అక్టోబర్ మాసంలో నిద్రపోని పురిసై గ్రామ సందుల్లో కళాకారులు తమ పాత్రలను రిహార్సల్ చేస్తున్న శబ్దాలు ప్రతిధ్వనిస్తాయి. ఆసక్తిగల ప్రేక్షకులు గ్రామ కూడలిలో గుమిగూడారు, గాలి సంగీతంతో నిండిపోయింది, వీధుల్లో నిరాడంబరంగా వరుసదీరి ఉన్న ఇళ్ళు గ్రీన్ రూములుగా రూపాంతరం చెందాయి. కుప్పుసామి, చంద్ర నడిపించే టీ దుకాణం వంటి చిన్నపాటి స్థానిక వ్యాపారాలు రాత్రంతా కస్టమర్లకు సేవ చేస్తాయి. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రదర్శకులు - ఝార్ఖండ్‌కు చెందిన జానపద నాటక రంగం నుంచి వచ్చినవారు, స్థానిక తెరుక్కూత్తు కళాకారులు, తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పరై బృందాలు, కేరళ, పుదుచ్చేరి నుండి వచ్చిన ప్రదర్శనకారులు, చెన్నై, ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన ఆధునిక నాటక కళాకారులు - ఉన్నారు. పురిసై ఉత్సవంగా పిలిచే ఈ ప్రసిద్ధ కలైమామణి కన్నప్ప తంబిరాన్ స్మారక నాటక ఉత్సవం అక్టోబర్ 6, 2024న మళ్ళీ తిరిగి వచ్చింది.
గతంలో ఇది మూడు రోజుల కార్యక్రమంగా ఉండేది. అయితే, అటువంటి అనేక సంప్రదాయాలకు కోవిడ్-19 అంతరాయం కలిగించిన తరువాత, ఇప్పుడు దీనిని రెండేళ్ళకోసారి, గరిష్టంగా ఒకటిన్నర రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ పండుగ మూలాలు 1989 నాటివి. అప్పుడు ఈ పండుగను కోడై విళా (వేసవికాల పండుగ) అని పిలిచేవారు. దీనిని ఆధునిక నాటక రచయిత ఎన్. ముత్తుసామి, పురిసైకి చెందిన కన్నప్ప తంబిరాన్, ఆయన పెద్ద కుమారుడు కాశీతో కలిసి ప్రారంభించారు. ఈ జానపద రూపం సహజ శక్తితో ప్రేరణ పొందిన ముత్తుసామి, తెరుక్కూత్తును ఆధునిక కథన రీతులతో మిళితం చేయడానికి తంబిరాన్తో కలిసి పనిచేశారు.
ఈ గ్రామం తెరుక్కూత్తు కళాకారులకు కేంద్రంగా పేరుపొందింది. "ఇక్కడ ప్రతి ఒక్కరూ - వారు రైతులైనా, లేదా దినసరి కూలీ కార్మికులైనా - కళాకారులే," అని గ్రామ నివాసి, తెరుక్కూత్తు కళాకారుడు, ఉత్సవ నిర్వాహకులలో ఒకరైన పళని మురుగన్ (49) అన్నారు. నగరాన్ని ఆధారంగా చేసుకొన్న ఆధునిక నాటక రంగం, సమకాలీన నృత్యంలో దశాబ్దాల పాటు గడిపిన తర్వాత, మురుగన్ తెరుక్కూత్తుకు తిరిగి వచ్చారు. "ఏళ్ళ తరబడి సాధన చేసి ఇచ్చిన ప్రదర్శనల తర్వాత దాని యాదృచ్ఛికతకు అనుగుణంగా మారటం సవాలుతో కూడుకున్నది," అని ఆయన అంగీకరించారు, "కానీ ఇది సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లుగా ఉంది."
































