నేను కె. ముగేశ్. వెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న నేను, ఫోటోగ్రఫీని ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా చదువుతున్నాను. కెమెరాని ఎలా వాడాలో, దాని సహాయంతో ఏది ఎలా రికార్డు చేయాలో నేర్చుకుంటున్నాను. ఈ కథనంలో, రాతి క్వారీలో డ్రిల్లర్గా పనిచేసే నా తండ్రి, 51 ఏళ్ళ కదిర్వేలు కె. లాంటి కార్మికుల కష్టాలను నివేదిస్తున్నాను.
నాన్న పని మీద బయటికెళ్ళిన్నప్పుడు, అమ్మ వసంతి కె. ఇంటి పనులు చేస్తూనే నా 12 ఏళ్ళ చెల్లి దర్శికనూ నన్నూ జాగ్రత్తగా చూసుకుంటుంది. ప్రతి 15 రోజులకొకసారి, ఒకటి లేదా రెండు రోజుల కోసం నాన్న ఇంటికి వచ్చినప్పుడు, మేం ఆయన్ని చూస్తుంటాం. ఆయన తరచూ చాలా అలసిపోయి, నీరసంగా ఉంటాడు. నేను ఆయనతో సమయం గడపేది అప్పుడు మాత్రమే.
నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఆయన పని గురించి మరింత తెలుసుకునే ఉద్దేశ్యంతో నేనాయన్ని బోలెడు ప్రశ్నలు అడుగుతుంటాను. ఆయన నాకెప్పుడూ చాలా ఓపికగా సమాధానమిస్తాడు. అయినప్పటికీ, ఆయన పని స్వభావాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అయితే, ఒక రోజున మా ఫోటోగ్రఫీ క్లాస్ బోధకుడైన శ్రీపతి ప్రోత్సహించిన తరువాత, నేను నాన్నతో పాటు ఆయన పని ప్రదేశానికి వెళదామని నిర్ణయించుకున్నాను. నాతో పాటు నా కెమెరాని కూడా తీసుకెళ్ళాను.
అక్కడ నేను చూసినదాన్ని – నా తండ్రి జీవిత కథని కొన్ని మాటల్లోనూ, అనేక ఫోటోల రూపంలో కూడా ఇలా చిత్రీకరించాను.























