పశువుల కొట్టంలోని ఇటుకలు పరిచిన మట్టి నేల మీద నున్న గేదె పేడను మంజీత్ కౌర్(48) రెండు చేతులతో ఎత్తి తీశారు. ముడుకులపై కూర్చున్న ఆమె నేలపై ఇంకా పచ్చిగా ఉన్న పేడనంతా గీరి, ఒక బాల్టా (గోలెం)లోకి ఎత్తి, దాన్ని తల మీదకు ఎత్తుకున్నారు.. తలపై ఉన్న బరువు కింద పడకుండా జాగ్రత్తగా నడుస్తూ, ఆ పశువుల పాకకున్న చెక్క గేట్లను దాటి 50 మీటర్ల దూరంలో ఉన్న పేడ కుప్ప వద్దకు వెళ్ళారు. ఆమె నెలల తరబడి పడిన శ్రమకు గుర్తుగా, ఆ పేడకుప్ప ఆమె ఛాతీ అంత ఎత్తులో ఉంది

ఇది ఏప్రిల్‌ నెలలో ఎండలు మండిపోతున్న ఓ మధ్యాహ్నం. అరగంటలో మంజీత్, ఈ చిన్న దూరాన్ని - నెత్తిపై పేడ గోలెంను మోసుకుంటూ పేడదిబ్బ దగ్గరదాకా - ఎనిమిది సార్లు తిరిగారు. చివరగా, ఒట్టి చేతులతోనే ఆ గోలేన్ని నీటితో కడిగారు. రోజూ అక్కడినుంచి ఇంటికి బయలుదేరే ముందు, ఆమె తన చిట్టి మనవడి కోసం ఒక గేదె నుండి అర లీటరు పాలను తీసి, ఒక చిన్న స్టీలు పాల డబ్బాలో నింపుకుంటారు.

ఇలా ఉదయం 7 గంటల నుండి మొదలుపెట్టి ఆమె పనిచేసే ఇళ్ళల్లో ఇది ఆరవ ఇల్లు. ఈ ఇళ్ళన్నీ హవేలియాఁ గ్రామంలోని పెత్తందారీ కులాలకు చెందిన భూస్వాములైన జాట్ సిక్కులకు చెందినవి. ఈ గ్రామం పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో ఉంది.

" మజ్‌బూరీ హై (చాలా కష్టం)," అంటారామె. నిస్సహాయతే ఆమెను బతుకుదెరువు కోసం పశువుల పాకలను శుభ్రం చేయడానికి పురికొల్పుతోంది. ఒక్క రోజులో ఆమె తన తలపై ఎంత పేడ మోస్తుందో ఆమెకే ఖచ్చితంగా తెలియదు, కానీ " బడ్డా సిర్ దుఖ్దా హై, భార్ చుక్దే చుక్దే (తలపై బరువు మోసీ మోసీ నా తల చాలా నొప్పిగా ఉంటుంది)" అని చెప్పారామె.

ఆమె ఇంటికి తిరిగివెళ్ళే దారి పొడుగునా, బంగారుపసుపు వన్నె గోధుమ పొలాలు దిగంతాల దాకా విస్తరించి ఉన్నాయి. అవి త్వరలోనే, పంజాబ్‌లో పంట కాలం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ నెలలో జరిగే బైసాఖి పండుగ తర్వాత, కోతకు వస్తాయి. గండీవిండ్ బ్లాక్‌లో ఉన్న వ్యవసాయ భూమిలో చాలా భాగం హవేలియాఁ జాట్ సిక్కులకు చెందినదే. అందులో ఎక్కువగా వరి, గోధుమ పండుతాయి.

Manjit Kaur cleaning the dung of seven buffaloes that belong to a Jat Sikh family in Havelian village
PHOTO • Sanskriti Talwar

హవేలియాఁ గ్రామంలోని ఒక జాట్ సిక్కు కుటుంబానికి చెందిన ఏడు గేదెల పేడను శుభ్రం చేస్తున్న మంజీత్ కౌర్

After filling the baalta (tub), Manjit hoists it on her head and carries it out of the property
PHOTO • Sanskriti Talwar

బాల్టా(గోలెం)ను నింపిన తర్వాత, దానిని తల మీదకు ఎత్తుకుని, పశువులశాల నుంచి బైటికి తీసుకుపోతున్న మంజీత్

కానీ, మంజీత్‌కి ఒక చల్లటి చపాతీ , టీ మాత్రమే మధ్యాహ్న భోజనం. ఆ తర్వాత ఒక గంట విశ్రాంతి. ఆమెకిప్పుడు దాహంగా ఉంది. "ఇంత ఎండలో కూడా వాళ్లు తాగడానికి నీళ్ళివ్వరు," మంజీత్ అగ్రవర్ణాలకు చెందిన తన యజమానుల గురించి చెప్పారు.

మంజీత్ మజహబీ సిక్కులలో దళిత వర్గానికి చెందినవారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నుంచి ఆమె, ఆమె కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరించడం ప్రారంభించారు. హిందుస్థాన్ టైమ్స్‌ పత్రిక 2019లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, హవేలియాఁ జనాభాలో వ్యవసాయ కూలీలుగానో లేదా రోజువారీ కూలీలుగానో పనిచేసేవారిలో మూడింట ఒక వంతుమంది షెడ్యూల్డ్ కులాల, వెనుకబడిన తరగతులకు చెందినవాళ్లు. మిగిలినవాళ్లు జాట్ సిక్కులు. జాట్ సిక్కుల వ్యవసాయ భూముల్లో దాదాపు 150 ఎకరాలు సరిహద్దు కంచెకు ఆవల, పాకిస్థాన్‌ సరిహద్దుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నాయని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.

హవేలియాఁలోని దళిత మహిళలు పేడను ఎత్తిపోసి, పశువుల పాకలను శుభ్రం చేస్తారు, లేదా జాట్ సిక్కుల ఇళ్లలో ఇంటి పని చేస్తారు.

"గరీబాఁ బారే సర్కార్ నహీ సోచదీ తాహీ తే గోహా చుక్దే హాఁ అసిఁ (ప్రభుత్వం పేద ప్రజల గురించి ఆలోచించదు, అందుకే మేం పశువుల పేడను ఎత్తిపోసి, పాకలను శుభ్రం చేస్తాం),” అని మంజీత్ అన్నారు.

ఈ పని చేసినందుకు వాళ్లకేం ఇస్తారు?

“ఒక ఆవు లేదా గేదెకు బదులుగా, మాకు ప్రతి ఆరు నెలలకు ఒక మన్ (లేదా మాండ్ - దాదాపు 37 కిలోలతో సమానం) గోధుమలు లేదా బియ్యం ఇస్తారు. ఇది పంట సీజన్‌పై ఆధారపడి ఉంటుంది." అని మంజీత్ చెప్పారు.

మంజీత్ మొత్తం 50 డంగర్లు (పశువులు)న్న ఏడు ఇళ్లల్లో పనిచేస్తారు. “ఒక ఇంటిలో 15, మరొక దానిలో ఏడు. మూడో దానిలో ఐదు, నాలుగో ఇంటిలో ఆరు …” అంటూ మంజీత్ లెక్కపెట్టడం మొదలుపెట్టారు.

15 జంతువులున్న ఒక్క కుటుంబం మినహా మిగిలినవాళ్ళంతా గోధుమ లేదా బియ్యం వాటాను సరిగ్గా చెల్లిస్తారని ఆమె చెప్పారు. "వాళ్లు 15 జంతువులకు 10 మన్ (370 కిలోలు) మాత్రమే ఇస్తారు. నేను వాళ్ల దగ్గర పని మానేయాలనుకుంటున్నా." అని ఆమె చెప్పారు.

It takes 30 minutes, and eight short but tiring trips, to dump the collected dung outside the house
PHOTO • Sanskriti Talwar

సేకరించిన పేడను బైట ఉన్న పేడకుప్పపై వేయడానికి అరగంట సమయం పడుతుంది. ఇందుకోసం శ్రమపడి బరువుమోస్తూ ఎనిమిదిసార్లు అటూ ఇటూ తిరగాలి

The heap is as high as Manjit’s chest. ‘My head aches a lot from carrying all the weight on my head’
PHOTO • Sanskriti Talwar

ఈ కుప్ప దాదాపు మంజీత్ ఛాతీ అంత ఎత్తుంది. ‘ఆ బరువునంతా నా నెత్తి మీద మోయడం వల్ల నాకు తలనొప్పి వస్తుంది’

ఆ మధ్యనే పుట్టిన మనవడికి బట్టలు కొనడానికి, ఇంటి ఖర్చుల కోసం ఏడు గేదెలు ఉన్న ఇంటివాళ్ల నుంచి మంజీత్ రూ. 4,000 అప్పు తీసుకున్నారు. అక్కడ ఆరు నెలల పనిని పూర్తి చేశాక, మే నెలలో ఆమెకు గోధుమల బకాయి చెల్లించారు. మార్కెట్ ధర ప్రకారం గోధుమ ధరను లెక్కించి, ఆమె చెల్లించాల్సిన బకాయిలకు బదులుగా గోధుమలను మినహాయించుకున్నారు.

ఏడు గేదెలకుగాను ఆమె జీతం ఏడు మన్‌లు, అంటే దాదాపు 260 కిలోలు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఈ ఏడాది క్వింటాల్ (100 కిలోలు) గోధుమల కనీస మద్దతు ధర రూ. 2,015. ఆ ప్రకారం ఆమెకు వచ్చిన 260 కిలోల గోధుమల విలువ దాదాపు రూ. 5,240. అప్పు చెల్లించిన తర్వాత, మంజీత్‌కు రూ. 1,240 విలువైన గోధుమలు మాత్రం మిగులుతాయి.

ఇంకా నగదు రూపంలో చెల్లించాల్సిన వడ్డీ కూడా ఉంది. “ప్రతి 100 రూపాయల (అప్పు) మీద వాళ్లకు నెలకు రూ. 5 ఇవ్వాలి,” అని ఆమె చెప్పారు. అంటే వార్షిక వడ్డీ రేటు 60 శాతం అవుతుంది. ఏప్రిల్ మధ్య నాటికి ఆమె రూ. 700 వడ్డీ చెల్లించారు.

మంజీత్ తన ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు – 50 ఏళ్ల ఆమె భర్త, 24 ఏళ్ల కుమారుడు కూడా వ్యవసాయ కూలీలే. ఇంకా కోడలు, ఇద్దరు మనవలు, 22, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు పెళ్లికాని కుమార్తెలు. కుమార్తెలిద్దరూ జాట్ సిక్కుల ఇళ్లల్లో ఇంటిపని చేస్తారు, ఒక్కొక్కరూ నెలకు రూ. 500 సంపాదిస్తారు.

ఆమె ఇంకో యజమాని నుండి ఎలాంటి వడ్డీ లేకుండా రూ. 2,500 అప్పు కూడా తీసుకున్నారు. కిరాణా సరుకులు కొనడానికి, వైద్యం ఖర్చులు, కుటుంబంలో జరిగే వివాహాలు, ఇతర సందర్భాల కోసం ఉన్నత కులాల వాళ్ల నుంచి చిన్నచిన్న అప్పులు తీసుకోవడం తప్పనిసరి అనీ; పశువుల్ని కొనుక్కోవడానికో, లేదా మరే ఇతర ఖర్చుల కోసమో మహిళలకు నగదు సహాయాన్ని చేసే చిన్నమొత్తం పొదుపు సంఘాల నుంచి నెలవారీ వాయిదాలు తీసుకోవాల్సిందేనని ఆమె చెప్పారు.

Manjit Kaur at home with her grandson (left); and the small container (right) in which she brings him milk. Manjit had borrowed Rs. 4,000 from an employer to buy clothes for her newborn grandson and for household expenses. She's been paying it back with the grain owed to her, and the interest in cash
PHOTO • Sanskriti Talwar
Manjit Kaur at home with her grandson (left); and the small container (right) in which she brings him milk. Manjit had borrowed Rs. 4,000 from an employer to buy clothes for her newborn grandson and for household expenses. She's been paying it back with the grain owed to her, and the interest in cash
PHOTO • Sanskriti Talwar

ఇంటి వద్ద తన చిన్నారి మనవడితో మంజీత్ కౌర్ (ఎడమ); ఆమె అతని కోసం పాలు తీసుకువచ్చే చిన్న డబ్బా (కుడి). తన మనవడికి బట్టలు కొనడానికి, ఇంటి అవసరాల కోసం మంజీత్ ఒక యజమాని దగ్గర రూ.4,000 అప్పు తీసుకున్నారు. ఆ అప్పును ఆమె తన వాటాగా వచ్చే ధాన్యంతో, దానికి వడ్డీని నగదు రూపంలో చెల్లిస్తున్నారు

పటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం (మాజీ) ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ గియాన్ సింగ్ మార్చి 2020లో 'దళిత్ ఉమెన్ లేబరర్స్ ఇన్ రూరల్ పంజాబ్: ఇన్‌సైట్ ఫ్యాక్ట్స్' అనే అధ్యయనాన్ని వెలువరించారు. గ్రామీణ పంజాబ్‌లోని దళిత మహిళా కార్మికుల కుటుంబాలలో 96.3 శాతం అప్పుల్లో ఉన్నాయని ఆయన బృందం చేసిన సర్వేలో తేలిందని ఈ అధ్యయనం చెబుతోంది. ఆ కుటుంబాల సగటు అప్పు రూ. 54,300. ఈ అప్పు మొత్తంలో 80.40 శాతం సంస్థాగతేతర వనరుల నుండి వచ్చింది.

చాలా సంవత్సరాల పాటు యజమానులుగా ఉన్నవారు వెయాజ్ (వడ్డీ) వసూలు చేయరనీ,  కొత్త యజమానులు మాత్రమే ఆ పని చేస్తారనీ హవేలియాఁలోని మరో దళిత మహిళ సుఖ్‌బీర్ కౌర్ (49) వివరించారు.

మంజీత్ ఇంటి పక్కనే ఆమె కుటుంబ బంధువు సుఖ్‌బీర్ తన భర్తతోనూ, ఇంకా ఇరవైల వయసులో ఉన్న ఇద్దరు కుమారులతోనూ కలిసి రెండు గదుల ఇంటిలో నివసిస్తున్నారు. వారంతా వ్యవసాయ కూలీలుగా, లేదా రోజువారీ కూలీలుగా రోజుకు రూ. 300 జీతానికి పని చేస్తున్నారు; అది కూడా పని దొరికినప్పుడే. సుఖ్‌బీర్‌ గత 15 ఏళ్లుగా జాట్‌ సిక్కుల ఇళ్లలో పేడ ఎత్తిపోస్తూ, పశువుల పాకలను శుభ్రం చేస్తున్నారు.

ఆమె మొత్తం 10 జంతువులున్న అలాంటి రెండు ఇళ్లలో పని చేస్తున్నారు. మూడో ఇంట్లో నెలకు రూ. 500 జీతానికి ఇంటి పని చేస్తారు. ఆమె ఉదయం 9 గంటలకన్నా ముందే పనికి బయలుదేరినా, తిరిగి రావడానికి మాత్రం నిర్ణీత సమయమంటూ ఉండదు. “కొన్ని రోజులు మధ్యాహ్నానికి, కొన్నిసార్లు 3 గంటలకు తిరిగి వస్తాను. ఒకోసారి సాయంత్రం 6 గంటలు కూడా కావచ్చు" అని సుఖ్‌బీర్‌ చెప్పారు. “ఇంటికి తిరిగి వచ్చాక నేను భోజనం సిద్ధం చేయాలి, మిగిలివున్న ఇంటి పనిని పూర్తి చేయాలి. నేను పడుకునే సరికి రాత్రి 10 గంటలు అవుతుంది.”

మంజీత్ పని ఇంకాస్త మెరుగని సుఖ్‌బీర్‌ చెప్పారు. ఎందుకంటే, చాలావరకు ఇంటి పనులన్నీ ఆమె కోడలే చేస్తుంది.

మంజీత్‌లాగే సుఖ్‌బీర్ కూడా తన యజమానుల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దాదాపు ఐదేళ్ల క్రితం ఆమె తన కుమార్తె పెళ్లి కోసమని ఒక యజమాని నుంచి రూ. 40,000 అప్పుగా తీసుకున్నారు. ప్రతి ఆరు నెలలకు చెల్లిస్తున్న ఆరు మన్‌ల (సుమారు 220 కిలోలు) గోధుమలు లేదా బియ్యం నుండి ఆమె అప్పు కింద కొంత భాగాన్ని మినహాయించినా, ఆమె అప్పు ఇంకా తీరలేదు.

Sukhbir Kaur completing her household chores before leaving for work. ‘I have to prepare food, clean the house, and wash the clothes and utensils’
PHOTO • Sanskriti Talwar
Sukhbir Kaur completing her household chores before leaving for work. ‘I have to prepare food, clean the house, and wash the clothes and utensils’
PHOTO • Sanskriti Talwar

పనికి వెళ్లడానికి ముందే తన ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటున్న సుఖ్‌బీర్ కౌర్. ‘నేను వంట చేయాలి, ఇల్లు ఊడ్చాలి, బట్టలుతకాలి, గిన్నెలు తోముకోవాలి

ప్రతి ఆరు నెలలకు ఒకసారి మొత్తం అప్పును లెక్కిస్తారు. కానీ కుటుంబ వేడుకలు లేదా ఇతర అవసరాల కోసం ఆమె ఇంకొంచెం అప్పు తీసుకుంటారు. “ తే చల్దా హీ రెహందా హై (ఇది ఇలాగే జరిగిపోతూ ఉంటుంది). అందుకే మేం ఈ రుణ చట్రం నుండి బయటపడలేం,” అని సుఖ్‌బీర్‌ చెప్పారు.

అప్పు ఇచ్చిన కుటుంబంలోని వాళ్ళు అప్పుడప్పుడూ ఆమెను కొన్ని అదనపు పనులు చేయమని ఆదేశిస్తుంటారు. "వాళ్ల దగ్గర నుండి అప్పు తీసుకున్నాం కాబట్టి దేన్నీ కాదని చెప్పలేం. మేం ఒక్క రోజు పనికి వెళ్ళకపోతే, వాళ్లు మమ్మల్ని తిడతారు. మా డబ్బులు మాకిచ్చేసి, పోయి ఇంట్లో కూర్చోండి అంటారు." అని సుఖ్‌బీర్ చెప్పారు.

పంజాబ్‌లో వెట్టిచాకిరీ, కుల వివక్ష నిర్మూలనకు 1985 నుండి కృషి చేస్తున్న దళిత్ దాస్తాన్ విరోధి ఆందోళన్ సంస్థ అధ్యక్షురాలు, న్యాయవాది-కార్యకర్త అయిన గగన్‌దీప్, ఈ పనిలో ఉన్న చాలా మంది దళిత మహిళలకు పెద్దగా చదువు లేదని చెప్పారు. "వాళ్లకు చెల్లించే ధాన్యం నుండి అప్పు కింద ఎంత ధాన్యాన్ని మినహాయించుకుంటున్నారో అన్న లెక్కలు వాళ్లకు తెలీవు. దాంతో వాళ్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు."

మాల్వా (దక్షిణ పంజాబ్), మాఝా (తరన్ తారన్ ఉన్న పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు) ప్రాంతాలలో ఇలా మహిళలపై దోపిడీ సర్వసాధారణం అని తన మొదటి పేరు మాత్రమే చెప్పుకునే గగన్‌దీప్ అన్నారు. దోఆబా ప్రాంతంలో (పంజాబ్‌లోని బియాస్, సట్లెజ్ నదుల మధ్య ఉంది) చాలామంది విదేశాలలో స్థిరపడినందున ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది."

సర్వేలో పాల్గొన్న దళిత మహిళా కార్మికుల్లో ఎవరికీ కూడా కనీస వేతనాల చట్టం, 1948 గురించి ఏమీ తెలీదని పంజాబీ విశ్వవిద్యాలయ బృందం చేసిన అధ్యయనం కూడా తెలిపింది.

పశువుల పేడను ఎత్తిపోసే మహిళలను కనీస వేతనాల చట్టం కింద నోటిఫై చేసిన షెడ్యూల్‌లో చేర్చకపోవడంవల్ల వారికి కూలీల హోదా ఇవ్వడం లేదని గగన్‌దీప్ చెప్పారు. ప్రభుత్వం గృహ కార్మికులను ఈ షెడ్యూల్‌లో చేర్చినా, ఇళ్ల వెలుపల ఉండే పశువుల పాకలను శుభ్రం చేసేవాళ్లను మాత్రం చేర్చలేదు. "ఈ మహిళలకు కూడా గంటల లెక్కన కనీస వేతనం చెల్లించాలి. ఎందుకంటే, వీళ్లు ఒక్క రోజులో ఒకటి కంటే ఎక్కువ ఇళ్లల్లో పేడను ఎత్తిపోసి, శుభ్రం చేస్తున్నారు." అని గగన్‌దీప్ చెప్పారు..

Left: The village of Havelian in Tarn Taran district is located close the India-Pakistan border.
PHOTO • Sanskriti Talwar
Right: Wheat fields in the village before being harvested in April
PHOTO • Sanskriti Talwar

ఎడమ: భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తరన్ తారన్ జిల్లాలోని హవేలియాఁ గ్రామం. కుడి: ఏప్రిల్‌ నెలలో కోతలకు ముందు గ్రామంలోని గోధుమ పంటలు

సుఖ్‌బీర్ తన కూతురి అత్తమామలకు తాను చేసే పని గురించి ఎప్పటికీ చెప్పలేరు. “వాళ్లకు తెలిస్తే మమ్మల్ని అసహ్యించుకుంటారు. తమ కొడుకు ఒక పేదింటి సంబంధం చేసుకున్నాడని వాళ్లనుకుంటారు,” అని ఆమె అన్నారు. ఆమె అల్లుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు, కానీ అతని కుటుంబం చదువుకున్నది. తాను కొన్నిసార్లు రోజువారీ కూలీగా పని చేస్తానని మాత్రం సుఖ్‌బీర్ వాళ్లకు చెప్పారు.

17 సంవత్సరాల వయస్సులో నూతన వధువుగా హవేలియాఁకు రాకముందు మంజీత్ ఎన్నడూ పనిచేసి ఎరుగరు. ఇక్కడి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె ఏదో ఒక ఉపాధిని చూసుకోవాల్సి వచ్చింది. ఆమె కూతుళ్లు ఇళ్లల్లో పని చేస్తున్నారు. అయితే జీవనోపాధి కోసం వాళ్లకెప్పుడూ పశువుల పేడను ఎత్తే పరిస్థితి రానివ్వకూడదని ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు.

తమ భర్తలు వాళ్ల సంపాదననంతా తాగుడు మీద ఖర్చు చేస్తున్నారని మంజీత్, సుఖ్‌బీర్‌లిద్దరూ చెప్పారు. “వాళ్లకొచ్చే రోజు కూలీ రూ. 300లో వాళ్లు రూ.200 తాగుడు కోసమే ఖర్చు చేస్తారు. కాబట్టి (మిగిలిన దాని మీద) జీవించడం కష్టమవుతోంది,” అని సుఖ్‌బీర్ చెప్పారు. వాళ్ళకు పని దొరకనప్పుడు భార్యల సంపాదనలో కొంత భాగాన్ని కూడా లాక్కుంటారు. "మేం వాళ్లను అడ్డుకుంటే, మమ్మల్ని కొడతారు, తోసేస్తారు, మాపై పాత్రలు విసిరేస్తారు." అని సుఖ్‌బీర్ వివరించారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 (NFHS-5) ప్రకారం, పంజాబ్‌లో 18-49 సంవత్సరాల వయసున్న వివాహిత మహిళల్లో 11 శాతం మంది భర్తలుపెట్టే శారీరక హింసను అనుభవిస్తున్నారు. దాదాపు 5 శాతం మంది భర్త తమను తోసేయడమో, బలంగా ఊపడమో, తమ మీద ఏదో ఒకటి విసిరేయడమో చేసినట్లు చెప్పారు. 10 శాతం మంది భార్యలు భర్తల చేతిలో చెంపదెబ్బలు తిన్నారు. 3 శాతం మంది పిడికిలితో లేదా హాని కలిగించే ఏదైనా వస్తువుతో దెబ్బలు తిన్నారు. ఇంకో 3 శాతం మందిని తన్నడం, లాగడం లేదా కొట్టడం చేశారు. 38 శాతం మంది మహిళలు తమ భర్తలు తరచుగా మద్యం సేవిస్తుంటారని చెప్పారు.

సుఖ్వీందర్ కౌర్(35) ఒక దళిత మజహబీ సిక్కు. ఆమె తన 15 ఏళ్ల కొడుకు, 12 ఏళ్ల కుమార్తె, అరవయ్యవ పడిలో పడిన తన మామగారితో కలిసి అదే పరిసరాల్లో నివసిస్తున్నారు. పేడను ఎత్తిపోసే పనిని చేస్తానని నేనెన్నడూ నా చిన్నతనంలో ఊహించలేదని ఆమె చెప్పారు. అయితే, తన భర్త వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నా కూడా, కొడుకు పుట్టాక తమ కుటుంబ ఖర్చులను తామే స్వయంగా చూసుకోవాలని ఆమె అత్తగారు (ఐదేళ్ల క్రితం మరణించారు) ఆమెకు చెప్పారు.

She started collecting dung and cleaning cattle sheds to manage the family expenses on her own
PHOTO • Sanskriti Talwar
Sukhvinder Kaur outside her house (left) in Havelian village, and the inside of her home (right). She started collecting dung and cleaning cattle sheds to manage the family expenses on her own
PHOTO • Sanskriti Talwar

హవేలియాఁ గ్రామంలోని తన ఇంటి బైట సుఖ్వీందర్ కౌర్(ఎడమ), ఆమె ఇంటి లోపలి భాగం (కుడి). కుటుంబ ఖర్చుల కోసం ఆమె పేడను ఎత్తి, పశువుల పాకలను శుభ్రం చేసే పనిని మొదలుపెట్టారు

పెళ్లయిన ఐదు సంవత్సరాలకు, ఆమె పేడను ఎత్తడం, పశువుల పాకలను శుభ్రం చేయడం, అగ్రవర్ణాలవారి ఇళ్లల్లో నేలను ఊడ్చి, తుడవడం వంటి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఐదు ఇళ్లలో - రెండిళ్లలో ఇంటి పనిమనిషిగా నెలకు రూ. 500 జీతానికి- పని చేస్తున్నారు. మిగిలిన మూడు ఇళ్లలో ఉన్న 31 పశువుల పేడను ఎత్తిపోసి, శుభ్రం చేస్తారు.

అంతకుముందు ఆమె ఈ పనిని అసహ్యించుకునేవారు. ఒకేసారి తాను మోసే 10 కిలోల పేడ గోలెం బరువు గురించి ఆలోచిస్తూ, "అది నాకు మోయలేని భారంగా తోచేది." ఇక దాని ఘాటైన కంపు గుర్తుకురాగానే దుఃఖం, అసహ్యం కలగలిసిన స్వరంతో " ఓ దిమాగ్ దా కిద్దా మార్ గయా (నా బుర్ర మొద్దుబారిపోతుంది)" అన్నారామె.

వ్యవసాయ కూలీగా పనిచేసే ఆమె భర్త 2021 అక్టోబర్‌లో అనారోగ్యం పాలయ్యారు. చివరికి అతని మూత్రపిండం పనిచేయడం లేదని నిర్ధారణ అయింది. వాళ్లు అతణ్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోయారు, కానీ మరుసటి రోజు ఉదయం అతను మరణించారు. "(వైద్య) నివేదికలను బట్టి, అతనికి ఎయిడ్స్ ఉందని మాకు తెలిసింది" అని సుఖ్వీందర్ చెప్పారు.

అప్పుడే ఆమె వైద్య పరీక్షల కోసం ఒక యజమాని నుండి రూ.5,000 అప్పు తీసుకున్నారు. అంత్యక్రియలు, ఇతర కర్మకాండల కోసం మొదట రూ. 10,000, ఆ తర్వాత మరో రూ. 5,000 తీసుకోక తప్పలేదు.

తన భర్త మరణానికి ముందు నెలకు నూటికి 10 రూపాయల వడ్డీకి ఆమె అప్పు తీసుకున్నారు. అంటే సంవత్సరానికి 120 వడ్డీ రేటు. ఆమె అప్పు తీసుకున్న కుటుంబ సభ్యులే ఆమె తమ ఇంట్లో నగలు దొంగిలించిందని ఆరోపించారు. “అందుకే నేను వాళ్ల ఇంట్లో పని వదిలేశాను. మరొకరి దగ్గర మరో రూ. 15,000 అప్పు తీసుకుని, వాళ్ల డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించా. చివరికి నగలు వాళ్ల ఇంట్లోనే దొరికాయి” అని సుఖ్వీందర్ చెప్పారు.

ఆమె తీసుకున్న ఆ రూ. 15,000 అప్పు ఇంకా తీరనేలేదు.

Helplessness and poverty pushes Mazhabi Sikh women like Manjit Kaur in Havelian to clean cattle sheds for low wages. Small loans from Jat Sikh houses are essential to manage household expenses, but the high interest rates trap them in a cycle of debt
PHOTO • Sanskriti Talwar

హవేలియాఁలోని మజహాబీ సిక్కు మహిళ మంజీత్ కౌర్ లాంటి వాళ్లు నిస్సహాయత, పేదరికం కారణంగా తక్కువ జీతానికే పశువుల పాకలను శుభ్రం చేస్తున్నారు. ఇంటి ఖర్చుల కోసం జాట్ సిక్కుల దగ్గర చిన్న చిన్న అప్పులు చేయడం తప్పదు, కానీ ఎక్కువ వడ్డీ రేట్ల కారణంగా వాళ్లు అప్పుల చట్రంలో ఇరుక్కుపోతున్నారు

దళిత దాస్తాన్ విరోధి ఆందోళన్, తరన్ తారన్ జిల్లా అధ్యక్షుడు రంజిత్ సింగ్ మాట్లాడుతూ, అధిక వడ్డీ రేట్ల వల్ల ఈ మహిళలు ఎప్పటికీ ఆ అప్పులను పూర్తిగా తీర్చలేరన్నారు. "వడ్డీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఒక మహిళ తన అప్పును ఎన్నటికీ తీర్చలేదు. చివరికి ఆమె బందువా మజ్దూరీ (వెట్టిచాకిరీ) వైపుకు నెట్టబడుతుంది,” అని చెప్పారు. ఉదాహరణకు సుఖ్వీందర్ రూ. 10,000 అప్పు మీద నెలకు రూ. 1,000 వడ్డీ కడతారు.

నలభై ఐదు సంవత్సరాల క్రితం, భారతదేశం వెట్టిచాకిరీ వ్యవస్థ (నిర్మూలన) చట్టం 1976 ని ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా ఉల్లంఘన జరిగితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచార నిరోధక) చట్టం, 1989 ప్రకారం, షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వెట్టిచాకిరీ చేయమని ఒత్తిడి చేస్తే అది శిక్షార్హమైన నేరం. అయితే, జిల్లా యంత్రాంగం ఈ కేసుల విచారణపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని రంజిత్ అన్నారు.

"అతను (ఆమె భర్త) బతికి ఉంటే ఇంటిని నడపటం చాలా తేలికగా ఉండేది" అని సుఖ్వీందర్ తన నిస్సహాయతను వెల్లడించారు. "మా జీవితమంతా అప్పులు తీసుకోవడం, దాన్ని తిరిగి చెల్లించడంతోనే సరిపోతోంది."

అనువాదం: రవికృష్ణ

Sanskriti Talwar

Sanskriti Talwar is an independent journalist based in New Delhi. She reports on gender issues.

Other stories by Sanskriti Talwar
Editor : Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna