అదొక జరగని కాల్పుల భీభత్సం. న్యూస్ పేపర్లలో దీనిని గురించి వైవిధ్యమైన శీర్షికలు అచ్చయ్యాయి. కానీ అన్నిటికన్నా - బహదూర్ షా జాఫర్ మార్గ్‌పై “రైతును పోలీసులు కాల్చి చంపారు” - అనే వార్త ఈ "హత్య" జరిగిన కొద్ధిక్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కానీ ఆ మరణం కాల్పుల వలన జరగలేదు. జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లో ప్రసిద్ధి చెందిన ఆదాయపు పన్ను కార్యాలయం (ఐటిఓ) జంక్షన్ వైపుకు వచ్చిన నిరసనకారుల సమూహాలలో ఈ విషయం చాలా గందరగోళాన్ని సృష్టించింది. ఇదే పుకారు రెడ్ ఫోర్ట్ వద్ద హింసకు దారితీసింది.
ట్రాక్టర్ నడుపుతున్న ఒక యువ రైతును పోలీసులు పాయింట్-బ్లాంక్ లో కాల్చి చంపారు అనే కథ అందరి నోళ్ళలోనూ పడింది. సోషల్ మీడియా వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఈ కథను అందరికీ చేర్చడంలో ఏ రాజీ లేకుండా పనిచేసింది. కొన్ని టెలివిజన్ ఛానెళ్లు కూడా ఇదే కథను ప్రసారం చేశాయి. మైదానంలో ఉన్న ప్రజలు ఈ ‘గోలికాండ్’ (కాల్పులు) ను నమ్మి పోలీసులు హింసిస్తున్నారని ఆరోపించారు. ఇక ఐటిఓ జంక్షన్ సమీపంలో ఉన్న నిరసనకారులు చెల్లాచెదురయ్యారు.
నిజానికి నలభయిదేళ్ల నవ్నీత్ సింగ్, తాను నడుపుతున్న ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయాడు. అతనిని ఎవరూ కాల్చలేదు. కానీ ఎర్రకోట వద్ద జరిగిన ఈ విధ్వంసాన్ని అర్ధం చేసుకునేలోగా, 2020 సెప్టెంబరులో పార్లమెంటు ద్వారా జారీ చేయబడ్డ మూడు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే నాడు నిరసన తెలిపిన రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీ మరుగున పడిపోయింది.
భిన్నంగా ప్రారంభమైన ఇటువంటి రోజు ఇలా మారిపోవడం చాలా విచారకరం.
అంతకాలం విపరీతమైన చలి, మంచు ఉన్నాగాని, భారతదేశ 72 వ రిపబ్లిక్ డే నాటి ఉదయం మాత్రం వెచ్చగా, ఎండతో మొదలైంది. రెండు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలిపిన రైతులు ప్రణాళికాబద్ధమైన మార్గాల్లో శాంతియుత ట్రాక్టర్ పరేడ్‌లు నిర్వహించి చరిత్ర సృష్టించబోతున్నారు. మధ్యాహ్నం సెంట్రల్ ఢిల్లీ లోని రాజ్‌పథ్‌లో అధికారిక కవాతు ముగిసిన తర్వాత సింఘు, తిక్రీ మరియు ఖాజీపూర్- ఈ మూడు సరిహద్దుల నుండి ఇవి మొదలవ్వాల్సి ఉంది.
ఈ కవాతులు రిపబ్లిక్ డే యొక్క అతిపెద్ద పౌరుల వేడుకగా మారేవి. కానీ సాయంత్రానికల్లా ప్రజల దృష్టి, ఆసక్తి వేరేవైపుకి మరలిపోయింది.








