దిల్లీలో అది ఒక సోమరి శీతాకాలపు మధ్యాహ్నం. జనవరి సూర్యుడు వరండాలో స్వాగతించిన అతిథిలా కూర్చునివున్నప్పుడు కమర్ అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నివసిస్తోన్న తన తల్లికి ఫోన్ చేశారు. 75 ఏళ్ళ వయసున్న షమీమా ఖాతూన్‌ను ఆ పట్టున బిహార్‌లోని సీతామఢీ జిల్లా, బర్రీ ఫుల్వరియా గ్రామంలోని తన చిన్ననాటి ఇంటికి తీసుకువెళ్ళారు.
ఆ మధ్యాహ్నం టెలిఫోన్ లైన్‌కి ఇరువైపులా మాట్లాడుకుంటోన్న ఆ గొంతులు మీకు వినిపించి ఉంటే మీరు ఖచ్చితంగా ఒక వింతను గమనించి ఉండేవారు. కమర్ స్పష్టమైన ఉర్దూలో అడిగారు, “అమ్మీ, జరా యే బతాయియేగా, బచ్‌పన్‌మేఁ జో మేరే సర్ పే జఖమ్ హోతా థా నా ఉస్కా ఇలాజ్ కైసే కర్తే థే?” (అమ్మా, నా చిన్నప్పుడు నా తలమీద కనిపించిన దద్దుర్లను ఎలా నయం చేశావో చెప్పు?)
“శీర్ మేఁ జో హో జాహాయి – తోరొహూ హోలా రహా – బత్‌ఖోరా కహా హాయి ఒకో ఇధర్. రేహ్, చికినీ మిట్టీ లగాకే ధోలియా రహా, మగర్ లగా హాయి బహుత్. త ఛూట్ గెలాయి [నెత్తి మీద కనిపించేది – అది నీకు కూడా వచ్చింది – దాన్నిక్కడ బత్‌ఖోరా అంటారు. నేను నీ తలను రేహ్ (చవిటి మట్టి), చికినీ మిట్టి(మట్టి)తో కడిగాను, కానీ అది చాలా బాధపెడుతుంది. చివరకి, దాన్ని నువ్వు వదిలించుకున్నావు,]" ఆమె తన ఇంటి వైద్యం గురించి వివరిస్తూ ఆనందంగా నవ్వారు. అయితే ఆమె మాట్లాడే భాష కమర్ మాట్లాడే భాషకు భిన్నంగా ఉంది.
వారి సంభాషణలో అసాధారణమైనది ఏమీ లేదు. కమర్, ఆయన తల్లి ఎప్పుడూ ఒకరితో ఒకరు వేర్వేరు భాషల్లోనే మాట్లాడుకుంటారు.
"నేను ఆమె మాండలికాన్ని అర్థం చేసుకుంటాను, కానీ తిరిగి మాట్లాడలేను. ఉర్దూ నా ‘మాతృభాష’ అని నేను చెప్తుంటాను కానీ మా అమ్మ మాట్లాడే భాష వేరేగా ఉంటుంది," ఈ సంగతినంతా ఆ మర్నాడు మేమందరం PARIభాషా సమావేశంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రాయవలసిన అంశంపై చర్చిస్తున్నప్పుడు కమర్ చెప్పారు. "ఆమె భాష పేరేమిటో ఎవరికీ తెలియదు. అమ్మీకి లేదా నా కుటుంబంలో మరెవరికీ, చివరకు దాన్ని మాట్లాడేవారికి కూడా తెలియదు," అన్నారాయన. తనతో సహా, పనికోసం వెతుక్కుంటూ గ్రామం నుండి వలస వచ్చినవాళ్ళెవరూ, తన తండ్రి, సోదరుడు కూడా ఎప్పుడూ ఈ భాష మాట్లాడలేదు. కమర్ పిల్లలు దీన్నించి మరింత దూరమయ్యారు; వారు తమ నాయనమ్మ మాట్లాడే భాషను అర్థం చేసుకోలేరు.



















