ముందుగా ప్రారంభం నుంచి మొదలెడదాం...
పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) భారతదేశ వైవిధ్యం గురించి 2014 నుండి వివరిస్తూ వస్తోన్న ఐతిహాసిక వృత్తాంతం భారతీయ భాషలతో ప్రారంభమవుతుంది - గ్రామీణ ప్రాంతాలలోని 833 మిలియన్ల మంది ప్రజలు 86 విభిన్న లిపులను ఉపయోగిస్తూ, 700కు పైగా ఉన్న వివిధ భాషలలో మాట్లాడుతున్నారు. లిపులు లేని భాషలతో సహా ఈ భాషలన్నీ, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రంగా నిలిచివున్నాయి. అవి లేకుండా ప్రజల ఆర్కైవ్‌ను స్పష్టంగా వర్ణించడం అటుంచి, అసలు ఊహించలేం. PARIలో ప్రచురితమయ్యే ప్రతి ఒక్క కథా ప్రయాణంలో భారతీయ భాషల్లోని అనువాదాలు కీలక పాత్రను పోషిస్తాయి
“ఈ ఆర్కైవ్ జర్నలిజం రంగంలో అగ్రగామిగా ఉంది; ఇది అనువాదాన్ని సామాజిక న్యాయం అనే దృష్టి కోణం నుంచి చూస్తుంది" అని స్మితా ఖటోర్ చెప్పారు. "గ్రామీణ భారతీయులలో అధికసంఖ్యాకులు ఇప్పటికీ ఆంగ్ల భాషకు కాంతి సంవత్సరాల దూరంలో నివసిస్తున్నప్పటికీ, జ్ఞానాన్ని పెంపొందించటం, వ్యాప్తిచేయడం అనేది కేవలం ఆంగ్లం చదువుకున్న, ఆంగ్లం మాట్లాడేవారికి మాత్రమే చెందిన విశేషమైన హక్కుగా ఉండకుండా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది.”
పదాల సాంస్కృతిక సందర్భం, పదబంధాల సముచితత్వం, ఇంకా మరిన్ని విషయాల గురించి మా భాషా సంపాదకుల, అనువాదకుల బృందం తరచుగా తమ ఆలోచనలను పంచుకోవడం, చర్చించడం, సమాలోచన చేయడం జరుగుతుంటుంది. అటువంటి మరొక రోజు…
స్మిత: ఒడిశాలోని కురుంపురి పంచాయతీ నుండి తెలంగాణకు వలసవచ్చి, అక్కడి ఇటుక బట్టీలలో పనిచేస్తున్నవారు తనను చూసి చాలా సంతోషించిన సంగతిని పురుషోత్తం ఠాకూర్ తన కథనంలో వివరించిన ఒక సన్నివేశం గుర్తుందా? వారిలో ఒక పెద్దమనిషి అతనితో ఇలా అన్నారు: “చాలాకాలం తర్వాత నేను ఒడియా మాట్లాడే ఒక వ్యక్తిని కలిశాను. నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది!”
మరొకటి, తనకు అర్థంకాని భాషలో మాట్లాడే ఉపాధ్యాయులు, స్నేహితులు ఉన్న కొత్త బడికి అలవాటు పడటం వలస కూలీల పిల్లవాడైన రఘుకు అతి పెద్ద సవాలుగా మారటం గురించి జ్యోతి శినోలి మహారాష్ట్ర నుంచి నివేదించిన కథనం. ఈ కథలోని రఘు తల్లి గాయత్రి, "కేవలం మూడు వారాలపాటు చెన్నైలోని బడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు మా అబ్బాయి ఏడుస్తూ ఇంటికొచ్చాడు. ఇంకెప్పుడూ బడికి వెళ్ళటం తనకు ఇష్టంలేదని వాడు చెప్పాడు. బడిలో అందరూ మాట్లాడేది తనకేమీ అర్థం కాకపోవటంతో, అందరూ తనతో కోపంగా మాట్లాడుతున్నట్టుగా వాడికి అనిపించింది."
గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు భాషాపరమైన గుర్తింపు - ప్రత్యేకించి వారు జీవనోపాధిని వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చినప్పుడు - చాలా కీలకమైనది.









