ఝార్ఖండ్‌లోని చెచరియా గ్రామంలో ఉండే సవితా దేవి మట్టి ఇంటి గోడల మీంచి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటం కిందకి చూస్తూ ఉంది. "బాబాసాహెబ్ మాకు ఇచ్చారు [వోటు వేసే హక్కులు], అందుకనే మేం వోటు వేస్తున్నాం," అంటారు సవిత.

సవితకు ఒక బిఘా (0.75 ఎకరం) సొంత భూమి ఉంది. అందులో ఆమె ఖరీఫ్ కాలంలో వరి, మొక్కజొన్న; రబీ కాలంలో గోధుమ, చనా(సెనగ), నూనె గింజలను పండిస్తారు. తన పెరటిలో కూరగాయలను పెంచాలని ఆమె అనుకుంటున్నారు. "కానీ రెండేళ్ళుగా, నీరు లేదు"; వరుసగా రెండేళ్ళ పాటు వచ్చిన కరవు ఆమె కుటుంబాన్ని అప్పులపాలు చేసింది.

ముప్పైరెండేళ్ళ వయసున్న సవిత తన నలుగురు పిల్లలతో కలిసి పలామూ జిల్లాలోని ఈ గ్రామంలో నివసిస్తున్నారు; ఆమె భర్త ప్రమోద్ రామ్ (37) అక్కడికి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరులో వలస కార్మికుడిగా పనిచేస్తారు. "ప్రభుత్వం మాకు ఉద్యోగాలివ్వటం లేదు," అంటారు దినసరి కూలీగా పనిచేసే ఈ దళితుడు. "మా సంపాదన పిల్లలను పోషించేందుకు కనాకష్టంగా సరిపోతుంది."

నిర్మాణ ప్రదేశాలలో పనిచేస్తున్న ప్రమోద్, నెలకు 10,000-12,000 వరకు సంపాదిస్తారు. కొన్నిసార్లు ఆయన ట్రక్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తారు కానీ ఆ అవకాశం ఏడాది పొడుగునా ఉండదు. "మగవాళ్ళు నాలుగు నెలలపాటు ఇంటి దగ్గరే కూర్చుంటే, మేం బిచ్చమెత్తుకోవడం మొదలెట్టాలి. మరేం చేయగలం [వలసపోవటం తప్ప]?" అనడుగుతారు సవిత.

960 మంది (జనగణన 2011) నివాసముండే చెచరియా గ్రామానికి చెందిన మగవాళ్ళలో ఎక్కువమంది పని కోసం వెతుక్కుంటూ వలస వెళ్తారు. "ఇక్కడ ఉద్యోగావకాశాలు లేవు. ఇక్కడే పని దొరికితే, జనం ఎందుకు పనికోసం బయటికి వెళ్ళటం?' సవితా దేవి అత్తగారైన 60 ఏళ్ళ సుర్‌పతి దేవి అంటారు.

PHOTO • Savita Devi
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: చెచరియా గ్రామంలో ఉండే సవితా దేవి మట్టి ఇంటి గోడల మీంచి కిందకి చూస్తూ ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటం. ఈ గ్రామం గత రెండేళ్ళుగా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటోంది. కుడి: "బాబాసాహెబ్ మాకు ఇచ్చారు [వోటు వేసే హక్కులు], అందుకనే మేం వోటు వేస్తున్నాం," అంటారు సవిత

ఎనిమిది లక్షల మందికి పైగా జనాభా పని కోసం, ఉపాధి కోసం వెతుక్కుంటూ ఝార్ఖండ్ నుంచి బయటకు వెళ్ళారు (జనగణన 2011). "ఈ గ్రామంలో పనిచేసేవాళ్ళలో 20 నుంచి 52 ఏళ్ళ వయసున్నవారిని ఒక్కరిని కూడా మీరు చూడలేరు," అంటారు హరిశంకర్ దూబే. "కేవలం ఐదు శాతం మంది మాత్రమే మిగిలారు; మిగిలినవారంతా వలసపోయారు," అని బసనా పంచాయత్ సమితి సభ్యుడైన ఆయన చెప్పారు. చెచరియా ఈ పంచాయతీకే చెందినది.

"ఈసారి వాళ్ళు మమ్మల్ని వోటు అడగటానికి వచ్చినప్పుడు, మా గ్రామం కోసం నువ్వేం చేశావని మేం అడుగుతాం," అన్నారు సవిత, కోపంగానూ నిశ్చయంతోనూ. గులాబీ రంగు నైటీ ధరించి, పసుపురంగు దుపట్టాను తలపైగా చుట్టుకొని ఉన్న ఆమె మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటిముందు కూర్చొని ఉన్నారు. అప్పుడు మధ్యాహ్నం అవుతూ ఉంది. మధ్యహ్న భోజనంలో భాగంగా ఖిచిడీ ని తిని, ఆమె నలుగురు పిల్లలూ అప్పుడే బడి నుంచి ఇంటికి వచ్చారు.

సవిత చమార్ దళిత సముదాయానికి చెందినవారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆ గ్రామవాసులు నిర్వహించిన అంబెద్కర్ జయంతి ఉత్సవాల ద్వారా తాను తెలుసుకున్నట్టు ఆమె చెప్పారు. ఆ గ్రామంలో 70 శాతం మంది షెడ్యూల్డ్ కులాల సముదాయాలకు చెందినవారే. ఫ్రేము కట్టిన అంబేద్కర్ చిత్రపటాన్ని ఆమె కొద్ది సంవత్సరాల క్రితం అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గఢ్వా పట్టణం నుంచి తెచ్చుకున్నారు.

2022లో జరిగిన పంచాయత్ ఎన్నికలకు ముందు సవిత తనకు బాగా జ్వరంగా ఉన్నప్పటికీ, ముఖియా (గ్రామ పెద్ద) భార్య అభ్యర్థన మేరకు ఒక ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. "తాను గెలిస్తే ఒక చేతిపంపును వేయిస్తానని ఆమె మాకు వాగ్దానం చేసింది," అన్నారు సవిత. ఆమె గెలిచినప్పటికీ ఆ వాగ్దానాన్ని చెల్లించలేదు. సవిత రెండుసార్లు ఆమె ఇంటికి వెళ్ళారు. "నన్ను కలవటం సంగతి అటుంచి, ఆమె నావేపు చూడను కూడా లేదు. ఆమె కూడా ఒక మహిళే, కానీ మరో మహిళకు ఉన్న కష్టం గురించి ఆమెకు సహానుభూతి లేదు."

చెచరియా గ్రామం పదేళ్ళుగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ 179 కుటుంబాల నీటి అవసరాలను ఒకే ఒక్క బావి తీరుస్తోంది. ప్రతిరోజూ సవిత 200 మీటర్ల ఎత్తు ప్రదేశంలో ఉన్న ఒక చేతి పంపు దగ్గరకు రెండుసార్లు వెళ్ళి నీటిని తెచ్చుకుంటారు. పొద్దుపొద్దున్నే నాలుగు లేదా ఐదు గంటల నుంచి మొదలుపెట్టి, నీటి సంబంధిత పనుల మీద రోజులో ఐదు నుంచి ఆరు గంటల పాటు ఆమె గడుపుతారు. "ఒక చేతి పంపును ఏర్పాటు చేయటం ప్రభుత్వ బాధ్యత కాదా?" అని ఆమె ప్రశ్నిస్తారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఏదమ, కుడి: ఎండిపోయిన బావి పక్కనే నిల్చొనివున్న సవిత మామగారు, లఖన్ రామ్. చెచరియా గ్రామం దశాబ్ద కాలానికి పైగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది

వరుసగా వచ్చిన కరవులతో ఝార్ఖండ్ బాగా దెబ్బతింది: 2022లో దాదాపు మొత్తం రాష్ట్రాన్ని - 226 బ్లాక్‌లు - కరవు పీడిత రాష్ట్రంగా ప్రకటించారు. ఆ తర్వాతి ఏడాది, 2023లో 158 బ్లాక్‌లు కరవుపాలన పడ్డాయి.

తాగటానికి, బట్టలు ఉతికేందుకు ఎంత నీరు వాడగలమో మేం ఆలోచించుకొని వాడాలి," తమ కచ్చా ఇంటి ఆవరణలో ఉన్న బావిని చూపిస్తూ అన్నారు సవిత. ఆ బావి ఈ 2024 వేసవికాలం ప్రారంభం కావడానికి ముందు, పోయిన నెల నుంచి ఎండిపోయింది.

చెచరియాలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుంది. ప్రమోద్, వలస కూలీ అయిన అతని తమ్ముడు కూడా ఈ పోలింగ్ తేదీకి ముందే తమ ఇంటికి తిరిగివస్తారు. "వాళ్ళు కేవలం వోటు వేయడానికే వస్తున్నారు," అన్నారు సవిత. వాళ్ళు ఇంటికి రావటానికి అయ్యే ఖర్చు రూ. 700. దీనివలన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పనిని కూడా వదులుకోవాలి, తద్వారా వాళ్ళు మళ్ళీ లేబర్ మార్కెట్‌లో ఉండాల్సివస్తుంది.

*****

చెచరియాకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఒక ఆరు లేన్ల హైవే నిర్మాణంలో ఉంది, కానీ ఈ గ్రామానికి మాత్రం రోడ్డు కూడా లేదు. దాంతో, రేణు దేవి (25)కి నొప్పులు వచ్చినప్పుడు సర్కారీ గాడీ (ప్రభుత్వ ఆంబులెన్స్) ఆమె ఇంటి గుమ్మం వరకూ రాలేకపోయింది. "ఆ స్థితిలో నేను మెయిన్ రోడ్డు [సుమారు 300 మీటర్లు] వరకూ నడవాల్సివచ్చింది," చెప్పిందామె. రాత్రి 11 గంటల వేళ ఆమె నడచిన నడక ఆమె జ్ఞాపకాల్లో స్పష్టంగా ముద్రించుకుపోయింది.

ఆంబులెన్సులే కాదు, ప్రభుత్వ పథకాలేవీ వారి గుమ్మం ముందుకు వచ్చిన దాఖలాలు లేవు.

చెచరియాలోని ఎక్కువ కుటుంబాలు చుల్హా (పొయ్యి)మీదే వంట చేసుకుంటాయి. వారికి ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన కింద ఎల్‌పిజి సిలిండర్ అందకపోయైనా ఉండాలి, లేదంటే సిలిండర్లను తిరిగి నింపుకునేందుకు వారి దగ్గర డబ్బైనా లేకపోవాలి.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: కొన్ని నెలల క్రితం ప్రసవించినప్పటి నుండి రేణు దేవి తన పుట్టింటిలోనే ఉంటోంది. ఆమె సోదరుడు కన్హయ్ కుమార్ హైదరాబాద్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కుడి: కుటుంబం ఫీజు కట్టలేకపోవటంతో రేణు సోదరి ప్రియాంక 12వ తరగతి తర్వాత చదువు ఆపేసింది. టైలరింగ్ పనితో జీవనోపాధి పొందాలనే ఆశతో ఆమె ఇటీవల తన పిన్ని నుండి కుట్టు మిషన్‌ను అరువు తీసుకుంది

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: చెచరియా నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఒక ఆరు లేన్ల రహదారి నిర్మాణంలో ఉంది, కానీ రేణు, ప్రియాంకల ఊరికి ఇంకా రోడ్డు కూడా రాలేదు. కుడి: వ్యవసాయ అవసరాల కోసం ఆ కుటుంబం తమ ఇంటి వెనుక ఉన్న బావి నీటిపై ఆధారపడి ఉండేది

చెచరియా నివాసితులు అందరికీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కార్డ్ (MNREGA) కార్డ్ (బుక్‌లెట్) ఉంది, ఇది సంవత్సరంలో 100 రోజుల పనికి హామీ ఇస్తుంది. ఐదు నుంచి ఆరేళ్ళ క్రితమే ఈ కార్డులు జారీ చేసినా అందులో పేజీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. వాటి కాగితం ఇప్పటికీ తాజా వాసన వేస్తోంది

వారి కుటుంబానికి ఫీజు కట్టే స్తోమత లేకపోవడంతో రేణు చెల్లెలైన ప్రియాంక 12వ తరగతి తర్వాత తన చదువును వదిలేయాల్సివచ్చింది. కుట్టుపని చేయటం ద్వారా జీవనోపాధిని పొందాలనే ఆశతో 20 ఏళ్ళ ప్రియాంక తన పిన్ని వద్ద నుండి ఒక కుట్టు మిషన్‌ను అరువు తీసుకుంది. "ఆమెకు త్వరలోనే పెళ్ళి కాబోతోంది," ప్రసవం తర్వాత తన పుట్టింట్లోనే ఉన్న రేణు చెప్పింది. "పెళ్ళికొడుక్కి ఉద్యోగం లేదు, పక్కా ఇల్లు కూడా లేదు, కానీ 2 లక్షల కట్నం కోసం డిమాండ్ చేస్తున్నాడు." ఈ పెళ్ళి కోసం ఆ కుటుంబం ఇప్పటికే డబ్బు అప్పు చేసింది.

ఎటువంటి సంపాదనా లేనప్పుడు చెచరియా వాసుల్లో అనేకమంది అధిక వడ్డీలను వసూలు చేసే వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు చేస్తారు. "ఈ ఊళ్ళో అప్పు లేని ఇల్లనేదే లేదు," అంటారు సునీతా దేవి. ఆమె కవల పిల్లలైన లవ కుశులు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు పని కోసం వలసపోయారు. వాళ్ళు ఇంటికి పంపే డబ్బుతోనే వారి ఇల్లు నడుస్తుంది. "కొన్నిసార్లు వాళ్ళు రూ. 5,000, మరికొన్నిసార్లు రూ. 10,000 పంపుతారు," అన్నారు కుశలవుల తల్లి, 49 ఏళ్ళ సునీత.

పోయిన ఏడాది జరిగిన వారి కుమార్తె పెళ్ళి కోసం సునీత, ఆమె భర్త రాజ్‌కుమార్ రామ్‌లు స్థానిక వడ్డీ వ్యాపారి నుండి 5 శాతం వడ్డీకి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వారు రూ. 20,000 తిరిగి చెల్లించగలిగారు, ఇంకా 1.5 లక్షల బాకీ ఉందని ఆమె చెప్పారు.

" గరీబ్ కే చావ్ దేవ్ కోయీ నయీకే. అగర్ హమ్ ఏక్ దిన్ హమన్ ఝూరీ నహీఁ లానబ్, తా అగలా దిన్ హమన్ కే చూల్హా నహీఁ జలీ [పేదవారికి సాయం చేసేవారెవరూ లేరు. ఒక్క రోజు మేం కట్టెలను తెచ్చుకోకపోతే, మా పొయ్యిలో అగ్గి రాజుకోదు]," అంటారు సునీతా దేవి.

గ్రామంలోని ఇతర మహిళలతో కలిసి ఒక కొండ మీదినుంచి కట్టెలు తెచ్చుకోవటం కోసం ఆమె ప్రతిరోజూ 10-15 కిలోమీటర్ల దూరం నడుస్తారు, ఆ క్రమంలో అటవీ గార్డుల నుంచి ఎడతెగని వేధింపులను ఎదుర్కొంటారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: చెచరియాలో నివాసముండే అనేక ఇతరుల వలెనే సునీతా దేవి, ఆమె కుటుంబం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లేదా ఉజ్వల యోజన వంటి ప్రభుత్వ పథకాల నుండి ఎలాంటి ప్రయోజనం పొందలేదు. కుడి: స్థానికంగా దాదాపు ఉద్యోగ అవకాశాలేవీ అందుబాటులో లేకపోవడంతో, చెచరియాలోని పురుషులు వివిధ నగరాలకు వలస వెళ్ళారు. చాలా కుటుంబాలకు లేబర్ కార్డులు (MGNEREGA కింద) ఉన్నాయి, కానీ వారిలో ఎవరికీ దానిని ఉపయోగించుకునే అవకాశం రాలేదు

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు, 2019లో సునీతా దేవి గ్రామంలోని ఇతర మహిళలతో కలిసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. "ఎవరికీ ఇల్లు రాలేదు," అని ఆమె చెప్పారు. "మేం పొందే ఏకైక ప్రయోజనం రేషన్. అది కూడా, ఐదు కిలోలకు బదులుగా 4.5 కిలోలు మాత్రమే వస్తాయి."

ఐదేళ్ళ క్రితం భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణు దయాళ్ రామ్ మొత్తం ఓట్లలో 62 శాతం ఓట్లతో విజయం సాధించాడు. ఆయన రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన ఘూరన్‌రామ్‌ను ఓడించాడు. ఈ ఏడాది కూడా అదే స్థానం నుంచి అతను పోటీ చేస్తున్నాడు.

పోయిన ఏడాది, అంటే 2023 వరకూ సునీతకు అతని గురించి ఏమీ తెలియదు. ఒక స్థానిక సంతలో ఆమె అతని పేరు మీద కొన్ని నినాదాలను విన్నారు. " హమారా నేతా కైసా హో? వి డి రామ్ జైసా హో! "

" ఆజ్ తక్ ఉన్‌కో హమ్‌లోగ్ దేఖా నహీఁ హై [ఈ రోజు వరకూ మేం అతన్ని చూసి ఎరుగం]."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ashwini Kumar Shukla

अश्विनी कुमार शुक्ला, झारखंड के स्वतंत्र पत्रकार हैं, और नई दिल्ली के भारतीय जन संचार संस्थान (2018-2019) से स्नातक कर चुके हैं. वह साल 2023 के पारी-एमएमएफ़ फ़ेलो हैं.

की अन्य स्टोरी Ashwini Kumar Shukla
Editor : Sarbajaya Bhattacharya

सर्वजया भट्टाचार्य, पारी के लिए बतौर सीनियर असिस्टेंट एडिटर काम करती हैं. वह एक अनुभवी बांग्ला अनुवादक हैं. कोलकाता की रहने वाली सर्वजया शहर के इतिहास और यात्रा साहित्य में दिलचस्पी रखती हैं.

की अन्य स्टोरी Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli