“ఇంత వరకు నేనేదీ కోరలేదు,” అని ఆవిడ చెప్పారు. “నా దేశం కోసం పోరాడాను, రివార్డ్ కోసం కాదు. నా కుటుంబ సభ్యుల కోసం కూడా ఏమీ కోరలేదు. కానీ ఇప్పుడు, నా జీవితపు ఆఖరి దశలోనైనా నా పోరాటానికి గుర్తింపు వస్తుందనే ఆశతో ఉన్నాను.”
అనారోగ్యానికి పేదరికం తోడవడంతో కొన్నేళ్ల క్రితం ఆమె స్థితి దయనీయంగా మారింది. అప్పుడే, జెయ్‌పోర్‌కు చెందిన పరేశ్ రథ్ అనే ఒక యువ విలేకరి ఆమె గురించి ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు. అంతే కాక, తన సొంత ఖర్చుతో ఆమెను మురికివాడ నుండి సింగిల్ రూమ్ ఇంటికి షిఫ్ట్ చేసి, వైద్య ఖర్చులను కూడా భరించారు. ఇటీవలే పాండా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తన కుమారుడి అలవాట్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి అతని ఇంట్లోనే బస చేస్తున్నారు. రథ్ ప్రచురించిన వార్త తర్వాత మరిన్ని వార్తా కథనాలు ఆమె గురించి వచ్చాయి. ఒకసారి ఒక జాతీయ పత్రిక కవర్ పేజీపై కూడా ఆమె వార్తను ప్రచురించారు.
“మేము మొదటి వార్తా కథనాన్ని ప్రచురించినప్పుడు, ఆమెకు కొంత సాయం అందింది,” అని రథ్ చెప్పారు. “అప్పటి కొరాపుత్ కలెక్టర్ అయిన ఉషా పధీ ఆమెపై సానుభూతి కనబర్చి, వైద్య సహాయంగా రెడ్ క్రాస్ ఫండ్ నుండి రూ. 10 వేలను మంజూరు చేశారు. దాంతో పాటు కొంత ప్రభుత్వ భూమిని కూడా కేటాయిస్తామని మాటిచ్చారు. కానీ పధీ గారు ట్రాన్స్‌ఫర్ అయ్యి జిల్లాను వీడి వెళ్లిపోయారు. బెంగాల్ నుండి కొందరు ప్రజలు కూడా ఆమెకు విరాళాలను పంపారు.” అయితే, కొంత కాలం తర్వాత అవి కూడా అడుగంటి పోయి ఆమె పరిస్థితి యథాతథం అయ్యింది. “అయినా కూడా, ఇక్కడ విషయం కేవలం డబ్బు మాత్రమే కాదు,” అని రథ్ వివరించారు. “ఆమెకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసినా, ఈ వయసులో ఇంకెన్నేళ్లు దానిని ఆమె ఉపయోగించుకోగలదు? నిజానికి ఆ పెన్షన్ అనేది ఆమెకు అందాల్సిన గుర్తింపు, గౌరవం అని ఆవిడ భావిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రమూ స్పందించలేదు.”
విసిగి వేసారేంతగా ఎన్నో సార్లు ప్రయత్నించిన మీదట, గత సంవత్సరం చివర్లో లక్ష్మి గారికి ఈ జిల్లాలో పాంజియాగూడ గ్రామంలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ భూమిపై ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉన్నారు. ప్రస్తుతానికి, ఆమె పాత గదికి పక్కన ఉన్న గదిని మెరుగుపరిచేందుకు రథ్ నగదు సాయం చేశారు, త్వరలోనే ఆమెను ఆ గదిలోకి షిఫ్ట్ చేద్దామని ఆశిస్తున్నారు.
ఇప్పుడు స్థానికంగా ఆమెకు కాస్త పేరు వచ్చింది. ఆమెకు సాయం చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. “రేపు, ఇక్కడి దీప్తి స్కూల్‌లో జాతీయ జెండాను ఎగరవేయబోతున్నాను. వాళ్లే నన్ను పిలిచి అడిగారు” అని ఆమె గర్వంతో చెప్పారు, అయితే “ఫంక్షన్‌కు వేసుకు వెళ్లడానికి ఒక మంచి చీర” లేదని ఆందోళన చెందుతున్నారు.
మరో వైపు, ఈ INA వృద్ధ సైనికురాలు తన తర్వాతి పోరాటాన్ని ప్లాన్ చేస్తున్నారు. “'చలో ఢిల్లీ’ అని నేతాజీ నినాదాన్ని ఇచ్చారు. ఆగస్ట్ 15 తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నన్ను స్వాతంత్ర సమరయోధురాలిగా గుర్తించకపోతే అదే చేస్తాను. పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాను,” అని ఆ వృద్ధ మహిళ చెప్పారు. “చలో ఢిల్లీ, అదే చేస్తాను.”
ఆమె అలానే నడుస్తూ ఉంటుంది, ఆరు దశాబ్దాలు ఆలస్యమైనా సరే ఆమె మనసులో ఆశ చావలేదు. ఆమె పాడే పాట లాగా, “ఒక్కో అడుగేస్తూ ముందుకు సాగుదాం …”
ఫోటోలు: పి. సాయినాథ్