పావగడ, చూసేందుకు కన్నులవిందుగా ఉంటుంది. వీధులలో గుత్తులుగా కాగితం పూలు, రంగు రంగుల ఇళ్లు, అలంకరించబడిన గుళ్లు, గోపురాలు, వాటిలో నుండి వచ్చే సంగీతం. ఇవన్నీ, కర్ణాటకలోని తుంకూరు జిల్లాలోని ఈ పల్లెటూరిలో రోజూ నడిచేవారికి సుపరిచితం. చూడటానికి అందంగా ఉన్నా, నిజానికి ఇందులో అందం లేదు. ఎందుకంటే ఇక్కడ విషయం మానవ వ్యర్థాలైన మ*మూ*ల గురించి కాబట్టి.

మధ్య తరగతి వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి, ఈ పదాలను పూర్తిగా రాయకుండా, * వాడి దాచాల్సి వస్తోంది. కానీ అంతటి అదృష్టానికి రామాంజనప్ప నోచుకోలేదు. పావగడ తాలూకా లోని కన్నమేడి అనే పల్లెటూరిలోని పారిశుద్ధ్య కార్మికుడైన ఈయన "మలాన్ని నేను ఒట్టి చేతులతో కడుగుతాను," అని చెప్పారు. అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదనుకుంటే, ఇలా తనలోని మానవత్వాన్ని అణగదొక్కే ఈ పనికి సాంత్వన చేకూర్చాల్సిన ఒకే ఒక్క విషయంలోనూ ఎదురు దెబ్బలు తప్పవు: చివరిసారి రామాంజనప్పకు జీతం వచ్చింది అక్టోబరు 2017లో.

టౌన్ హాల్ గోడల మీద చెత్తను వేరు చేయడం గురించిన పెయింటింగ్స్ ఉన్నాయి, ఉండాలి కూడా. కానీ, అవి అధికారుల కంటితుడుపు చర్యలో భాగం మాత్రమేనని, మాదిగ కులానికి చెందిన దళితులైన 20 మంది పారిశుద్ధ్య  కార్మికులు, ఆ గోడలకు 30 అడుగుల దూరం కూడా లేని  అంబేద్కర్ భవన్‌లోని ఒక సభలో, వారి నిస్సహాయ స్థితిని వివరిస్తూ మాకు చెప్పారు.

నెల నెలా తాను అందుకునే రూ. 3400తో, భార్య, స్కూలుకు వెళ్లే ముగ్గురు పిల్లలతో ఐదు మంది ఉన్న కుటుంబాన్ని పోషించడానికే కష్టమయ్యేది. అలాంటిది, ఆ కొంత జీతం వచ్చి కూడా  తొమ్మిది నెలలు అవుతోంది.

కొందరికి జీతాలు రాకపోగా, ఇంకొందరికి నెలల ముందే ఇస్తామని చెప్పిన ఇంక్రిమెంట్ రాలేదు.

Pavagada's deceptively picturesque landscape
PHOTO • Vishaka George
painting on sanitation
PHOTO • Vishaka George

పావగడలోని ప్రకృతి అందాలు, పవిత్రమైన స్వచ్ఛ భారత్ పెయింటింగ్‌ల వెనుక ఆ పట్టణపు పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొనే కష్టాలు దాగి ఉన్నాయి

అదే తాలూకా లోని కోడమడగు జిల్లాలోని నారాయణప్ప, "నేను రోడ్లు ఊడుస్తాను, పబ్లిక్ టాయిలెట్లు, స్కూల్ టాయిలెట్లు, మురికి కాలువలను రోజూ కడుగుతాను. ఇదంతా చేసినందుకు నా జీతం 13,400 అవుతుంది అని నాలుగు నెలల ముందు చెప్పారు, కానీ ఇంకా 3,400 దగ్గరే ఉంది" అని చెప్పారు. రామాంజనప్పతో పోలిస్తే ఈయన పరిస్థితి కాస్త మెరుగైనది - ఎందుకంటే, ఈయన ఉండే పంచాయితీలో ఉండే పారిశుధ్య కార్మికులకు , ఆ కొద్దిపాటి జీతాలైనా అందుతున్నాయి.

2011 సాంఘిక, ఆర్థిక, కుల సెన్సస్ (Socio Economic and Caste Census 2011) ప్రకారం, దక్షిణ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఈ రాష్ట్రంలోని 30 జిల్లాలలో తుంకూరు మొదటి స్థానంలో ఉందని, కర్ణాటక రాష్ట్ర సఫాయి కర్మచారీల కమీషన్ వారు తయారు చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

2013 'మాన్యువల్ స్కావెంజర్స్ నియామక నిషేధం, వారి పునరావాసం చట్టం' అనేది, నిషేధంపై మాత్రమే దృష్టి పెట్టిన 1993 చట్టానికి తర్వాతి దశగా రూపొందించబడింది. 2013 చట్టం ప్రకారం, అలాంటి నియామకాలను చేసే వారిపై దావా వేసి, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.  పంచాయితీలు, మునిసిపాలిటీలు, పోలీసులు, అసెంబ్లీలతో పాటు ఇతర సంస్థల నుండి కూడా సభ్యులను చేకూర్చి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా చట్టంలో ఉంది.

ఆ  చట్టాన్ని అమలుపరుస్తామని ప్రతిజ్ఞ చేసినవారే, రామాంజనప్పతో, అతని తోటి కార్మికులతో ఈ చట్ట విరుద్ధమైన పనిని చేయిస్తున్నారు.

బెంగళూరులోని రామయ్య పబ్లిక్ పాలసీ సెంటర్, యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ అయిన చేతన్ సింగాయ్ మాట్లాడుతూ, " పంచాయితీ , మునిసిపల్ క్లీనర్లలో కూడా తారతమ్యాలు ఉన్నాయి" అని అన్నారు. "ఎవరి కుటుంబాలలో అయితే తరతరాలుగా సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తున్నారో, ఆ కుటుంబాలలోని వారిని, (మద్యానికి లేదా మత్తు పదార్థాలకు) బానిసైన వాళ్లను గుర్తించి, వారిని మాన్యువల్ స్కావెంజర్లుగా నియమిస్తున్నారు. సామాజిక సంక్షేమ విభాగం వారు కూడా, ఇలాంటి తారతమ్యాలను అలుసుగా వాడుకుంటున్నారు," అని సింగాయ్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మాన్యువల్ స్కావెంజర్లను లెక్కించమని, కర్ణాటక రాష్ట్ర సఫాయి కర్మచారీల కమీషన్ ఆదేశించిన ఒక అధ్యయనంలో భాగంగా ఈయన పనిచేస్తున్నారు. ఈ అధ్యయనం పూర్తయితేనే, పావగాడలో కానీ, తుంకూరులో కానీ, నిజానికి ఎంత మంది అలాంటి వృత్తిలో కొనసాగుతున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.

 manual scavengers At a meeting in Ambedkar Bhavan
PHOTO • Vishaka George
painting on the wall of a man throwing garbage
PHOTO • Vishaka George

అంబేద్కర్ భవన్‌లోని ఒక మీటింగ్‌లో దాదాపు 20 మంది మాన్యువల్ స్కావెంజర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు; హాల్ బయట, నగరపు గోడల మీద కనబడే దృశ్యాలు మాత్రం వేరు

చట్టవిరుద్ధమైన నియామకం పట్ల, జీతాలు ఇవ్వకపోవడం పట్ల మేము పలుమార్లు అడిగిన ప్రశ్నలకు, కోడమడగు పంచాయితీ ఆఫీసు నుండి ఎటువంటి స్పందనా రాలేదు. మరో వైపు, కన్నమేడి పంచాయితీ ఆఫీసు అధికారులైతే ఏకంగా దురుసుగా, వ్యతిరేకంగానూ స్పందించారు.

మునిసిపాలిటీలలో లాగా కాకుండా, పంచాయితీలలోని కార్మికులను ‘పర్మనెంట్’ ఉద్యోగులుగా పరిగణించాలి. కానీ, అటువంటి ఉద్యోగాలతో వచ్చే ప్రయోజనాలు - భవిష్య నిధి, ఇన్‌స్యూరెన్స్ వంటివేవీ వీళ్లకు లేవు.

"తరచుగా హానికరమైన విషవాయువులను పీల్చుతూ, భయంకరమైన వ్యాధులకు గురయ్యే అవకాశమున్న వీళ్లకు, ఇన్‌స్యూరెన్స్ ఎవరు ఇస్తారు?" అని కె. బి. ఓబులేష్ ప్రశ్నించారు. దళిత వర్గాల కోసం పోరాడుతున్న 'తమాటె : సెంటర్ ఫర్ రూరల్ ఎంపవర్‌మెంట్' అనే సంస్థను ఈయన స్థాపించారు.

గ్రామ పంచాయితీ స్థాయిలో ఉన్న సఫాయి కర్మచారీల పరిస్థితి ఇలా ఉంటే, మునిసిపాలిటీలలో కాంట్రాక్ట్ క్లీనర్లుగా ఉన్న వారి స్థితి ఇంకా ఘోరమైనది. త్వరలో, వాళ్ల పరిస్థితే అందరికీ వస్తుంది.

పారిశుద్ధ్య రంగంలోని ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు, కర్ణాటకలో చేసిన ఒక ప్రయత్నం వల్ల, 700 మంది ప్రజలకు కేవలం ఒక్క సఫాయి కర్మచారీని మాత్రమే నియమించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇలా ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తే, వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాల్సి వచ్చి, వారికి వేతనాలు ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. ఆందుకని ఆ కార్మికులను ఉద్యోగం నుండి తీసివేసి, వారికి పునరావాసం కూడా ఇవ్వకుండా వదిలేస్తున్నారు.

"ఏకపక్షంగా రూపొందించిన ఈ 1:700 నిష్పత్తి వల్ల," ఇప్పటిదాకా "దాదాపు 30 మంది దాకా పావగడలోనే ఉద్యోగాలను కోల్పోయారు" అని ఓబులేష్ అన్నారు.

sanitation worker cleaning the gutter
PHOTO • Vishaka George
sanitation worker cleaning the gutter
PHOTO • Vishaka George

కర్ణాటకలో గత పదేళ్లలో, మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేస్తూ 69 మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి

అలా ఉద్యోగం నుండి తీసివేయబడ్డ వారిలో మణి అనే మహిళ కూడా ఒకరు. పౌర కార్మికుడు , కాంట్రాక్ట్ కార్మికుడైన ఆవిడ భర్తను కూడా ఉద్యోగం నుండి తీసేశారు. "ఇప్పుడు నా పిల్లల గతేంటి? ఇంటి అద్దె కట్టడం ఎలా?" అని ఆవిడ ప్రశ్నిస్తున్నారు.

జులై 11న, బెంగళూరులోని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP), పౌర కార్మికుల వేతనాలలో బకాయి పడ్డ 27 కోట్ల నిధులను విడుదల చేసింది. అది కూడా,7 నెలలవుతున్నా వేతనాలు రానందుకు టి. సుబ్రమణి (40) అనే ఒక పౌరకార్మికుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాతే. బెంగళూరులో 18 వేలమంది పౌరకార్మికులు ఉన్నారని, వారందరికీ చెల్లింపులు అందాయని, BBMPలో జాయింట్ కమీషనర్ ఫర్ హెల్త్, సర్ఫరాజ్ ఖాన్ నాకు చెప్పారు. "కార్మికులను బయోమెట్రిక్ విధానం ద్వారా ధృవీకరించి, తర్వాత వారికి చెల్లింపులు అందజేశాం."

కానీ, "ఇంతగా వాయిదా పడుతూ వచ్చాక, BBMP విడుదల చేసిన 27కోట్లు కూడా, పౌరకార్మికులలో సుమారు 50 శాతం మందికి మాత్రమే అందాయి" అని ఓబులేష్ అన్నారు. ఆయన అంచనా ప్రకారం బెంగళూరులో సుమారు 32 వేల దాకా పౌరకార్మికులు ఉన్నారు. కానీ, బయోమెట్రిక్ పద్ధతిలో ధృవీకరణను ప్రారంభించాక ఆ సంఖ్య తగ్గింది.

"నిధుల కొరత", ఉద్యోగాల క్రమబద్ధీకరణల వల్ల వేతనాలు మంజూరు చేయలేకపోయామనీ, ఒక నెల రోజులలో ఈ సమస్యలు పరిష్కారమవుతాయని, పావగడ పట్టణంలో మునిసిపాలిటీ కార్మికులకు ఇన్-ఛార్జ్ అయిన హెల్త్ ఇన్స్‌పెక్టర్, ఎస్. శంశుద్దీన్ చెప్పుకొచ్చారు. కానీ శంశుద్దీన్ అదృష్టం కొద్దీ, ఈ సమస్యల వల్ల ఆయనకు రావాల్సిన వేతనం మాత్రం ప్రభావితం కాలేదు. ఆయన స్థాయిలో ఉన్న ఉద్యోగికి నెలకు దాదపు రూ. 30 వేల వరకు అందుతుందని ఓబులేష్ అన్నారు.

పావగడలోని డ్రైనేజీ సమస్యకు పరిష్కారంగా, 2013లో మొదటిసారి యంత్రీకరణను (మెకనైజేషన్) ప్రవేశపెట్టారు. అప్పుడు, ఈ దేశం, ప్రభుత్వం రెండూ మొట్ట మొదటిసారిగా తమను తోటి మనుషులుగా, సంతోషకరమైన జీవితాలకు అర్హత ఉన్న వారిగా చూడటం ప్రారంభించాయని మునిసిపల్ కార్మికులు అనుకున్నారు.

Sanitation worker have gathered at one place
PHOTO • Vishaka George

పారిశుద్ధ్య రంగంలోని ఉద్యోగులను ‘క్రమబద్ధీకరించడం’ అనే పేరుతో పావగడలోని దాదాపు 30 మంది కార్మికులను (వారిలో కొందరిని ఈ కథనంలో ప్రస్తావించడం జరిగింది)  తమ ఉద్యోగాల నుండి తొలగించారు

కానీ నిజమేమిటంటే, మురుగు కాల్వలలో నుండి, ద్రవ రూపంలో ఉండే, లేదా దాదాపుగా ద్రవ రూపంలో ఉండే వ్యర్థ పదార్థాన్ని మాత్రమే ఈ యంత్రాలు వెలికి తీయగలవు. కావాల్సిన స్థాయిలో అది ద్రవ రూపంలో లేకపోతే, ఎవరైనా ఒకరు అందులోకి దూకి, ఆ మురుగును కలిపి, అందులో‌ ఉన్న రాళ్లను, పైపులలో పేరుకుపోయి ఇరుక్కున్న ఏదైనా పూడికను తొలగించాల్సి ఉంటుంది. దీంతో, ప్రతి కార్మికుడు మ*న్ని కలిపే వారు అవుతారు. బతికే హక్కు కోసం వీరు ఇలా పోరాడాల్సి వస్తోంది.

కర్ణాటకలో గత పదేళ్లలో, మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేస్తూ 69 మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి. వారిలో అధిక శాతం, సెప్టిక్ ట్యాంకులలో ప్రాణాలు కోల్పోయారని ఓబులేష్ చెప్పారు.

ట్యాంకులలోకి దూకే ముందు, "లోదుస్తులు మాత్రమే ఉండేలా బట్టలు విప్పేస్తాము. అంతకు ముందు 90 మి.లీ మద్యం తాగుతాం, దాని వల్లే పని చేయగలుగుతాం" అని నారాయణప్ప చెప్పారు.

అదే రోజు కానీ, ఆ తర్వాతి రోజులలో భోజనం చేయాలంటే, అంతకంటే ఎక్కువ మోతాదులో మద్యం తాగాల్సి ఉంటుంది.

"ఆ దుర్వాసనను మర్చిపోవడానికి ఇదంతా చేయాల్సిందే, తప్పదు" అని రామాంజనప్ప అన్నారు.

ఒక్కో 90 మి.లి. మద్యం బాటిల్‌కు 50 రూపాయల చొప్పున, కొందరు రోజుకు రూ. 200 కంటే ఎక్కువ మద్యం పైనే ఖర్చు చేస్తారు, ఇదంతా కూడా, తమకు  క్రమంగా అందని, అతి తక్కువ జీతాల మీద ఆధారపడుతూ.

Sanitation worker in a meeting
PHOTO • Vishaka George
Sanitation worker putting their problems in a meeting
PHOTO • Vishaka George
Sanitation worker in a meeting
PHOTO • Vishaka George

‘ఇది చేసేందుకే మేము పుట్టామని జనం మాకు చెబుతూ ఉంటారు. మాకు ఒక సాంఘిక బాధ్యత ఉంది.’ అని గంగమ్మ (ఎడమ) చెప్పారు. నారాయణప్ప (మధ్య), రామంజనప్ప (కుడి) కూడా వారి దుఃఖాన్ని పంచుకున్నారు

బంధువులు, పొరుగింటి వాళ్ల నుండి అప్పు తీసుకుంటేనే వారికి సర్దుబాటు అవుతుంది. "ఎక్కడా అప్పు దొరక్కపోతేనే, వడ్డీ వ్యాపారుల నుండి అప్పు తీసుకుంటాం. జామీను మీద పెట్టడానికి మాకు భూమి, ఇతరత్రా ఆస్తులేవీ లేవు కాబట్టి బ్యాంకులు మాకు ఋణాలు మంజూరు చేయవు," అని రామాంజనప్ప చెప్పారు.

సుమారుగా జీతం వచ్చే, వేరే ఉద్యోగాలేవీ అందుబాటులో లేవా? "ఇది చేసేందుకే మేము పుట్టామని జనం మాకు చెబుతూ ఉంటారు. మాకు ఒక సాంఘిక బాధ్యత ఉంది. మేము చేయకపోతే ఎవరు చేస్తారు? తరతరాలుగా మేము ఇదే చేస్తూ వస్తున్నాము," అని పావగడలోని దొమ్మతమరి పంచాయితీకి చెందిన గంగమ్మ అనే ఒక సఫాయి కర్మచారి చెప్పారు.

"కుల వ్యవస్థ చేసే హాని ఇదే. ఈ పని చేసేందుకే నువ్వు పుట్టావని నమ్మేలా చేస్తుంది ఈ వ్యవస్థ," అని ఓబులేష్ చెప్పారు, "ఇంతకంటే మెరుగైన జీవితం గడపడం నీ వల్ల కాదు, నువ్వు గడపవు కూడా. ఇలా అణచివేతకు గురైన ఈ జనం ఒక రకమైన బానిసత్వంలో మగ్గుతున్నారు. వాళ్లకు జీతాలు అందవు, కానీ ఇంకా ఎక్కువ పని చేస్తే ఇంకాస్త ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి అధికారులు వాగ్దానాలు చేస్తారు. ఇలా వాళ్ళు ఒక ఉచ్చులో ఇరుక్కుపోతారు.

1989లో అమెరికాకు చెందిన ఒక సీరియల్ కిల్లర్ అయిన రిచర్డ్ రమిరెజ్, తనకు ఉరి శిక్ష విధించారని తెలిసి - "ఇందులో కొత్తేముంది. ఈ రంగంలో చావు ఎప్పుడో రాసి ఉంటుంది" అని అన్నాడట. ఇలానే పావగడ తాలూకాలో కూడా చావు అంత అరుదైనది కాదు. వాళ్ల రంగంలో చావు ఎప్పుడూ వెంటే ఉంటుంది, కానీ బలయ్యేది మాత్రం ఎప్పుడూ సఫాయి కర్మచారీలే . రక్షణా సామాగ్రి అత్యల్పం, రిస్క్ మాత్రం అత్యధికం. సెలవులు లేవు, జీతాలు లేవు. ఈ పల్లెటూరి అందం వెనుక ఉండే నిజం ఇదే.

ఈ వార్తా కథనం కోసం ఇంటర్వ్యూ చేయబడ్డ పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ల పూర్తి పేరును ఉపయోగించవద్దని కోరారు.

ఈ వార్తా కథనాన్ని పూర్తి చేయడంలో సహాయం చేయడంతో పాటు, తమ సమయాన్ని వెచ్చించిన పరిశోధకులు నోయెల్ బెన్నో గారికి రచయిత ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అనువాదం - శ్రీ రఘునాథ్ జోషి

Vishaka George

ବିଶାଖା ଜର୍ଜ ପରୀର ଜଣେ ବରିଷ୍ଠ ସମ୍ପାଦିକା। ସେ ଜୀବନଜୀବିକା ଓ ପରିବେଶ ପ୍ରସଙ୍ଗରେ ରିପୋର୍ଟ ଲେଖିଥାନ୍ତି। ବିଶାଖା ପରୀର ସାମାଜିକ ଗଣମାଧ୍ୟମ ପରିଚାଳନା ବିଭାଗ ମୁଖ୍ୟ ଭାବେ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି ଏବଂ ପରୀର କାହାଣୀଗୁଡ଼ିକୁ ଶ୍ରେଣୀଗୃହକୁ ଆଣିବା ଲାଗି ସେ ପରୀ ଏଜୁକେସନ ଟିମ୍‌ ସହିତ କାର୍ଯ୍ୟ କରିଥାନ୍ତି ଏବଂ ନିଜ ଆଖପାଖର ପ୍ରସଙ୍ଗ ବିଷୟରେ ଲେଖିବା ପାଇଁ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କୁ ଉତ୍ସାହିତ କରନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ବିଶାଖା ଜର୍ଜ
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sri Raghunath Joshi