విరిగిన చేయికి తగిలించి ఉన్న కట్టుతాడు(స్లింగ్) నారాయణ్ గైక్వాడ్‌ను ఇబ్బంది పెడుతోంది. ఆయన దాన్ని తీసేసి, తలపై ఉన్న టోపీని సర్దుకుని తన నీలిరంగు డైరీ, పెన్ను కోసం వెతికారు. ఆయన తొందరలో ఉన్నారు.
మాఝ నావ్ నారాయణ్ గైక్వాడ్. మీ కొల్హాపురాతన ఆలోయ్. తుమ్హీ కుఠన్ ఆలాయ్? (నా పేరు నారాయణ్ గైక్వాడ్. నేను కొల్హాపుర్ నుంచి వచ్చాను. మీరెక్కడి నుంచి వచ్చారు?) కొల్హాపుర్, జాంభళీ గ్రామానికి చెందిన 73 ఏళ్ళ ఆ రైతు అడిగారు.
దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మండుతోన్న సూర్యుని నుండి రక్షణ కోసం ఒక గుడారంలో ఆశ్రయం పొందుతోన్న అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన ఆదివాసీ సాగుదారుల బృందానికి ఆయన తన ఈ ప్రశ్నను సంధించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 24-26 తేదీల్లో అక్కడ సమావేశమై ఉన్న మహారాష్ట్రలోని 21 జిల్లాలకు చెందిన రైతులలో వీరు కూడా భాగమే. శిరోల్ తాలూకాలోని తన గ్రామంలో నారాయణ్‌కు మూడు ఎకరాల భూమి ఉంది. ఆయన అక్కడి నుండి దాదాపు 400 కిలోమీటర్ల దూరం తన గాయపడిన చేతితోనే ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నారు.
తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత నారాయణ్ తాను, ఇతర రైతులు తమ తమ గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పడం ప్రారంభించారు. "నేను రైతును. అందుకే ఈ సమస్యలతో నాకూ సంబంధం ఉంటుంది," అని జనవరి 25న మేం కలుసుకున్నప్పుడు ఆయన నాతో అన్నారు. ఆయన తన విరిగిన కుడి చేతితోనే మరాఠీలో నోట్స్ తయారుచేసుకుంటున్నారు. ఈ రకంగా విరిగిన చేతిని కదిలించడం బాధ కలిగిస్తున్నప్పటికీ, "రైతుల, వ్యవసాయ కూలీల పోరాటాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే నేను వారి సమస్యలను వింటాను," అని ఆయన అన్నారు.
తాను ఆజాద్ మైదాన్‌లో 10 జిల్లాలకు చెందిన 20 మందికి పైగా రైతులతో మాట్లాడినట్లు ఆయన తర్వాత నాతో అన్నారు.
జనవరి మొదటి వారంలో పొలంలో పనిచేసుకుంటోన్న నారాయణ్‌పై కొబ్బరి మట్ట పడడంతో ఆయన చేతికి దెబ్బ తగిలింది. ఆయన చెరకు, జ్వారీ (జొన్న) పంటలు పండిస్తున్నారు; రసాయన ఎరువులు వాడకుండా కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఆయన తనకు తగిలిన దెబ్బను గురించి మొదట్లో పట్టించుకోలేదు, కానీ ఒక వారం తర్వాత కూడా నొప్పి తగ్గకపోవడంతో జాంభళీలోని ఒక ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లారు. “డాక్టర్ పరీక్ష చేసి చెయ్యి బెణికిందని చెప్పాడు. అతను నన్ను పట్టీ (గుడ్డ కట్టు) వేసుకోమని చెప్పాడు,” అన్నారాయన.








