ఫలై గ్రామంలో ఒక గుడిసెలో, మహారాష్ట్ర లో వాయువ్య దిశగా సత్పుడా కొండల నడుమ, ఎనిమిదేళ్ల షర్మిల పావ్ర ఆమె ‘స్టడీ టేబుల్’ వద్ద పెద్ద కత్తెర, బట్టలు, సూది దారాలతో. కుర్చుని ఉంది
ఆ టేబుల్ మీద ఒక పాత కుట్టు మెషిన్ ఉంది. దాని మీద వాళ్ళ నాన్న ఇంకా కుట్టడం పూర్తి చెయ్యని ఒక డ్రెస్ ఉంది. ఆమె దానిని తీసుకుని, కుట్టుమెషిన్ మీద పనిచేయడంలో తన నైపుణ్యాన్ని మెరుగు పరచుకుంటోంది.
నందుర్బర్ జిల్లాలో తోరణమాల్ ప్రాంతంలోని ఈ కుగ్రామంలో ఉన్న ఈ టేబుల్ పైనే ఆమె ఏదన్నా నేర్చుకునేది. మార్చ్ 2020 లో ఆమె హాస్టల్(రెసిడెన్షియల్ స్కూల్) మూసేసినప్పటి నుంచి ఇదే ఆమె నేర్చుకునే స్థలం. “అమ్మ నాన్న కుట్టడం చూసి, ఈ మెషిన్ నడపడం నా అంతట నేనే నేర్చుకున్నాను. ” అన్నది ఆమె.
ఆమె తన బడిలో నేర్చుకున్నదంతా, ఈ పద్దెనిమిది నెలల విరామంలో పూర్తిగా మర్చిపోయింది.
ఫలైలో బడి లేదు. తమ పిల్లలకు చదువు చెప్పించుదామన్న కోరికతో, 2019లో, షర్మిల తల్లిదండ్రులు నందుర్బార్ పట్టణంలోని అటల్ బిహారి వాజపేయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ లో వేశారు. ఇది వారి ఊరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 60 ఆశ్రమశాలల్లో (షెడ్యూల్ ట్రైబ్ వర్గాల కోసం ప్రత్యేకమైన బడులు) ఈ బడి కూడా ఒకటి. వీటిని జిల్లా పరిషత్తు నడుపుతుంది, ఇది 2018లో మహారాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డుకు అనుసంధానించబడింది. అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పబడిన దీని విద్యా విధానం స్థానికంగా రూపొందించి,మరాఠీ భాషలో భోదించబడుతుంది.(ఇప్పుడు ఆ బోర్డుని తీసేశారు, ఇవి ఇప్పుడు స్టేట్ బోర్డు లో భాగమయ్యాయి.)
షర్మిల బడికి వెళ్లడం మొదలుపెట్టే సమయానికి మరాఠి ఆమెకి కొత్త భాష. ఆమె పావ్రా వర్గానికి చెందినది, ఇంట్లోవాళ్ళు కూడా పావ్రా భాష మాట్లాడతారు. నా నోట్ బుక్ లో ఉన్న మరాఠి పదాలను చూసి కొన్ని అక్షరాలను గుర్తుకుతెచ్చుకుంది, కానీ ఆమె హిందీలో నాతో అన్నది, “నాకు ఇవి అన్ని గుర్తులేవు.”
ఆమె పట్టుమని పదినెలలు కూడా బడిలో లేదు. ఆమె ఒకటో తరగతి చదువుతుండగా ఆ బడిని మూసివేశారు. అందులో చదివే అక్రాని తాలూకాకు చెందిన 476 విద్యార్థులు (ఆమె గ్రామం అక్కడే ఉన్నది) అందరిని ఇళ్లకి పంపేశారు. “మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు”, అన్నది.
ఆమె బడి- జాతీయ గీతం, ప్రార్థన తో రోజు మొదలయ్యేది. ఇంట్లో ఆమె దినచర్య వేరేగా ఉంటుంది. “ నేను ముందు బోర్ నుంచి నీళ్లు పట్టుకుని వస్తాను(బోర్ ఆమె ఇంటికి బయట ఉంది). ఆ తరవాత రింకు(ఏడాది వయసున్న ఆమె చెల్లెలు)ని అమ్మ వంట పూర్తయ్యేవరకు చూసుకుంటాను. నేను రింకుని ఈ చుట్టుపక్కల అంతా తిప్పి, బోల్డన్ని చూపిస్తాను.” ఆమె తల్లిదండ్రులు మెషిన్ మీద పని చేయనప్పుడు షర్మిల కుట్టు పనులు నేర్చుకుంటుంది.
నలుగురు తోబుట్టువులలోను, షర్మిల అందరికన్నా పెద్దది. ఆమె తరవాత అయిదేళ్ల రాజేష్ , మూడేళ్ళ ఊర్మిళ, ఆ తరవాత రింకు ఉన్నారు. “ఆమె పద్యాలూ చదవగలదు, రాసేది కూడా(మరాఠీ అక్షరాలు)” అన్నాడు ఆమె 28 ఎనిమిదేళ్ల తండ్రి రాకేష్. అతను, తన మిగితా పిల్లల చదువు గురించి కూడా ఆందోళన పడుతున్నాడు. రాజేష్ ని, ఊర్మిళని ఆరేళ్లకు బడిలో చేర్పించవచ్చు. “ఆమెకు చదువడం, రాయడం వచ్చి ఉంటే ఆమె తన తమ్ముడికి, చెల్లికి నేర్పించి ఉండేది,” అన్నారాయన. “ దో సాల్ మే బచ్చేకి జిందగీ కా ఖేల్ బన్ గయి హై (ఈ రెండేళ్లలో నా బిడ్డ జీవితం ఆటలాగా మారిపోయుంది)” తన కూతురు ఆ కుట్టు మెషిన్ వద్ద పడుతున్న తిప్పలు చూస్తూ అన్నాడు.
“మాకు ఆమె చదువుకుని ఆఫీసర్ అవ్వాలని ఉంది. మాలాగా దర్జీ పనిని నమ్ముకోకూడదు. చదువుకోకపోతే ఎవరూ గౌరవించరు.” అన్నది షర్మిల తల్లి, పాతికేళ్ల సరళ.
సరళ, రాజేష్ కలిసి నెలకు 5,000 నుంచి 6,000 రూపాయిల వరకు, వారి దర్జీ పని ద్వారా సంపాదిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం దాకా, రాకేష్ సరళ గుజరాత్ కు లేదా మధ్యప్రదేశ్ కు వలస వెళ్లి పొలం పనులు చేసి దినకూలి సంపాదించుకునేవాళ్ళు. “షర్మిల పుట్టాక మేము ఈ పని ఆపేశాము, ఎందుకంటే ఆమె చాలా జబ్బు పడేది( మేము మాతో పాటు ఆమెను కూడా వలసి నెలల్లో తీసుకు వెళ్లేవాళ్లము). అంతేగాక ఆమెని బడికి పంపాలని కూడా అనుకున్నాము.” అన్నాడతను.
చిన్నవాడిగా ఉన్నప్పుడు అతను అదే ఊరిలో ఉన్న తన మావయ్య గులాబ్ వద్ద దర్జీ పని నేర్చుకున్నాడు(ఈయన 2019 లో చనిపోయారు). అతని సహాయం తో రాకేష్ కుట్టు మెషిన్లను కొని సరళకు కూడా శిక్షణ ఇచ్చాడు. .
“మాకు వ్యవసాయ భూమి లేదు. అందుకని మేము 2012 లో, రెండు సెకండ్ హ్యాండ్ కుట్టు మెషిన్లను 15,000 రూపాయలకు కొన్నాము.” అన్నది సరళ. దీనికోసం వారు దాచుకున్న అన్ని డబ్బులు ఖర్చవగా, రాకేష్ తల్లిదండ్రులు దినకూలీలుగా పనిచేసి దాచుకున్న దానిలో కూడా కొంత డబ్బును తీసుకోవలసి వచ్చింది. వారి మావయ్య గులాబ్ తన వద్దకు వచ్చే కొందరు ఖాతాదారులను రాజేష్, సరళ వద్దకి పంపేవాడు.
“మా వద్ద రేషన్ కార్డు లేదు. అందువలన మాకు రేషన్ కొనడానికి మాత్రమే 3,000 - 4,000 రూపాయిలు ఖర్చవుతాయి.” వారికి కావలసిన సరుకు జాబితా చదివింది సరళ- గోధుమ పిండి, బియ్యం, ఉప్పు, కారం,.... “వారు పెరిగే పిల్లలు. వారి తిండి దగ్గర రాజీ పడను,” అన్నదామె.
పిల్లల చదువుల కోసం డబ్బు పొదుపు చెయ్యాలంటే వారికి అసాధ్యం.అందుకే వారు ఆశ్రమశాలల పట్ల కృతజ్ఞతతో ఉన్నారు. “అక్కడ పిల్లలు కనీసం చదువుకుంటున్నారు, సరిగ్గా తింటున్నారు.” అన్నది సరళ. కానీ ఆ బడి ఒకటి నుండి ఏడవ తరగతి వరకు మూసివేసి ఉంది.
అక్రాని తాలూకా లో ఆన్లైన్ చదువు అంటే గ్రహాంతర పదం వంటిదే. ఆశ్రమశాలలోని 476 విద్యార్థులలో, 190 మందికి టీచర్లు ఏ విధమైన సమాచారమూ చేరవేయలేకపోయారు. ఇందులో షర్మిల కూడా ఉంది. వీరంతా అధికారిక విద్య కు చాలా దూరంగా ఉన్నారు.
“90 శాతం మంది తల్లిదండ్రుల వద్ద ఒక మామూలు ఫోన్ కూడా లేదు”, అన్నాడు సురేష్ పడవి. నలభైనాలుగేళ్ల వయసున్నఈ టీచర్ నందుర్బార్ ఆశ్రమశాలలో పనిచేస్తారు. ఈ మహారోగం మొదలైన దగ్గరనుంచి అక్రని తాలూకా లోని కుగ్రామాలకు చెందిన విద్యార్ధులని వెతికి పట్టుకుని వారికి పాఠాలను అందించడానికి తిరిగే 9 మంది టీచర్ల బృందంలో ఈయన ఒకరు.
“మేము ఇక్కడికి వారంలో మూడు రోజులు వస్తాము, రాత్రుళ్ళు గ్రామంలో ఎవరొకరి ఇంట్లో ఉంటాము.” అన్నారు సురేష్. వచ్చిన ప్రతిసారి, టీచర్లు 10-12 మంది పిల్లలను పోగుచేసి, 1 నుండి 10 తరగతుల మధ్యవారికి చదువు చెప్తారు. “ఒకరు ఒకటో తరగతిలో ఉండొచ్చు, మరొకరు 7వ తరగతి లో ఉండొచ్చు. కానీ మేము అందరికి చదువు చెప్పాలి(కలిపే).” అన్నారు.
అతని టీచర్ల బృందం, ఇంకా షర్మిలను చేరలేదు. “చాలామంది పిల్లలు చాలా దూరంగా ఎక్కడో మూలల్లో ఉంటారు. వారికి ఫోన్ ఉండదు, చేరడానికి రోడ్లు ఉండవు. వారిని చేరడం చాలా కష్టం,” అన్నారు సురేష్.
ఫలై లో ఉన్న షర్మిల ఇంటికి వెళ్లడం చాలా కష్టం. త్వరగా చేరాలంటే ఒక కొండనెక్కి, ఒక ఏరును దాటాలి. మరో దారి- బురద గా ఉన్న రోడ్డు. ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది. “మా ఇల్లు చాలా లోపల ఉంది.” అన్నాడు రాకేష్. “టీచర్లు ఎవరూ ఈ వైపుకు రాలేదు.”
అంటే షర్మిల వంటి ఇతర విద్యార్థులకు బడులు మూయగానే చదువు నుండి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. జనవరి 2021లోని అధ్యాయనంలో , మహారోగం వలన బడులు మూతబడడం మూలంగా, 92 శాతం విద్యార్థులు కనీసం ఒక సామర్ధ్యాన్ని కోల్పోయారు- వారి అనుభవాలను మాటలలో చేప్పగలగడం, తెలిసిన పదాలను చదవడం, అర్ధం చేసుకుంటూ చదవడం, దృశ్యాన్ని చూసి చిన్న చిన్న వాక్యాలు రాయడం.
*****
“బడిలో నా పేరుని పెన్సిల్ తో రాయడం నేర్చుకున్నా,” అన్నది సునీతా పావ్రా. ఈమె షర్మిల పక్కింట్లోనే ఉంటుంది. ఆమె ఆటపాటలలో జతగత్తె కూడా. ఆమె కూడా షర్మిలతో పాటే అదే బడిలో చేరి, మహారోగం వలన బడి మూతబడేవరకు చదివింది.
“నేను ఈ డ్రెస్ ని బడిలో వేసుకునే దాన్ని, ఇప్పుడు ఇంట్లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటా,” అన్నది ఆమె మట్టి ఇంటి బయట వేలాడుతున్న యూనిఫార్మ్ ని చూపించి. “బాయి(టీచర్) పుస్తకం( బొమ్మల పుస్తకం) లోంచి పండ్లన్నీ చూపించేది. రంగురంగుల పండ్లు. అవి ఎర్రగా ఉండేవి. నాకు వాటి పేరులు తెలీవు.” అన్నది ఆమె వాటి పేర్లను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నిస్తూ.
సునీత తన పుస్తకంలో రాయడం, బొమ్మలు వేయడం మానేసింది. కానీ ఆమె ఇంటి ముందు ఉన్న తారురోడ్డులో చాక్ పీస్ తో డబ్బాలు గీసి షర్మిలతో కలిసి తొక్కుడుబిళ్ళాట ఆడుతుంది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు- దిలీప్ కి ఆరేళ్ళు, అమిత కు ఐదు, దీపక్ కి నాలుగు. ఎనిమిదేళ్ల సునీత అందరిలోనూ పెద్దది. తాను మాత్రమే బడికి వెళ్తుంది, ఆమె తల్లిదండ్రులు మిగిలిన వారిని కూడా నెమ్మదిగా బడిలో చేర్పించుదామనుకుంటున్నారు.
ఆమె తల్లిదండ్రులు గీత, భాకీరాం వారి తిండి కోసం వర్షాకాలం లో కొండవాలులో ఉన్న తమ ఎకరం భూమిలో జొన్నలు పండిస్తారు. “దీని పైనే బతుకుతున్నాము. పనికోసం బయటకు వెళ్తాము,” అన్నది 35 ఏళ్ళ గీత.
ప్రతి ఏడాది వారు, అక్టోబర్ లో గుజరాత్ పత్తి చేలలో పని చేయడానికి వెళ్తారు. అక్కడ ఒక్కొక్కరికి దినకూలి 200 రూపాయిల నుంచి 300 వరకు వస్తుంది. ఇలా దగ్గరగా, ఏడాదికి 200 రోజులు వరకు, అంటే ఏప్రిల్- మే దాకా పని సాగుతుంది. “మేము మా పిల్లలను మాతో తీసుకు వెళితే వాళ్లు కూడా మాలాగా చదువురానివారవుతారు. మేము వెళ్లే చోట బడి లేదు”, అన్నాడు 42 ఏళ్ళ భాకీరాం.
“ ఆశ్రమశాల లో పిల్లలు బాగా తింటారు, చదువుకుంటారు”, అన్నది గీత. “ప్రభుత్వం ఈ బడులను తెరవాలి.”
జూలై 15, 2021 నాటి ప్రభుత్వ తీర్మానం ఇలా పేర్కొంది: “రాష్ట్రంలో ప్రభుత్వ సహాయక రెసిడెన్షియల్ మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కోవిడ్ రహిత ప్రాంతాలలో 2021 ఆగస్టు 2 నుండి 8 నుండి 12వ తరగతి వరకు మాత్రమే తెరవడానికి అనుమతించబడ్డాయి.”
“నందుర్బార్ లో మొత్తం 139 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 22,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.” అన్నారు గణేస్గ్ పరకడే. ఈయన నందుర్బార్ జిల్లా పరిషత్ సభ్యులు. అక్రని తాలూకాలో చదివే చాలామంది విద్యార్థులు కొండ ప్రాంతాలు, అడవులకు చెందినవారు. కానీ ఇప్పుడు, “చాలా మందికి చదువు మీద ఆసక్తి పోయింది, అమ్మాయిలకైతే పెళ్లి చేసేస్తున్నారు.” అన్నారు గణేష్
*****
షర్మిల ఇంటికి 40 కిలోమీటర్ల దూరంలో, అక్రాన్నితాలూకాలోని సిందిడీగర్ గ్రామంలో, 12 ఏళ్ళ రహిదాస్ పావ్రా , అతని ఇద్దరు స్నేహితులు- వారి కుటుంబానికి చెందిన 12 మేకలను, ఐదు ఆవులను మేపుతున్నారు. “ మేము ఇక్కడ కాసేపటి కోసం ఆగుతాము. మాకు ఇక్కడ నచ్చింది. ఇక్కడ నుంచి కొండలు, ఊర్ల, ఆకాశం అన్ని కనిపిస్తాయి”, అన్నాడు రహిదాస్, ఒకవేళ బడి ఉండి ఉంటే అతను తన క్లాస్ రూమ్ లో కూర్చుని మాథ్స్, జియోగ్రఫీ, హిస్టరీ- ఇలా ఆరవ తరగతికి చెందిన పాఠాలు చదువుతుండేవాడు. రహిదాస్ అతనున్న చోటకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాపూర్ తాలూకాలోని కై డి. జె. కొంకణి ఆదివాసీ ఛాత్రాలయా శ్రావణి స్కూల్ లో చదివేవాడు.
ముప్పైయారేళ్ల రహిదాస్ తండ్రి ప్యానె, 32 ఏళ్ళ అమ్మ షీలా వారి రెండెకరాల పొలంలో వర్షాకాల సమయంలో మోక్కజొన్న, జొన్న పండిస్తారు. “మా అన్న రామదాస్ పొలంలో నాకు సాయం చేస్తాడు.” అన్నాడు రహిదాస్.
ఆ ఏడాదికి పంటనందుకున్నాక- ప్యానె, షీలా, నాలుగో తరగతి వరకు చదివిన 19 ఏళ్ళ రామ దాసు, పక్క రాష్ట్రమైన గుజరాత్ లోని నవసరి జిల్లాలోని చెరకు తోటల్లో పనిచేస్తారు. వారు ఒక్కొక్కరికి రోజు వేతనం 250 రూపాయిల వరకు ఉంటుంది. ఇలా ఏడాదికి 180 రోజులు పని చేస్తారు.
“పోయిన ఏడాది కరోనాకు భయపడి వారు వెళ్లలేదు. కానీ ఈ ఏడాది నేను వారితో పాటే వెళ్తున్నాను.” అన్నాడు రహిదాస్. వారి ఇంటిలో పెంచుతున్న జంతువుల వలన వారికి ఆదాయం లేదు. మేకపాలు ఇంటిలో వారే తాగుతారు. కొన్ని సార్లు మేకను కసాయివాడికి అమ్మి, ఆ మేక పరిమాణం, ఆరోగ్యం బట్టి 5, 000 నుంచి 10,00 వరకు సంపాదిస్తారు. ”కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. మాకు బాగా డబ్బు అవసరపడ్డప్పుడు మాత్రమే.” అన్నాడు రహిదాస్
గొడ్లను మేపే ఈ ముగ్గురు స్నేహితులు ఒకే బడిలో, ఒకే తరగతిలో చదువుతున్నారు. “నేను మహారోగానికి ముందు కూడా వేసవి, దీపావళి సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు, ఆవులను మేపడానికి తీసుకువెళ్ళేవాడిని. నాకు ఇదేమి కొత్త కాదు,” అన్నాడు రహిదాస్
లొంగిపోయిన అతని అభిమానంలో కొత్త ఏముంది? “నాకు మళ్లీ బడికి వెళ్లాలనిపించడం లేదు.” అన్నాడు. మళ్లీ బడులు తెరుస్తారనే సమాచారం అతనిని ఏమి ఉత్సాహపరచడం లేదు. “నాకు అసలేమీ గుర్తులేదు మళ్లీ మూసేస్తే ఏం చేస్తాము?”, అని అడిగాడు.
అనువాదం: అపర్ణ తోట