నిలిచిపోయిన మురుగు కాలువ నుంచి పారుతోన్న మురుగు నీటిని దాటుకొని రెండు పక్కా ఇళ్ళ మధ్య దుమ్ముదుమ్ముగా ఉన్న దారిలోకి ప్రవేశించారు నల్లమ్మ. ఆ దారిలో ఒక పక్కగా కట్టెపుల్లలు పోగుపడి ఉన్నాయి. నీలిరంగు పూల షిఫాన్ చీర ధరించిన 35 ఏళ్ల పొడగరి నల్లమ్మ, బాగా ఉపయోగంలో ఉన్న దారిలా కనిపిస్తోన్న ఆ బాటలో నడుస్తోంటే, చెప్పులు లేని ఆమె పాదాలు మురుగునీటి తడి గుర్తులను వదులుతున్నాయి.
పొదలు, ఎండిపోయినగడ్డి, చెత్తాచెదారం నిండివున్న ఒక వెల్లడి ప్రదేశానికి చేరుకున్నాం. "ఎక్కడ చోటుంటే అక్కడ మేం కూర్చుంటాం (మల విసర్జన కోసం)," అప్పుడే మేం దాటివచ్చిన గుడికల్ గ్రామంలోని ఇళ్ళవైపు చూపిస్తూ అన్నారు నల్లమ్మ. "మా ఇళ్ళల్లో ఒక్క ఇంటిలో కూడా మరుగుదొడ్డి లేదు. అది సి-సెక్షన్ (సిజేరియన్ కానుపు) అయినా, గర్భిణీ అయినా, బహిష్టు అయినా, మేమిక్కడకి రావాల్సిందే," అన్నారామె ఒక విధమైన ఖచ్చితత్వంతో.
ఏళ్ళ తరబడి ఇంటి వెనుక అంటే బహిరంగ మల విసర్జన చేసే ప్రదేశంగా పేరుపడిపోయింది. "మా వైపున్న వీధిలోని ప్రతి మహిళా ఇక్కడికే వస్తారు. వీధికి అవతల మగవాళ్ళకు కూడా ఇలాంటి చోటే ఉంది," నల్లమ్మ వివరించారు.
కర్నూలు జిల్లా యెమ్మిగనూరు బ్లాక్‌లోని గుడికల్ గ్రామ జనాభా 11,213 (2011 జనాభా లెక్కలు). ఈ గ్రామాన్ని "బహిరంగ మల విసర్జన రహిత' గ్రామంగా ముందు కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి. కానీ గుడికల్‌లో నల్లమ్మ నివసించే మూడవ వార్డు మాత్రం ఖచ్చితంగా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామం మాత్రం కాదని ఇక్కడ నివాసముండేవారు అంటున్నారు. నిజానికి ఇక్కడున్న ఎనిమిది వార్డుల్లోని ఆరు వార్డుల్లో మరుగుదొడ్లు లేవని నల్లమ్మ చెప్పారు. (అధికారిక డేటా ఇక్కడ 20 వార్డులున్నట్టు చూపిస్తున్నప్పటికీ, స్థానిక సచివాలయంలో పనిచేసే వాలంటీర్, ఆమె సహాయకులతో సహా స్థానిక ప్రభుత్వ అధికారులంతా ఇక్కడ ఉన్నది ఎనిమిది వార్డులు మాత్రమే అని చెప్తున్నారు.)
గుడికల్‌లోని దాదాపు 25 శాతం కుటుంబాలు కాయకష్టం చేసుకునే సాధారణ కూలీలు (సామాజిక ఆర్థిక కుల గణన 2011). 53 శాతం కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. ఎక్కువమంది రైతులు మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలను సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న నీటి సంక్షోభం కారణంగా, వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది. మొత్తంగా 1,420 హెక్టార్ల భూమి సాగులో ఉంది.
నల్లమ్మ పురాతనమైన జమ్మి (ప్రొసోపిస్ సినరేరియా) చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్న నాలుగు అడవి పందులను చూపించారు. ‘తెల్ల కొంగలు, పాముల’తో పాటు పందులు కనిపించడం ఇక్కడ మామూలు విషయమని ఆమె చెప్పారు. “మేం ఉదయం ఇక్కడికి వచ్చేసరికి సాధారణంగా చిమ్మచీకటిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, కానీ భయమైతే ఉంటుంది కదా,” అని ఆమె చెప్పారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన నల్లమ్మ, ఉదయం తన ఇంటి పనిలో తీరికలేకుండా ఉంటారు. ఆమె గ్రామంలోని చాలామంది చేసినట్లే, తెల్లవారుజామున 4 గంటలకు చీకటిగా ఉన్నప్పుడే ఇక్కడికి వసారు. భవన నిర్మాణాలలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఆమె, పని కోసం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యెమ్మిగనూరు పట్టణానికి ఉదయం 8 గంటలకంతా చేరుకుంటారు. "నేను పనిచేసే నిర్మాణ ప్రదేశాలలో కూడా మరుగుదొడ్లు లేవు," అని ఆమె చెప్పారు. "అక్కడ కూడా అవసరం పడితే, చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక చెట్టు చాటుకో లేదా బయలు ప్రదేశానికో వెళ్తాం."
*****
"మాల, మాదిగ, చాకలి, నేతకాని, బోయ, పద్మశాలి - వీరంతా వేర్వేరు చోట్లకు వెళతారు," అన్నారు జానకమ్మ ఇక్కడ నివసించే వివిధ సామాజిక వర్గాల ప్రజల గురించి చెబుతూ. ఈ వర్గాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సి), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి)గా జాబితా చేయబడినవి. “పురుషులు, స్త్రీలు వేర్వేరు చోట్లకు వెళతారు; యువకులు, పెద్దవాళ్ళు కూడా వేర్వేరు చోట్లకు వెళతారు." గుడికల్‌లోని ఐదవ వార్డులో నివాసముంటున్న ఈమె వయస్సు 60 ఏళ్ళు దాటాయి. ఈమె ఒబిసి జాబితాలో ఉన్న బోయ సామాజిక వర్గానికి చెందినవారు.
ఇక్కడ నివసించేవారిలో చాలామందికి సొంత భూమి లేదు, కచ్చా ఇళ్ళలో నివసిస్తుంటార్రు. “మా ముసలి వయసులో, మేం మరుగు కోసం రాళ్ళో కొండలో ఎక్కలేం. దగ్గర్లోకే వెళ్లాలి," అంటున్నారు రమణమ్మ. ఆమె తనలాగే అరవై ఏళ్ళు దాటిన ఇద్దరు మహిళలతో కలిసి - అంజమ్మ, ఎల్లమ్మ - ఐదవ వార్డులో కమ్యూనిటీకి చెందిన ఒక ప్రదేశంలో కూర్చునివున్నారు.
ఎత్తైన హనుమాన్ కొండ పాదాల దగ్గర ఈ బోయ బస్తీ ఉంది. కొన్ని నెలల క్రితం వరకు గుడికల్ చెరువు గట్లు వారి బహిరంగ మలవిసర్జన స్థలంగా ఉండేవి. అయితే, ఒక ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేశాడు. నిరుత్సాహం నిండిన స్వరంతో, “ఇప్పుడు పొలాలకు దగ్గరగా మా గుడిసెలు వేసుకుంటున్నాం.” అన్నారు రమణమ్మ.
ఎల్లమ్మ దీనికి అంగీకరిస్తూ, “ఇంతకుముందు లాగా పైకెక్కి ఒక రాయి వెనక్కు వెళ్ళడం లేదా కొండపైకి వెళ్లడం అనేది ఇప్పుడు నా వయస్సులో ఉన్నవారికి ప్రమాదం. కాబట్టి నేను మరుగు గురించి ఆలోచించడం లేదు." అన్నారు
అక్కడికి కిలోమీటరు లోపు దూరంలో ఉండే ఆరో వార్డులో నివాసముంటున్న పార్వతమ్మ, “ఈ ఎస్సీ కాలనీలో మరుగుదొడ్లు లేవు, సరైన మురుక్కాలవ కూడా లేదు. కాలువలా పారే మురుగు నుండి వచ్చే దుర్వాసనతో తిండి తినడం కూడా కొన్నిసార్లు కష్టమవుతోంది," అన్నారు.
ఎన్నికల సమయంలో గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చిన రాజకీయ నాయకులతో ఈ విషయం గురించి మాట్లాడటానికి తాను, మరికొంతమంది మహిళలు లెక్కలేనన్నిసార్లు ప్రయత్నించిన సంగతిని ఈ 38 ఏళ్ళ మహిళ గుర్తు చేసుకున్నారు. మహిళల గొంతులను వినిపించుకోరని ఆమె అన్నారు. “మా చుట్టూ ఉండే మగవాళ్ళు మమ్మల్ని మాట్లాడనివ్వరు. మేమేం మాట్లాడుతున్నామో మాకు తెలియదని వాళ్ళు మాకు చెప్తారు."
పార్వతమ్మకు స్థానిక పరిపాలనపై పెద్దగా నమ్మకం లేదు, ప్రధానంగా గ్రామ-వార్డు సచివాలయం లేదా గ్రామ-వార్డు సెక్రటేరియట్ మీద. (అన్ని ప్రభుత్వ శాఖల సేవలను, సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సచివాలయాలను ఏర్పాటు చేశారు.) గుడికల్‌లో 51 మంది సచివాలయం వాలంటీర్లు ఉన్నారు. వీరంతా 3 సచివాలయాల నుండి పనిచేస్తారు. ఒక్కో వాలంటీర్ కింద 50 ఇళ్ళుంటాయి.
"మూడేళ్ళ క్రితం సచివాలయం సిబ్బంది వచ్చి గుడికల్‌లోని కొన్ని ఇళ్ళల్లో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు స్థలాన్ని గుర్తించి వెళ్ళారు. మా ఇళ్లకు గుర్తులు పెట్టారు కానీ, వాళ్ళు మళ్లీ రాలేదు," అని 49 ఏళ్ళ నర్సమ్మ చెప్పారు. “చాలామంది వాలంటీర్లు ఉన్నప్పటికీ, వారు పట్టించుకోరు. వాళ్లకి కొమ్ములు మొలిచాయి (అధికారం వారి నెత్తికెక్కింది).”
గుడికల్ పంచాయతీ కార్యదర్శి, ఆ ప్రాంతంలోని సచివాలయాలన్నిటికీ అధిపతి అయిన గులామ్ జమీలా బీ (43), మరుగుదొడ్డి కట్టుకోవడానికి ఉండవలసిన అర్హతకు సంబంధించిన ప్రమాణాలను జాబితా చేశారు: “మరుగుదొడ్డి లేకపోవడం, ఇంటి యాజమాన్యం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇచ్చే (బిపిఎల్) కార్డ్, ఆధార్ నమోదు.” వీటి ఆధారంగా గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్ఒ) ఒక జాబితాను తయారుచేసి ‘స్వచ్ఛ ఆంధ్ర మిషన్’ పథకం కింద ఉచిత మరుగుదొడ్లను మంజూరు చేస్తారని ఆమె చెప్పారు.
మెజారిటీ కుటుంబాలు దీనికి అర్హత సాధించినప్పటికీ, గుడికల్‌లో కేవలం తొమ్మిది మరుగుదొడ్లు మాత్రమే నిర్మించినట్లు గులామ్ చెప్పారు. ఆమె 2019 నుండి వైఎస్ఆర్‌సిపి (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) అనుసరిస్తోన్న ఎన్నికల మేనిఫెస్టోను మాకు అందజేస్తూ, “జగన్ (ముఖ్యమంత్రి) అమలు చేయడానికి ప్రణాళిక తయారుచేసిన అన్ని పథకాలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఈ కరపత్రంలో మరుగుదొడ్ల ప్రస్తావన ఎక్కడా లేదు.” అన్నారు.
నర్సమ్మ నాల్గవ వార్డు చివరన నివాసముంటున్నారు. 2019లో మరుగుదొడ్డి ఏర్పాటుకు ఆమె అనుమతి పొందారు. జూన్ నుండి అక్టోబర్ వరకు ఉండే వర్షాకాలంలో కురిసే వానలకు నీరు నిలబడిపోకుండా, వరదలు ముంచెత్తకుండా ఉండేందుకు అక్కడ ఉన్న అన్ని ఇళ్ళ ఎత్తును రెండు అడుగుల మేర పెంచుకుంటారు. నర్సమ్మ ఉండే ఇల్లు మిగిలిన ఇళ్ళకు దిగువన లోతట్టు ప్రాంతంలో ఉంది.
ఆమె 4x4 అడుగుల చతురస్రాకారంలో రాళ్ళతో గుర్తుపెట్టివున్న స్థలం పక్కన నిలబడి ఉన్నారు. మూడేళ్ళ క్రితం మరుగుదొడ్డి నిర్మించాలనుకున్న స్థలానికి గుర్తుగా పెట్టిన ఆ రాళ్ళే మిగిలాయి తప్ప పనేమీ జరగలేదని ఆమె చెప్పారు.
నర్సమ్మ ఇంటికి ఎదురుగా 51 ఏళ్ళ భద్రమ్మ నివసిస్తున్నారు. వర్షాకాలంలో గుడికల్‌లోని వివిధ ప్రాంతాల నుండి కొట్టువచ్చిన వరద నీరు తమ రహదారిని చెత్తాచెదారంతో నింపి దారి లేకుండా చేస్తుందనీ, భరించరాని దుర్వాసన కూడా వస్తుందని ఆమె చెప్పారు. "వేసవి కాలంలో జాతర జరిగే ప్రదేశం కూడా ఇదే" అంటూ ఆమె తమ వీధి చివర ఉన్న ఆలయాన్ని సూచిస్తూ చెప్పారు. "గ్రామం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ ఊరేగింపును (ఈ మార్గం గుండా) జరుపుకుంటారు, కానీ రుతుపవనాల సమయంలో వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో ఎవరూ పట్టించుకోరు."
గుమ్మం దగ్గర స్నానాల గది ఉన్న కాంక్రీట్ ఇంట్లో రామలక్ష్మి నివసిస్తోంది, కానీ ఆ స్నానాల గదిలో మరుగుదొడ్డి లేదు. 21 ఏళ్ళ ఈ యువతి మూడేళ్ల క్రితం పెళ్ళి చేసుకుని ఈ గుడికల్‌కు వచ్చింది. "నా అత్తమామలు, భర్త, నేను ఆ (బహిరంగ మలవిసర్జన) స్థలాన్నే ఉపయోగిస్తాం." ఆమె పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కావడంతో, వారి అవసరాలను ఇంటి దగ్గరలోనే తీర్చుకోవాలి.
గుడికల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గులామ్ జమీలా బీ మినహా ఈ కథనంలో ఉదహరించిన మహిళలందరూ తమ గుర్తింపును బయట పెట్టకూడదనే షరతుపై తమ అనుభవాలను పంచుకున్నారు .
అనువాదం: సుధామయి సత్తెనపల్లి