కింద పడివున్న కొమ్మను నేలకేసి కొట్టి, తాను తోటలోకి ప్రవేశించినట్లుగా ప్రకటిస్తారు తంగమ్మ ఎ.కె. "నేనీ దట్టంగా చెట్లు పెరిగిపోయిన ఖాళీస్థలాల్లోకి చాలా జాగ్రత్తగా ప్రవేశిస్తాను. కర్రను నేలకేసి కొట్టి శబ్దం చేయగానే అక్కడేమైనా పాములుంటే అవి దూరంగా తొలగిపోతాయి," అంటారామె. ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్ల కింద దట్టంగా పెరిగివున్న తీగలు, విరిగిన కొమ్మలు, అడవి గడ్డిలోంచి, ఎటువంటి జీవుల దారిలోకి చొరబడకుండా జాగ్రత్తపడుతూ దారి చేసుకుంటారు తంగమ్మ.
ఎర్నాకుళంలో ఉన్న ఒక హౌసింగ్ కాలనీలోని ఖాళీ ఇంటిస్థలంలో ఉంది ఈ నిర్జన ప్రదేశం. "దారిన పోతుంటే (మంచి) కొబ్బరికాయలు దొరకడమంటే అదృష్టం వచ్చిపడ్డట్టే!" అని ఈ 62 ఏళ్ళ వృద్ధురాలు చెప్పారు. ఇలా ఎవరికీ చెందని స్థలాలలో రాలిపడిన కొబ్బరికాయలను సేకరించి, ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి వాటిని అమ్ముతుంటారామె. కొబ్బరి అనేక మలయాళీ వంటకాలలో ఉపయోగించే ప్రధాన పదార్థం. అందువలన కొబ్బరికాయలకు ఏడాది పొడవునా ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది.
"ఇంతకుముందు నేను పని ముగించుకుని వెళ్తూ ఈ సమీప పరిసరాల నుండే (పుదియ రోడ్ జంక్షన్) కొబ్బరికాయలు సేకరించేదాన్ని, కానీ ఇప్పుడు నా జబ్బులు నన్ను పనికి వెళ్ళనివ్వడం లేదు," ఎత్తుగా పెరిగివున్న గడ్డి గుండా నెమ్మదిగా దారిచేసుకుని వెళుతూ చెప్పారు తంగమ్మ. ఆమె ఊపిరి తీసుకోవడానికో, లేదా మధ్యాహ్న సూర్యుని ఎండ నుండి తన కళ్లను కాపాడుకుంటూ, కొబ్బరి కాయల కోసం పైకి చూసేందుకో మధ్య మధ్య ఆగుతూ నడుస్తున్నారు.
ఐదు సంవత్సరాల క్రితం నుంచి తంగమ్మ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట, ఇతర థైరాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడటం ప్రారంభించారు. దీంతో ఆమె ఇంటి పనులు చేసే తన పూర్తికాల ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ పని ద్వారా ఆమె నెలకు రూ. 6,000 సంపాదించేవారు. డబ్బు అవసరమున్న తంగమ్మకు పనిలేకుండా ఇంట్లో ఉండడమన్నది కష్టమే. దాంతో ఆమె ఇరుగుపొరుగున ఉన్న ఇళ్ళలో దుమ్ములు దులపడం, ఆవరణలను శుభ్రం చేయడం వంటి తక్కువ శారీరక శ్రమతో కూడిన పనులకు మారారు. ఒకసారి కోవిడ్-19 దెబ్బతీసిన తర్వాత, ఇక ఆ పని చేయడం కూడా ఆగిపోయింది.
అప్పటి నుంచి, ఖాళీగా ఉన్న ఇంటిస్థలాల్లో రాలిపడిన కొబ్బరికాయలను సేకరించి అమ్ముకోవడం ద్వారా తంగమ్మ తన ఖర్చులను జరుపుకుంటున్నారు. ఇంకా ఆమెకు ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 1600 పింఛను కూడా వస్తుంది.
“ఈ ఖాళీ స్థలాలలోకి ప్రవేశించకుండా నన్నింతవరకూ ఎవరూ ఆపలేదు. నా గురించి అందరికీ తెలుసు, నా వలన ఎటువంటి హాని ఉండదని కూడా తెలుసు,” ఎటువంటి కాపలా లేకుండా పడివున్న ఆస్తుల గురించి చెబుతూ అన్నారు తంగమ్మ. ఆమె ఆ ప్రదేశాలలో ఆరోగ్యంగా ఉన్న కొబ్బరి చెట్ల కోసం, వాటి కాయల కోసం వెతుకుతుంటారు.
తంగమ్మ తన పనిని గురించి వివరిస్తూనే, అడ్డం వస్తున్న కొమ్మలను విరుస్తూ, దట్టమైన పొదలను పక్కకు నెడుతూ, చెట్ల మొదట్లో పడిపోయిన కొబ్బరికాయల కోసం చూస్తున్నారు. కొబ్బరికాయ కనిపించగానే, దానిని సమీపంలోని గోడపై ఉంచి, ఇంకేమైనా కనిపిస్తాయేమోనని తన వెదుకులాటను కొనసాగిస్తున్నారు.
ఒక గంటసేపు కొబ్బరికాయలను పోగుచేశాక, చివరకు తన పనిని ముగించారు తంగమ్మ. ఆ తర్వాత పక్కనే ఉన్న కాంపౌండ్‌లోకి ఉన్న గోడను దాటి, ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఆమె ఇంతకుముందు పనిచేసిన ఇంటి యజమాని, ఒక గ్లాసు నీళ్లతో ఆమెకు స్వాగతం పలికారు.
సేదతీరిన తంగమ్మ తననూ, తన దుస్తుల మీదున్న ఆకులనూ కలుపునూ వదిలించి శుభ్రంచేసుకొని కొబ్బరికాయలను వేరుచేయటం మొదలుపెట్టారు. ఆమె వాటిని దగ్గరలో ఉన్న హోటళ్ళలోనూ, ఇళ్ళలోనూ అమ్మేందుకు వీలుగా వేర్వేరు సంచులలో నింపారు. ఒక మామూలు సైజు కొబ్బరికాయ అమ్మితే ఆమెకు రూ. 20 వస్తాయి. అదే పెద్ద కొబ్బరికాయలైతే రూ. 30కి అమ్మవచ్చు.
కొబ్బరికాయలన్నింటినీ సైజులవారీగా వేరు చేయటం పూర్తయ్యాక, తంగమ్మ ఫ్రెష్ అయ్యి, తన పని బట్టలు - పాత నైటీ - మార్చుకుని, చీర కట్టుకున్నారు. ఈ కొబ్బరికాయలను హోటల్‌కి అమ్మే పుదియ రోడ్ జంక్షన్‌కు వెళ్లే బస్సును అందుకోవడానికి పరుగు తీశారు.
"వెళ్ళిన ప్రతిసారీ నాకు కొబ్బరికాయలు దొరకవు. అదంతా మన అదృష్టంపై ఆధారపడివుంటుంది. ఒకోసారి చాలా ఎక్కువ దొరుకుతాయి, మరోసారి అసలేమీ దొరకవు," అంటారు తంగమ్మ.
తల పైకెత్తి కొబ్బరికాయల కోసం చూడటం రానురానూ కష్టమవుతోందని, భారంగా ఊపిరి పీల్చుకంటూ తడబడుతోన్న మాటలతో చెప్పారు తంగమ్మ. "నా తల తిరుగుతుంటుంది." తన ఇంటిదగ్గరే ఉన్న కర్మాగారాల నుంచి వచ్చే కాలుష్యమే తన ఆరోగ్యం ఇంత త్వరగా దిగజారటానికి కారణమని నిందిస్తూ చెప్పారు తంగమ్మ.
చిత్రంగా, తంగమ్మ తన ఆహారంలో కొబ్బరికాయను ఇష్టపడరు. “కొబ్బరితో చేసిన వంటలు నాకు నచ్చవు. ఎప్పుడో ఒకసారి పుట్టు (బియ్యపు రవ్వ, కొబ్బరి తురుము కలిపి ఆవిరిపై ఉడికించినది) లేదా ఆయలా (సముద్రపు చేప) కూరను తయారు చేసేటప్పుడు మాత్రమే నేను కొబ్బరిని ఉపయోగిస్తాను,” అని ఆమె చెప్పారు. ఆమె కొబ్బరి పొట్టును ఇంధనంగా ఉపయోగిస్తారు, ఎండు కొబ్బరిని మిల్లులకు ఇచ్చి బదులుగా కొబ్బరి నూనెను తీసుకుంటారు. కొబ్బరి మొలకలను బోన్సాయ్ సాగు కోసం తన కుమారుడు కణ్ణన్‌కు అందజేస్తారు.
ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పుడు, 40 రోజులకు ఒకసారి జరిగే కొబ్బరి కోతకు తంగమ్మ వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఆమెకు తాజా కొబ్బరికాయలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏలూర్‌లో ఉండే ఆమె ఇంటికి, తిరిగి పుదియ రోడ్డుకు చేసే ప్రయాణాలు బాధాకరంగా మారాయి. “నేను పుదియ రోడ్‌లో నివసించినప్పుడు, ఇదంతా చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు 20 నిమిషాల బస్సు ప్రయాణం, ఆ తర్వాత 15 నిమిషాల నడక వలన చాలా అలసటగా అనిపిస్తోంది,” అన్నారు, బస్సు కోసం ఎదురుచూస్తూన్న తంగమ్మ.
తంగమ్మ తన ఐదుగురు తోబుట్టువులతో కలిసి పుదియ రోడ్ జంక్షన్ చుట్టుపక్కల ప్రాంతంలోనే పెరిగారు. ఆమె పూర్వీకుల ఇల్లు ఉన్న స్థలాన్ని ఆమె, తోబుట్టువులంతా కలిసి తర్వాత పంచుకున్నారు. తంగమ్మ వాటాగా వచ్చినదానిని ఆమె భర్త వేలాయుధన్ అమ్మేశాడు. వారికి సొంత ఇల్లు లేకపోవడంతో తరచుగా స్థలాలు మారుతుండేవాళ్ళు. కొన్నిసార్లు ఆమె తన సోదరితో కలిసి పుదియ రోడ్‌లో ఉండేవారు, మరికొన్నిసార్లు ఏదో ఒక వంతెన కింద ఉండేవారు. వారు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఏలూర్‌లోని ఎస్.సి. కాలనీలో మూడు సెంట్ల స్థలంలో (1306.8 చదరపు అడుగులు) కట్టినది. నిరాశ్రయులైన వారికి సహాయం చేయడంలో భాగంగా దీనిని పంచాయతీవారు పట్టాయం (పట్టా భూమి)గా ఇచ్చారు.
తంగమ్మ, పుదియ రోడ్డులోనూ ఆ చుట్టుపక్కలా కొబ్బరికాయలు కోసేందుకు కొబ్బరి చెట్లు ఎక్కే పనిచేసే ఆమె భర్త వేలాయుధన్‌లకు ఇద్దరు పిల్లలు- కణ్ణన్ (34), కార్తీక (36). కణ్ణన్, తన భార్య కుటుంబానికి వ్యవసాయంలో సహాయం చేస్తూ త్రిసూర్‌లో నివసిస్తున్నారు. ఆమె కుమార్తె కార్తీక తన మూడేళ్ల కుమార్తె వైష్ణవితో కలిసి అక్కడికి దగ్గరలోనే నివసిస్తున్నారు. మనవరాలిని తక్కాళి (టమాటా) అని తంగమ్మ ప్రేమగా పిలుచుకుంటారు. "పిల్లలతో ఉండటం చాలా సరదాగా ఉంటుంది, కానీ ఇది చాలా దబాయింపుగా ఉండి, అలసటను కలగచేస్తుంది," ఆంటారామె.
*****
"నేనీ మధ్య వస్తువుల్ని స్పష్టంగా చూడలేకపోతున్నా కాబట్టి, ఇకపై కొబ్బరికాయల కోసం వెతికే పని చేయలేను," ఆమె తన మంచం మీద బట్టలు, కొన్ని కాగితాలు, పెంపుడు చిలుక ఉన్న పంజరాన్ని అమర్చుకుంటూ చెప్పారు. తంగమ్మ తన చిలుక తాతు తో కలిసి ఒంటరిగా నివసిస్తున్నారు. ఎవరైనా ఇంట్లోకి చొరబడినట్టు గ్రహిస్తే అరిచి గోలచేయడాని కూడా ఈ చిలుక శిక్షణ పొందివుంది.
తన పూర్వపు రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె ఇలా చెప్పారు: "ఒకసారి నేను ఒక పాము నా దగ్గరలోనే కదులుతుండటం చూసి కదలకుండా నిల్చున్నాను. అది నా తెగిపోయిన చెప్పుల పక్కనుంచే పాకుతూపోయింది. ఇప్పుడు నేను పామునే కాదు, కొబ్బరికాయలను కూడా గుర్తించలేను!" తన కంటి చూపు బలహీనపడిందని ఆమె చెప్పారు. పూట గడవటం కష్టమై, తన ఆరోగ్య సమస్యలకు మందులు వాడే స్తోమత లేక, సరిపడినంత ఆహారం కూడా తంగమ్మ తీసుకోలేకపోతున్నారు.
“నేను ఇంతకుముందు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇప్పటికీ నాకు నగదురూపంలోనూ, కరుణ రూపంలోనూ మద్దతు ఇస్తూనేవున్నారు. కానీ నేను వెళ్ళి వారిని కలవడం కూడా చాలా కష్టంగా ఉంటోంది,” తన శ్రేయోభిలాషిని కలవడానికి వెళుతున్నప్పుడు చెప్పారు తంగమ్మ. అలాంటి ఒక ఇంటికి వెళుతుండగా ఆమెకు అలసిపోయినట్లుగా, గొంతెండిపోయినట్లుగా అనిపిస్తుంది. తీపి తింటే, తనకు నడిచే శక్తి వస్తుందనే ఆశతో ఆమె టాఫీ తింటుంటారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి