“ఈ పిటీషన్లన్నీ వెనక్కు తీసుకుని చింపేయండి," అని చమరు అన్నారు. "ఇవి చెల్లవు. ఈ కోర్టు వాటిని అంగీకరించదు."

మెజిస్ట్రేట్ పనిని ఆయన కొద్ది కొద్దిగా ఇష్టపడటం మొదలుపెట్టారు.

అది 1942వ సంవత్సరపు ఆగస్ట్ నెల. దాదాపు దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. సంబాల్పూర్‌లోని ఈ కోర్టు అయితే నిశ్చయంగా కల్లోలంలో ఉంది. చమరు పరిద, ఆయన కామ్రేడ్లతో కలిసి ఆ కోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దానికి జడ్జ్‌గా తనను తానే ప్రకటించుకున్నారు. ఆయన కింద 'ఆర్డర్లీ'గా జితేంద్ర ప్రధాన్‌ను నియమించుకున్నారు. ఆ కోర్టు (పేష్‌కర్) క్లర్క్‌గా ఉండాలని పూర్ణచంద్ర ప్రధాన్ ఎంచుకున్నారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా వారందరూ ఇలా కోర్టును ఆక్రమించారు.

కోర్టులో హాజరై ఆశ్చర్యపోతున్న ప్రజలను ఉద్దేశించి చమరు ఇలా అన్నారు - "ఈ పిటీషన్లన్నీ బ్రిటీష్ రాజ్యాన్ని సంబోధిస్తూ దాఖలు చేసినవి. ఇప్పుడు మనందరం స్వతంత్ర భారతదేశంలోకి ప్రవేశించాం. ఈ కేసులను పరిగణించాలంటే వీటిని వెనక్కు తీసుకోండి. పిటీషన్లను మార్చి, మహాత్మా గాంధీ గారిని సంబోధిస్తూ తయారు చేయండి. అప్పుడు మేము వాటిని పరిగణిస్తాము."

అరవై ఏళ్ల తర్వాత, దాదాపు అదే తారీఖున చమరు ఆ గాథను ఎంతో ఉత్సాహంతో మాకు చెప్పారు. ఆయన వయసు ఇప్పుడు 91 సంవత్సరాలు. జితేంద్ర (81) ఆయన పక్కన కూర్చుని ఉన్నారు. పూర్ణచంద్ర మరణించారు. ఇప్పటికీ వారందరూ ఒడిషాలోని బార్‌ఘడ్ జిల్లాలోని పనిమారా గ్రామంలో నివసిస్తున్నారు. స్వాతంత్ర సమరం జోరుగా సాగిన సమయంలో ఈ గ్రామానికి చెందిన ఎందరో యువకులు, యువతులు అందులో పాల్గొన్నారు. 1942లో ఈ గ్రామానికే చెందిన 32 మంది జైలుకు వెళ్లారని రికార్డులు చెబుతున్నాయి. వారిలో కొందరైన చమరు మరియు జితేంద్ర ఇంకా సజీవంగా ఉన్నారు.

ఒకానొక సమయంలో, ఈ గ్రామానికి చెందిన ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక సత్యాగ్రాహి స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారిని బెంబేలెత్తించిన గ్రామం ఇది. ఈ గ్రామంలోని ప్రజల ఐకమత్యాన్ని ఎవ్వరూ విడగొట్టలేకపోయారు. వారి సంకల్పం గురించి ఎన్నో ఊళ్లలో కథలుగా చెప్పుకునే వారు. బ్రిటీష్ రాజ్యాన్ని ఎదురించిన వారు పేదలు, నిరక్షరాస్యులైన రైతు కూలీలు. రోజువారీ జీవితాన్ని అతికష్టం మీద నెగ్గుకొస్తోన్న చిన్నకారు రైతులు. చాలా మంది ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతున్నారు.

చరిత్ర పుస్తకాలలో వారి పేరు కనబడకపోవచ్చు. చివరికి ఒడిషా రాష్ట్ర వాసులే వారిని మరచిపోవచ్చు. బార్‌ఘడ్‌లో మాత్రం, దీనిని స్వేచ్ఛా గ్రామంగానే పిలుస్తారు. స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్లలో ఎవ్వరికీ స్వలాభం చేకూరలేదు. రివార్డులు, పోస్టులు గానీ ఏ ఇతర వృత్తిపరమైన లాభమూ అందలేదు. అయినా వాళ్లు ఎంతో ప్రమాదాలను ఎదుర్కొన్నారు, భారత స్వతంత్రం పోరాడారు.

వీళ్లంతా స్వతంత్ర పోరాటంలో క్షేత్ర స్థాయిలో పోరాడిన సైనికులు. అది కూడా చెప్పుల్లేకుండా. ఇక్కడి వారెవ్వరూ ఎన్నడూ చెప్పులు వేసుకున్న పాపాన పోలేదు.

Seated left to right: Dayanidhi Nayak, 81, Chamuru Parida, 91, Jitendra Pradhan, 81, and (behind) Madan Bhoi, 80, four of seven freedom fighters of Panimara village still alive
PHOTO • P. Sainath

ఎడమ నుండి కుడికి, కూర్చుని ఉన్న వారు: దయానిధి నాయక్ (81), చమురు పరిదా (91) మరియు జితేంద్ర ప్రధాన్ (81). (వెనుక) మదన్ భోయి (80). పనిమారా గ్రామానికి చెందిన ఏడుగురు స్వాతంత్ర సమర యోధులలో నలుగురు ఇంకా బ్రతికే ఉన్నారు

“కోర్టులోని పోలీసులు ఆశ్చర్యపోయారు,” అని చమరు నవ్వారు. "ఏం చేయాలో వాళ్లకు అస్సలు అర్థం కాలేదు. వాళ్లు మమ్మల్ని అరెస్ట్ చేయబోతుంటే నేను వాళ్లతో ఇలా అన్నాను - 'ఇక్కడి మెజిస్ట్రేట్‌ను నేను. మీరు నా ఆదేశాన్ని అనుసరించాలి. మీరు భారతీయులైతే నన్ను అనుసరించండి. మీరు బ్రిటీష్ వారైతే, తిరిగి మీ దేశానికి వెళ్లిపోండి’.”

అప్పుడు పోలీసులు అసలైన మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్లారు. "ఆ మెజిస్ట్రేట్ మమ్మల్ని అరెస్ట్ చేసే ఆర్డర్ల మీద సంతకం పెట్టడానికి నిరాకరించారు, ఎందుకంటే పోలీసుల వారెంట్ల మీద పేర్లే లేవు," అని జితేంద్ర ప్రధాన్ చెప్పారు. "అప్పుడు పోలీసులు తిరిగి వచ్చి మా పేర్లు అడిగారు. అయితే మేమెవరమో చెప్పడానికి నిరాకరించాము."

ఏం చేయాలో తోచని పోలీసు యంత్రాంగం సంబల్పూర్ కలెక్టర్ వద్దకు వెళ్లారు. "ఇదంతా వేళాకోళంగా అనిపించి, ఆయనకు విసుగొచ్చి వాళ్లతో ఇలా చెప్పారు, `ఊరికే ఏవో ఒక పేర్లు పెట్టండి. వాళ్లకు A, B మరియు C అనే పేర్లు పెట్టి ఆ ఫారాలు అలాగే నింపండి’. దాంతో పోలీసులు అదే చేశారు, మమ్మల్ని నేరస్థులు A, B మరియు Cగా అరెస్ట్ చేశారు," అని చమరు చెప్పారు.

అక్కడితో పోలీసుల అగచాట్లు ఆగలేదు. "జైలు వద్ద, వార్డెన్ మమ్మల్నిలోపలికి అనుమతించలేదు," అని చమరు నవ్వుతూ చెప్పసాగారు, "ఆయనకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. వార్డెన్ వాళ్లను ఇలా ప్రశ్నించారు: నేను మీ కళ్లకు ఒక వెధవ లాగా కనబడుతున్నానా? రేపు గనక ఒకవేళ వీళ్లు తప్పించుకుని పారిపోతే పరిస్థితి ఏంటి? A, B మరియు C పారిపోయారు అని నేను రిపోర్ట్ చేయమంటారా? అప్పుడు సుద్ద వెధవలాగా కనబడతాను’. ఆయన మంకుపట్టు పట్టాడు.”

కొన్ని గంటల పాటు వాగ్వాదం జరిగిన తర్వాత, ఖైదీలను లోనికి అనుమతించేలా పోలీసులు జైలు భద్రతా అధికారులను ఒప్పించగలిగారు. "మమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టే సమయానికి ఈ చమత్కారం తారాస్థాయికి చేరుకుంది," అని జితేంద్ర చెప్పారు. "అక్కడి ఆర్డర్లీ ఇబ్బందికరంగానే, ఇలా అరిచి పిలవాల్సి వచ్చింది: A ముందుకు రావాలి! B, ముందుకు రావాలి! C, ముందుకు రావాలి!. ఆ తర్వాతే కోర్టు మా కేసును విచారించింది."

పరిస్థితిలోకి తోసినందుకు వారిపై బ్రిటీష్ ప్రభుత్వం కక్షగట్టింది. వారికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించి నేరస్థులు ఉండే జైలుకు బదిలీ చేశారు. "మామూలుగా అయితే, రాజకీయ ఖైదీలు ఉండే జైళ్లకు మమ్మల్ని పంపేవారు," అని చమరు చెప్పసాగారు. "కానీ అప్పటికి స్వాతంత్ర సమరం పతాక స్థాయిలో జరుగుతోంది. ఆ మాట అలా ఉన్నా, పోలీసులు ఎన్నటికీ హింసాత్మకంగా, కక్షపూరిత బుద్ధితోనే వ్యవహరించేవారు.

"అప్పట్లో మహానది మీదుగా వంతెన ఉండేది కాదు. మమ్మల్ని ఒక పడవలో తీసుకెళ్లాల్సి వచ్చింది. మేమే స్వయంగా వెళ్లి లొంగిపోవడం వల్లే అరెస్ట్ అయ్యామనీ, మాకు తప్పించుకు వెళ్లే ఉద్దేశం లేదనీ వాళ్లకు తెలుసు. అయినా కూడా మా చేతులు కట్టేసి, మమ్మల్ని ఒకరినొకరితో కట్టేశారు. ఒకవేళ పడవ అదుపుతప్పి మునిగిపోతే - అలా చాలా సార్లు జరిగింది కూడా - మేము ఏమీ చేయలేము. మేమంతా చనిపోయేవాళ్లం.

"పోలీసులు మా కుటుంబ సభ్యులనూ వదలకుండా పీడించారు. ఒకసారి, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు రూ. 30 జరిమానా విధించారు. అప్పట్లో ఒక రోజంతా పని చేస్తే రెండు అణాల విలువైన ధాన్యం మాత్రమే సంపాదన ఉండేది కాబట్టి ఆ జరిమానా చాలా పెద్ద మొత్తం. ఆ జరిమానా వసూలు చేయడానికి మా అమ్మ దగ్గరికి వెళ్లారు. కట్టకపోతే నా జైలు శిక్ష ఇంకా పొడిగిస్తామని బెదిరించారు.

The stambh or pillar honouring the 32 ‘officially recorded’ freedom fighters of Panimara
PHOTO • P. Sainath

‘అధికారిక లెక్కల్లో గుర్తించబడిన’ 32 మంది పనిమారా స్వాతంత్ర సమర యోధుల స్మృతిగా నిర్మించిన స్థూపం

"మా అమ్మ ఇలా బదులిచ్చింది: ‘వాడు నాకొక్కదానికే కొడుకు కాదు; ఈ ఊరికే బిడ్డ. నా మీద కన్నా ఈ ఊరి మీదే వాడికి మక్కువ ఎక్కువ’. అయినా వాళ్లు బలవంత పెట్టడం ఆపలేదు. అప్పుడు ఆమె చెప్పింది: `ఈ గ్రామంలోని యువకులందరూ నా బిడ్డలే. జైల్లో ఉన్న వాళ్లందరి తరఫునా నేనే జరిమానా కట్టాలా?'"

అప్పటికి పోలీసులు విసుగెత్తిపోయారు. "అప్పుడు వాళ్లు మా అమ్మతో ఇలా అన్నారు: సరే, మాకు ఏదైనా ఇవ్వండి, కొడవలి లాంటిది. కనీసం, దానినైనా తనిఖీలో భాగంగా జప్తు చేసుకున్నాం అని రాసుకుంటాం’. అందుకు మా అమ్మ తాపీగా `మా దగ్గర కొడవలి లేదు’ అని చెప్పింది. అలా బదులిచ్చి, పేడ నీళ్లు చేతిలోకి తీసుకుని వాళ్లు నిలబడిన చోటిని పరిశుద్ధం చేయబోతున్నానని, వాళ్లను బయలుదేరమని తెగేసి చెప్పింది". ఆ దెబ్బకు వాళ్లు వెళ్లిపోయారు.

* * *

ఒకవైపు కోర్టులో చమత్కారం నడుస్తూ ఉండగా, మరోవైపు పనిమారాలోని రెండవ దళం సత్యాగ్రాహులు తమ పనిలో మునిగిపోయారు. "సంబాల్పూర్ మార్కెట్‌ను ఆధీనంలోకి తెచ్చుకుని అందులో బ్రిటీష్ వారి వస్తువులను నాశనం చేయడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాం," అని దయానిధి నాయక్ చెప్పారు. ఆయన చమరు మేనల్లుడు, "మా అమ్మ పురిట్లోనే చనిపోవడంతో చమరు మావయ్య నన్ను పెంచి పెద్ద చేశారు, నేను ఆయనను ఒక నాయకుడిలా గౌరవిస్తాను."

దయానిధి కూడా బ్రిటీష్ ప్రభుత్వాన్ని తొలిసారి ధిక్కరించినప్పుడు ఆయన వయస్సు కేవలం 11 ఏళ్లే. 1942 నాటికి ఆయనకు 21 ఏళ్లు వచ్చేసరికి, బాగా అనుభవుజ్ఞుడైన వీరుడిగా మారిపోయారు. ఈ రోజు 81 ఏళ్ల వయసొచ్చినా, ఆనాటి సంఘటనలన్నీ గుర్తుంచుకుని పూస గుచ్చినట్టు వివరించగలుగుతున్నారు.

"బ్రిటీష్ వారిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండింది. మమ్మల్ని అణిచివేయాలనే ప్ర యత్నాలన్నీ బెడిసికొట్టి మా సంకల్పాన్ని ఇంకా దృఢపరిచాయి. కేవలం మమ్మల్ని భయపెట్టడానికే పలు మార్లు ఈ గ్రామం చుట్టూ సాయుధ దళాలను మోహరించి, వారి జెండాతో మార్చ్‌లను నిర్వహించారు. కానీ అవేవీ ప్రభావం చూపలేదు.

"దాదాపు అన్ని వర్గాల ప్రజలలో బ్రిటీష్ వారిపై వ్యతిరేకత ఏర్పడింది. భూమి లేని కార్మికుల నుండి స్కూల్ టీచర్ల వరకు. టీచర్లు కూడా ఉద్యమానికి మద్దతు పలికారు. వాళ్లు రాజీనామా చేయలేదు, అలాగని విధులనూ నిర్వర్తించలేదు. దాని వెనుక ఒక గమ్మత్తైన కారణం కూడా చెప్పుకొచ్చారు: `రాజీనామాలను సమర్పించడం ఎలా వీలవుతుంది? మేము అసలు బ్రిటీష్ ప్రభుత్వాన్నే గుర్తించడం లేదు.’ అలా విధులను బహిష్కరించడం కొనసాగించారు!

"ఆ రోజులలో మా గ్రామం ఇప్పటి కంటే కూడా మారు మూల ఉండేది. అరెస్టులు, పోలీసుల తనిఖీల వల్ల ఏకబిగిన కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు మా గ్రామానికి రాలేకపోయేవారు. అలాంటి సమయాల్లో బయటి ప్రపంచం గురించిన సంగతులేవీ మాకు తెలిసేవి కాదు. 1942 ఆగస్టులో పరిస్థితి అలానే ఉండేది." దాంతో, అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి గ్రామం తరఫున కొందరు ప్రజలు బయటికి వెళ్లేవారు. "అలా వెళ్లడం వల్లే, పోరాటంలో ఈ ఘట్టం మొదలైంది. అలా నేను రెండవ దళంలో చేరాను.

"మా గ్రూపులో ఉన్న అయిదుగురూ చిన్న వయసు వాళ్లే. మొదట మేము సంబాల్‌పూర్‌లోని కాంగ్రెస్ నాయకుడు ఫకీరా బెహెరా గారి ఇంటికి వెళ్లాం. మాకు పూలతో పాటు చేతి కంకణాలను ఇచ్చారు, వాటి మీద 'డూ ఆర్ డై' (విజయం సాధించాలి లేదా మరణించాలి) అనే నినాదం ఉండింది. మేము మార్కెట్‌కు మార్చ్‌లో భాగంగా వెళ్లగా, స్కూలు పిల్లలు, ఇతరులు పరిగెడుతూ మాతో కలిసి వచ్చారు.

"మార్కెట్ వద్ద, క్విట్ ఇండియా ఉద్యమ నినాదాన్ని నినాదించాము. ఆ వెంటనే 30కి పైగా సాయుధ దళ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు.

"ఇక్కడ కూడా, ఎంతో గందరగోళం ఏర్పడి, మాలో కొందరిని వెంటనే వదిలేశారు."

ఎందుకు?

At the temple, the last living fighters in Panimara
PHOTO • P. Sainath

పనిమారాలో ఇంకా జీవించి ఉన్న స్వాతంత్ర సమరయోధులు గుడి వద్ద కూర్చుని ఉన్నారు

"ఎందుకంటే, 11 ఏళ్ల పిల్లలను కూడా అరెస్ట్ చేసి బంధించడం కనీ వినీ ఎరుగని వింత కాబట్టి. అందువల్ల, 12 ఏళ్ల లోపు వయసున్న మా లాంటి వాళ్లను వదిలేశారు. అయితే జుగేశ్వర్ జీనా మరియు ఇందర్జిత్ ప్రధాన్ అనే చిన్న పిల్లలు మాత్రం వెళ్లమని మారాం చేశారు. గ్రూపుతో పాటే ఉంటామని అడిగారు, వాళ్లకు నచ్చజెప్పి పంపించాల్సి వచ్చింది. ఆ తర్వాత మిగితా వాళ్లను బార్‌ఘడ్ జైలుకు తరలించారు. అక్కడ నేను, దిబ్య సుందర్ సాహు, ప్రభాకర సాహు 9 నెలల శిక్ష అనుభవించాము."

* * *

80 ఏళ్ల వయసున్న మధన్ భోయి స్పష్టమైన గొంతుతో ఇంకా చక్కగా పాడగలుగుతున్నారు. "సంబల్పూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయానికి మేము మార్చ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మా గ్రామానికి చెందిన మూడవ దళం పాడిన పాట అది." దేశ ద్రోహ చర్యల నిలయంగా ఆ కార్యాలయంపై ముద్ర వేసి, బ్రిటీష్ ప్రభుత్వం ఆ కార్యాలయాన్ని మూసివేసింది.

మూడవ స్క్వాడ్ లక్ష్యం: మూసివేయబడిన కాంగ్రెస్ కార్యాలయానికి స్వేచ్ఛను ప్రసాదించడం.

"నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు. మా మావయ్య, అత్తయ్యల దగ్గర నేను పెరిగినా, వాళ్లు నాపై శ్రద్ధ చూపేవారు కాదు. నేను కాంగ్రెస్ మీటింగ్‌లకు హాజరు కావడం చూసి వాళ్లు ఆందోళనపడ్డారు. నేను సత్యాగ్రాహీలతో కలిసి పోరాటంలో చేరడానికి ప్రయత్నించినప్పుడు, నన్ను ఒక గదిలో బంధించారు. అప్పుడు నేను పశ్చాత్తాపపడి మారిపోయినట్టు నటించాను. వాళ్లు నన్ను బయటకు రానిచ్చారు. పొలం పనికి వెళుతున్నట్టుగా గడ్డ పార, గంప మొదలైన సామాగ్రితో సహా బయటికి వచ్చాను. పొలాల నుండి నేరుగా బార్‌ఘడ్ సత్యాగ్రహానికి వెళ్లిపోయాను. అక్కడ మా గ్రామం నుండి వచ్చిన 13 మంది ఇతరులతో కలిసి సంబాల్పూర్‌కు వెళ్లే మార్చ్‌లో పాల్గొడానికి సిద్ధమయ్యాను. వేసుకోవడానికి ఖాదీ సరికదా, అసలు చొక్కానే లేదు. గాంధీ గారు ఆగస్ట్ 9న అరెస్ట్ అయినప్పటికీ, ఆ వార్త ఈ గ్రామానికి చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. అప్పుడే నిరసనకారులను మూడు లేదా నాలుగు దళాలుగా సంబాల్పుర్‌కు పంపే ఆలోచన వచ్చింది.

"మొదటి దళాన్ని ఆగస్ట్ 22న అరెస్ట్ చేశారు. మమ్మల్ని ఆగస్ట్ 23న అరెస్ట్ చేశారు. పోలీసులు మమ్మల్ని అసలు కోర్టుకే తీసుకు వెళ్లలేదు ఎందుకంటే చమరు, అతని స్నేహితులు కలిసి చేసిన చమత్కారం మళ్లీ జరుగుతుందేమోనని వాళ్లలో భయం కలిగింది. అసలు కాంగ్రెస్ ఆఫీస్ వరకు కూడా మమ్మల్ని వెళ్లనివ్వలేదు. నేరుగా జైలుకే తరలించారు."

దాంతో పనిమారాకు చెడ్డ పేరు వచ్చింది. "మా గురించి అన్ని చోట్లా తెలిసి వచ్చింది, మమ్మల్ని బద్మాష్ గ్రామం అని పిలిచారు" అని భోయి కొంత గర్వంతో చెప్పారు.

ఫోటోలు: పి. సాయినాథ్

ఈ వార్తా కథనం ది హిందూ సండే మ్యాగజైన్‌లో 2002 అక్టోబరు 20న మొదట ప్రచురితమైంది.

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు. :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2

లక్ష్మి పాండా ఆఖరి పోరాటం

తొమ్మిది దశాబ్దాల అహింస

షేర్పూర్ : గొప్ప త్యాగం, గుర్తులేని జ్ఞాపకం

గోదావరి: దాడి కై ఎదురుచూస్తున్న పోలీసులు

కలియస్సేరి :  సుముకన్ కోసం వెతికే ఒక ప్రయత్నం

కల్లియస్సేరి : యాభైల్లో కూడా వీడని పోరాటం

అనువాదం : శ్రీ రఘునాథ్ జోషి

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

کے ذریعہ دیگر اسٹوریز Sri Raghunath Joshi