రూపేశ్ మొహార్కర్ ఇరవయ్యో పడిలో ఉన్న ఆ యువతీయువకుల బృందాన్ని ఒకచోటికి చేర్చి వాళ్ళకు ఉత్సాహాన్ని రేకెత్తించేలా మాట్లాడుతున్నారు.

“ఏకాగ్రతతో ఉండండి,” అని ఆ 31 ఏళ్ళ యువకుడు అరిచారు. అక్కడున్న యువతీయువకులు అతని క్లుప్త ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. "సోమరిగా ఉండడానికి వీల్లేదు!" అంటూ, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదని అతను వాళ్ళకు గుర్తు చేశారు.

వాళ్ళు అతనితో ఏకీభవిస్తున్నట్లు తల వూపుతూ, గంభీరమైన ముఖాలతో, విజయోత్సాహంతో గట్టిగా కేక పెట్టారు. ఆ తర్వాత వాళ్ళంతా ఉత్సాహంగా తమ తమ స్ప్రింటింగ్ (కొద్ది దూరాల పరుగు), రన్నింగ్ (పరుగు), స్ట్రెచింగ్‌లకు తిరిగి వెళ్ళారు. అది వాళ్ళు నెల నుంచి చేస్తున్న శారీరక శిక్షణలో భాగం.

అది ఏప్రిల్ నెల ప్రారంభ దినాలలోని ఒక ఉదయం 6 గంటల సమయం. భండారాలోని శివాజీ స్టేడియం నగరంలోని ఏకైక ప్రజా మైదానం. ఆ మైదానం మొత్తం 100 మీటర్లు పరుగు; 1,600 మీటర్ల పరుగు; శక్తిని పెంచుకోవడానికి చేసే షాట్‌పుట్, ఇతర కసరత్తులు చేస్తూ, చెమటోడుస్తున్న యువతతో నిండిపోయివుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి మళ్ళీ గెలవాలనుకుంటున్న సార్వత్రిక ఎన్నికల గురించి వాళ్ళకసలు పట్టింపే లేదు. భండారా-గోందియా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏప్రిల్ 19, 2024న ప్రారంభమయ్యే మొదటి దశలో ఓటింగ్ జరుగుతుంది. ఇది సుదీర్ఘమైన, కష్టతరమైన, చెమటలు పట్టించే ఎన్నికల ప్రక్రియ.

ఎన్నికల పోటీలకు దూరంగా, ఈ యువతీ యువకులు రాబోయే రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సిద్ధపడుతున్నారు. వీటికోసం దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 15 ఆఖరి రోజు. దీనికి శారీరక, రాత పరీక్షలు రెండూ ఉంటాయి. పోలీస్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుల్ డ్రైవర్లు, స్టేట్ రిజర్వ్ పోలీస్ బలగాలు, పోలీసు బ్యాండ్‌మెన్, జైలు కానిస్టేబుళ్ళ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహిస్తారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

తూర్పు మహారాష్ట్రలోని భండారాకు చెందిన ఒక రైతు బిడ్డ రూపేశ్ మొహార్కర్ (ఎడమ). రాష్ట్ర పోలీసు విభాగంలో చేరడానికి శిక్షణ పొందుతోన్న రూపేశ్‌కు ఇదే చివరి అవకాశం. అతను భండారా, గోందియా జిల్లాలకు చెందిన చిన్నరైతుల పిల్లలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగ భద్రత ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలన్నదే ఈ పిల్లల లక్ష్యం

భారతదేశపు నిరుద్యోగ శ్రామిక శక్తిలో యువత దాదాపు 83 శాతం ఉంది. అయితే అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (IHD) విడుదల చేసిన 2024 భారతదేశ నిరుద్యోగ నివేదిక ప్రకారం నిరుద్యోగుల్లో మాధ్యమిక లేదా ఉన్నత విద్య పొందిన వారి వాటా 2000లో ఉన్న 54.2 శాతం నుంచి, 2022 నాటికి 65.7 శాతానికి పెరిగింది.

నిరుద్యోగం కారణంగా ఆందోళనతో ఉన్న దేశంలోని గ్రామీణ యువతను చూడాలనుకుంటే వాళ్ళను శివాజీ స్టేడియంలో చూడొచ్చు. ఇక్కడ అందరూ అందరితో పోటీ పడతారు, కానీ విజయం కొద్దిమందినే వరిస్తుందని అందరికీ తెలుసు. పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఉన్న కొద్ది ఖాళీల కోసం లక్షల మంది పోటీ పడతారు.

భండారా, గోందియాలు అడవులు సమృద్ధిగా ఉన్న, అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలు. ఈ జిల్లాలలో వరిని ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ గణనీయ సంఖ్యలో ఉన్న షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారిని పనిలోకి ఇముడ్చుకోవటం కోసం ఎలాంటి పెద్ద పరిశ్రమలూ లేవు. గత రెండు దశాబ్దాలుగా చిన్న, సన్నకారు, భూమిలేని రైతులు ఈ జిల్లాల నుండి భారీగా ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు.

ఇటీవల మహారాష్ట్ర గృహమంత్రిత్వ శాఖ 17,130 పోస్టులను జిల్లాల-కోటా వారీగా భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది . భండారా పోలీస్‌లో 60 ఖాళీలు ఉన్నాయి, వాటిలో 24 ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేశారు. గోందియాలో 110 ఉద్యోగాలు ఉన్నాయి.

వాటిలో ఒకదాని కోసం రూపేశ్ పోటీ పడుతున్నారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి వద్ద పెరిగిన రూపేశ్ కుటుంబానికి భండారా సమీపంలోని సోనులీ గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఈ పరీక్షల్లో విజయం సాధించి వర్దీ (యూనిఫామ్) ధరించడానికి ఇదే అతనికి చివరి అవకాశం.

"నాకు వేరే మార్గం లేదు," అన్నారు రూపేశ్.

PHOTO • Jaideep Hardikar

ఇటీవల భండారాలోని శివాజీ స్టేడియంలో జరిగిన శిక్షణా డ్రిల్‌లో పాల్గొన్న దాదాపు 50 మంది యువతీయువకులతో కూడిన రూపేశ్ మొహార్కర్ పటాలం

అతను తన కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే, తూర్పు మహారాష్ట్రలో ఆర్థికంగా వెనుకబడిన ఈ జిల్లాలోని దాదాపు 50 మంది యువతీయువకులకు మార్గనిర్దేశం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

రూపేశ్ తమ పోరాటాన్ని ప్రతిబింబించే విధంగా 'సంఘర్ష్' అనే పేరున్న  అకాడెమీని అనధికారికంగా నిర్వహిస్తున్నారు. అతని బృందంలోని సభ్యులంతా భండారా, గోందియా జిల్లాల్లోని అంతగా వివరాలు తెలియని చిన్నచిన్న గ్రామాలకు చెందినవారు. చిన్నరైతుల బిడ్డలైన ఈ యువతీయువకులు ఉద్యోగ భద్రత ఉన్న ఉద్యోగాన్ని సాధించి, యూనిఫామ్‌ను ధరించి, తమ కుటుంబ భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు. వీళ్ళలో ప్రతి ఒక్కరూ ఉన్నత పాఠశాల విద్యలో ఉత్తీర్ణులయ్యారు, చాలా కొద్దిమందికి మాత్రమే డిగ్రీ ఉంది.

వీరిలో  ఎంతమంది పొలాల్లో పనిచేశారు? అందరూ తమ చేతుల్ని పైకెత్తారు.

ఎంతమంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారు? వాళ్ళలో కొంతమంది గతంలో వలసవెళ్ళారు.

వారిలో ఎక్కువమంది ఎంజిఎన్‌ఆర్‌జిఎ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ప్రదేశాలలో పని చేశారు.

రూపేశ్ బృందం ఒక్కటే కాకుండా, స్టేడియం అంతా ఇలాంటి అనేక అనధికారిక అకాడమీ బృందాలతో నిండిపోయి కనిపిస్తోంది. పరీక్షలో విజయం సాధించడానికి గతంలో విఫల ప్రయత్నాలు చేసిన రూపేశ్ వంటివాళ్ళే ఎక్కువగా వీటికి నాయకత్వం వహిస్తున్నారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

భండారా నగరంలోని ఏకైక ప్రజా మైదానంలో, రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్, 2024 కోసం ఇరవయ్యో పడిలో ఉన్న యువతీ యువకులు చెమటోడుస్తున్నారు. వారిలో చాలామంది తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న మొదటిసారి లేదా రెండోసారి ఓటు వేయబోయే ఓటర్లు

ఇక్కడ శారీరక కసరత్తులు చేస్తున్న చాలామంది యువత మొదటిసారి లేదా రెండోసారి తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు; కానీ తమ కెరీర్, భవిష్యత్తు గురించి మౌనంగా ఆందోళన చెందుతున్నారు. తాము ఇతర రంగాలలో కూడా ఉద్యోగభద్రత కలిగిన ఉద్యోగాలను, నాణ్యమైన ఉన్నత విద్యను, గ్రామాల్లో మెరుగైన జీవితాన్ని, సమాన అవకాశాలను కోరుకుంటున్నామని వారు PARIకి చెప్పారు. జిల్లా పోలీసు శాఖలో స్థానికులకు కోటా కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారు.

"ఈ రిక్రూట్‌మెంట్ మూడేళ్ళ తర్వాత జరుగుతోంది," అని 32 ఏళ్ళ గురుదీప్‌సింగ్ బచ్చిల్ చెప్పారు. రూపేశ్‌లాగా అతనికీ ఇదే చివరి అవకాశం. విశ్రాంత పోలీస్ కొడుకైన బచ్చిల్ పోలీసు ఉద్యోగం కోసం దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తున్నారు. "నేను శరీర దారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణుడనవుతున్నాను, కానీ రాతపరీక్షలో తప్పుతున్నాను," ఆశావహులైన అభ్యర్థులతో నిండివున్న స్టేడియంలో తిరుగుతూ చెప్పారతను.

ఇక్కడ మరో సమస్య ఉంది: మహారాష్ట్రలోని ఇతర సంపన్న ప్రాంతాలకు చెంది, మంచి వనరులతో, మంచి శిక్షణ పొందిన అభ్యర్థులు చాలామంది భండారా, గోందియా వంటి వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న ఖాళీలను పూరించేందుకు నిర్వహిస్తోన్న ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. శిక్షణ విషయంలో వారు తమకన్నా ముందున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వామపక్ష-తీవ్రవాద ప్రభావిత జిల్లాలలో ఒకటైన గడ్‌చిరోలికి మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. ఇక్కడ స్థానిక నివాసితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అందువల్ల బయటి అభ్యర్థుల నుంచి రూపేశ్, తదితరులకు విపరీతమైన పోటీ ఎదురవుతోంది.

అందుకే, అందరూ సాధన చేస్తున్నారు, చెమటోడుస్తూ కష్టపడి సాధన చేస్తున్నారు.

స్టేడియంలోని గాలి మొత్తం వందల కాళ్ళ పరుగుల కారణంగా ఎగిసిపడుతున్న ఎర్రటి ధూళితో నిండిపోయింది. ఇక్కడ ఆశావహులైన అభ్యర్థులు - నిరాడంబరమైన ట్రాక్-సూట్లు లేదా ప్యాంట్లు ధరించినవారు, బూట్లు ధరించినవారు కొందరు, ఇంకొందరు చెప్పులు లేని కాళ్ళతో ఉన్నవారు - తమ టైమింగ్‌ను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దృష్టిని ఏదీ మరల్చలేదు, సుదూరాన ఉన్న ఎన్నికలు వాళ్ళ దృష్టిని మరల్చే అవకాశం మరీ తక్కువ.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: భండారాలోని తన అత్తకు చెందిన చికెన్ దుకాణంలో పనిచేస్తోన్న రూపేశ్ మొహార్కర్. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి వద్ద పెరిగిన రూపేశ్ కుటుంబానికి భండారా సమీపంలోని సోనులీ గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేందుకు ఇదే అతని చివరి అవకాశం. అతను ఫిజికల్ డ్రిల్స్‌లో శిక్షణ ఇస్తున్న యువతీయువకులు, అప్పుడే ముగిసిన ఉదయం సెషన్‌ తర్వాత వ్యూహం గురించీ, తమలోని లోటుపాట్ల గురించీ అతనితో చర్చిస్తూ కనిపిస్తున్నారు

రూపేశ్ కులం రీత్యా మాంసం అమ్మేవారు కాకపోయినా, అతను భండారాలోని తన అత్తకు చెందిన దుకాణంలో మాంసం అమ్మే పని చేస్తున్నారు. అది తన అత్త ప్రభా శేంద్రే కుటుంబానికి తన వంతుగా చేస్తోన్న సహాయం. అతను ఏప్రాన్ ధరించి, చాలా నైపుణ్యంతో కోళ్ళను కోసి, వచ్చీపోయే కస్టమర్లతో వ్యవహరిస్తుంటారు. ఏదో ఒక రోజు ఖాకీ యూనిఫామ్ ధరిస్తానని కలలు కంటూ అతను ఏడేళ్ళుగా ఇదే పని చేస్తున్నారు.

ఔత్సాహికులలో చాలామందికి తమ పేదరికం నుండి బయటపడటమే అతి పెద్ద లక్ష్యం.

కఠినమైన శారీరక శ్రమను తట్టుకోవడానికి కోడి మాంసం, గుడ్లు, వేటమాంసం, పాలు, పండ్లు లాంటి మంచి ఆహారం అవసరమని రూపేశ్ చెప్పారు. "మాలో చాలామందికి మంచి ఆహారం తినే స్తోమత ఉండదు," అన్నారతను.

*****

పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించిన ప్రతిసారీ ఇక్కడికి వచ్చి, బస చేసి, పరీక్షకు సిద్ధమయ్యే నిరుపేద గ్రామీణ యువతీ యువకులకు భండారా కేంద్రంగా మారింది.

శివాజీ స్టేడియంలో శతకోటి కలలు ఒకదానినొకటి తోసుకువస్తుంటాయి. రోజులు గడిచే కొద్దీ జిల్లా నుంచి మరింత మంది యువత మైదానంలోకి దిగుతారు. గడ్‌చిరోలి సరిహద్దులో ఉన్న గోందియాలోని అర్జుని మోర్‌గావ్ తహసీల్‌, అరకరొండీ గ్రామంలో ఎంజిఎన్‌ఆర్‌జిఎ పని ప్రదేశంలో మేం 24 ఏళ్ళ మేఘా మేశ్రామ్ అనే పట్టభద్రురాలిని కలిశాం. ఆమె తన తల్లి సరితతో పాటు మరో 300 మంది ఇతర గ్రామస్థులతో కలిసి ఇసుకను, బండరాళ్ళను ఒక రోడ్డు నిర్మాణ ప్రదేశానికి మోసుకెళుతోంది. అలాగే 23 ఏళ్ళ మేఘా ఆడే కూడా. మేఘా మేశ్రామ్ దళిత మహిళ (షెడ్యూల్డ్ కులం) కాగా మేఘా ఆడే ఆదివాసీ (షెడ్యూల్డ్ తెగ).

"మేం ఉదయం, సాయంత్రం గ్రామంలోనే కసరత్తులు చేసి పరిగెత్తుతాం," అని మేఘా మేశ్రామ్ నిశ్చయం నిండిన స్వరంతో చెప్పింది. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆమె తల్లిదండ్రులకు సహాయంగా రోజంతా పనిచేసి, రోజువారీ వేతనం తీసుకుంటుంది. మేఘాలిద్దరూ భండారా అకాడెమీల గురించి విని, పోలీసు శాఖలో ఉద్యోగాన్ని ఆశిస్తున్న వేలాదిమందిలో చేరడానికి మే నెలలో అక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. తమ ఖర్చుల కోసం కూలీ డబ్బులను దాచి పెట్టుకుంటున్నారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: మేఘా మేశ్రామ్ పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది; ఈ దళిత యువతి ప్రస్తుతం తన గ్రామంలోని ఎంజిఎన్‌ఆర్‌జిఎ ప్రదేశంలో తల్లి సరితకు సహాయం చేస్తోంది. కుడి: ఎంజిఎన్‌ఆర్‌జిఎ ప్రదేశం వద్ద స్నేహితురాలు మేఘా ఆడేతో మేఘా మేశ్రామ్. రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024లో పోలీసు శాఖలో చేరాలనేది ఈ ఇద్దరు పట్టభద్రుల ఆకాంక్ష

ఈ అభ్యర్థులు భండారాకు వచ్చాక గదులు అద్దెకు తీసుకుని బృందాలుగా కలిసి ఉంటూ, వంట చేసుకుంటూ పరీక్షలకు సిద్ధమవుతారు. ఎవరైనా పరీక్షలో ఉత్తీర్ణులైతే, అందరూ కలిసి సంబరాలు చేసుకుంటారు. తర్వాతి రిక్రూట్‌మెంట్‌ల ప్రకటన కోసం వేచి చూస్తూ మరుసటి రోజు ఉదయం ట్రాక్‌లకు తిరిగి వెళతారు.

ఎన్ని కష్టాలున్నా ఆడపిల్లలు మాత్రం తమ సాటి మగపిల్లల కంటే ఏ మాత్రం వెనకబడటంలేదు.

"నా ఎత్తు కారణంగా నేను అర్హత సాధించలేదు," అని 21 ఏళ్ళ వైశాలి మేశ్రామ్ ఇబ్బందిని కప్పిపుచ్చుతున్న నవ్వుతో చెప్పింది. అది తన చేతుల్లో లేదని ఆమె పెదవి విరిచింది. కాబట్టి, ఆమె 'బ్యాండ్స్‌మెన్' విభాగంలో దరఖాస్తు చేసింది, అక్కడైతే ఆమె ఎత్తు ఆమెకు అడ్డు కాదు.

వైశాలి తన చెల్లెలు గాయత్రితో పాటు మరో గ్రామానికి చెందిన 21 ఏళ్ళ మయూరి ఘరాడే అనే పోలీసు ఉద్యోగాన్ని ఆశిస్తోన్న యువతితో కలిసి గదిని పంచుకుంటోంది. చక్కగా, శుభ్రంగా ఉన్న గదిలో ఎవరి వంతు ప్రకారం వాళ్ళు వంట చేస్తారు. వాళ్ళ నెలవారీ ఖర్చు కనీసం రూ.3,000. వారికి కావాల్సిన మాంసకృత్తులు ప్రధానంగా పప్పులు, కాయధాన్యాల నుంచి అందుతాయి.

ఆకాశాన్నంటుతోన్న ధరలు తమ ఖర్చు మీద ప్రభావం చూపుతున్నాయని వైశాలి చెప్పింది. "అన్నీ ఖరీదే."

వీళ్ళ రోజువారీ కార్యక్రమం చాలా తీరికలేకుండా ఉంటుంది: ఉదయం 5 గంటలకు లేచి, శారీరక శిక్షణ కోసం సైకిల్‌పై మైదానానికి వెళతారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సమీపంలోని గ్రంథాలయంలో చదువుకుంటారు. రూపేశ్ మాంసం దుకాణంలో తన పని చేసుకుంటూనే మధ్యమధ్య అక్కడికి వచ్చి, మాక్ టెస్ట్ పేపర్ డ్రిల్స్‌లో వారికి సహాయం చేస్తారు. సాయంత్రం శారీరక శిక్షణ కోసం వాళ్ళు మళ్ళీ మైదానానికి వస్తారు; పరీక్షకు తయారుకావటంతో తమ రోజును ముగిస్తారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఫొటోలో ఉన్న ఇతర యువతుల మాదిరిగానే వైశాలి తులసీరామ్ మేశ్రామ్ (ఎడమ) రాష్ట్ర పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. తన రూమ్‌మేట్ మయూరి ఘరాడే (కుడి)తో కలిసి వైశాలి మహారాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024ను లక్ష్యంగా పెట్టుకుంది

నిజానికి రూపేశ్ లేదా వైశాలి లాంటి వాళ్ళు భవిష్యత్తు అంధకారంగా ఉన్న వ్యవసాయ రంగం నుంచి వైదొలగడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళలో చాలామంది తమ తల్లిదండ్రులు పొలాల్లో ఎలాంటి రాబడీ లేకుండా కష్టపడడాన్ని చూసినవారు. పని కోసం కూలీలుగా మారి ఎక్కడో దూరానికి వలస వెళ్ళడం వారికి ఇష్టంలేదు.

వయసు పెరుగుతున్న కొద్దీ, వాళ్ళు భద్రత ఉందని భావించే ఉద్యోగాలను, గౌరవప్రదంగా ఉండే జీవనోపాధిని పొందాలని తహతహలాడుతున్నారు. కానీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండు చోట్లా ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2024 ఎన్నికలు ప్రారంభమవుతున్న తరుణంలో, అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ భవిష్యత్తు గురించి మాట్లాడడం లేదని వీళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. 12వ తరగతిలో ఉత్తీర్ణులై, ఎక్కువ అర్హతలు లేని వీరికి ఈ పోలీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మాత్రమే అవకాశం.

వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారు?

ఆ ప్రశ్న తర్వాత సుదీర్ఘమైన నిశ్శబ్దం. అది సిలబస్‌లో లేని ప్రశ్న!

అనువాదం: రవి కృష్ణ

Jaideep Hardikar

जयदीप हार्दिकर, नागपुर स्थित पत्रकार-लेखक हैं और पारी की कोर टीम के सदस्य भी हैं.

की अन्य स्टोरी जयदीप हरडिकर
Editor : Priti David

प्रीति डेविड, पारी की कार्यकारी संपादक हैं. वह मुख्यतः जंगलों, आदिवासियों और आजीविकाओं पर लिखती हैं. वह पारी के एजुकेशन सेक्शन का नेतृत्व भी करती हैं. वह स्कूलों और कॉलेजों के साथ जुड़कर, ग्रामीण इलाक़ों के मुद्दों को कक्षाओं और पाठ्यक्रम में जगह दिलाने की दिशा में काम करती हैं.

की अन्य स्टोरी Priti David
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

की अन्य स्टोरी Ravi Krishna