“కొంచెం కోపాన్ని చూపించడానికి కళ్ళను కొద్దిగా పైకి లేపాలి... తీవ్రమైన కోపం చూపించేందుకు, కళ్ళు పెద్దగా చేసి, కనుబొమ్మలు పైకి లేపి ఉంచాలి. ఆనందం చూపించటం కోసం, చిరునవ్వుతో బుగ్గలను పొంగించాలి.’’
ఇలాంటి చిన్న చిన్న వివరాలపై శ్రద్ధ చూపడమే దిలీప్ పట్నాయక్‌ను ఝార్ఖండ్‌లోని సరాయకేలా ఛావ్ నృత్యంలో ఉపయోగించే ముఖాలకు తగిలించుకునే ముసుగులను తయారుచేయడంలో ప్రముఖ కళాకారుడిగా మార్చింది. "మారుముఖం అనేది పాత్రను ప్రతిబింబించాలి," అంటారు ఆయన. "సరాయకేలా మారుముఖాలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి నవరసాలు, అంటే తొమ్మిది రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి, మరే ఇతర ఛావ్ శైలిలో ఇది లేదు."
ఆయన పనిచేసే ప్రదేశంలో వివిధ దశలలో ఉన్న మారుముఖాలు చుట్టూ పడి ఉంటాయి. విశాలమైన కళ్ళు, పెన్సిల్ గీతలాంటి సన్నని కనుబొమ్మలు, ముదురు చర్మపు రంగు... ఇలా విభిన్న వ్యక్తీకరణలను ప్రదర్శిస్తూ అవి రకరకాలుగా ఉంటాయి.
ఈ కళారూపం నృత్యాన్నీ, యుద్ధకళలనూ మిళితం చేస్తుంది. రామాయణం, మహాభారతం, ఇంకా స్థానిక జానపదగాథలకు సంబంధించిన కథలను ప్రదర్శించేటప్పుడు నృత్యకారులు ఈ మారుముఖాలను ధరిస్తారు. దిలీప్ అన్ని మారుముఖాలను తయారుచేస్తారు, కానీ ఆయనకు ఇష్టమైనది కృష్ణుని మారుముఖం. ఎందుకంటే: "పెద్ద కళ్ళు, ఎత్తిన కనుబొమ్మలతో కోపాన్ని వర్ణించడం సులభం, కానీ చిలిపితనాన్ని చూపించడం అంత సులభం కాదు."
దిలీప్ కూడా ఒక కళాకారుడు కావడం దీనికి దోహదపడింది. చిన్నతనంలో ఆయన ఛావ్ నృత్య బృందంలో భాగంగా ఉండేవాడు, ఛావ్ పండుగ సమయంలో స్థానిక శివాలయంలో ఇచ్చే ప్రదర్శనలు చూస్తూ ఆయన నేర్చుకున్నాడు. అప్పటి నుంచీ ఆయనకు ఇష్టమైనది, కృష్ణుడి నృత్యం. ఈ రోజున ఆయన ఢోల్ (డోలు) వాయిస్తారు, ఒక సరాయకేలా ఛావ్ బృందంలో భాగంగా కూడా ఉన్నారు.










