అనరుల్ ఇస్లామ్ తన పొలంలో పనిచేసుకోవడానికి వెళ్లినప్పుడల్లా అంతర్జాతీయ సరిహద్దు దాటవలసి వచ్చేది. అలా వెళ్ళినప్పుడల్లా ఒక సమగ్రమైన ప్రోటోకాల్‌ను, భద్రతా తనిఖీలను పూర్తిచేయాల్సివచ్చేది. ప్రతిసారీ తన గుర్తింపుకార్డు (ఆయన తన ఓటర్ ఐడీ కార్డును ఉపయోగిస్తారు) అక్కడ సమర్పించి, రిజిస్టరులో సంతకం చేసి అనంతరం ప్రోటోకాల్‌కి వెళ్లాల్సివచ్చేది. వ్యవసాయం నిమిత్తం ఆయన తీసుకొచ్చే పనిముట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఆయన తన ఆవుల్ని కూడా పొలానికి తీసుకువెళ్లాల్సివస్తే, వాటి ఫొటోలను కూడా సమర్పించాల్సివుంటుంది.
“ఒక్కసారి రెండు కంటే ఎక్కువ ఆవుల్ని రానివ్వరు. తిరిగి వచ్చేటప్పుడు నేను సంతకం చేశాక నా డాక్యుమెంట్లను తిరిగిస్తారు. గుర్తింపుకార్డు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు”, అని చెప్పారు అనరుల్ ఇస్లామ్.
అందరికీ బాబుల్‌గా పరిచితుడైన అనరుల్ ఇస్లామ్ - మేఘాలయ రాష్ట్రం ఈశాన్య ప్రాంతం లోని గారో హిల్స్ జిల్లా, బగీచా అనే గ్రామంలో నివసిస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సుమారు 443 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రాష్ట్ర సరిహద్దు - సుమారు 4,140 కిలోమీటర్ల సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కూడా - ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సరిహద్దు ఇది. మేఘాలయ హద్దుగా వున్న ఈ ప్రాంతమంతా ఇనుపతీగలు, కాంక్రీట్‌లతో నిర్మించబడింది.
1980 ప్రాంతాల్లో ఈ ఫెన్సింగ్ వేయకముందు - అనేక శతాబ్దాలుగా ఈ మార్గం స్థానిక గ్రామీణుల ఆర్థికాభివృద్ధికి, వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడేది. భారత ఉపఖండంలో బంగ్లాదేశ్ ఏర్పడిన అనంతరం ఈ రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. ఉభయ దేశాల మధ్యా కుదిరిన ఒప్పందం మేరకు, రెండు దేశాల మధ్యా 150 గజాల స్థలాన్ని బఫర్‌జోన్‌గా నిర్ణయించారు. సరిహద్దుకు అటూఇటూ దీనిని నిర్వహించాల్సివుంటుంది.
47 ఏళ్ల అనరుల్ ఇస్లామ్ తన వ్యవసాయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు ఏడేళ్లున్నప్పుడే తండ్రి అతడిని బడి మాన్పించి తనతోపాటు పొలం పనులకు తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. అతని ముగ్గురు సోదరులకు కూడా భూమి పంపకం జరిగింది. వారు దానిని సాగుచేసుకోవడమో, కౌలుకు ఇవ్వడమో జరిగింది. అతని నలుగురు అక్కచెల్లెళ్లూ గృహిణులుగా వున్నారు.
వ్యవసాయంతో పాటు అనరుల్ జీవనోపాధికి మరికొన్ని వ్యూహాలూ పాటిస్తుంటాడు. భవన నిర్మాణ కార్మికులకు వడ్డీకి అప్పులిస్తుంటాడు. కానీ, ఆ పంటపొలం మాత్రం అతని భావోద్వేగాలతో కలిగలిసి వుంది. “ఇది మా నాన్న పొలం. నేను చిన్నపిల్లాడిగా వున్నప్పటినుంచీ నాకీ భూమితో విడదీయలేని అనుబంధం వుంది. ఈ నేల నాకెప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ వ్యవసాయం చేయడం, నాకు సంతోషంగా ఉంటుంది.” అన్నారు అనరుల్.
సరిహద్దుకు కుడివైపున, ఫెన్సింగ్‌కి దాదాపుగా ఆనుకుని ఆయనకు ఏడు బీగాల (సుమారు రెండున్నర ఎకరాల) భూమి వుంది. బఫర్‌జోన్‌లో భద్రత నిమిత్తం అక్కడ పొలాలున్న రైతులు వాటిని వదులుకోమని అనేక సంవత్సరాలుగా ఒత్తిళ్లకు గురవుతున్నారు. అనరుల్ మాత్రం తన పనిని మానలేదు. కారణం - అతని భూమి సరిహద్దు గోడకు అతి సమీపంలో వుండడమే. `మా పూర్వీకులు నివసించిన నేల ఇది. ఇప్పుడిది అంతర్జాతీయ సరిహద్దుగా మారింది. కానీ, దీంతో మా అనుబంధం శాశ్వతం` అంటారు అనరుల్.
అనరుల్ ఇస్లామ్‌ది ఆ ప్రాంతంలో ఒకప్పుడు పేరుమోసిన కుటుంబం. అత్యంత విశాలంగా విస్తరించిన వీరి నివాసాలను బఫాదార్ బంగ్లా (భూమి యజమానుల స్వస్థలం) అని స్థానికులు పిలుస్తుంటారు. 1970ల తర్వాత; యుద్ధం తరువాత సరిహద్దు దోపిడీదొంగల దాడుల కారణంగా చాలామంది స్థానికులు వేరే వూర్లకు తరలిపోవడమో; లేదా సరిహద్దులకు దగ్గరగా వుండే అతిపెద్ద మునిసిపాలిటీ జిక్‌జాక్ బ్లాకు శివార్లకో తరలిపోవాల్సివచ్చింది. 600 మంది జనాభా వున్న బగీచా గ్రామం కూడా వీటిలో ఒకటి. “ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన నష్టపరిహారం కూడా అందరికీ తగినట్లు నిర్ణయించలేదు. ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయనే నెపంతో నష్టపరిహారాన్ని పూర్తిగా కూడా ఇవ్వలేదు”, అని వాపోయాడు అనరుల్.
సరిహద్దు గేట్లను ఉదయం 8 గంటలకు తెరిచి, సాయంత్రం నాలుగు గంటలకు మూసేస్తారు. మిగతా సమయమంతా గేటు మూసివుంటుంది. ఈ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి రైతులు సరిహద్దు భద్రతా దళాల (బిఎస్ఎఫ్) వద్ద వుండే రిజిస్టరులో తమ వేలిముద్రలు, సంతకం, ఒక గుర్తింపుకార్డుతో నమోదు చేసుకోవాలి. రైతులు తమ పొలాలకు వెళ్లేప్పుడూ, వచ్చేప్పుడూ ఈ పద్ధతినే పాటించాలి. “గుర్తింపుకార్డు లేనివారిని గేటు లోపలికి అనుమతించరు. పొరపాటున ఎవరైనా ఆరోజు గుర్తింపుకార్డు తేవడం మర్చిపోయారంటే ఆ రోజంతా వృధా అయిపోయినట్లే” అని చెప్పారు అనరుల్ ఇస్లామ్.
అనరుల్ పొలానికి వెళ్లేప్పుడు తన ఆహారం - అది అన్నమైనా, రొట్టెలైనా; పప్పు, కూర, చేప, బీఫ్ ఏవైనా ... వాటిని ఒక అల్యూమినియం గిన్నెలో పెట్టుకుని దానిపైన ఒక ప్లేట్ ని కప్పి, ఒక కాటన్ తుండుగుడ్డలో చుట్టుకుని తీసుకువెళ్లాలి. సరిహద్దు గేటుకు సమీపంలో వున్న ఒక ఆలయం బావి నుంచి మంచినీళ్లు పట్టుకోవాలి. నీళ్లు కానీ అయిపోయాయా, ఇక ఆరోజు సాయంత్రం దాకా దాహంతో అల్లాడాల్సిందే. నీళ్లు కావాలంటే మళ్లీ బోర్డర్ దగ్గర ప్రక్రియ అంతా పూర్తిచేయాల్సిందే. ``అయితే బిఎస్ఎఫ్ సిబ్బంది మాక్కాస్త సాయం చేస్తుంటారు. కానీ గేట్లు తెరవడానికి కూడా చాలా సమయం ఎదురుచూడాల్సి వస్తుంటుంది. నేను నీళ్లు తాగాలంటే ఇంత పెద్ద తతంగం అవసరమా? నాలాంటి రైతుకిది సాధ్యమా?`` అనడిగాడు అనరుల్.
ఉదయం ఎనిమిది గంటలకు గేట్లు తెరవడం, సాయంత్రం నాలుగింటికే వాటిని మూసేయడం రైతులకు చాలా కష్టంగా మారింది. మహేంద్రగంజ్ ప్రాంతంలో సాధారణంగా రైతులు సూర్యోదయానికి ముందే పొలానికి వెళ్లిపోతారు. “అన్నమో, రాత్రి మిగిలినదేదైనా వుంటే వాటిని తిని, ఉదయం నాలుగు గంటలకే మేము పొలానికి వెళ్లిపోతాం. ఎండ పెరిగేసరికి మేము పని ఆపేస్తాం. కానీ, ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలకి గేట్లు తెరుస్తుండడం వల్ల నా శారీరక ఆరోగ్యం కూడా పాడవుతోంది”, అని చెప్పారు అనరుల్.
అనరుల్ భద్రతా నిబంధనల్ని తప్పక పాటిస్తారు. బిఎస్ఎఫ్ దళాలు అనేక పరీక్షల తర్వాతే రైతుల్ని లోపలికి అనుమతిస్తాయి. మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదు. వీటిని గేటు వద్దనే డిపాజిట్ చేసి, తిరిగి వెళ్లేటప్పుడు వెనక్కి తీసుకోవాలి. వ్యవసాయం నిమిత్తం రైతులు తీసుకువెళ్లే ప్రతి పనిముట్టునూ భద్రతాదళాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. కొన్ని సందర్భాల్లో పొలంలో విద్యుత్ సాయంతో పనిచేయాల్సివచ్చినప్పుడు, ఒక్కరోజు అద్దెకు తీసుకొచ్చిన పవర్-టిల్లర్లను ట్రాక్టర్లపై పెట్టుకుని గేటు దాటాల్సివుంటుంది. అందుకు బిఎస్ఎఫ్ దళాలు అనుమతిస్తాయి. అయితే, ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ట్రాక్టర్లను అనుమతించరు. ఆ సమయంలో ఆవుల్ని కూడా లోపలికి పోనివ్వరు. “నేనొక్కడినే పొలంలో పనిచేసుకుంటూ మా ఆవుల్ని ఎక్కడ వదిలిపెట్టగలను?” అని ప్రశ్నిస్తారు అనరుల్. పోయిన ఏడాది అనరుల్ తన మూడు ఆవుల్ని అమ్మేయాల్సివచ్చింది. ఒక గేదెను కౌలుకు ఇవ్వాల్సివచ్చింది. ఇప్పుడు ఆవులు అవసరమైతే ఆయన ఆ ఒక్కరోజుకీ ఎవరి దగ్గరినుంచైనా అద్దెకు తీసుకుని పొలానికి వెళ్తుంటాడు.
బోర్డర్ గేటు వద్ద విత్తనాలను తనిఖీ చేస్తారు. జనుము విత్తనాలు, చెరకు మొలకలను లోపలికి అంగీకరించరు. మిగిలిన పంటలను కూడా మూడడుగుల ఎత్తుకు మించి పెంచడానికి వీల్లేదు. ఎందుకంటే సరిహద్దులో కాపలాకు కనుచూపుమేర స్పష్టంగా చూడగలగాలి.
ఈ కారణంగా అనరుల్ శీతాకాలంలో పప్పుధాన్యాలు; వర్షాకాలంలో వరి; పండ్లు, కూరగాయలు- బొప్పాయి, ముల్లంగి, వంకాయ, మిరపకాయలు, పొట్లకాయలు, మునగ కాయలను ఏడాది పొడవునా పండిస్తుంటాడు. జులై నుంచి నవంబర్ దాకా, అంటే వరి పండించే సమయంలో అప్పుడప్పుడూ తన పొలాన్ని లీజుకిస్తుంటాడు అనరుల్. మిగతా సమయాల్లో తానే సొంతగా పంట పండించుకుంటాడు.
పండించిన ఉత్పత్తులను బయటికి తీసుకురావడం ఇంకో పెద్ద సవాల్. వరి అయితే కొన్ని వారాల పాటు 25 క్వింటాళ్ల దాకా; బంగాళాదుంపలు (ఆలూ) మరో 25-30 క్వింటాళ్ల వరకూ వుంటాయి. “పంటను నా తల మీద పెట్టుకుని తెచ్చుకోవాలి. ఇందుకోసం రెండు నుంచి ఐదు సార్లు లోపలికీ బయటికీ తిరగాల్సివస్తుంటుంది”, అని చెప్పారు అనరుల్. ఆయన మొదట పూర్తి పంటను గేటు వద్దకు చేర్చుకుని ఆ తర్వాత గేటు ఇవతలికి తెస్తాడు. అనంతరం పంటను ఇంటికో, లేదా మహేంద్రగంజ్ మార్కెట్‌కో తీసుకువెళ్లడానికి స్థానిక రవాణా వాహనాల కోసం రోడ్డు పక్కన వేచిచూడాల్సివస్తుంది.
కొన్ని సందర్భాల్లో సరిహద్దుల్లో గొడవలు కూడా చెలరేగుతుంటాయి. పశువుల్ని పొలాల్లోకి విచ్చలవిడిగా వదిలేయడం, లేదా తమ పంటను దొంగిలించారనే ఆరోపణలతో తరచూ ఇలాంటి పోరాటాలు జరుగుతుంటాయి. కొన్నిసందర్భాల్లో హద్దుల విషయంలో కూడా ఘర్షణలు జరుగుతుంటాయి. “పది సంవత్సరాలకు ముందు ఒకసారి నేను నా పొలాన్ని చదును చేసుకుంటుండగా నాకు, కొందరు బంగ్లాదేశీలకూ మధ్య పెద్ద గొడవే జరిగింది. బంగ్లాదేశ్ సరిహద్దు సైనికదళాల నుంచి కొందరు నావద్దకు వచ్చి, అది బంగ్లాదేశ్‌కు సంబంధించిన స్థలమని, తక్షణం నేల చదును చేయడం అపేయమని ఆదేశించారు,” అని చెప్పాడు అనరుల్. ఆయన వెంటనే బిఎస్ఎఫ్ దళాలకు ఈ విషయాన్ని తెలియజేశారు. స్థానికుల కథనం ప్రకారం బిఎస్ఎఫ్ సిబ్బందికీ, బంగ్లాదేశ్ సైనిక దళాలకీ మధ్య జరిగిన విడతలవారీ చర్చలు, వాదనల ఫలితంగా ... ఉభయదేశాల హద్దుల వద్ద ఒక వెదురు తడికను బిగించారు. కానీ, అదెంతో కాలం నిలబడలేదు. తిరిగి మళ్లీ హద్దుల గొడవ మొదలైంది. అనరుల్, “దీనివల్ల నేను రెండు బీఘాల స్థలాన్ని పోగొట్టుకున్నాను, ఆ భూమిని ఇంకా నాకు స్వాధీనం చేయలేదు”, అని వాపోయారు. రెండు బీఘాల స్థలం పోగొట్టుకోవడంతో ఇప్పుడు మిగిలిన ఐదు బీఘాల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడాయన.
భారత్, బంగ్లాదేశ్ రైతులు కొన్ని మీటర్ల దూరంలో వేర్వేరుగా పొలాల్లో పనిచేసుకుంటుంటారు. అనరుల్, “భద్రతాదళాలు ఇష్టపడకపోవడం వల్ల నేను బంగ్లాదేశ్ రైతులతో మాట్లాడడమే మానేశాను. మన సైనిక దళాలకు ఏదైనా అనుమానం వస్తే ఇక నా భూమి నా అధీనం లో ఉండదు. కాబట్టి, బంగ్లాదేశ్ రైతులు పలకరించినా నేను మౌనంగానే వుంటాను”. అని చెప్పాడు.
“కొందరు దొంగలు మా కాయగూరల్ని దొంగిలిస్తుంటారు. కానీ, ఫిర్యాదు చేయలేని పరిస్థితి నాది. బంగ్లాదేశీలకు వారిలో వారికి సమైక్యత వుండదు, కానీ నాకు అల్లా ఆశీర్వాదాలున్నాయి.” పశువుల దొంగరవాణాకు కొందరు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారని, భారీగా స్మగ్లింగ్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని మహేంద్రగంజ్ స్థానికులు చెప్పారు. 2018లో అనరుల్ వద్ద ఒక 28 ఏళ్ల యువకుడు 70 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. దీనిమీద తనకు 20,000 వడ్డీ రావచ్చని ఆయన ఆశించాడు. అయితే డ్రగ్స్ రవాణా కారణంగా అతను మరణించాడు. దీంతో అనరుల్ కుంగిపోయాడు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి, చివరికి 50,000 తీసుకోవడానికి అంగీకరించాడాయన. స్థానికులు చెప్పేదాని ప్రకారం, సరిహద్దు పరిధి అంతా డ్రగ్స్ సరఫరాకు వాడడం జరుగుతోంది. డ్రగ్స్ టాబ్లెట్లను ఫెన్సింగ్ అవతలికి విసిరేస్తే చాలు. `మీకెంత సూటిగా విసిరేయడం వస్తే మీకంత డబ్బు దొరుకుతుంది` అని చెప్పాడు అనరుల్.
తన వడ్డీ వ్యాపారం గురించి మాట్లాడుతూ అనరుల్ ``నేను నా పెద్ద కుటుంబాన్ని పోషించుకోవాలి. అందువల్లే ... ఎప్పుడైనా నా దగ్గర డబ్బుంటే దానిని వడ్డీకి తిప్పుతుంటాను. ఇదంతా కేవలం మరికొంత డబ్బు సంపాదన కోసమే`` అని చెప్పారు.
ఫెన్సింగ్ ప్రభావం వ్యవసాయం, డ్రెయినేజీ వ్యవస్థల మీద కూడా పడింది. అనరుల్ వర్షాధారిత పొలం జులై, ఆగస్టు నెలల్లో వచ్చే భారీ వర్షాలకు చెరువులా మారిపోతుంది. నీరు బయటికి పోయే అవకాశం లేదు. గస్తీ దళాల కఠిన నిబంధనలు, దొంగల భయం కారణంగా పొలంలో పంపు బిగించుకోవడం వీలుకాదు. అదీకాక, నీటిని బయటికి తోడే యంత్రాలు భారీ స్థాయివి. వాటిని లోపలికి అనుమతించరు. ఒకవేళ అనుమతించినా - వీటిని రోజూ లోపలికీ, బయటికీ తీసుకురావడం అసాధ్యం. ఇక జేసీబీలనైతే వాటి ఎత్తు కారణంగా అసలే అనుమతించరు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో అనరుల్ ఒకటి రెండు రోజులు ఎండ వచ్చేదాకా ఎదురుచూస్తాడు. వర్షాలు అతి భారీవైతే ఒక్కోసారి రెండు వారాల దాకా కూడా ఎదురుచూడాల్సివస్తుంది. ఫలితంగా పంట పోగొట్టుకోవడమే కాక, అతని భుజాలపై పెనుభారం కూడా పడుతుంది.
ఇక వ్యవసాయ కూలీలను దొరకబుచ్చుకోవడం మరో సవాల్. చెల్లుబాటయ్యే గుర్తింపుకార్డులున్నవారిని మాత్రమే పొలాల వద్దకు అనుమతిస్తారు. వీరందరికీ మంచినీళ్లు అందించడం మరో సవాలు. కనీసం నీడన కూర్చోవడానికి ఒక్క పెద్ద చెట్టు కూడా లేదు. `ఇలాంటి కఠిన నిబంధనల వల్లే కూలీలు మా పొలాలలో పనికి రావడానికి ఆసక్తి చూపరు` చెప్పారు అనరుల్. ఇందువల్లే అతనొక్కడే పొలం పని చేసుకుంటాడు. అవసరమైతే ఒక్కోసారి తన భార్యను, లేదా కుటుంబసభ్యుల్లో ఒకరిని తనతోపాటు తీసుకువెళ్తుంటాడు.
ఇక స్త్రీలకైతే అదనపు కష్టాలుంటాయి. వారికి టాయిలెట్లుండవు. బిడ్డలను తల్లులతో పాటు బఫర్‌జోన్ లోకి రానివ్వరు.
ఇక అనరుల్ చేసే మూడో పని - నిర్మాణరంగంలో పనిచేయడం. దీనివల్ల అతనికి స్థిరమైన ఆదాయమొస్తుంది. అక్కడికి 15-20 కిలోమీటర్ల చుట్టుదూరంలో అనేక పబ్లిక్, ప్రయివేటు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అనరుల్ ఎక్కువగా అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో వున్న తుర అనే పట్టణానికి వెళ్తుంటాడు. (అయితే కోవిడ్19 కారణంగా వల్ల విధించిన లాక్‌డౌన్‌లో దీనిని ఆపేశారు). మూడేళ్ల క్రితం అనరుల్ తనకొచ్చిన ఆదాయంతో మూడు లక్షలు ఖర్చు చేసి, తన కుమార్తె వివాహం కోసం ఒక సెకండ్‌హ్యాండ్ మోటార్‌బైక్, కొంత బంగారం కొన్నారు. వ్యవసాయ కూలీగా సాధారణంగా ఆయనకు రోజుకు 700 రూపాయల ఆదాయమొస్తుంది. ఏటా ఈ విధంగా కనీసం లక్ష రూపాయలు సంపాదించాలనేది అతని కోరిక. “నా పొలం ద్వారా నాకు మూడు నెలలకోసారే ఆదాయం వస్తుంది. కానీ తక్షణ అవసరాలకు ఈ కూలీ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది”, అన్నారాయన.
అనరుల్ విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఆయన పెద్దన్నయ్య ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పదిహేనేళ్ల కుమార్తె శోభాబేగం 8వ తరగతిలో వుంది. కొడుకు సద్దాం ఇస్లాం (11) నాలుగో తరగతి; సీమాబేగం (6) మూడవ తరగతి చదువుతున్నారు. 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న అతని పెద్ద కుమార్తెలు ముగ్గురూ వివాహాలు చేసుకుని స్థిరపడ్డారు. అనరుల్‌కి ఇద్దరు భార్యలు. జిప్పిలా టి సంగ్మా తొలి భార్య కాగా, జకీదా బేగం రెండవ భార్య. ఇద్దరికీ అటూఇటూగా 40 ఏళ్లుంటాయి.
తన పెద్ద పిల్లలు కనీసం డిగ్రీ దాకానైనా చదువుకోవాలని ఆశించాడు అనరుల్. “కానీ, వాళ్లందరూ టీవీ, మొబైల్ ఫోన్ల ప్రభావానికి లోనై, చదువులు చెడగొట్టుకుని ప్రేమవివాహాలు చేసుకున్నారు. నా పిల్లలెవరికీ చదువు మీద ఆసక్తి లేకపోవడం నాకెంతో బాధను కలిగిస్తుంటుంది. వాళ్లు అటు చదువుకోరు; ఇటు ఏ పనీ చేయరు. కాకపోతే నేను అదృష్టాన్ని నమ్ముతాను. వారి జీవితాలు బావుంటాయని నా నమ్మకం”, అన్నారాయన.
2020లో అనరుల్ తన పొలంలో బాదం పంట వేయాలని భావించాడు. కానీ, కోవిడ్ నిబంధనల కారణంగా బిఎస్ఎఫ్ అక్కడ లాక్‌డౌన్‌ను విధించింది. రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా తాను కొంత పంటను పోగొట్టుకున్నానన్నాడు అనరుల్. కానీ, తమలపాకు మొలకల ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించాడాయన.
గతేడాది ఏప్రిల్ 29 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో వుంది. ఆ తర్వాత రోజుకు 3 నుంచి 4 గంటలపాటు రైతులు తమ పొలాల్లో పనిచేసుకునే వెసులుబాటునిచ్చారు. కొంతకాలం తర్వాత మళ్లీ పాత పద్ధతినే పునరుద్ధరించారు.
ఇన్నేళ్లలో అనరుల్ బిఎస్ఎఫ్ దళాల్లో కొందరిని మిత్రులుగా చేసుకోగలిగాడు. “కొన్ని సమయాల్లో వారిని చూస్తే జాలివేస్తుంది. వారు తమ కుటుంబాలకు దూరంగా ఇక్కడవుండి మాకు సంరక్షణ కల్పిస్తున్నారు. ఈద్ పండుగ వంటి సందర్భాల్లో వారిని మేము మా ఇళ్లకి భోజనానికి ఆహ్వానిస్తుంటాం. లేదా ... అన్నం, మేకమాంసపు కూరను వారికోసం బోర్డర్ గేటు దగ్గరికే తీసుకువెళ్తుంటాం. పొలానికి వెళ్లేప్పుడో, వచ్చేప్పుడో వారు మాకు టీ కూడా అందిస్తుంటారు,” అంటారు అనరుల్.
ఈ కథనాన్ని అందించిన రిపోర్టర్ కుటుంబం మహేంద్రగంజ్ నివాసులు.
అనువాదం: సురేష్ వెలుగూరి