గత మూడేళ్ళలో ఒక్కరు కూడా నాగలి చేయించుకోలేదు. కనీసం గొడ్డలి, పారలకి పిడి కూడా చేయించుకోలేదు. అంటే అర్థం, వ్యవసాయ పనిముట్లు చేసే బంగారు రామాచారి కష్టాల్లో వున్నారని. ఎన్నో ఏళ్ళుగా అతను ముకుందాపురంలో ఉన్న ఏకైక వడ్రంగి. ఆయనకు భూమి లేదు. పశువులు లేవు, రైతూ కాదు. కానీ ఆతని బాగోగులన్నీ ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలోని ఆ గ్రామంలో జరిగే వ్యవసాయం మీదే ఆధారపడివున్నాయి.

"వ్యవసాయం బాగాలేనప్పుడు రైతులే కాదు అందరూ చిక్కుల్లో పడతారు," అన్నారు ఎస్. శ్రీనివాస్ అనే ఇక్కడి రాజకీయ కార్యకర్త. "రామాచారి పరిస్థితి మరీ ఘోరం. ఆయన ఆకలితో చనిపోయారు. అది కూడా నాగార్జున సాగర్ ఆనకట్ట ఎడమకాలువ ఆయకట్టులోనే ఉన్న గ్రామంలో. ఇంతకుముందు ఏళ్ళకు ఏళ్ళు వ్యవసాయం బాగా సాగిన చోట.

వ్యవసాయ సంక్షోభం దుష్ప్రభావ ప్రకంపనలు ఆ రంగాన్ని దాటి విస్తరించాయి. రైతులను ఆత్మహత్యల వైపుకు నెడుతున్న ఈ సంక్షోభం కుమ్మరులు, చర్మకారులు, వడ్రంగులు వంటి ఎన్నో వ్యవసాయ అనుబంధ రంగాలవారిని కూడా సంక్షోభంలోకి నెట్టింది. సున్నితమైన, తరాల నాటి అనుబంధ రంగాల సంబంధాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి.

"నేను విజయవాడలో చెప్పుల కంపెనీలో పనికి వెళ్ళాను," అన్నారు చనిపోయిన రామాచారి భార్య అరుణ. వడ్రంగి సామాజిక వర్గానికి చెందిన మహిళలు సామాన్యంగా పనికోసం వలస పోరు. "మరో మార్గం లేదు," అందావిడ. "నేను ఇంతకు ముందెప్పుడూ ఇలా పనికోసం వలసవెళ్ళలేదు. కానీ ఇక్కడ పని దొరికే అవకాశాలు తక్కువ." నెలకొకసారి వచ్చేటట్టు పిల్లల్ని భర్త దగ్గర వదిలేసి వెళ్ళింది ఆవిడ.

"రామాచారికి ఒకప్పుడు 40 మంది దాకా ఖాతాదారులు వుండేవాళ్ళు," అన్నారు శ్రీనివాస్. "అతనితో పని చేయించుకున్నందుకు వాళ్ళతనికి ధాన్యం ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కరు ఏడాదికి 70 కిలోల ధాన్యం ఇచ్చేవాళ్ళు." మొత్తం వచ్చే 2800 కిలోల ధాన్యంలో తన కుటుంబానికి కావాల్సిన ధాన్యం ఉంచుకుని, మిగతాది మార్కెట్లో అమ్మేసేవారు. "70 కిలోలకు 250 రూపాయలు వచ్చేవి. అవి బియ్యం కాదు, వడ్లు అని గుర్తుంచుకోవాలి." తన కుటుంబ అవసరాలకు ఉంచుకుని మిగతా వడ్లు అమ్మితే సంవత్సరానికి 4000 రూపాయలు వచ్చేవి. దానితో అతను తన కుటుంబాన్ని పోషించుకునేవారు."

అతనికి ఇంకా ఎక్కువమందే ఖాతాదారులు ఉండేవారు. కానీ వ్యవసాయం పరిస్థితి బ్రహ్మాండంగా వున్నప్పుడు అతనికి కష్ఠాలు మొదలయ్యాయి. ఊర్లోకి వచ్చిన 12 ట్రాక్టర్ల వల్ల అతనికి పని తగ్గిపోయింది. "అది శరీరకష్టం చేసే వాళ్లందరినీ దెబ్బకొట్టింది," కె. లింగయ్య అన్నారు. అతనిలాంటి భూమి లేని కూలీలందరి పనీ అప్పటినుంచి కష్టంగానే వుంది. ఊర్లోకి ట్రాక్టర్లు రావడం రామాచారికి పెద్ద దెబ్బ. అయినా అతను తన వృత్తిని కొనసాగిస్తూ ఏదో ఒకరకంగా నెట్టుకొచ్చారు. "అతనికి ఇంకో పని రాదు," అన్నారు అరుణ. అతను 5వ తరగతి వరకూ, ఆమె 4వ తరగతి వరకూ చదివారు.

PHOTO • P. Sainath

తమ పిల్లలను భర్త రామాచారి వద్ద వదిలి నెలరోజుల పాటు పని కోసం అరుణ వలస వెళ్ళారు

ట్రాక్టర్లు కేవలం ప్రారంభం మాత్రమే. 1990ల్లో వ్యవసాయంలోకి - అవి ప్రభుత్వానివైనా ప్రైవేటువైనా - కొత్త పెట్టుబడులేవీ రాలేదు. ఈ స్తబ్ధతకు పంట నష్టం కూడా తోడయ్యింది. రైతులు కొత్త పనిముట్లను చేయించుకోవడం మానేశారు. రామాచారికి ఇది సంకటంగా మారింది. "పాత పనిముట్లను ఎందుకు మార్చటం? వాటి ఖరీదుని మేమెక్కడ భరించగలం? కొత్తవాటిని మేమేం చేసుకుంటాం?" గ్రామ ప్రజలు ప్రశ్నించేవారు. ఆదే సమయంలో ఉన్న ఆ కాస్త వ్యవసాయానికి కూడా పనికిరాకుండా పాత పనిముట్లు ఇంకాస్త పాడైపోయాయి.

అలాగే ప్రతి ఒక్కరూ రుణ ఊబిలో చిక్కుకుంటున్నారు. వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోవడం, పంటలు నష్టపోవడం వల్ల చాలమంది రోజులు గడవడానికి అప్పులు చేయాల్సివచ్చింది. స్వాభిమాని, ప్రతిభ వున్న చేతివృత్తి నిపుణుడైన 45 ఏళ్ళ రామాచారి, ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. వాస్తవానికి అంతనికున్న 6000 రూపాయల అప్పు ఆ ప్రాంతంలో అందరికీ ఉన్న అప్పులతో పోలిస్తే చాలా తక్కువ.

"ఈ గ్రామం ఒక్క సహకార సంఘానికే రూ. 22 లక్షల అప్పు వుంది," ఆ సంస్థ అధికారి కె. రెడ్డి అన్నారు. వాళ్ళు గ్రామీణ బ్యాంకుకి రూ. 15 లక్షలు, స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్‌కి మరో రూ. 5 లక్షలు అప్పు వున్నారు. "అదేమంత పెద్ద మొత్తం కాదు," అన్నారు వామపక్ష కార్యకర్త ఎస్. శ్రీనివాస్. "ముకుందాపురం గ్రామం ప్రజలు వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పే ఇంకా చాలా పెద్దది." ఇక్కడి ప్రజలను తీసుకుంటే వారి అప్పు దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

అంటే, 345 కుటుంబాలున్న ఈ గ్రామానికి రూ. 1.5 కోట్ల అప్పు ఉంది. జీవితం కేవలం మనుగడ కోసం ఆడే ఆటగా మారుతుండటంతో, వ్యవసాయం మునిగిపోవటం మొదలయింది. భూముల ధరలు కూడా ఒకప్పుడు రూ. 1,20,000 వుండే ఎకరం ధర ఇప్పుడు రూ. 60,000కు పడిపోయింది. "మామూలుగా జనం భూములు పోగొట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు," అన్నారు జిల్లాలో రైతు సంఘం నాయకుడు గంగి నారాయణ్ రెడ్డి. "కానీ ఇప్పుడు తెగనమ్ముదామన్నా కొనేవాళ్ళు లేరు."

కొంతమంది ట్రాక్టర్ యజమానులు తమ ట్రాక్టర్లను తమకు అప్పిచ్చినవారికి వదులుకోవాల్సివచ్చింది. కానీ అదేమీ రామాచారికి కలిసిరాలేదు. ట్రాక్టర్ వాడని రైతులు కూడా పనిముట్లు మార్చాలని అనుకోవడం లేదు. "ఏడాదికి ముగ్గురు నలుగురు ఖాతాదారులు మిగిలారు చివరకి," అన్నారు శ్రీనివాస్. ఇటీవల గ్రామస్థులు 30 పైగా ఎద్దులను గతిలేక అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే, వడ్రంగులకి ఇప్పుడు వాటికి అవసరమయ్యే వస్తువులను చేసేపని కూడా పోయింది.

PHOTO • P. Sainath

'వ్యవసాయ పనిముట్లను దేనికోసం మార్చుకోవాలి? కొత్త పనిముట్లతో ఏం చెయ్యాలి?' గ్రామ ప్రజలు అడుగుతున్నారు

తర్వాత, వలసలు మొదలయ్యాయి. "ఇంతకుముందు 500 మంది కూలీలు పనికోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవాళ్ళు," అన్నారు గంగి రెడ్డి. "ఇప్పుడదంతా పోయింది. 250 మంది జనం ఇక్కడినుంచే పనికోసం వలస పోతున్నారు."

ఈ ఏడాది గ్రామమంతా ఆకలితో అలమటించింది. రామాచారి పరిస్థితి మరింత ఘోరం. విషాదమేమిటంటే, వీళ్ళు కష్టాలలో గడిపిన ఆ రెండేళ్ళ కాలంలో భారతదేశం తన దేశంలో అత్యంత పేదలు చెల్లించే ధరల కంటే కూడా తక్కువ ధరకు ధాన్యాన్ని ఎగుమతి చేసింది. ఒకే ఒక్కసారి తన పొరుగింటి అతని దగ్గర కొంత డబ్బు అప్పు చేసి, ఈ వడ్రంగి నూకలు కొన్నారు. ఆ నూకల్లో ఇంకా కొన్ని ఇంట్లోనే వున్నాయి. వాటిని పారెయ్యడానికి అరుణకు మనసురాలేదు.

ఆవిడ పనికోసం నగరానికి వెళ్ళాక గ్రామంలో రామాచారి ఆకలితో అలమటించారు. "మేం చాలాసార్లు పిల్లలకి అన్నం పెట్టేవాళ్ళం," అన్నారు ముత్తమ్మ అనే పొరుగింటావిడ. "కానీ రామాచారి అంతా బాగున్నట్టే పైకి కనిపించేవాడు. గత వారంలో 5 రోజుల పాటు అతను ఒక్క మెతుకైనా అన్నం తినలేదు. కానీ చెప్పుకోడానికి సిగ్గుపడ్డాడు." వారి ఇరుగు పొరుగువాళ్ళ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. అయినా వాళ్ళు పిల్లలకు అన్నం పెట్టి కాపాడారు. ఈ మే నెల 15వ తేదీన రామాచారి కుప్పకూలిపోయారు. అరుణ హుటాహుటిన విజయవాడ నుంచి వచ్చేసరికే అతను చనిపోయారు.

అనేక పొరల వ్యవసాయ సంక్షోభం రామాచారిని ముంచెత్తింది. ఇంచుమించు ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఎంతోమంది రైతుల ఆత్మహత్యలకు కూడా దారితీసింది. ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని నాశనం చేసాయి. పెట్టుబడి లేమి. విపరీతమైన ఖర్చులు. పంట నష్టం. పెరిగిపోతున్న అప్పులు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం. అతని నైపుణ్యానికి తరిగిపోయిన గిరాకీ. ఇంకొన్ని పొరలు కూడా.

ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకుంటుందన్న ఆశతో ఉన్నారు అరుణ. రామాచారి దరఖాస్తు చేసుకున్న ఒకే ఒక్క ప్రభుత్వ కార్యక్రమం, చేతివృత్తులవారికి కొత్త పనిముట్లు ఇచ్చే పథకం 'ఆదరణ'. కానీ ఆ పనిముట్లు వచ్చేలోపే వడ్రంగి వెళ్ళిపోయారు.

ఈ వ్యాసం సంక్షిప్తంగా మొదట ‘ ది హిందూ ’ పత్రికలో అచ్చయ్యింది.

అనువాదం: వి. రాహుల్జీ

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

की अन्य स्टोरी Rahulji Vittapu