నా పేరు ఎస్. కీర్తి, నేను తెన్కాశి జిల్లాలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థినిని. నా పాఠశాల ద్వారానే నేను ఒక ఏడాది కాలం పాటు సాగిన ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో పాల్గొనగలిగాను. మీరు నమ్ముతారో లేదో గానీ, అప్పటివరకూ నేను ఫోటోలను పెళ్ళిళ్ళలో, పెద్ద పెద్ద కార్యక్రమాలలో మాత్రమే తీస్తారనుకునేదాన్ని. మావంటి శ్రామిక వర్గ ప్రజల జీవితాలను, పోరాటాలను ఫోటోల ద్వారా నమోదు చేయవచ్చని నేను మొదటిసారిగా అర్థం చేసుకున్నాను. ఇంకా ఆ ఫోటోలు మమ్మల్ని గౌరవంగా చిత్రీకరిస్తాయి కూడా.
ఒక రోజు వర్క్‌షాప్‌ను అందించినవారు శ్రామిక ప్రజల జీవితాలపై ఒక ఫోటో ఎగ్జిబిషన్ గురించి నాకు చెప్పి, నా చేతుల్లో ఒక కెమెరాను ఉంచారు. తరువాతి మూడు రోజులు నేను జీవితాలను డాక్యుమెంట్ చేయడానికి ప్రయత్నించాల్సి ఉంది. అయితే నాకు ఏమీ తెలియలేదు. మొదటి రోజున నాకు ఎలా షూట్ చేయాలో, ఫోటో డాక్యుమెంటరీ సంగతేమిటో తెలియలేదు. “కథ కోసం మీరెక్కడో దూరంగా వెతకొద్దు. అది ఎప్పుడూ మీ ముందే జరుగుతుంటుంది.” నా శిక్షకుడి మాటలు నాకు గుర్తున్నాయి.
వర్క్‌షాప్‌లో నేను చదివిన "దీపస్థంభపు వెలుగులో, మా అమ్మ జీవితం" అనే కథ నాకు గుర్తుకు వచ్చింది. నా తల్లి కష్టాలను అర్థం చేసుకోవడానికి, ఆమె జీవితాన్ని డాక్యుమెంట్ చేయడానికి నేను ఆమె వెంట ఉండి ఆమెను గమనించాలనుకున్నాను. ఈ సమయంలో నేను తెల్లవారుజాము నుండి రాత్రి వరకు మా అమ్మ చేస్తోన్న పనులను చూస్తూ, ఆమెతో చాలా మాట్లాడాను. ఈ డాక్యుమెంటరీ ద్వారా నా తల్లి ఎంత కఠినమైన జీవితాన్ని గడుపుతోందో నాకు అర్థమైంది. ఆమె పేరు ఎస్. ముత్తులక్ష్మి, వయస్సు 42 సంవత్సరాలు. ఆమె చాలా సాహసి, ధైర్యవంతురాలు కూడా.
ఆమె మాకోసం తన కలలను త్యాగం చేసిన వ్యక్తి. గతంలో మా నాన్న గ్రామంలోనే ఒక చిన్న దుకాణాన్ని నడిపేవాడు. ఆయన చిన్నతనంలో మా నాన్న పని కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఆ తర్వాత మా నాయనమ్మ 2,000 రూపాయలు అప్పుగా తీసుకుని, తమ సొంత స్థలంలో దుకాణం పెట్టుకోవడానికి మా నాన్నకు ఇచ్చింది. ఆయన తన సైకిల్‌పై సమీప గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి కొంత సరుకును తెచ్చుకుని పని ప్రారంభించాడు. ఇది 1997లో జరిగింది.
కానీ 2016లో ఒక దురదృష్టకర ప్రమాదం జరిగింది. మా అమ్మ దగ్గర్లోని ఒక గ్రామంలో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం ప్రారంభించి అప్పటికి రెండు నెలలైంది. ఆమె కళాశాలకు వెళ్ళి బి.ఎ. (తమిళం) కూడా చదవాలనుకుంది. కానీ అప్పుడే నాన్న, మా అన్న, నేను ఒక ప్రమాదంలో గాయపడ్డాం. నాన్న కాలు బాగా దెబ్బతిని, ఆయనకు ఆపరేషన్ చేయాల్సివచ్చింది. మా అన్న, నేను మా కాళ్ళకు చిన్న గాయాలతో బయటపడ్డాం. నాన్నకు శస్త్రచికిత్స చేయించడానికి అమ్మ దగ్గర తగినంత డబ్బు లేదు. కానీ ఆమె ఏదో విధంగా బంధువుల నుండి అప్పులు తీసుకొని, తనకున్న కొన్ని నగలు తాకట్టు పెట్టి, అవసరమైన మూడు లక్షల రూపాయలు పోగుచేసింది. కానీ ఇదంతా ఆమెకు మరిన్ని బాధ్యతలను తెచ్చిపెట్టింది.
అది ఆమె కలలకు పూర్తిగా తెరదించింది. దీనంతటి గురించి తాను ఏమనుకుందో, ఆమె ఎప్పుడూ బయటకు మాట్లాడలేదు. తన కుటుంబాన్ని ప్రేమించడం తన కర్తవ్యమని ఆమె ఎప్పుడూ అనుకుంది. ఆమె తన గురించి తాను పట్టించుకోవటం మానేసింది. అందుకే నేను ఆమె జీవితాన్ని డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను మా బడిలో ఈ ఫోటో డాక్యుమెంటరీని సమర్పించిన తర్వాత, అది చెన్నైలో జరిగిన ప్రదర్శనకు ఎంపికైనప్పుడు, నా తల్లిదండ్రులు నా గురించి చాలా గర్వపడ్డారు. మా నాన్న ఎప్పుడూ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకునేవాడు. ఆయనిప్పుడు నా ప్రయాణం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
నేను ప్రదర్శన జరుగుతోన్న హాలుకు వెళ్ళగానే మొదట చూసింది బ్యానర్‌పై ఉన్న మా అమ్మ ఫోటో. నేను ఉక్కిరిబిక్కిరైపోయాను. చాలామంది కళాకారులు, జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కొంతమంది విదేశీయులు కూడా ఆ ప్రదర్శనను చూసేందుకు వచ్చారు. వారిలో కొందరు పోస్ట్‌కార్డ్‌ల మీద నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరికొందరు నా పని గురించి ప్రోత్సహిస్తూ మాట్లాడారు. కానీ నా ప్రదర్శనను చూడటానికి రాలేకపోయిన ఇద్దరు వ్యక్తులు నా తల్లిదండ్రులు. మేం మా ప్రదర్శనను ముగించే సమయానికి నా తల్లి లెక్కలు చూసుకుంటూ తీరికలేకుండా ఉంటుందని, ఆమె తన కష్టాల జీవితాన్ని కొనసాగిస్తూ ఉందని నాకు తెలుసు.
ఆ కెమెరాను చేతిలో పట్టుకుని నేను మొదటిసారి మా అమ్మను ఫోటో తీసినప్పుడు, తర్వాత ఆ ఫోటోను చూసుకున్నప్పుడు నా తల్లి ముఖంలో కనిపించిన ఆనందం, భావోద్వేగాలు నాకు ఇంకా గుర్తున్నాయి.
























