ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని కోటపాలెం గ్రామంలో బంటు దుర్గారావుకు చెందిన కొబ్బరితోట త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కోటపాలెం, కొవ్వాడ, మరువాడ (మరియు అందులోని రెండు శివారు గ్రామాలు - గూడెం మరియు తెక్కలి)లను కలుపుకుని మొత్తం 2,073 ఎకరాలలో అతని సొంతానికి ఒక ఎకరం భూమి ఉంది. ఈ భూమి మొత్తాన్ని, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) కర్మాగారం కోసం జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది.
కానీ 2017 మే నెలలో, దుర్గారావుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ్ వికాస్ బ్యాంక్ నుండి రూ. 60,000 రుణం మంజూరు అయ్యింది. "ఒకవైపు బ్యాంకులు వ్యవసాయ రుణాలను మంజూరు చేస్తున్నాయి, మరో వైపు రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 33లో [అతని భూమి ఉన్న చోట] నీటి వాగు ఉందని అంటున్నారు. రెండూ ప్రభుత్వ సంస్థలే అయినప్పుడు, రెండూ ఎలా నిజం అవుతాయి?" అని ఆయన సందేహం వ్యక్తం చేశాడు.
విద్యుత్తు కర్మాగారం వల్ల దాదాపు 2,200 రైతు మరియు మత్స్యకారుల కుటుంబాలు నిర్వాసితులు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2017లో ప్రచురించిన సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ పేర్కొంది. ఈ కుటుంబాలలో అధిక శాతం OBC మరియు దళిత సామాజిక వర్గాలకు చెందినవి. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రూ. 4 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని రిపోర్ట్ అంచనా వేసింది.
ఆ మూడు గ్రామాలతో పాటు రణస్థలానికి చెందిన రెండు శివారు గ్రామాలలోని భూమిని సేకరించే ప్రక్రియ 2011లో మొదలై, 2014 ఎన్నికల తర్వాత ఊపందుకుంది. అయితే, 2018 మార్చిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం నుండి వైదొలిగింది. NPCIL ఒక కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కాబట్టి, "ఈ ప్రాజెక్ట్ మరింతగా ఆలస్యం అవుతుంది" అని కోటపాలెం గ్రామ సర్పంచ్ సుంకర ధనుంజయరావ్ చెప్పారు.
దీని వల్ల గ్రామవాసులలో అనిశ్చితి, గందరగోళం మరింత ఎక్కువయ్యాయి.
"అవసరమైన మొత్తం 225 కోట్లలో (మూడు గ్రామాలలో కలిపి 2073 ఎకరాలను సేకరించినందుకు గాను ఇవ్వాల్సిన నగదు పరిహారంలో) ఇప్పటిదాకా రూ. 89 కోట్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది," అని ధనుంజయరావ్ చెప్పారు. భూమి మార్కెట్ విలువతో పోలిస్తే చాలా తక్కువ మొత్తాన్ని ఇస్తున్నారని గ్రామవాసులు వాపోతున్నారు.
"35 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగపురం ఎయిర్పోర్ట్ కోసం చేసిన భూ సేకరణ సమయంలో ఇచ్చిన మొత్తానికి ఇంచు మించుగా మేము ఎకరాకు 34 లక్షలు డిమాండ్ చేస్తే, నాకు 15 లక్షలు మాత్రమే చెల్లించారు. అయితే, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి దగ్గరగా ఉన్నందువల్ల, ఆ భూమి మార్కెట్ విలువ [ఎకరాకు] రూ. 3 కోట్లు ఉంది," అని బడి కృష్ణ (58) నొక్కి చెప్పాడు. ఆయనకు కొవ్వాడలో (సెన్సస్‌లో జీరుకొవ్వాడ అని పేర్కొనబడింది) మూడు ఎకరాల రెవెన్యూ భూమి ఉంది, అందులో కొబ్బరి, అరటి మరియు సపోటాలను పండిస్తున్నాడు.
2013 ల్యాండ్ అక్విజిషన్ రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (LARR) చట్టం ప్రకారం, ఆ ప్రాంతంలో గత సంవత్సరంలో జరిగిన భూ-లావాదేవీల సగటు విలువ ఆధారంగా నష్ట పరిహారాన్ని లెక్కించాలి. అయితే, ఆ చట్టపరమైన విధానాన్ని అనుసరించకుండా జిల్లా యంత్రాంగం పరిహార మొత్తాన్ని రూ. 18 లక్షలుగా నిర్దేశించింది. మొత్తం 2,073 ఎకరాలలో ఇప్పటి దాకా కేవలం 20-30% ఎకరాలకు మాత్రమే పరిహారం అందజేశారనీ, వారికి అందజేసినది కూడా పూర్తి మొత్తంలో కొంత భాగం మాత్రమేనని స్థానిక సామాజిక కార్యకర్తలు అంచనా వేశారు.
ఆ 2,073 ఎకరాలలో దుర్గారావుతో పాటు కోటపాలెంలోని ఇతర దళిత కుటుంబాలకు చెందిన 18 ఎకరాలు కూడా ఉన్నాయి. 1973 ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం (వ్యవసాయ భూములపై పరిమితి) కింద, ఒక్కో కుటుంబానికి ఒక ఎకరా అందజేయబడింది. వారికి అప్పట్లో డీ-ఫారం పట్టాలను ఇచ్చారు, అంటే ఆ భూమిపై లావాదేవీలన్నీ చట్ట వ్యతిరేకమైనవిగా పరిగణించబడతాయి - ఆ భూమిని వారసత్వంగా మాత్రమే కుటుంబ సభ్యులకు బదిలీ చేయవచ్చు.
"మాకు భూమి అందినప్పుడు, దాన్ని సాగు చేసేందుకు పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన డబ్బు మా దగ్గర లేదు. అప్పట్లో నీటి పారుదల సదుపాయం ఏదీ లేదు, వర్షపు నీరు మాత్రమే ఉండేది. బోరు బావిలపై పెట్టుబడి పెట్టేందుకు కూడా మా వద్ద డబ్బు లేదు. కాబట్టి ఆ భూమిని [అగ్ర కుల] కాపు, కమ్మ రైతులకు కౌలుకు ఇచ్చాము, వాళ్లు బోరు బావులు తవ్వి, 2011 దాకా భూమిని సాగు చేశారు," అని కోటపాలెంకు చెందిన యాగటి ఆశ్రయ్య (55) చెప్పాడు. ఈ భూమిలో ఆశ్రయ్యకు కూడా ఒక ఎకరా ఉంది. ఆ దశాబ్దాల కాలంలో, ఈ గ్రామాలలో చిన్నపాటి భూముల సొంతదారులైన ఇతరులతో పాటు తను కూడా ఒక రైతు కూలీగా పని చేసేవాడు.
అణు విద్యుత్తు కర్మాగారం రాబోతోందనే వార్త కొద్ది కొద్దిగా వ్యాప్తి చెందడం మొదలవగానే, భూమి సొంతదారులు, భూమిని కోల్పోతామనే భయంతో తామే సాగు చేయడం మొదలుపెట్టారు. కానీ చాలా సందర్భాలలో నష్ట పరిహారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అగ్రకుల రైతులకు ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. "మాకు మాత్రం, మా భూములు ఒక నీటి వాగులో ఉన్నందువల్ల పరిహారం అందదని చెప్పారు" అని దుర్గారావు ప్లాటుకు పక్కనే ఒక ఎకరాకు సొంతదారు అయిన డొంగ అప్పారావు (35) చెప్పాడు.
అంతే కాక, LARR చట్టంలోని ఇతర నియమాలు - ఒక్కో కుటుంబానికి ఏక పర్యాయం అందించాల్సిన R&R సెటిల్మెంట్ ప్యాకేజీ రూ. 6.8 లక్షలు, ఇళ్లు, పడవలు, వలలు, చెట్లు, పశువుల సంపదను బేరీజు వేసి నష్టపరిహారం ఇవ్వడం వంటివి - కూడా అనుసరించలేదు. కొవ్వాడ వాసి అయిన మైలపిల్లి కన్నాంబ (56) "మావి పూరి గుడిసెలే అయినా, అలాంటివి మా దగ్గర అయిదు ఉన్నాయి. క్రమంగా మాకు వయసు మీరిపోతోంది, ఇవన్నీ తిరిగి నిర్మించుకోవాలంటే ఎన్ని ఏళ్లు పడుతుంది?"
7,248 MW (మెగా వాట్) సామర్థ్యం ఉండబోతోన్న కొవ్వాడ అణు విద్యుత్తు కర్మాగారం, 2008 భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం ప్రకారం నిర్మించబోయే మొదటి కర్మాగారం కానుంది. అది మునుపు గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలోని తలాజ తాలూకాలోని మిథివిర్డి జిల్లాలో ఏర్పాటు కావాల్సినది. అయితే అక్కడి రైతులు ఏళ్ల తరబడి దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరచడంతో, అక్కడ ప్రతిపాదించిన కర్మాగారం ఇప్పుడు కొవ్వాడకు వచ్చి చేరింది.
2032 కల్లా భారతదేశంలో అణు విద్యుత్తు సామర్థ్యాన్ని 63,000 MWకు చేర్చాలని 2006 ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, దేశంలోని ఏడు అణు విద్యుత్తు కర్మాగారాలను కలిపి మొత్తం సామర్థ్యం 6,780 MW వద్ద ఉంది. సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రతిపాదించిన కర్మాగారాలలో దాదాపు 30 వేల MW సామర్థ్యం ఉన్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతంలోనే నాలుగు చోట్ల స్థాపించబడబోతున్నాయి. ప్రస్తుతానికి, కేవలం కొవ్వాడ ప్రాజెక్ట్ మాత్రమే ముందుకు కొనసాగుతోంది, నెల్లూరు జిల్లాలోని కావలి నగరానికి దగ్గర్లోని మరో కర్మాగారం కోసం భూ సేకరణ జరుగుతోంది."
2017 ప్రపంచ అణు విద్యుత్తు పరిశ్రమల స్టేటస్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో, నిర్మాణంలో ఉన్న రియాక్టర్ల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. రష్యా, అమెరికా, స్వీడెన్, దక్షిణ కొరియా దేశాలు గత నాలుగేళ్లలో పలు రియాక్టర్లను మూసివేశాయని రిపోర్ట్ తెలుపుతోంది.
అంతే కాక, పునరుత్పాదక శక్తి యొక్క కొనుగోలు ధరలు గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుతున్నాయని అబు ధాబీలోని ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత విద్యుత్తు అవసరమైతే, అణు విద్యుత్తు, బొగ్గు ఆధారిత విద్యుత్తుకు బదులుగా పునరుత్పాదక విద్యుత్తు వనరుల మీద పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ సరళికి వ్యతిరేకంగా వెళుతూ, భారతదేశంలో పెరుగుతోన్న విద్యుత్తు అవసరాలను నెరవేర్చేందుకే అణు విద్యుత్తును ప్రోత్సహిస్తున్నట్టు ఇండియన్ ఎనర్జీ పాలసీ చెప్పుకొచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్ వద్ద విద్యుత్తు పుష్కలంగా ఉందని, రోజుకు 200 MU (మిలియన్ యూనిట్స్) ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, రోజువారీ డిమాండ్ 178 MU మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ 2017 ఏప్రిల్ నెలలో ద హిందూ దినపత్రికకు వెల్లడించారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ పూర్వ కేంద్ర సెక్రెటరీ, డా. ఇ. ఎ. ఎస్. శర్మను ఈ విలేకరి సంప్రదించినప్పుడు "ఇదివరకే విద్యుత్తు పుష్కలంగా ఉన్న రాష్ట్రంలో ఇన్నిన్ని అణు రియాక్టర్లను స్థాపించాల్సిన అవసరం ఏమిటి?" అని ప్రశ్నించారు.
అయితే, NPCIL పూర్వ ఛీఫ్ ఇంజినీర్, కొవ్వాడ అణు విద్యుత్తు కర్మాగారానికి పూర్వ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. వి. రమేశ్ "ఉత్పత్తి చేయబోయే అణు విద్యుత్తులో ఒక్కో MWకు రూ. 24 కోట్లు ఖర్చు చేసి, ఆ విద్యుత్తును ప్రజలకు ఒక KWhకు (కిలోవాట్-అవర్) రూ. 6ల సబ్సిడీ ధర వద్దే పంపిణీ చేస్తాము" అని నాతో చెప్పారు.
అయితే శాస్త్రవేత్తల అధ్యయనాలలో వేరే విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ యొక్క పూర్వ డిప్యూటీ డైరెక్టర్ డా. కె. బాబూ రావు "అణు విద్యుత్తును ఒక KWhకు రూ. 1 వద్దే ఇస్తామని గతంలో NPCIL చెప్పింది, ఇప్పుడు దానిని రూ. 6కు పెంచారు. వాళ్లు శుద్ధ అబద్ధాలు చెబుతున్నారు. మొదటి సంవత్సరమే ఆ విద్యుత్తుపై ఛార్జీలు ఒక్కో KWhకు రూ. 19.80 నుండి రూ. 32.77 వరకు ఉంటాయి." అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ సంస్థ 2016 మార్చి నెలలో చేసిన ఒక అధ్యయనంలో పేర్కొన్న ఛార్జీలను డా. బాబూ రావు పేర్కొన్నారు.
అంతే కాక, కొవ్వాడలో అణు విద్యుత్తు కర్మాగారానికి అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డ్ (AERB) ఇంకా సైట్ క్లియరెన్స్‌ను మంజూరు చేయనేలేదని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాష్ట్ర సెక్రెటేరియట్ నర్సింగ రావు పేర్కొన్నారు. "ప్రాజెక్ట్ యంత్రాంగం పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డ్ నుండి క్లియరెన్స్‌లను పొందడానికి ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉంది. 2009లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ డీల్‌ను అమలు చేయాల్సిన జనరల్ ఎలెక్ట్రిక్ సంస్థ, ఈ ఒప్పందం నుండి వైదొలగింది. ఇప్పుడేమో వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్ కంపెనీ దివాళా తీసి, ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది" అని ఆయన చెప్పారు. "AERB, WEC రెండూ ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా లేవు, అలాంటప్పుడు, ప్రధాన మంత్రి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భూ సేకరణ చేయడానికి ఎందుకింత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు?"
భూసేకరణ కొనసాగుతుండగానే, కొవ్వాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరాన ఎట్చెర్ల మండలానికి చెందిన ధర్మవరం గ్రామంలో 200 ఎకరాలలో ఒక టౌన్షిప్ నిర్మాణం జరుగుతోంది. విద్యుత్తు కర్మాగార నిర్మాణం మొదలై, ఆ అయిదు గ్రామాలకు చెందిన కుటుంబాలు నిర్వాసితులైనప్పుడు, వారందరికీ ఈ టౌన్షిప్లో ఆవాసం కల్పించాలని ప్రణాళికలో ఉంది.
కొవ్వాడలో నిర్వాసితులుగా మారేందుకు వేచి ఉన్న మైలపిల్లి రాము (42) అనే మత్స్యకారుడు, నిర్వాసితుడిగా మారడం వల్ల, చేపలు పట్టడం తిరిగి లాభదాయకం అవుతుందనే ఆశతో ఉన్నాడు. ( కొవ్వాడలో మత్స్యకారుల ఉపాధిపై భారీ ఫార్మా పరిశ్రమల ప్రభావం అనే కథనాన్ని చూడండి) "ఫార్మసూటికల్ పరిశ్రమలు చేసే నీటి కాలుష్యం వల్ల ఇక్కడ [కొవ్వాడ తీరంలో] మేము చేపలు పట్టడం కొనసాగించలేము. ధర్మవరం కూడా తీరానికి దగ్గరే ఉంటుంది కాబట్టి, అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ చేపలు పడదామనే ఆశతో ఉన్నాం," అని ఆయన చెప్పాడు. అయితే, ఫార్మా కంపెనీల కాలుష్యంతో పోలిస్తే ఆ ప్రాంతం మొత్తంలో అణు విద్యుత్తు కర్మాగారం వల్ల ఏర్పడే కాలుష్యం పలు రెట్లు అధికంగా ఉండవచ్చనే సంగతి ఆయనకు తెలియదు.
ఈ అణు విద్యుత్తు కర్మాగారం వల్ల ఒకవేళ తాము నిర్వాసితులైతే అందుకు న్యాయమైన, చట్టబద్ధమైన నష్ట పరిహారం పొందడానికి గాను హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఒక కేసును దాఖలు చేయాలని కొందరు గ్రామవాసులు సిద్ధమవుతున్నారు.
అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి