దయానిత సింగ్ PARIతో కలిసి 2022లో దయానిత సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డును ఆ ఏడాది పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాకు చెందిన ఎమ్. పళని కుమార్ అందుకున్నారు.
ఈ సంవత్సరం రూ. 2 లక్షల విలువైన దయానిత సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డు ఆమె ఎంపిక చేసిన మరో వర్ధమాన, ప్రతిభావంతురాలైన ఫోటోగ్రాఫర్: పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాకు చెందిన ఆయినాకు దక్కింది.
ఆయినా తాను మరచిపోవాలనుకునే వాస్తవాలను తన జ్ఞాపకాలలో సజీవంగా ఉంచడానికి ఒక మార్గంగా ఫోటోగ్రఫీలోకి వచ్చారు. అంతర్గత స్థాయిలో స్థితిస్థాపకత-నిర్మాణ సాధనంగా కనిపించే పరికరం చాలామంది చెప్పలేని కథలను చెప్పడానికి ఉపయోగించే రాజకీయ పరికరం కూడా కావచ్చని ఆమె తెలుసుకున్నారు. సెబాస్టియో సగాడో, వివియన్ మేయా, శంకర్ సర్కార్, పళని కుమార్, ఇంకా ఇతరుల పనిని చూసినప్పుడు ఆమెకు ఈ అవగాహన వచ్చింది. కోవిడ్-19 తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు PARIతో కలిసి పనిచేయడం వలన ఆమెలో ఆ అవగాహన మరింత బలపడింది.
కోవిడ్-19 సమయంలో కామాఠీపురలోని సెక్స్ వర్కర్ల ఫోటోలను, ఎలాంటి ఆరోగ్య సంరక్షణా సహాయం లేకుండా కాలినడకన గ్రామాలకు తిరిగివచ్చిన వలసజీవుల ఫోటోలను ఆమె కెమెరా కన్ను చాలా ఉద్వేగభరితంగా బంధించింది. ఆయినా రూపొందించిన మొత్తం 23 ఛాయాచిత్ర కథనాలు, ఒక మహానగరపు నిర్లక్ష్యం చేయబడిన మూలల్లో నివసించే పాత్రల అద్భుతమైన సమ్మేళనాన్ని మనకు అందిస్తాయి - ముంబై లోకల్లో రాజస్థాన్ నుంచి వలస వచ్చిన సంగీతకారుడు, నగర టాక్సీ డ్రైవర్లు, గేట్వే ఆఫ్ ఇండియా ఫోటోగ్రాఫర్లు, గాడిద పాలను అమ్మే వ్యక్తి, ముంబై వీధుల్లో నాట్యం చేస్తూ, కొరడాతో కొట్టుకునే కర్ణాటక నుంచి వచ్చిన వలసదారుడు. ఈ కథనాలలో సున్నితత్వంతో, సహానుభూతితో ఆమె పట్టణంలో ఒక పల్లెను ప్రదర్శించే తీరుతో పోల్చదగ్గవారు ఎంతోమంది లేరు.















