"వీర్ నారాయణ్ సింగ్ ఆ?" అని చత్తీస్‌ఘడ్‌లోని సోనాఖాన్ గ్రామానికి చెందిన సహస్రామ్ కన్వర్ తన అభిప్రాయం చెప్పసాగారు. "అతను ఒక దొంగ, ఒక బందిపోటు. కొందరు ప్రజలు ఆయన గొప్పవాడని అంటారు. మేము అలా అనుకోం." ఆయన చుట్టూ కూర్చున్న వారిలో చాలా మంది అవునంటూ తలూపారు. మరికొందరు అటువంటి అభిప్రాయాన్నే వెళ్లబుచ్చారు.
అది విని మాకు ఎంతో బాధేసింది. సోనాఖాన్ గ్రామాన్ని వెతుక్కుంటూ మేము ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాం. 1850 దశకం మధ్యలో జరిగిన చత్తీస్ఘడ్ గిరిజన తిరుగుబాటుకు ఈ గ్రామం కేంద్రంగా నిలిచింది. ఇది, 1857లో జరిగిన సైనిక తిరుగుబాటుకు ముందే మొదలైంది. ఒక నిజమైన పల్లె వీరుడిని తెర పైకి తెచ్చింది.
ఈ గ్రామంలోనే వీర్ నారాయణ్ సింగ్ బ్రిటీష్ వారిని ఎదిరించి నిలిచారు.
1850లలో కరువు అంచుల దాకా వచ్చిన దీన స్థితి ఈ విప్లవానికి దారి తీసింది. ప్రజల దైనందిన జీవనం మరింత కష్టతరం కావడంతో సోనాఖాన్‌లోని నారాయణ్ సింగ్, ఆ ప్రాంతపు భూస్వాములను ధిక్కరించి నిలిచాడు. దాదాపు అంతా గిరిజనులే నివసించే ఈ గ్రామంలో అత్యంత వృద్ధుడైన చరణ్ సింగ్, "అతను ఎన్నడూ దాన ధర్మాలను కోరలేదు" అని చెప్పారు. నారాయణ్ సింగ్ మీద ఇతనికి మాత్రమే కాస్తంత సదభిప్రాయం ఉందనిపిస్తోంది.
"ప్రజల కోసం గోడౌన్లను తెరిచి, అందులోని ధాన్యాన్ని పంచి పేదల ఆకలి తీర్చమని అతను వ్యాపారులను, భూస్వాములను కోరాడు." కరువు కాటకాల సమయాలలో ఎప్పుడూ జరిగే లాగానే, అప్పుడు కూడా గోడౌన్లలో ధాన్యం నిండుగా ఉండింది. " ప్రజలకు తొలి పంట చేతికి అందగానే, తీసుకున్న ధాన్యాన్ని వారు తిరిగి ఇచ్చేస్తారని చెప్పాడు. దానికీ భూస్వాములు ఒప్పుకోకపోవడంతో పేద ప్రజలకు తోడుగా దండెత్తి, ధాన్యాన్ని జప్తు చేసుకుని అందరికీ పంచేలా నాయకత్వం వహించాడు.”అలా మొదలైన పోరాటం చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించి, అన్ని చోట్లా గిరిజనులు తమను అణిచివేచేస్తోన్న వర్గాలపై తిరుగుబాటు చేశారు.








