితో తాకడానికి భక్తులు అన్ని ప్రయత్నాలు చేస్తారు

వీడియో చూడండి: సూర్యాపేటలో చందనం ఊరేగింపు

“ఐదేళ్ల క్రితం మా అన్నయ్య తన మనవడితో కలిసి ఇక్కడికి వచ్చాడు. ఊరేగింపులో వారు కింద పడిపోయారు. పిల్లవాడు [దాదాపు మూడు సంవత్సరాల వయస్సు గలవాడు] చనిపోయి ఉండేవాడు, కాని వారు ఏదో ఒకవిధంగా తొక్కిసలాటనుండి ప్రాణాలతో బయటపడ్డారు, ” అని బాలయ్య గుర్తు చేసుకున్నారు. వారి గ్రామానికి తిరిగి వెళ్ళేటప్పుడు, అతను, అంజమ్మ, ఇతర భక్తుల మాదిరిగానే, పొలాలపై, వ్యవసాయ పనిముట్లపై, ఇంకా వారి బట్టలపై పూయడానికి దర్గా కార్యనిర్వాహకులు సాచెట్‌లలో పంచిపెట్టిన గంధం లేపనాన్ని తీసుకుంటారు.

అంజమ్మ, బాలయ్యల విశ్వాసం 30 సంవత్సరాల నాటిది. వారు తమ ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక చిన్న దర్గా ను నిర్మించారు. అక్కడ వారు వరి, పత్తి సాగు చేస్తారు. ఇది తమ కుమారుడి ఆరోగ్యం కోసం చేసిన ప్రార్థన అని వారు చెప్పారు. వారు వివిధ దేవాలయాలను కూడా సందర్శిస్తారు. అక్కడి నుండి, దర్గా నుండి చందనం లేపనాన్ని,  పోస్టర్నో లేదా క్యాలెండర్‌నో తమతో వెనక్కి తీసుకెళతారు. "మేము కూడా ఇక్కడికి బస్సులో వస్తాము" అని వారి గ్రామం నుండి వస్తామని బాలయ్య చెప్పాడు.

ఉర్సు- షాపింగ్ కు, జాయ్‌రైడ్‌లకు కూడా ఒక మంచి అవకాశం. దర్గా చుట్టూ ఉన్న ప్రాంతం ఫెర్రిస్ వీల్స్, పిల్లల కోసం జారుడు బండలు, ఇతర ఆకర్షణలతో ఆటస్థలంగా మారుతుంది. ఇది చురుకైన వ్యాపారానికి వేదికగా మారుతుంది. ఇక్కడ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయనే ప్రచారంతో బండ్లపై, నేలపై, చిన్న దుకాణాలు, స్టాల్స్‌లో విక్రయదారులు పెరుగుతున్నారు. బొమ్మలు, గాజులు, పోస్టర్లు, మట్టి విగ్రహాలు, ఇమిటేషన్ ఆభరణాలు, గుడ్లు, పాలు లాటరీ టిక్కెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు ఇంకా ఎన్నెన్నో అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు.

“పళ్ళు తోముకోవడానికి కూడా మాకు సమయం లేదు. ఒక బండికి కనీసం ముగ్గురు వ్యక్తులు కావాలి, ” అని రూపావత్ సరోజ చెప్పింది. ఆమె శనగ పిండితో చేసిన పట్టి తో సహా ఇంకా చాలా  చిరుతిళ్లు సిద్ధం చేసి అమ్ముతుంది. ఇక్కడ ఆహార బండ్లు జిలేబీలు, బూందీ మిశ్రమం, కొబ్బరి హల్వా, ఇంకా అనేక ఇతర వస్తువులను కూడా విక్రయిస్తాయి.

ఈ సంవత్సరం అయితే, బండ్లు విపరీతంగా ఉండటంతో, సరోజ గత సంవత్సరం తన సంపాదించిన రూ. 30,000 కంటే తక్కువ అమ్మకాలు జరుగుతాయి అనుకుంటుంది. ఆమెకు దర్గాకు చాలా దూరంలో ఒక చిన్న దుకాణం ఉంది. ఇది వారంలో అన్ని రోజులు తెరిచి ఉంటుంది - అయినప్పటికీ ఉర్సు రోజున అమ్మకాలు గరిష్ట స్థాయిలో ఉంటాయి, అలానే సంవత్సరంలో అన్ని శుక్రవారాల్లో అమ్మకాలు ఎక్కువగా అంటే ఇంచుమించుగా  రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు  అమ్మకాలు ఉండవచ్చు అని ఆమె చెప్పింది.

“ఉర్సులో ఒక రోజులో మాకు రూ. 15,000 [తోపుడు బండి వలన] లాభం వస్తుంది,” అని గాజులు అమ్మే మిసల్ చెప్పాడు (అతను తన పూర్తి పేరు చెప్పలేదు). అతను సాధారణంగా ఒక నెలలో అంత మొత్తాన్ని సంపాదిస్తాడు. ఈ సంవత్సరం అతను మరో ఏడుగురు విక్రేతలతో కలిసి ఒక ట్రక్కును రూ. 16,000 కు అద్దెకు తీసుకున్నాడు. ఈ తోపుడు బండిని విజయవాడ నుండి దర్గా వరకు ఈ రోజు వ్యాపారం కోసం తీసుకువచ్చారు.

The Urs is also an occasion for brisk business. With word spreading that sales here can be profitable, a growing number of vendors try to find a slot
PHOTO • Harinath Rao Nagulavancha
The Urs is also an occasion for brisk business. With word spreading that sales here can be profitable, a growing number of vendors try to find a slot
PHOTO • Harinath Rao Nagulavancha
The Urs is also an occasion for brisk business. With word spreading that sales here can be profitable, a growing number of vendors try to find a slot
PHOTO • Harinath Rao Nagulavancha

ఉర్సు కూడా చురుకైన వ్యాపారానికి ఒక సందర్భం. ఇక్కడ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయని ప్రచారం జరగడంతో, పెరుగుతున్న విక్రేతల సంఖ్య స్లాట్‌ను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది

పుణ్యక్షేత్రం సమీపంలోని గ్రామాలలో నివసించే ప్రజలకు కూడా ఇది ఒక ముఖ్యమైన సందర్భం. “మా పాడి-పంట [పశువులు, పంటలు] బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రధాన పండుగ ఉర్సు, ”అని లంబాడీ వర్గానికి చెందిన 48 ఏళ్ల భూక్య ప్రకాష్ చెప్పారు. అతను దర్గా నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్మెట్ తండాలో నివసిస్తున్నాడు. అతను 5.5 ఎకరాలలో పత్తి, వరి, మిర్చి సాగు చేస్తున్నారు.

“నా కుటుంబం దాదాపు రూ. 30,000 ఖర్చు చేస్తుంది [ఉర్స్ సమయంలో],” అని చెప్పాడు ప్రకాష్. బట్టలు, ఆభరణాల కొనుగోలు, పిండి ఆధారిత చిరుతిళ్లు – ఉర్సు సమయంలో చేసే ఈ ఖర్చులు, వారు దసరా లేదా దీపావళి వంటి ఇతర ప్రసిద్ధ పండుగల సమయంలో కూడా చేయరు.

మేము ప్రకాష్ ని కలిసినప్పుడు, 20 రోజులుగా తను, తన బృందం కలిసి పని  చేస్తున్న ఓ నాటకానికి డైలాగులు చెబుతూ రిహార్సల్‌కి సిద్ధమవుతున్నాడు. ఇటీవల నాటకాన్ని వారి వేడుకలకు అదనంగా జోడించారు. ఇది ‘ నిద్ర లేచిన రుద్ర సింహాలు ’, అనే ప్రతీకార కథ. దీనిని ఉర్సు తర్వాతి రోజు అతని గ్రామం మొత్తానికి ప్రదర్శిస్తారు.

లంబాడీలకు దర్గా లో ముఖ్యమైనది కందూరు - మేకలు లేదా గొర్రెలను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించడం - కళాశాలలో ప్రవేశం పొందడం, అనారోగ్యం నుండి కోలుకోవడం, మంచి పంట పండించడం వంటి వాటి కోసం. కానీ రద్దీ కారణంగా చాలా మంది మేకలు/గొర్రెలకు బదులుగా ఉర్సు రోజున కోళ్లను బలి ఇస్తారు. వీటిని కట్టెల పొయ్యిలపై వండుతారు. ఇందుకోసం  కొందరు తమ స్వంత పాత్రలను తెచ్చుకుంటారు, మరికొందరు స్థానిక దుకాణాల నుండి కట్టెలతో పాటు వాటిని అద్దెకు తీసుకుంటారు. వండిన ఆహారంలోని మసాలా వాసన చందనం దుమ్ము వాసనలతో కలగలిసిపోతుంది.

PHOTO • Harinath Rao Nagulavancha

ఎగువ ఎడమవైపు: 'మా ప్రధాన పండుగ ఉర్సు ,' అని లంబాడీ కమ్యూనిటీకి చెందిన భూక్య ప్రకాష్ చెప్పారు. ఎగువ కుడి: పెరుగుతున్న రద్దీలో సందర్శకులు సులభంగా తప్పిపోగల దారి ఇది. దిగువ వరుస: గంధం ఊరేగింపు కోసం గుర్రం సిద్ధంగా ఉంది ; ప్రజలు భక్తికి గుర్తుగా వేదిక వద్ద జంతువులకు ఆహారం ఇస్తారు

"ఇది [ఉర్సు] ప్రారంభం మాత్రమే" అని దర్గా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ సైదా నాయక్ చెప్పారు. ఉర్సు తర్వాత ప్రతి శుక్రవారం, జూన్-జూలైలో వచ్చే పంటల సీజన్ బాగుండాలని, జనపహాడ్ గ్రామంలోని కందూరు కోసం చాల మంది జనాలు వస్తుంటారు. వారు మేకలను, గొర్రెలను సమర్పించే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఈ  మాట అన్నాడు. .

ఒక జంతువు వధకు రూ. 1,200 సేకరిస్తారు. ఆ తరువాత పవిత్ర శ్లోకాల పఠనంతో మందిరంలో వండిన భోజనాన్ని అందిస్తారు. ఈ మొత్తాన్ని భరించలేమని పలువురు అంటున్నారు. డబ్బును దర్గా నిర్వహణ అధికారులు లేదా సబ్-కాంట్రాక్టర్ల ద్వారా సేకరిస్తారు (ఈ సబ్-కాంట్రాక్టర్లు జంతువులను వధించడం, కొబ్బరికాయలు అమ్మడం, లడ్డూలు పంపిణీ చేయడం అనేక ఇతర లాభదాయకమైన కార్యకలాపాల చేసే హక్కులు పొందుతారు). ఈ కాంట్రాక్టులను రాష్ట్ర వక్ఫ్ బోర్డు వేలం వేస్తుంది.

భరించలేని ఫీజులే కాకుండా, వేదిక వద్ద అధ్వాన్నమైన పారిశుధ్యం, మరుగుదొడ్లు లేకపోవడం గురించి సందర్శకులు మాట్లాడుతున్నారు. “మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్‌డిఓలు [రెవెన్యూ డివిజనల్ అధికారులు] అందరూ ఈ స్థలాన్ని సందర్శిస్తారు. మేము చాలాసార్లు వారికి తెలియజేసినా కూడా పరిస్థితి మారలేదు, ”అని సైదా నాయక్ చెప్పారు. గతంలో స్థానిక మీడియాలో కూడా దర్గా కార్యకలాపాల్లో అవకతవకలు జరిగాయని, సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని వార్తలు వచ్చాయి.

అయినప్పటికీ, సందర్శకులు వారి కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తుంటారు - విశ్వాసం, ఆశ, ఇంకా బహుశా రుచికరమైన భోజనం కోసం.

అనువాదం: జి విష్ణు వర్ధన్

Harinath Rao Nagulavancha

हरिनाथ राव नागुलवंचा लिंबू वर्गीय फळांची शेती करतात आणि ते तेलंगणातील नलगोंडास्थित मुक्त पत्रकार आहेत.

यांचे इतर लिखाण Harinath Rao Nagulavancha
Translator : G. Vishnu Vardhan

G. Vishnu Vardhan obtained a Post-graduation Diploma in Rural development and management from Hyderbad. Currently he works with ICRISAT in tribal agency area of Utnoor, Telangana.

यांचे इतर लिखाण G. Vishnu Vardhan