ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పండే మిరప పంటను కొయ్యడానికి సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గడ్, ఒడిశాల నుంచి ఎందరో యువ కూలీలు వస్తారు. వాళ్ళిక్కడికి వచ్చేది కూలీ డబ్బులకోసం కాదు- ఏడాదిపొడుగునా వాడుకోవడానికి సరిపొయ్యే మిరపకాయల కోసం. ఈ కారపు దినుసును నిల్వచేసుకోవాలనే కోరిక ఎంతటిదంటే, ఇందుకోసం వాళ్ళల్లో కొందరు బాలబాలికలు బడి కూడా మానేసి వస్తారు. ఈ రోజువారీ ప్రధాన ఆహారాన్ని సేకరించి ఇంటికి తీసుకురావడానికి సంవత్సరంలో వారికి దొరికే ఏకైక అవకాశం ఇదొక్కటే మరి.

వీరికిది రోజువారీ ఆహార పదార్థం. పిల్లలు వారి కుటుంబాల్లోని పెద్దలకంటే చాలా తక్కువ కారం తింటారు. కానీ వాళ్ళ కుటుంబాలకి రోజూ కావాల్సిన మిరపకాయలు సంపాదించడంలో మాత్రం పిల్లల పాత్రే ఎక్కువ. ఈ పనిచేసేవాళ్లలో సగం మంది పిల్లలే. తిరిగి మిరపపంట కాపుకి వచ్చేవరకు సరిపోయేలా ఈ విలువైన మిరపకాయల్ని "సంపాదిస్తారు". రోజు కూలి 120 రూపాయలు తీసుకునే బదులు ఎక్కువమంది అంతకు సమానమైన మిరపకాయలు తీసుకోవడానికే మొగ్గుచూపుతారు. చేసే పనిని బట్టి మొత్తంమీద అర క్వింటాల్, లేదా ఒక్కోసారి క్వింటాల్ దాకా మిరపకాయలు వస్తాయి. కిలో 100 రూపాయలు అనుకుంటే క్వింటాల్‌కి రూ.10,000 కూలీ వచ్చినట్టు.

వాళ్ల కుటుంబాలకిది మంచి సంపాదనే. ఒక కుటుంబం సంవత్సరానికి 12 నుంచి 20 కిలోల మిరపకాయలు వాడుకుంటుంది. అదనపు ఆదాయం కోసం మిగిలిన సరుకుని వాళ్ళు మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఇలా మిరపకాయలు కూలీగా తీసుకోవడంవల్ల కారానికి ఏడాదంతా లోటు ఉండదు- అది కూడా చేను నుండి తాజాగా కోసిన నాణ్యమైన మిరపకాయలు!

"మా గ్రామం నుంచి మేం 20 మందిమి వచ్చాం. ఇక్కడ మూడు వారాల పాటు ఉంటాం," ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలోని గుటుముడా గ్రామం నుంచి వచ్చిన ఉమాశంకర్ పొడియామి అన్నారు. "మా బృందంలోని ప్రతి ఒక్కరూ కూలీగా డబ్బు తీసుకోవడంకంటే మిరపకాయలు తీసుకోడానికే ఇష్టపడతారు".

PHOTO • Purusottam Thakur

తన కుటుంబానికి కావాల్సిన మిరపకాయలు సంపాదించడం కోసం మల్కాన్‌గిరి జిల్లా నుంచి వచ్చిన ఉమాశంకర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పచ్చిమిరప తోటల పక్కనే ఉన్న రోడ్లకిరువైపులా ఈ ఎర్రటి మసాలా దినుసు పెద్ద పెద్ద రాశులుగా పోసివుంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య మిరపకాయలు పుస్కలంగా లభిస్తాయి. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుండి ఎక్కువగా వచ్చే ఆదివాసీ కార్మికులు మిరపకాయలను తెంపి, నాణ్యత ప్రకారం వేరుచేసి, బస్తాలకెత్తి, చిల్లర అమ్మకానికో లేదా, ఎగుమతి చేయడానికో మార్కెట్‌కు తీసుకెళ్లడం కోసం సిద్ధం చేస్తారు.

ఉత్సాహవంతులైన పిల్లలు - మొత్తం కూలీల్లో సగంమంది వీళ్ళే - మిరప కుప్పల చుట్టూ పరుగులు తీస్తూ, మిరపకాయలను సైజులవారీగా వేరుచేసి గోనెబస్తాలలోకి ఎత్తుతున్నారు. ఉత్సాహం కంటే కూడా వాళ్ళ పేదరికం వాళ్ళనీ చేలకు వచ్చేలా చేస్తోంది. వీరిలో ఎక్కువ కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నవే. తమ సొంత ప్రాంతాలలో పనులు దోరకకపోవటం వాళ్ళని సరిహద్దు దాటించి అత్యధికంగా మిరపను పండించే ఈ రాష్ట్రాలకు తీసుకొస్తోంది.

PHOTO • Purusottam Thakur

మిరపకాయలు సేకరించే పనిలో వున్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు

అంతేకాదు, ఉదయాన్నే తినే సద్దితో సహా  సంవత్సరమంతా వారి తిండిలో ఖచ్చితంగా ఉండేది ఒక్క మిరపకాయ మాత్రమే. తినడానికి ఇంకే ఆహారపదార్థాలు లేకపోయినా, మిరపలోని పోషకాలు వారిని జీవించగలిగేలా చేస్తాయి. ఇది కొన్ని రుచిలేని వంటకాలకు మసాలారుచిని కూడా జోడిస్తుంది. ఆహారంగానే కాకుండా వారి కొన్ని ఆచారాలలో కూడా ఉపయోగిస్తారు కాబట్టి మిరపకాయలకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని మిరప తోటల్లో పనిచేయడానికి సరిహద్దు దాటి ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారిలో 14 ఏళ్ల వెట్టీమోయే కూడా ఉన్నాడు. అతను సుక్మా జిల్లా బడేసిటీ గ్రామంనుంచి వచ్చాడు. రెండేళ్ల క్రితం తండ్రి మలేరియాతో చనిపోవడంతో బడి మానేసి కుటుంబానికి చెందిన చిన్న వ్యవసాయ భూమిలో పనికి దిగాల్సివచ్చింది. అప్పుడప్పుడు భవన నిర్మాణ కూలీగా కూడా పనిచేస్తాడు. తన కొద్దిపాటి భూమిలో పంటకోతలు అయిపోయాక, మిరపకాయల కోసం ఈ పనికి వచ్చాడు.

గ్రామంలోని మరో 35 మందితో కలిసి మోయే ఇక్కడికి వచ్చాడు. అందరూ డబ్బుకు బదులుగా మిరపకాయలే కూలీగా కావాలని అన్నారు. "మిరపకాయలు కొయ్యడానికి రోజు కూలి 120 రూపాయలు," అన్నాడు మోయే. "ఒకవేళ మిరపకాయల రూపంలో చెల్లించేట్టయితే, మేం కోసే మిరపకాయల్లో ప్రతి 12 లాటుల్లో 1 లాటు మాకు ఇస్తారు. మేం కూలిగా మిరపకాయలు తీసుకోడానికే ఇష్టపడతాం."

మిరపకాయల కాలం ముగిసే సమయానికి, సరిహద్దులను దాటి పనికోసం వచ్చిన ఈ పిల్ల కూలీలు తమ ఇంటిని నిలబెట్టడానికి, తమ జీవితాలకు కొంత మసాలాను జోడించడానికి తమ మిరప సంపదను ఇళ్ళకు తీసుకువెళతారు. మిరపకాయలు ఇంట్లోకి రావాలంటే బడి, మిగతా పనులు వెనక్కి వెళ్లాల్సిందే మరి.

PHOTO • Purusottam Thakur

సంవత్సరానికి సరిపడా మిరపకాయలను బస్తాలతో తీసుకువెళ్తున్న కూలీలు


అనువాదం: వి. రాహుల్జీ

Purusottam Thakur

पुरुषोत्तम ठाकुर, साल 2015 के पारी फ़ेलो रह चुके हैं. वह एक पत्रकार व डॉक्यूमेंट्री फ़िल्ममेकर हैं और फ़िलहाल अज़ीम प्रेमजी फ़ाउंडेशन के लिए काम करते हैं और सामाजिक बदलावों से जुड़ी स्टोरी लिखते हैं.

की अन्य स्टोरी पुरुषोत्तम ठाकुर
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

की अन्य स्टोरी Rahulji Vittapu