మూడు రోజులు షాజహాన్పూర్ లోని నిరసన స్థలంలో కాలం గడిపిన హనుమంత్ గుంజాల్ మరపురాని జ్ఞాపకాలతో తన గ్రామానికి తిరిగి వెళ్తున్నాడు.
41 ఏళ్ల భిల్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చంద్వాడ్ గ్రామానికి చెందిన ఆదివాసి సాగుదారుడు. ఇతను డిసెంబర్ 25 న షాజహన్‌పూర్ చేరుకున్నాడు. “అక్కడి రైతులు మంచి ఆతిథ్యమిచ్చారు, నిజంగా మంచివారు” అని చెప్పాడు. “వంట కోసం మేము కొద్ది బియ్యాన్ని, పప్పుని వెంట తీసుకువెళ్ళాము. కానీ వాటిని వాడే అవసరమే రాలేదు. వారు మాకు బోల్డంత నెయ్యితో రుచికరమైన ఆహారాన్ని వడ్డించారు. మమ్మల్ని ఔదార్యంగా స్వాగతించారు. ” అన్నాడు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు డిసెంబర్ 21 న, ‘జాత’ అనే వాహనాల కాన్వాయ్, నాసిక్ నగరం నుండి ఢిల్లీకి బయలుదేరింది. 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని శివార్లకి చేరుకోవడానికి సుమారు 1,000 మంది రైతులకు ఐదు రోజులు పట్టింది. షాజహన్‌పూర్ వద్ద, అంటే ఢిల్లీకి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్-హర్యానా సరిహద్దులో జాత ఆగిపోయింది. జాతీయ రాజధాని చుట్టూ ఉన్న నిరసన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ పదివేల మంది రైతులు, ఎక్కువగా పంజాబ్ నుంచి, ఇంకా హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన రైతులు 26 నవంబర్ నాటి నుండి నిరసన చేపట్టారు.
ఈ చట్టాలు మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి. అదే నెల 20వ నాటికి చట్టాలుగా మారాయి. ఈ మూడు చట్టాలు - ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం, రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. ఈ చట్టాలు ఆర్టికల్ 32 ను అణదొక్కి ప్రతి భారతీయుడిని చట్ట సహాయం అందుకోకుండా నిలిపివేసేంతగా ప్రభావితం చేస్తాయని విమర్శలు ఎదుర్కొంటున్నాయి.






