"కొండ్ర సమ్మయ్య అప్పుల్లో కూరుకుపోవడం వల్ల, మానసిక క్షోభకు గురై విషపూరితమైన పురుగుల మందును సేవించాడు" అని FIRలో పేర్కొనబడింది.
ఆ FIR (ఫస్ట్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్) 2017 సెప్టెంబర్ 17వ తేదీన తరిగోపుల పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడింది. అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ అనే గ్రామంలో సమ్మయ్య, అతడి భార్య కొండ్ర సాగరిక 6 ఎకరాల భూమిలో వర్షపు నీటితో బీటీ-పత్తిని సాగు చేసేవారు.
వాళ్లు తీసుకున్న అప్పు - అందులో బంధువుల నుండి వేర్వేరు వడ్డీ రేట్ల వద్ద తీసుకున్నదే సింహ భాగం - దాదాపు రూ. 5 లక్షలకు చేరుకుంది. వాళ్లు సాగు చేసిన భూమిలో ఒక ఎకరాకు కాస్త ఎక్కువ వైశాల్యం ఉన్నది మాత్రమే వారికి సొంతమైనది, మిగితాది వాళ్ల బంధువుల నుండి కౌలుకు తీసుకున్నది. "ప్రతి సీజన్‌కు ముందు, రైతులు సాధారణంగా అప్పు తీసుకునే ప్రక్రియలో భాగంగానే అప్పు ఈ స్థాయికి చేరుకుంది" అని సాగరిక చెప్పింది. వాళ్ల నష్టాలకు కరువు కూడా తోడైంది.
తమ సొంత భూమిని సాగు చేయడాన్ని ప్రయత్నించే ముందు, ఆ ఇద్దరూ పత్తి పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పని చేశారు. 2011లో పెళ్లి చేసుకున్న తర్వాత, కొంత సమయం పాటు హైదరాబాదులో నివసించారు. అక్కడ సమ్మయ్య డ్రైవరుగా పని చేశాడు. 2013లో సమ్మయ్య తండ్రి అనారోగ్యం పాలవడంతో వారిద్దరూ తెలంగాణాలోని జనగాం జిల్లాలోని నర్సాపూర్ అనే ఊరికి తిరిగి వచ్చారు.
2017 సెప్టెంబరులో ఆత్మహత్య చేసుకునే సమయానికి సమ్మయ్య వయసు 29 ఏళ్లు. సాగరిక వయసు కేవలం 23 ఏళ్లే. వాళ్ల పిల్లలు స్నేహిత, సాత్విక్‌ల వయసు 5 మరియు 3 ఏళ్లు. "నా భర్తతో నా పిల్లలు గడిపిన క్షణాలను వాళ్లు దాదాపు ప్రతి రోజూ గుర్తు చేసుకుంటారు" అని ఆమె చెప్పింది. "నా భర్త చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు చాలా కష్టంగా ఉండేది. ఫంక్షన్లు వేటికీ నా బంధువులు నన్ను పిలవలేదు. ఇప్పుడు నా కష్టాలు చూసిన తర్వాత నన్ను పిలవడం ప్రారంభించారు..."
తన భర్త చనిపోయిన కొన్ని నెలల తర్వాత, 2018 ఫిబ్రవరిలో తమ భూమిలో పండించిన సుమారు 7 క్వింటాళ్ల పత్తిని స్థానిక కొనుగోలుదారుకు సాగరిక అమ్మగలిగింది. ఖర్చులు పోగా మిగిలిన రూ. 12 వేలను తక్షణ అవసరాల కోసం ఖర్చు చేసింది. ఆ తర్వాత, 2018లో విత్తనాలు నాటే సీజన్‌లో మళ్లీ పత్తినే సాగు చేద్దామని ప్రయత్నించింది అయితే, దిగుబడి తక్కువగా ఉండటంతో ఆ తర్వాత ఆపివేసింది. "ఆ భూమి ఇప్పుడు ఖాళీగా పడి ఉంది, దానిని సాగు చేయడానికి చాలా ఎక్కువగా చదును చేయడంతో పాటు ఇతర పనులు కూడా చేయాలి" అని ఆమె చెప్పింది. కౌలుకు తీసుకున్న భూమి మీది లీజును కొనసాగించలేదు.
తన భర్త చనిపోయిన కొన్ని వారాల తర్వాత, భూమిని తన పేరు మీదకు మార్చాల్సిందిగా దరఖాస్తు చేయడానికి ఆమె తరిగోపుల మండల రెవెన్యూ కార్యాలయానికి (MRO) వెళ్లింది. అయితే, ఆమె భర్త సోదరుడు, తల్లి అందుకు ససేమిరా అన్నారు. అయితే 2020 జూలైలో ఒక ఎకరా భూమికి స్వంతదారు హక్కులను (తన కుమారుడిని నామినీగా పేర్కొని) పొందగలిగింది.
తన భర్త కుటుంబానికి చెందిన ఇంట్లోనే తన పిల్లలతో ఆమె నివసిస్తోంది. అద్దె కట్టమని ఆమెను అడగకపోయినా నెలవారీ ఖర్చులన్నీ ఆమె తన ఆదాయంతోనే నెట్టుకొస్తోంది. తన భర్త తండ్రి అయిన కొండ్ర ఎల్లయ్య 2014లో మృతి చెందిన తర్వాత, ఆయన భార్య అయిన కొండ్ర అంజమ్మ హైదరాబాదులో పనిమనిషిగా ఉపాధి దొరికింది.
తన భర్త తండ్రి యొక్క అన్నదమ్ములు (తాను మావయ్యలు అని పిలిచే వాళ్లు) వేరే పల్లెటూరిలో నివసిస్తారు. నర్సాపూర్‌లో సాగరిక, సమ్మయ్యలకు వాళ్లు లీజుకు ఇచ్చిన 5 ఎకరాల భూమిలో కొంత కాలం క్రితం వాళ్లే సేద్యం చేయడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం అక్టోబరులో తాను నివసిస్తోన్న ఇంటి నుండి వెళ్లిపొమ్మని ఆమెకు చెప్పారు. "ఇక్కడ (నర్సాపూర్‌లో) సేద్యం ప్రారంభించారు కాబట్టి, ఇక్కడికి వచ్చినప్పుడల్లా బస చేయడానికి చోటు కావాలి" అని ఆమె చెప్పింది. "దీపావళి కల్లా ఖాళీ చేయమని నాకు చెప్పారు, కానీ ఇల్లు ఏదీ దొరకలేదు. పల్లెటూళ్లలో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టం. ఏం చేయాలో నాకు తెలియడం లేదు."
సాగరిక తల్లిదండ్రులు నర్సాపూర్‌లో ఉంటారు. ఆమె తల్లి శాతర్ల కనక లక్ష్మి (45), ASHA వర్కర్ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్)గా పని చేస్తుంది. ఆమె తండ్రి, శాతర్ల ఎల్లయ్య (60) నర్సాపూర్‌లో దిన కూలీగా చేసే హమాలీ వృత్తిని (లోడింగ్, అన్‌లోడింగ్) చాలా ఏళ్ల క్రితం అనారోగ్యం కారణంగా నిలిపివేశాడు.
సమ్మయ్య ఆత్మహత్య తర్వాత, MGNREGA సైట్‌లలో పని ఉన్నప్పుడు, దానితో పాటు వ్యవసాయ కూలీగా వచ్చే ఆదాయంతో అన్ని ఖర్చులను నెగ్గుకొచ్చేందుకు సాగరిక ప్రయత్నిస్తోంది. "నా భర్త బ్రతికి ఉన్నప్పుడు కూడా నేను పని చేసే దానిని, అయితే బయట పని చేయడం, ఇంట్లో పిల్లలను చూసుకోవడం రెండూ నేనే చేయాల్సి వచ్చేది కాదు" అని ఆమె చెప్పింది. సమ్మయ్య లాగానే దళిత సామాజిక వర్గం అయిన అయిన మాల కులానికి చెందిన సాగరిక "ఇప్పుడు, నేను ఆధారపడేందుకు ఏ ఒక్కరూ లేరు. ఆ నిజాన్ని అతి కష్టం మీద అర్థం చేసుకోవాల్సి వచ్చింది" అని చెప్పింది.
గత సంవత్సరంలో అనారోగ్యం కారణంగా మార్చ్ నెల తర్వాత పొలాల్లో పని చేయడం నిలిపివేసింది కానీ ఏప్రిల్, మే నెలల్లో MGNREGA పని కొంత చేసింది. ఈ నెల జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొలాల్లో మళ్లీ పని చేసింది. మార్చ్ నెలలోని లాక్‌డౌన్ తర్వాత, ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 30 రోజులకు గాను MGNREGA పని దొరికింది, కానీ వేతనాల రూపంలో రూ. 1,500 మాత్రమే లభించాయి. ఆగష్ట్ నెల నుండే, క్రమం తప్పకుండా పని చేస్తోంది.
"దానికి కారణం అనారోగ్యం" అని ఆమె చెప్పింది. "పనిలో భాగంగా రోజంతా ఒంగోవాల్సి వస్తుంది. అయితే అలా చేయకూడదని డాక్టర్లు చెప్పారు. అందుకే ఆపేశాను." 2014 ఏప్రిల్‌లో వరంగల్ నగరంలోని ఒక ఆసుపత్రిలో సాత్విక్ పుట్టినప్పుడు చేసిన సిజేరియన్ ఆపరేషన్‌లో భాగంగా వేసిన కుట్ల దగ్గర రక్తం గడ్డ గట్టినట్టు గత సంవత్సరం ఫిబ్రవరిలో డాక్టర్లు కనిపెట్టారు.
గత ఆరు నెలలుగా, తరచుగా వచ్చే జ్వరాలు, అలసటతో పాటు గడ్డ గట్టిన రక్తం వల్ల వచ్చే నొప్పితో సాగరిక బాధపడుతోంది. దీని వల్ల చాలా రోజుల వరకు మంచానికే పరిమితమై ఉండాల్సి వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఆమెకు తెలియట్లేదు, ఆమెతో పాటు నర్సాపూర్‌కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగాం పట్టణంలో తాను వెళ్లే డాక్టరు కూడా కనిపెట్టలేకపోయారు.
అయినా, ఇంటి పనులన్నీ చేయడం ఆమెకు తప్పదు, అందు కోసం తెల్లవారుఝామున 5 గంటలకే నిద్ర లేస్తుంది. తర్వాత స్నేహిత, సాత్విక్‌లను నిద్రలేపుతుంది, స్నేహితను పనికి, సాత్విక్‌ను పల్లెటూరిలో తన తల్లిదండ్రుల ఇంటికి పంపుతుంది. వాళ్లు ఉదయం 9 కల్లా పనిలోకి చేరి, సాయంత్రం 6 కల్లా ఇంటికి చేరుకుంటారు.
సమ్మయ్య చనిపోయిన తర్వాత, తాను ఎంతో నేర్చుకున్నానని సాగరిక చెప్పింది. "నా గురించి ఎవరైనా [చెడుగా] మాట్లాడినప్పుడు నాకు నిరాశ కలగడం లేదు. నా పిల్లల కోసమైనా నేను బ్రతకాలని నాకు తెలుసు. ఏదైనా పని చేసుకుంటూ వాళ్లను చదివించుకుంటాను."
తన భర్త చేసిన అప్పులలో వేటినీ ఆమె తీర్చలేకపోయింది, చివరికి చిన్నవి కూడా. 2020లో తన సోదరి (అదే ఊరిలో తన భర్తతో పాటు సేద్యం చేస్తుంది) వద్ద తీసుకున్న అప్పులను తీర్చడానికి ప్రయత్నిస్తోంది. అప్పు మొత్తం రూ. 62 వేలు కాగా అందులో రూ. 50 వేలు తీర్చగలిగింది. (NSS 70వ రౌండ్ నివేదిక ప్రకారం, తెలంగాణాలో 89.1 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారంగా బతుకుతున్ణాయి. ఇది, జాతీయ సగటు 51.9 శాతం కంటే ఎంతో ఎక్కువ.)
సాగరికకు నెలకు రూ. 2 వేల వితంతు పెన్షన్ వస్తుంది, అది కాక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో రైతుల హక్కుల కోసం పోరాడే సంస్థ అయిన రైతు స్వరాజ్య వేదిక నుండి అప్పుడప్పుడు రూ. 2 వేల గౌరవ భృతిని అందుకుంటుంది. ప్రభుత్వ పథకాల ఫారంలను పూరించడంలో ప్రజలకు సాయం చేయడం, ధృవీకరణ ప్రక్రియలను పూర్తి చేయడానికి వారితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం వంటి పనులు చేసినందుకు ఈ భృతి ఇవ్వబడుతుంది.
మృతి చెందిన రైతుల కుటుంబ సభ్యులకు తెలంగాణా ప్రభుత్వం ఇచ్చే రూ. 6 లక్షల పరిహారం ఆమెకు అందలేదు.
"మొదట్లో నాకు ఎక్స్-గ్రేషియా వస్తుందని వాళ్లు [MRO అధికారులు] చెప్పేవాళ్లు. మళ్లీ రమ్మని చాలా సార్లు తిప్పించుకున్నారు. చివరికి [2018 డిసెంబరులో] వాళ్ల దర్యాప్తు ప్రకారం నా భర్తకు పల్లెటూరిలో వేరే వాళ్లతో తగాదాలు ఉన్నాయని తేలిందనీ, కాబట్టి అది ఆత్మహత్య కాదనీ ఫైల్ మూసేశారు" అని సాగరిక గుర్తు తెచ్చుకుంది.
కానీ FIRలో తగాదా గురించి ఏమీ పేర్కొనలేదు, అసలు అలాంటిదేదీ లేదని సాగరిక నొక్కి చెబుతోంది. ఆత్మహత్య తర్వాత, ఈ కేస్ 'అర్హత'ను దర్యాప్తు చేయడానికి అధికారులెవరూ తన ఇంటికి రాలేదు. MRO కార్యాలయానికి వెళ్లిన ప్రతి సారీ, తన ఫైల్‌ను మూసి వేయడానికి వేర్వేరు కారణాలు చెప్పుకొచ్చారు.
2019 నవంబరులో తన కేసును ఎందుకు మూసివేశారనే వివరాలు వెతుకుతూ, తనకు అందాల్సిన పరిహారం గురించిన స్టేటస్‌ను అడుగుతూ RTI ( సమాచార హక్కు చట్టం ) దరఖాస్తును దాఖలు చేసింది. ఇందులో, రైతు స్వరాజ్య వేదిక ఆమెకు సహాయం చేసింది. 2020 ఫిబ్రవరిలో జనగాం పట్టణానికి చెందిన రెవెన్యూ జిల్లా కార్యాలయానికి తన దరఖాస్తును పంపింది. ఇప్పటి దాకా జవాబు ఏదీ రాలేదు.
ఆ తర్వాత, మార్చి 25 నుండి అమల్లోకి వచ్చిన దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల స్కూళ్లు మూతబడటంతో ఆమె తన పిల్లల భవిష్యత్తు పట్ల ఆత్రుతగా ఉంది. జనగాం జిల్లాలో తాను చదువుతోన్న ప్రైవేట్ స్కూల్ హాస్టల్ నుండి స్నేహితను ఇంటికి పంపించారు. సాత్విక్ అదే ఊరిలోని గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నాడు, లాక్‌డౌన్ మొదలైనప్పటి నుండి ఇంట్లోనే ఉన్నాడు. 10వ తరగతి వరకు చదివిన సాగరిక "పిల్లలు ఎప్పుడూ ఇంటి బయటే ఉండి ఆడుకుంటున్నారు, వాళ్ల క్రమశిక్షణ తప్పుతోంది," అని చెప్పింది.
"దాంతో పాటు [లాక్‌డౌన్ వల్ల] దాదాపు సరుకుల ధరలన్నీ పెరిగాయి. ఒక పాల ప్యాకెట్ ధర ఇంతకు ముందు రూ. 10 ఉండేది, ఇప్పుడు రూ. 12 అయ్యింది. కూరగాయలు కొనడం కష్టంగా మారింది. ఇప్పుడు అన్నం, పచ్చళ్లు మాత్రమే తింటున్నాం. సాయంకాలం పూట పిల్లలు అడిగితేనే భోజనం పెడుతున్నాను. వాళ్లు వచ్చి 'నాకు ఆకలేస్తోంది' అని అన్నప్పుడే. లేకపోతే మేము అలానే నిద్రపోతాం."
2020 జూన్, డిసెంబర్ నెలల మధ్య ఫోన్ ద్వారా జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా ఈ వార్తా కథనాన్ని రాయడం జరిగింది.
ఈ వార్తా కథనాన్ని రాయడంలో సాయం చేసినందుకు గానూ రైతు స్వరాజ్య వేదికకు చెందిన హైదరాబాద్ వాస్తవ్యులు బొల్లవరం లక్ష్మీ ప్రియాంక, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి వినీత్ రెడ్డి గార్లకు విలేకరి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అనువాదం - శ్రీ రఘునాథ్ జోషి