ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

ఇటుకలు, బొగ్గు, రాయి

వారికి కేవలం కాళ్ళకు చెప్పులు లేకపోవడమే కాదు - వారి తలపై ఉన్నవి వేడి ఇటుకలు. ఆ ర్యాంప్‌పై నడుస్తున్నవారు ఒడిశా నుంచి వలస వచ్చి, ఆంధ్రప్రదేశ్‌లోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నవారు. అక్కడ బయట ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, మహిళలు ఎక్కువగా పనిచేసే కొలిమి ప్రాంతంలో అంతకంటే చాలా వేడిగా ఉంటుంది.

ఒకరోజు కూలిగా ప్రతి మహిళకు లభించేది రూ. 10-12. అది పురుషులు పొందుతున్న కనాకష్టమైన రూ. 15-20 మధ్య ఉన్న రోజు కూలి కంటే కూడా తక్కువ. కాంట్రాక్టర్లు ముందస్తు 'అడ్వాన్స్'లు అప్పుగా ఇచ్చి, అటువంటి వలసదారుల కుటుంబాలకు కుటుంబాలనే ఇక్కడికి రవాణా చేస్తారు. ఈ  అప్పులు వలసదారులను కాంట్రాక్టర్‌కు కట్టిపడేస్తాయి; చివరికి వారు వెట్టి కార్మికులుగా మిగిలిపోతారు. ఇక్కడికి వలసవచ్చేవారిలో 90 శాతం మంది భూమి లేనివారు లేదా సన్నకారు రైతులే.

వీడియో చూడండి : '90 శాతం సమయమంతా మహిళలు పని చేస్తూనే ఉండటం చూశాను . నిటారుగా వెన్నెత్తి నిలిచి ఉండాల్సిన మహిళలు వెన్ను విరిగిపోయేంత కష్టమైన పనులు చేస్తున్నారు ,' అని పి . సాయినాథ్ చెప్పారు

కనీస వేతన చట్టాలను బాహాటంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ, ఈ కార్మికులెవరూ ఎటువంటి పరిహారాన్నీ పొందలేరు. కాలం చెల్లిన వలస కార్మిక చట్టాలు వీరికి రక్షణ కల్పించడం లేదు. ఉదాహరణకు, ఈ చట్టాలు, ఒడిశాకు చెందిన వీరికి సహాయం చేయమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖను ఒత్తిడి చేయలేవు. అలాగే, ఒడిశా కార్మికశాఖ అధికారులకు ఆంధ్రాలో ఎలాంటి అధికారాలు లేవు. ఈ వెట్టి, ఇటుక బట్టీలలో పనిచేసే అనేక మంది మహిళలను, యువతులనూ లైంగిక దోపిడీకి కూడా గురిచేస్తుంది.

జార్ఖండ్‌లోని గోడ్డాలోని ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల పక్కనే ఉన్న డంప్‌లలో, అడుసుమట్టీ, బురదలగుండా నడుచుకుంటూ వెళుతున్న ఒంటరి మహిళ(కుడివైపు దిగువన). ఆ ప్రాంతంలోని అనేకమంది ఇతర మహిళల వలెనే, ఈమె కూడా కొన్ని రూపాయలను సంపాదించడానికి, గృహ ఇంధనంగా విక్రయించే, వ్యర్థంగా పడివున్న బొగ్గు కోసం ఈ డంప్‌లలో వెతుకుతోంది. ఆమెలాంటి వాళ్ళు లేకపోతే, అక్కడ బొగ్గు నిరుపయోగంగా పడి ఉండేది. ఆమె చేసే పని దేశానికి చాలా ఇంధన శక్తిని ఆదా చేస్తుంది; కానీ ఇలా పనిచేయడం నేరంగా చట్టం చేయబడివుంది.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ఈ పలకల (టైల్స్) తయారీదారు ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజాలో నివసిస్తున్నారు (కుడి దిగువన). తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేక ఆమె కుటుంబం, తమ ఇంటి పైకప్పునే కోల్పోయింది. ఇంటి పైకప్పుపై పరచివున్న పెంకులను అమ్మడం ద్వారా మాత్రమే వారు తమ అప్పు వాయిదాను తీర్చగలరు కాబట్టి వారు అదే పని చేశారు. ఇప్పుడామె పాత పలకల స్థానాన్ని భర్తీ చేయడానికి తాజా పలకలను తయారుచేస్తోంది.

తమిళనాడులోని పుదుక్కోట్టై నుండి వచ్చిన ఈ రాళ్ళు పగులగొట్టే మహిళ ఒక అద్భుతం (ఎడమ క్రింద). 1991లో, దాదాపు 4,000 మంది నిరుపేద మహిళలు తాము ఇంతకుముందు కట్టుబానిసలుగా పనిచేసిన క్వారీలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆనాటి స్థానిక పాలకవ్యవస్థ తీసుకున్న కొన్ని విప్లవాత్మక చర్యల వలన అది సాధ్యమయింది. కొత్తగా అక్షరాస్యులైన మహిళల కార్యాచరణ దాన్ని నిజం చేసింది. క్వారీ మహిళల కుటుంబాల జీవితాలు నాటకీయంగా మెరుగుపడ్డాయి. ప్రభుత్వం కూడా ఈ శ్రద్ధగల కొత్త 'యజమానుల' నుండి భారీ ఆదాయాన్ని ఆర్జించింది. కానీ ఈ ప్రక్రియ, గతంలో ఈ ప్రాంతంలో అక్రమ క్వారీలను నడిపిన కాంట్రాక్టర్ల క్రూరమైన దాడికి గురైంది. దీని వలన భారీ నష్టం జరిగింది. అయినప్పటికీ, చాలామంది మహిళలు మెరుగైన జీవితం కోసం తమ పోరాటాన్ని కొనసాగించారు.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

సూర్యాస్తమయానికి ఎదురుదిశగా సాగుతోన్న మహిళలు (క్రింద) గొడ్డాలోని ఓపెన్‌కాస్ట్ గనుల పక్కనే ఉన్న చెత్త క్షేత్రాన్ని వదిలివెళ్తున్నారు. వారు ఒక్క రోజు మొత్తం పనిలో తమకు వీలైనంత బొగ్గు(పనికిరాని)ను సేకరించి, వర్షాకాలపు ఆకాశం తమను బురదలో, మురికిలో ముంచెత్తడానికి ముందే ఇళ్ళకు బయలుదేరుతున్నారు. గనులు, క్వారీల్లో పనిచేసే మహిళల సంఖ్య గురించిన అధికారిక లెక్కలు అర్థరహితంగా ఉంటాయి. అక్రమ గనులలో, వాటి పరిసరాలలో ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది మహిళా కార్మికులను వారు లెక్కలోకి తీసుకోకుండా మినహాయించడమే దీనికి కారణం. ఈ చెత్త క్షేత్రం నుండి నడుస్తున్న మహిళలు ఆ మినహాయింపు లెక్కలోని వారే! రోజు ముగిసేసరికి ఒక 10 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు అదృష్టవంతులే.

అదే సమయంలో, వారు గనులలో పేలుళ్ళు, విష వాయువులు, రాతి ధూళి, గాలిలోని ఇతర మలినాల నుండి తీవ్రమైన ప్రమాదాలని ఎదుర్కొంటారు. కొన్నిసార్లు, 120-టన్నుల డంపర్ ట్రక్కులు గనుల అంచుకు వచ్చి, తవ్విన గనుల నుండి 'అదనపు భారం' లేదా పైకొచ్చిన మట్టిని డంప్ చేస్తాయి. అన్ని టన్నుల మట్టి కింద పూడుకుపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, కొంతమంది పేద మహిళలు ఆ మట్టి నుండి కూడా ఏదైనా వ్యర్థమైన బొగ్గు దొరుకుతుందేమో చూసేందుకు పరుగులు తీస్తుంటారు.

PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli