“బడికి పంపడానికి ఉదయాన్నే తన పిల్లల్ని నిద్ర లేపి, రుచికరమైన భోజనం వండిపెట్టి, వాళ్ళతో ఎక్కువ సమయం గడిపే తల్లిగా ఉండాలని నా కోరిక. కానీ, వాళ్ళు మేల్కొనడానికి నాలుగు గంటల ముందే నేను ఇంటి నుండి బయలుదేరాలి. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అర్ధరాత్రి ఎప్పుడో నేను ఇంటికి తిరిగి వస్తాను. వారం అంతా నేను ఆలోచించేది ఒకటే: ఆదివారం ఎప్పుడు వస్తుంది, 8 గంటలు హాయిగా ఎప్పుడు నిద్రపోతాను, రోజుకు మూడు పూటలా ఎప్పుడు తింటాను, అలాగే, ఇంట్లో నా పిల్లలతో కొంత సమయం ఎప్పుడు గడుపుతాను అని,” అన్నారు అమ్ములు. కానీ, ఈ రోజు వారాంతం కాదు. ఉత్తర చెన్నైలోని తిరువొత్తియూర్ పరిసరాల్లో ఉన్న ఒక ఇరుకైన వీధిలో, మేమిద్దరం మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. ఆమె తన కూరగాయల బండిని తోస్తున్నారు. నేను కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్నాను.
ఉదయం బయటికి వెళ్తున్నప్పుడు, దారిలో ఆమెను చూశాను. ఇప్పుడు మధ్యాహ్నం నేను ఇంటికి తిరిగి వస్తున్నసమయానికి కూడా అమ్ములు ఇంకా వీధుల్లోనే తిరుగుతున్నారు. మెత్తటి పూనమ్ చీర కట్టుకొని ఉన్న ఆమె, దాదాపు 100 కిలోల బరువున్న తన తోపుడు బండిని తన శక్తినంతా కూడదీసుకొని మరీ తోస్తున్నారు. ఇది 2024, వేసవికాలం. తిరువళ్ళూర్ జిల్లాలో, 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది, అత్యంత వేడిగా ఉన్న రోజున, 44.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే, ఇవేవీ కూడా ఈ 41 ఏళ్ళ కూరగాయల వ్యాపారి దినచర్యలో ఎలాంటి మార్పునూ తీసుకురాలేదు. భారతదేశంలోని 10 మిలియన్ల మహిళా వీధి వ్యాపారులలో, వేసవి వేడితో పోరాడుతున్న 40 శాతం మందిలో అమ్ములు ఒకరు. అలాగే, 68 శాతం వీధి వ్యాపారులలాగే, ఆమె కూడా వేడిగాల్పుల సమయంలో విరామం తీసుకోకుండా, దాదాపుగా ప్రతిరోజూ మధ్యాహ్నభోజనం చేయకుండానే కష్టబడుతుంటారు.






















