లక్ష్మీబాయి కాలే ప్రతి సంవత్సరం తన పంటలో కొంత భాగాన్ని కోల్పోతోంది. అయితే ఆమెకు వచ్చే నష్టం అధిక వర్షపాతం లేదా కరువు లేదా నాసిరకం వ్యవసాయ పద్ధతుల వల్ల కాదు. “పంచాయతీ, జంతువులను మా భూమిపై మేపడానికి అనుమతిస్తుంది. ఇందువలన మేము లెక్కలేనన్ని నష్టాలను అనుభవించాము.” అన్నది 60 ఏళ్ల లక్ష్మీబాయి.
లక్ష్మీబాయి, ఆమె భర్త వామన్ మూడు దశాబ్దాలుగా నాసిక్ జిల్లాలోని మొహదీ గ్రామంలో ఐదు ఎకరాల స్థలాన్నిసాగుచేస్తున్నారు. అయితే గైరాన్ - ప్రభుత్వ నియంత్రణలో ఉన్న గ్రామ కామన్స్‌లో వీరి భూమి- పచ్చిక భూమిగా ఉపయోగించబడుతుంది. ఆ దంపతులేమో అక్కడ కంది, సజ్జలు, జొన్న,వరిని పెంచుతారు. "తమ పశువులను మా భూమిలో మేపడానికి అనుమతించకపోతే గ్రామస్తులు మాపై కేసు పెడతారని పంచాయతీ సభ్యులు అంటున్నారు" అని ఆమె చెప్పారు.
లక్ష్మీబాయితో పాటు దిండోరి తాలూకాలోని ఆమె గ్రామానికి చెందిన ఇతర రైతులు 1992 నుండి తమ భూ హక్కుల కోసం పోరాడుతున్నారు. “మూడు తరాలుగా ఈ భూమిని మా కుటుంబం సాగు చేస్తోంది. కాని మేము ఈ భూమిని మా స్వంతం అని చెప్పుకోలేకున్నాము,” అని ఆమె అన్నారు. "2002 లో, మేము మా భూమి హక్కుల కోసం సత్యాగ్రహాన్ని, ‘జైల్ భరో ఆందోళన్’ ని చేసాము." ఆ సమయంలో, దాదాపు 1,500 మంది రైతులు, వారిలో ఎక్కువ మంది మహిళలు నాసిక్ సెంట్రల్ జైలులో 17 రోజులు గడిపినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.
మహారాష్ట్రలో ఇతర వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చబడిన లోహర్ కులానికి చెందిన, భూమి పట్టా లేని లక్ష్మీబాయికి - పంటనష్టాన్ని భరించడానికి ఎటువంటి సహాయం లేదు." భూమి మా పేరున లేనందున, మాకు [పంట] రుణాలు లేదా భీమా లభించవు" అని ఆమె చెప్పారు. అందుకని ఆమె వ్యవసాయ కూలీగా రోజుకు రెండుసార్లు ఎనిమిది గంటల షిఫ్టులు పనిచేసి పంట నష్టాలను తట్టుకుంటుంది.
భిల్ జాతికి చెందిన ఆదివాసీ రైతు, వితంతువు అయిన విజబాయి గంగూర్డే (55) ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఆమె మొహదీలోని తన భూమికి దూరంగా జీవించలేదు. "నా రెండు ఎకరాల భూమిలో ఎనిమిది గంటలు పనిచేసిన తరువాత, నేను మరో ఎనిమిది గంటలు [వేరొకరి భూమిలో] వ్యవసాయ కూలీగా పని చేస్తాను" అని విజబాయి చెప్పారు, ఈమె తన రోజును ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి, రెండు షిఫ్టులుగా తన పొలంలోనూ వేరొకరి పొలంలోను పనిచేస్తుంది.
"కానీ నేను ఎప్పుడూ షావుకార్ల నుండి అప్పులు తీసుకోలేదు" అని ఆమె తెలిపింది. "షావుకార్లు వారు రుణం తీసుకున్న ప్రతి 100 రూపాయలకు 10 రూపాయల వడ్డీని వసూలు చేస్తారు, అది నెలాఖరులోగా తిరిగి చెల్లించాలి." లక్ష్మీబాయి కూడా ప్రైవేట్ రుణదాతల నుండి దూరంగా ఉంటారు. "షావుకార్లు సమీప గ్రామాలలో వితంతువులను వేధించారు," అని ఆమె చెప్పారు.








