తన ముందు పరచివున్న వివిధ రకాల తోలుబొమ్మలను చూస్తూ,"మాకివి కేవలం తోలుతో చేసిన వస్తువులు కావు. అవి మాకు దేవతలూ దేవుళ్ళూ, దివ్య శక్తుల అవతారాలు," అన్నారు రామచంద్ర పులవర్. అతనిముందున్న సంక్లిష్టమైన నైపుణ్యంతో చేసిన ఆ బొమ్మలను తోల్పావకూత్తు తోలుబొమ్మలాటలో ఉపయోగిస్తారు. ఈ తోలుబొమ్మలాట కేరళలోని మలబారు దక్షిణ కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన రంగస్థల రూపం.
సంప్రదాయకంగా ఈ బొమ్మలను చక్కిలియన్ వంటి కొన్ని ప్రత్యేక సముదాయాలకు చెందినవారు తయారుచేస్తారు. ఈ కళా రూపానికున్న ప్రజాదరణ క్రమేపీ సన్నగిల్లిపోవడంతో, ఈ సముదాయానికి చెందిన సభ్యులు ఎటేటో వెళ్ళిపోయారు. ఈ కళను బతికించి ఉంచేందుకు కృష్ణన్కుట్టి పులవర్ తోలుబొమ్మల తయారీ కళను బోధించే లక్ష్యాన్ని చేపట్టారు. ఆయన కొడుకైన రామచంద్ర మరొక అడుగు ముందుకువేసి, తమ ఇంటిలోనివారికే కాక ఇరుగుపొరుగు మహిళలకు కూడా ఈ తోలుబొమ్మల తయారీ కళలో శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు. సంప్రదాయకంగా దేవాలయ ప్రాంగణాలలో పనిచేసే పురుషులకే పరిమితం చేసిన ఈ రంగంలో రాజలక్ష్మి, రజిత, అశ్వతి ప్రస్తుతం తోలుబొమ్మలను తయారుచేసే మహిళా కళాకారులు.
ఈ బొమ్మలను తయారుచేసేవారే కాక, ఈ ప్రదర్శనలను చూడటానికి వచ్చేవారు కూడా ఈ బొమ్మలను దేవతా సంబంధమైనవిగా పరిగణిస్తారు. వీటిని గేదెల, మేకల చర్మాలను ఉపయోగించి తయారుచేస్తారు. ఈ బొమ్మలు తయారుచేసేవారు మొదట చర్మాల మీద జాగ్రత్తగా రూపురేఖలను గీయటంతో మొదలెడతారు. ఆ తర్వాత వాటిని చెక్కటం కోసం ఉలులు, బరమాల వంటి ప్రత్యేక సాధనాలను ఉపయోగిస్తారు. "నేర్పరులైన కమ్మరుల కొరత వలన ఈ పనిముట్లను సంపాదించడం ఒక సవాలుగా మారింది," అని రామచంద్ర కుమారుడైన రాజీవ్ పులవర్ అన్నారు.


