ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

మట్టి, అమ్మ, 'దినసరి వేతనం'

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో భూమిలేని కార్మికులతో సమావేశం ఉదయం 7 గంటలకు కొంచం ముందుగా ఉంటుందని నిర్ణయమైంది. రోజంతా వారి పనివిధానం ఎలా వుంటుందో తెలుసుకోవాలనే ఆలోచనతోనే అలా నిర్ణయించుకున్నాం. అయినా మాకు ఆలస్యమయింది. మేము వెళ్ళేప్పటికే,  తాటి తోపు గుండా నడిచి పొలాలకు వెడుతూ, లేదంటే పని స్థలంలో, తవ్వివున్న గొయ్యిలోని మట్టిని బయటకు తోడుతూ, మూడు గంటలుగా అలా పనిచేస్తూనే ఉన్నారు.

ఈ స్త్రీలలో చాలామంది అప్పటికే వంట చేయడం, పాత్రలు కడగటం, బట్టలు ఉతకడం, ఇంకా కొన్ని ఇతర ఇంటి పనులను ముగించారు. పిల్లలను బడికి వెళ్ళేందుకు సిద్ధం చేశారు. కుటుంబ సభ్యులందరికీ అన్నం పెట్టేశారు. యథావిధిగా మహిళలు చివరిగా తిన్నారు. కాని  ప్రభుత్వ ఉపాధి హామీ సైట్‌లో మాత్రం పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనం ఇస్తున్నట్లు స్పష్టంగా ఉంటుంది.

ఇక్కడ కనీస వేతన చట్టం స్త్రీపురుషులిద్దరికీ ఉల్లంఘించబడుతోందనేది కూడా మరింత స్పష్టంగా తెలుస్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను మినహాయించి దేశంలోని చాలా ప్రాంతాలలో ఇలాగే ఉంది. అయినప్పటికీ, మహిళా కార్మికులకు ప్రతిచోటా పురుషులకు ఇచ్చే వేతనంలో సగం లేదా మూడింట రెండు వంతులు మాత్రమే లభిస్తోంది.

వీడియో చూడండి : ' ఉదయాన్నే 7.30 కల్లా బయట పనిచేయడానికి వచ్చే మహిళలు అప్పటికే మూడు గంటలపాటు ఇళ్ళల్లో పనిచేసి వస్తారు '

మహిళా వ్యవసాయ కూలీల సంఖ్య పెరగడం వల్ల, వారి వేతనాలు తక్కువగా ఉండడం వల్ల భూ యజమానులు లాభపడుతున్నారు. ఇది వారి వేతన బిల్లులను తగ్గిస్తుంది. మహిళలు సులభమైన పనులు చేస్తారు కాబట్టి, తక్కువ జీతం ఇస్తున్నామని కాంట్రాక్టర్లు, భూ యజమానులు వాదిస్తారు. అయితే, నాట్లు వేయడమనేది  ప్రమాదకరమైన, సంక్లిష్టమైన పని. అలాగే పంట కోతపని కూడా. ఈ రెండు పనులూ స్త్రీలను అనేక వ్యాధులకు గురిచేస్తాయి.

నిజానికి నాటడమనేది చాలా నైపుణ్యంతో కూడిన పని. మొలకల్ని భూమి లోపలికి తగినంత లోతులో నాటకపోయినా, మొక్కకూ మొక్కకూ తగినంత దూరం ఉంచకపోయినా అవి పెరగవు. భూమిని సరిగ్గా చదును చేయకపోతే, మొక్క ఎదగదు. అదీగాక, ఎక్కువ సమయం పిక్కల నుంచి మోకాలిలోతు నీటిలో వంగి పనిచేయాలి. అయినప్పటికీ, ఇది నైపుణ్యం లేని పనిగా పరిగణించబడుతుంది, తక్కువ వేతనాలు చెల్లిస్తారు. అలా ఎందుకంటే, ఈ పనిని కేవలం స్త్రీలు మాత్రమే చేస్తారు కాబట్టి.

పురుషులు చేసినంత పని మహిళలు చేయలేరనేది మహిళలకు తక్కువ వేతనం ఇస్తున్నందుకు చేసే మరో వాదన. కానీ ఒక పురుషుడు తీసే పంటకంటే మహిళ తీసే పంట తక్కువదని చూపేందుకు ఏ ఆధారాలూ ఉండవు. పురుషులు చేసే పనులనే మహిళలు కూడా చేసినా, మహిళలకు తక్కువ వేతనమే లభిస్తుంది.

వారికి నైపుణ్యం తక్కువ అయితే, భూస్వాములు ఇంతమంది మహిళలను పనిలోకి తీసుకుంటారా?

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో తోటమాలులకు, పొగాకు కోసేవారికి, ప్రత్తి ఏరేవారికి కనీస వేతనాలు నిర్ణయించింది. ఇవి నాట్లూ కోతల పనిచేసేవారు పొందే వేతనాలకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే, వివక్ష తరచుగా చాలా స్పష్టంగానూ, 'అధికారికంగానూ' ఉంటుంది.

కాబట్టి వేతన రేట్లకు ఉత్పాదకతతో పెద్దగా సంబంధం కలిగి ఉండకపోవచ్చు. అవి తరచుగా ఎప్పటి నుంచో ఉన్న పక్షపాతాలపై(ప్రిజుడిసెస్), వివక్ష యొక్క పాత నమూనాలపై, వీటన్నిటినీ చాలా మామూలు విషయాలుగా తీసుకోవడంపై- ఆధారపడి ఉంటాయి.

పొలాల్లోనూ, ఇతర పనిస్థలాల్లోనూ వెన్ను విరిగేంత పనిని మహిళలు చేసే దృశ్యాలు కళ్ళకు కనిపిస్తాయి. ఈ పనులేవీ వారి వారి పిల్లల సంరక్షణ ప్రధాన బాధ్యత నుండి వారికి మినహాయింపునివ్వవు. ఈ ఆదివాసీ మహిళ తన పిల్లలిద్దరిని ఒడిశాలోని మల్కన్‌గిరిలోని (కుడి దిగువన) ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చింది. ఇక్కడికి చేరుకోవాలంటే ఎగుడుదిగుడుగా ఉన్న బాటలమీద కిలోమీటర్ల దూరం నడిచి రావాలి. అంతదూరమూ చాలా వరకు తన కొడుకును ఎత్తుకొని మోసుకొస్తుంది. అది కూడా కఠినమైన కొండ వాలు పై గంటల తరబడి పని చేసిన తర్వాత.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath

পি. সাইনাথ পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার প্রতিষ্ঠাতা সম্পাদক। বিগত কয়েক দশক ধরে তিনি গ্রামীণ ভারতবর্ষের অবস্থা নিয়ে সাংবাদিকতা করেছেন। তাঁর লেখা বিখ্যাত দুটি বই ‘এভরিবডি লাভস্ আ গুড ড্রাউট’ এবং 'দ্য লাস্ট হিরোজ: ফুট সোলজার্স অফ ইন্ডিয়ান ফ্রিডম'।

Other stories by পি. সাইনাথ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli