ఆ రోజు ఉదయం, ఆమె భర్త పనికి వెళ్లే ముందు, 24 ఏళ్ళ నేహా తోమర్(ఆమె అసలు పేరు కాదు) అతని పాదాలను తాకింది. ఇది  రోజు జరిగే విషయం కాదు, కానీ  బయటకు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు అలా చేస్తుంది. “అంటే నేను  పుట్టింటికి వెళ్ళినప్పుడు,  అటువంటి  సందర్భాలలో’, అన్నది నేహా. ఆమె భేతువా బ్లాక్ లోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కాంపౌండ్ లో కూర్చుని ఉంది.

నేహా అమేథీ తెహసిల్ లో ఉన్న ఈ CHC కి అత్తగారితో  పాటు, ఇంకా పేరుపెట్టని, నాలుగునెలల వయసున్న తన నాలుగో సంతానాన్ని ఎత్తుకుని వచ్చింది. వాళ్లు ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్పుర జిల్లాలోని భేతువా గ్రామం నుండి వచ్చారు.  నేహా, వ్యవసాయ కూలీగా పనిచేసే ఆమె భర్త ఆకాష్ (అసలు పేరు కాదు) చివరికి ఇక పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారు - ‘ ఇత్నీతో హమారీ మర్జి హొని చాహియే’ , అన్నది నేహా, తమకు వెంటవెంటనే పుట్టిన నలుగురు పిల్లల గురించి చెబుతూ. ముందు నాలుగు, ఐదు యేళ్ళున్న ఇద్దరు కూతుళ్లు, తరవాత ఒకటిన్నర సంవత్సరాల  కొడుకు ఆ తరవాత ఈ బిడ్డ. ‘ఇది కూడా ఆవిడ చలవే’, అని తన అత్తగారికేసి చూపుతూ అన్నది నేహా.

The camp approach to sterilisation gave way to 'fixed-day services' at CHCs
PHOTO • Anubha Bhonsle

స్టెరిలైజేషన్ క్యాంపు విధానం CHCలలో 'నిర్దిష్ట-రోజు సేవల'కు దారితీసింది

ఆమె ఆరేళ్ళ వైవాహిక జీవితంలో గర్భ నిరోధకత గురించి గాని, పిల్లల మధ్య తీసుకోవలసిన ఎడాన్ని గురించి గాని ఎన్నడూ మాటలు సాగలేదు.  “నా పెళ్లి నాటికి ఎవరూ ఏమీ చెప్పలేదు. నా భర్త చెప్పినట్లు, వారింట్లో వారు చెప్పినట్లు వినమన్నారు.” అన్నది నేహా. మొదటి రెండు గర్భాలు దాటాక, ఆమె తన భర్తతో అండం విడుదలయ్యే సమయంలో, అంటే తన నెలసరి మొదలైన రెండు వారాల తరవాత రోజులలో భర్తతో శారీరకంగా కలవకపొతే పిల్లలు కలిగే అవకాశం తక్కువ అని  తెలుసుకుంది. “నేను కడుపు నొప్పి అనో, లేక రాత్రి పనులు పూర్తి  చేయడానికి ఎక్కువ సమయం తీసుకునో  ఆ రోజులు కలవకుండా చూసుకునేదాన్ని. కాని మా అత్తగారికి నేను ఏం చేస్తున్నానో అర్థమైపోయిది.” అన్నది నేహా.

సాంప్రదాయిక గర్భనిరోధక పద్ధతులైన ఉపసంహరణ, నెలలో కొద్ధి రోజులు కలవకపోవడం, సేఫ్-పీరియడ్ ని చూసుకోవడం ఇలా నేహా లాగా ఈ పద్ధతులు యు. పిలో మహిళలు ఎక్కువగా పాటిస్తున్నారు . జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-4, 2015-16) నుండి డేటా ఆధారంగా రిప్రొడక్టివ్ హెల్త్ జర్నల్‌లోని 2019 పేపర్‌ను గమనిస్తే, జాతీయంగా ఈ పద్ధతులు కేవలం 9 శాతం పాటిస్తే, యు పి రాష్ట్రంలో ఇవే పద్ధతులు, 22 శాతం పాటిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం పెళ్లయిన మహిళల్లో కేవలం 50 శాతం మంది మాత్రమే ఆధునిక గర్భనిరోధక పద్ధతులైన కండోమ్లు, పిల్ వాడడం, లేదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను పాటిస్తున్నారు. అదే దేశం మొత్తంలో అయితే ఇది 72 శాతం వరకు ఉంది.

ఆకాష్ కి ఆక్సిడెంట్ అయినప్పుడు, ఆ సమయంలో అతను పని చేయలేక, సంపాదన నిలిచిపోయినపుడు, నేహా ధైర్యాన్ని కూడదీసుకుని భర్తతో ఆపరేషన్ చేయించుకుంటానని  అడిగింది. ట్యూబల్ లైగేషన్ కి ఇచ్చిన మరో పేరు అది. ట్యూబల్ లైగేషన్ లో, మహిళల అండాశయంలో ఉన్న ఫెలోపియన్ ట్యూబులను మూసివేసి ఆమెకు గర్భం రాకుండా చేస్తారు. అత్తగారు ఇంకా సమాధానపడక ఆమెతో పాటు ఆసుపత్రికి ఏదో ఆశతో  వచ్చింది. “భగవాన్ ఆర్ బచ్చే కె బీచ్ మే కభీ ఆనా నహి చాహియే (దేవుడికి, గర్భానికి మధ్య ఎవరూ రాకూడదు)”, అని ఆమె  గొణుక్కుంటూనే ఉంది. నేహాతో పాటుగా అక్కడ బందోయ, నౌగీర్వా , సనాహ, డిక్రీ నుండి మరో 22 మంది మహిళలు ఆపరేషన్ కోసం CHC వద్ద గుమిగూడారు.

ఆ నవంబర్ ఉదయాన ఇంకా 10 గంటలు కూడా కాలేదు. ఎక్కువ మంది ఆడవారు 9 గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. రోజు గడుస్తున్న కొద్దీ ఇంకా చాలామంది అక్కడ చేరతారు. “30-40 మంది అక్కడ మహిళా నస్బండి(ఆడవారి  ఆపరేషన్) రోజున చేరతారు- ముఖ్యంగా అక్టోబర్ నుండి మార్చ్ వరకు. ఈ నెలల్లోనే ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటే, కుట్లు త్వరగా మానుతాయి. తాన్కె పక్తే నహీ హై (ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది).” అన్నారు నహేతువా CHC లో మెడికల్ ఆఫీసర్ అయిన అభిమన్యు వర్మ.

'About 30-40 come in on on mahila nasbandi day'
PHOTO • Anubha Bhonsle

‘దగ్గరగా 30-40 మంది  మహిళా  నస్బండి రోజు వస్తారు'

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా తఖత్‌పూర్ బ్లాక్‌లో నవంబర్ 8, 2014లో జరిగిన విషాదం తర్వాత స్టెరిలైజేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న 'క్యాంప్' విధానంపై అన్ని ప్రదేశాల నుండి ఆగ్రహం వ్యక్తమైంది. శిబిరంలో, 13 మంది మహిళలు మరణించారు అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా తఖత్‌పూర్ బ్లాక్‌లో నవంబర్ 8, 2014లో జరిగిన విషాదం తర్వాత స్టెరిలైజేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న 'క్యాంప్' విధానంపై అన్ని ప్రదేశాల నుండి ఆగ్రహం వ్యక్తమైంది. శిబిరంలో, 13 మంది మహిళలు మరణించారు, అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. జిల్లా ఆసుపత్రికి చెందిన ఒక సర్జన్ 90 నిమిషాలలో 83 అసెంబ్లీ-లైన్ ట్యూబెక్టమీలను పాడుబడిన, అపరిశుభ్రమైన భవనంలో నిర్వహించారు. ఈ శస్త్రవైద్యుడు ఒకే లాపరోస్కోప్‌ను ఉపయోగించాడు, అసెప్సిస్‌కు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు.

మహిళల ఆరోగ్యంతో సంబంధం లేని ఇటువంటి  సామూహిక శస్త్రచికిత్సా శిబిరం ఒకసారి మాత్రమే జరగలేదు. జనవరి 7, 2012న, బీహార్‌లోని అరారియా జిల్లాలోని కుర్సకాంత బ్లాక్‌లోని కపర్‌ఫోరా కుగ్రామంలో, 53 మంది మహిళలు పాఠశాల భవనంలో - టార్చ్‌లైట్‌ వెలుగులో అదేవిధంగా అపరిశుభ్రమైన పరిస్థితులలో స్టెరిలైజ్ చేయబడ్డారు.

అరారియా సంఘటన తర్వాత, 2012లో ఆరోగ్య హక్కుల కార్యకర్త దేవికా బిశ్వాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వలన సెప్టెంబరు 14, 2016న సుప్రీం కోర్టు మూడు సంవత్సరాలలోపు క్యాంపు ఆధారిత సామూహిక స్టెరిలైజేషన్‌లను నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉత్తర్వుతో ఆదేశించింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమం కింద ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం, సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడమని చెప్పింది. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా, యుపి, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల నుండి స్టెరిలైజేషన్ క్యాంపులలో నాణ్యత లేని సంరక్షణకు సంబంధించిన రుజువులు వెలువడ్డాయి.

ఆ తర్వాత, స్టెరిలైజేషన్‌కు, శిబిర విధానం 'ఫిక్స్‌డ్-డే సర్వీసెస్'కి దారితీసింది, అంటే స్త్రీలు, పురుషులు స్టెరిలైజేషన్ చేయించుకోవాలనుకుంటే నెలలో ఒక నిర్దిష్ట రోజున, నిర్దిష్ట CHCలకు రావచ్చు. ఈ వ్యవస్థ మెరుగైన పర్యవేక్షణ, పరిస్థితుల నియంత్రణకు అవకాశమిస్తుందని ఆశ. నిర్ణీత రోజును విస్తృతంగా ‘నస్బంది రోజు’గా భావించినప్పటికీ, పురుషులు వేసెక్టమీల కోసం చాలా అరుదుగా వస్తారు, కాబట్టి అనధికారికంగా, ఆ రోజును ‘మహిళా నస్బంది రోజు’గా పిలుస్తారు.

అయితే కోర్టు ఆదేశం ఉన్నప్పటికీ, గర్భనిరోధకం అనే పదానికి స్టెరిలైజేషన్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉంది - ప్రధానంగా స్త్రీల స్టెరిలైజేషన్‌పై.

Medical supplies on a table in a CHC waiting room. The operating room had been prepared and was ready since earlier that morning
PHOTO • Anubha Bhonsle

CHC వెయిటింగ్ రూమ్ బయట మందుల సామాను. ఆపరేషన్ గదిని పొద్దున్నే శుభ్రపరిచి, ఆపరేషన్ కు సిద్ధం చేశారు

జాతీయ ఆరోగ్య మిషన్ 2017 11వ కామన్ రివ్యూ మిషన్ నివేదిక ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 93. 1 శాతం స్టెరిలైజేషన్ ప్రక్రియలు మహిళలపైన జరిగాయి. ఇటీవల 2016-17 నాటికి, భారతదేశం, కుటుంబ నియంత్రణ నిధులలో, 85 శాతం స్త్రీల స్టెరిలైజేషన్ కోసం ఖర్చు చేసింది. UPలో (1998-99తో పోల్చితే) ఈ ప్రక్రియ యొక్క ఉపయోగం క్షీణించినప్పటికీ, అధిక సంతానోత్పత్తి ఉన్న జిల్లాల్లో 33 శాతం మంది గర్భనిరోధక వినియోగదారులు, తక్కువ సంతానోత్పత్తి ఉన్న జిల్లాల్లోని 41 శాతం మంది వినియోగదారులు- ఈ పద్ధతికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఇది ప్రాథమిక పద్ధతిగా మిగిలిపోయింది, అని 2019 లో రీప్రొడక్టివ్ హెల్త్ నివేదించింది.

సుల్తాన్‌పూర్ జిల్లాలో స్టెరిలైజేషన్ ప్రక్రియల భారం మొత్తం ఇద్దరు, ముగ్గురు వైద్యులపై పడింది. వారు తహసీల్ లేదా జిల్లా స్థాయిలో కుటుంబ నియంత్రణ సమన్వయకర్త రూపొందించిన జాబితా ప్రకారం పని చేస్తారు. వీరు 12 నుండి 15 బ్లాక్‌లలో విస్తరించి ఉన్న ఆసుపత్రులకు, ఆరోగ్య కేంద్రాలకు ప్రయాణిస్తారు. ప్రతి CHC దాదాపు నెలకు ఒకసారి నస్బంది రోజును నిర్వహించగలదు. ఆ రోజున పురుషులకు, మహిళలకు ఈ శస్త్ర చికిత్స చేస్తారు.

అటువంటి ఒక రోజున భేతువా CHCలో, మహిళల స్టెరిలైజేషన్ కోసం కేటాయించిన పరిమిత రోజుల సంఖ్య అక్కడి అవసరాన్ని తీర్చడానికి సరిపోదని స్పష్టమైంది. సాయంత్రం 4 గంటల సమయానికి, సర్జన్ వచ్చినప్పుడు, అతను హాజరుకావాల్సిన ప్రభుత్వ ఆరోగ్య మేళాలో రోగుల సంఖ్య 30కి చేరుకుంది. ప్రాథమిక తనిఖీ తర్వాత ఇద్దరు మహిళలు గర్భవతిగా ఉన్నందున తిరిగి వెళ్లమని చెప్పారు.

ఆ బిల్డింగ్ చివర ఆపరేషన్ థియేటర్ అని పిలిచే ఆ గదిని ముందే సిద్ధం చేసి ఉంచారు. అక్కడున్న పెద్ద కిటికీకి వేసిన పలచని పరదాల గుండా సూర్యుడు లోపలి కాంతిని వెదజల్లుతున్నా గాని ఆ గది చల్లగానే ఉంది. మూడు ‘ఆపరేటింగ్ టేబుళ్ల’ను మధ్యలో వరసగా పేర్చారు. మంచానికి ఒకవైపు కాళ్ల కింద ఇటుకలు పేర్చి పెట్టడం వలన ఒక కోణంలో, ఎత్తుగా ఉన్నాయి. ఇలా ఉన్న బల్లపై ఆపరేషన్ చేయడం సర్జన్లకు సులువుగా ఉంటుంది.

An 'operation theatre' at a CHC where the sterilisation procedures will take place, with 'operating tables' tilted at an angle with the support of bricks to help surgeons get easier access during surgery
PHOTO • Anubha Bhonsle

CHC లో ఒక ఆపరేషన్ థియేటర్. ఇక్కడ స్టెరిలైసెషన్ చేస్తారు, ఇక్కడ ‘ఆపరేషన్ టేబుళ్ల’ ను ఒకవైపు ఇటుకల పై  ఉంచి, ఎత్తు పెంచి, సర్జన్లకు ఆపరేషన్ చేయడానికి వీలుగా మారుస్తారు

“ట్రెండెలెన్‌బర్గ్ వసతి ఉన్న ఆపరేషన్ టేబుళ్ల గురించి మేము మెడికల్ స్కూల్ లో చదువుకున్నాము. వాటిలో వంచవచ్చు. కానీ ఇక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్నా, అటువంటి ఆపరేషన్ టేబుల్ ను నేను చూడలేదు.“ సరైన పద్ధతిలో పడుకోకపోతే ఆపరేషన్ చేయించుకున్నవారిలో తర్వాత వేరే సమస్యలు రావచ్చు, అని ఆయన చెప్పారు.

మొదట ఆపరేషన్ కు తీసుకు  వచ్చిన ముగ్గురు ఆడవారిలో నేహా కూడా  ఉంది. ఆమె అత్తగారిని బయట వేచి ఉండమని చెప్పారు. ఈ ముగ్గురు ఆడవారిలో ఎవరూ ఆధునిక గర్భనిరోధక పద్ధతిని వాడలేదు. నేహాకు వాటి గురించి తెలుసు కాని వాటిని వాడే పరిస్థితి లేకపోయింది. “నాకు వాటి గురించి తెలుసు గాని, ఆ గోళీల వలన నా తల  తిరుగుతుంది, కాపర్-టి భయంగా అనిపిస్తుంది. అది పెద్ద రాడ్ లాగ ఉంటుంది,” అని  గర్భాశయ పరికరాన్ని(IUD)  గురించి చెబుతూ అన్నది ఆమె.

అక్కడున్న వేరే ఇద్దరు మహిళలను ఆపరేషన్ కోసం తీసుకు వచ్చిన ఆశ వర్కర్ దీపలత యాదవ్, ఈ మాటలను విని నవ్వింది. “మీరు కాపర్ - టి గురించి చెప్పినప్పుడు మొదటగా వినేది దీని గురించే. ఆ పరికరం చిన్నది, T ఆకారం లో ఉంటుంది. కానీ దాని పాకెట్ చాలా  పెద్దగా ఉండడంతో, ఇది మొత్తం లోపలకు తోస్తారేమో అని భయపడతారు.” అన్నది యాదవ్. ఆమె పని ఇక్కడకు మహిళలను ఆపరేషన్ కు తీసుకురావడంతో  అయిపోయింది. ఆపరేషన్ కి తెచ్చిన ఒక్కో మహిళపై ఆమెకు 200 రూపాయిలు వస్తాయి. కానీ యాదవ్ అక్కడే ఉండి ఆ ఇద్దరు ఆడవారిని ఆసుపత్రి పడక మీదకి చేర్చి వారిపై అనస్తీషియా పనిచేసేవరకు వేచి ఉంది.

ఒకసారి ఆ ఆపరేషన్ టేబుళ్ల పైకి చేరాక ఎవరు ఎవరో చెప్పడం కష్టం. డాక్టర్, ఒక్కొక్కరిని దాటి వెళ్తున్న కొద్దీ, వారి తలలు భయంతో, అలసటతో వంగిపోతున్నాయి. ఈ ఆపరేషన్ వీరందరిని ఒకే గదిలో అవసరానికి మించి, మరీ దగ్గరగా చేర్చించింది. కానీ  ఎవరూ ఈ ఇబ్బందిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆపరేషన్ గది తలుపు, ఎన్ని ఆపరేషన్లు అయితే అన్నిసార్లు తెరుచుకుంటూ మూసుకుంటూనే ఉంది. దానివలన వీరికి అసలు చాటు దొరకలేదు.

ఆ గది వారి శ్వాస, వారిపై వాడే పరికరాల చప్పుడుతో  నిండిపోయింది. ఒక అటెండెంట్ వారు  పడుకున్న పద్ధతిని పరీక్షించి,  వారి చీరలను  పైకి సర్ది ఉంచారు. ఇలా చేస్తే,  వచ్చిన డాక్టర్ స్పష్టమైన ఇన్సిషన్(చర్మం పై ఆపరేషన్ చేయడానికి పెట్టే కోత) చేయడానికి వీలుగా ఉంటుంది.

The women who have undergone the procedure rest here for 60 to 90 minutes before an ambulance drops them to their homes
PHOTO • Anubha Bhonsle

ఆపరేషన్ చేయించుకున్న ఆడవారు 60 నుండి 90 నిముషాలు విశ్రాంతి తీసుకున్నాక, అంబులెన్సు వారిని ఇంటి వద్ద దింపుతోంది

“స్టెరిలైజేషన్ చేసే మూడు స్టేజీలలో, కోయడం, మూయడం, లాప్రోస్కోపిక్ పరికరంతో  ఫెలోపియన్ ట్యూబులను కట్టివేయడం, వీటన్నిటికీ సరైన వెలుతురు అవసరం.” గోస్వామి అన్నారు. ఆ మధ్యహ్నపు కాంతివంతమైన ఎండ నెమ్మదిగా బలహీనపడి సంధ్యలోకి జారుకుంటూ ఉంది. ఆ గదిలో వెలుతురు సరిపడా లేదనిపిస్తిన్నది. కానీ ఎవరూ అక్కడ ఉన్న స్టాండింగ్ ఎమర్జెన్సీ లైట్లను వేయలేదు.

ఇంకో ఐదు నిముషాలలో ఒక ఆపరేషన్ అయిపొయింది. డాక్టర్ తరవాత టేబుల్ వద్దకు వెళ్లారు. అటెండెంట్ కి చెప్పినట్లుగా, “హోగయా, డన్” అన్నారు. ఆశ వర్కర్ ఆపరేషన్ చేయించుకున్న మహిళను టేబుల్ మీద నుండి దించి, తరవాత బృందాన్ని సిద్ధం చేసేందుకు వెళ్లింది.

ఆ పక్కనే ఉన్నగదిలో పరుపులని పరిచారు. ఆ గదిలోని పసుపు గోడలకి చెమ్మ, నాచు పట్టి ఉన్నాయి. పక్కనున్న మూత్రశాల నుంచి వాసన వస్తోంది . ఒకసారి  ఆపరేషన్ అయిపోయాక, నేహాను ఈ గదిలోకి తెచ్చి ఒక మూల పడుకోబెట్టారు. ఆమె కాస్త తేరుకున్నాక ఆంబులెన్సులో తీసుకెళ్లి ఇంటివద్ద దిగబెడతారు. అరగంట తరవాత ఆమె ఆంబులెన్స్  ఎక్కే సమయానికి నేహా  ఇంకా మత్తులోనే ఉంది. ఆమె  ఆపరేషన్ త్వరగా చేసేయడం ఒక కారణమైతే, మరొక కారణం ఆమెకు పూర్తిగా అనెస్తీషియా ఇవ్వక పోవడం.

తన అత్తగారితో కలిసి నేహా ఇంటికి చేరాక, ఆకాష్ వారి కోసం ఎదురు చూస్తున్నాడు. “మగవారు, వారింటికి రాగానే, వారి అమ్మా, భార్య, పిల్లలు, కుక్క వారి కోసం ఇంటి దగ్గర ఎదురు చూడాలని అనుకుంటారు. కానీ ఈ ఇంట్లో అది తిరగబడింది.” అని ఆమె అత్తగారు అన్నది. ఆ తర్వాత నేహాకి టీ పెట్టడానికి, వారింట్లో మూల ఉన్న చిన్న వంట గదిలోకి వెళ్ళింది.

“ఇంజక్షన్ ఇచ్చినా కూడా ఇక్కడ నొప్పి వస్తోంది”, అని కడుపు పట్టుకుని అన్నది నేహా. అక్కడ కడుపు కోసిన చోట చతురస్రాకారపు బ్యాండేజ్ వేశారు.

రెండు రోజుల తరవాత నేహా మళ్లీ వంటగదిలో చేరి, గొంతుక్కూర్చుని వంట చేస్తోంది. ఆ బ్యాండేజ్ ఇంకా ఆమె వంటి మీదే ఉంది, ఆమె మొహం మీద అసౌకర్యం స్పష్టంగా కనిపిస్తోంది, ఆమె కుట్లు ఇంకా మానలేదు. “ పర్ ఝన్ ఝట్ ఖతమ్ (సమస్య తీరిపోయింది)”, అన్నది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజంలో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే  [email protected] కి మెయిల్ చేసి [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: అపర్ణ తోట

Anubha Bhonsle

২০১৫ সালের পারি ফেলো এবং আইসিএফজে নাইট ফেলো অনুভা ভোসলে একজন স্বতন্ত্র সাংবাদিক। তাঁর লেখা “মাদার, হোয়্যারস মাই কান্ট্রি?” বইটি একাধারে মণিপুরের সামাজিক অস্থিরতা তথা আর্মড ফোর্সেস স্পেশাল পাওয়ারস অ্যাক্ট এর প্রভাব বিষয়ক এক গুরুত্বপূর্ণ দলিল।

Other stories by Anubha Bhonsle
Illustration : Priyanka Borar

নিউ-মিডিয়া শিল্পী প্রিয়াঙ্কা বোরার নতুন প্রযুক্তির সাহায্যে ভাব এবং অভিব্যক্তিকে নতুন রূপে আবিষ্কার করার কাজে নিয়োজিত আছেন । তিনি শেখা তথা খেলার জন্য নতুন নতুন অভিজ্ঞতা তৈরি করছেন; ইন্টারেক্টিভ মিডিয়ায় তাঁর সমান বিচরণ এবং সেই সঙ্গে কলম আর কাগজের চিরাচরিত মাধ্যমেও তিনি একই রকম দক্ষ ।

Other stories by Priyanka Borar
Editor : Hutokshi Doctor
Series Editor : Sharmila Joshi

শর্মিলা জোশী পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার (পারি) পূর্বতন প্রধান সম্পাদক। তিনি লেখালিখি, গবেষণা এবং শিক্ষকতার সঙ্গে যুক্ত।

Other stories by শর্মিলা জোশী
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota