“ఎసి గదుల్లో నిర్వహిం చే ప్రదర్శనలు తాము అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకుంటున్నప్పటికీ, ఎవరి కళ గురించైతే మాట్లాడతాయో వాళ్ళనే అవి స్వాగతించవు. కోర్సులో భాగంగా, నేనొకసారి దిల్లీలో ఒక కళా ప్రదర్శనకి వెళ్ళాను. ఆ హాలులో, నిరుపేదలకు చెందిన ఫోటోలు, శిల్పాలు, చిత్రాలను ప్రదర్శనకి పెట్టారు. కాని అది ఉన్నత వర్గాలకు చెందినదన్న ఒకలాంటి భావన ఆ ప్రదేశంలో ఉట్టిపడింది. నేనక్కడ ఇమడలేననిపించింది,” 22 ఏళ్ళ హైరున్నిశా గంభీరంగా అన్నారు.
“చూడండి, ఇప్పటికే వెలివేయబడిన సముదాయానికి చెందిన వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి అనుభూతికి లోనవుతుంది? అది తనకి చెందిన ప్రదేశమని ఆమె భావిస్తుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేనే గనుక ఒక కళా ప్రదర్శనను నిర్వహిస్తే, అది ఇందుకు భిన్నంగా ఉంటుంది. గోడలపై ఫోటోలు తగిలించి, వాటి గురించి ఎవరితోనో మాట్లాడించడం లాంటిది ఉండదు. అక్కడికి నిజమైన వ్యక్తులను తీసుకువచ్చి, వార్రు ఇతరులతో మమేకమయ్యేలా చూస్తాను. అలాగే, ఆ ఫోటోలలో చిత్రీకరించబడిన పరిసరాలతో ఆ ప్రదర్శనా స్థలాన్ని అనుసంధానిస్తాను.” హైరున్నిశా కె. ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి. తాను వ్యాఖ్యాతగా వ్యవహరించబోయే ఒక క్యాంపస్ కార్యక్రమానికి తిరిగి వెళ్ళడానికి ఆమెకి కేవలం 20 నిమిషాల సమయమే ఉంది మరి.
కొత్తదిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోన్న హైరున్నిశా, ఉత్తర చెన్నై ప్రాంతంలోని ఒక ముస్లిమ్ కుటుంబానికి చెందిన మొదటి తరం విద్యావంతురాలు. “ఆ ప్రాంతం నుండి, చదువు కోసం ఇంత దూరం వచ్చిన వాళ్ళలో నేనే మొదటిదాన్ని. మా సముదాయంలోని మహిళలను డిగ్రీలు చదవకుండా ఇంటికే పరిమితమై ఉండేలా ప్రోత్సహిస్తుంటారు. నాకు 18 ఏళ్ళు నిండగానే పెళ్ళి చేసుకోమని ఒత్తిడి మొదలైంది. దాంతో, నేను పారిపోయి వచ్చేశాను. బయట ఒక విశాలమైన ప్రపంచం ఉందని ఫోటోగ్రఫీయే నాకు చూపించింది,” ఆమె తెలిపారు.
















