వారణాసిలో పోలింగ్ రోజున సల్మాకు రెండు వరసలు కనిపించాయి - ఒకటి పురుషుల కోసం, రెండోది మహిళల కోసం. బంగాలీ టోలా పోలింగ్ బూత్‌ను ప్రసిద్ధ విశ్వనాథ ఆలయానికి దారితీసే ఒక సన్నని సందులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేశారు.
ఆ 25 ఏళ్ళ ట్రాన్స్ మహిళ మహిళల వరసలో నిల్చున్నారు, కానీ "ఆంఖేఁ బడీ హో గయీ థీ సబ్‌కీ [అందరూ గుడ్లప్పగించి చూశారు]. మగవాళ్ళు నన్ను చూడనట్లుగా నటిస్తోంటే, మహిళల వరసలో చివరిగా నిల్చొన్న నన్ను చూసి ఆడవాళ్ళు ఇకిలించటం, గుసగుసలుపోవటం మొదలెట్టారు," అందామె.
కానీ సల్మా ఇవేమీ పట్టించుకోలేదు. "ఏమైతేనేం, నేను లోపలికి వెళ్ళాను," అందామె. "నాకు హక్కు ఉంది [వోటేయడానికి]. ఈరోజున మాకు అవసరమైన మార్పును తీసుకొచ్చేందుకు నేను ఆ హక్కును వినియోగించుకున్నాను."
భారతదేశంలో 48,044 మంది "మూడవ జెండర్‌కు చెందిన వోటర్లు" ఉన్నారని భారత ఎన్నికల సంఘం డేటా చూపిస్తోంది. వారి సంఖ్య కొద్దిపాటిదే అయినప్పటికీ, ఒక ట్రాన్స్ వ్యక్తిగా వోటరు గుర్తింపు కార్డును సంపాదించడం అన్నివేళలా అంత సులభం కాదు. వారణాసిలో సుమారు 300 మంది ట్రాన్స్ జనం ఉన్నారని, వారికి వోటరు గుర్తింపు కార్డులను సంపాదించడం ఒక పోరాటమయిందని ఫ్రిజ్మాటిక్ అనే ప్రభుత్వేతర సంస్థ వ్యవస్థాపక సంచాలకులు నీతి చెప్పారు. "మేం సుమారు 50 మంది ట్రాన్స్ వ్యక్తులకు వోటర్ ఐడిలు సంపాదించాం. కానీ ఎన్నికల సంఘం ధృవీకరణ కోసం ఇళ్ళకు వెళ్ళడాన్ని తప్పనిసరి చేసింది. వారి జెండర్‌ను ధృవీకరించడానికి ప్రజలు తమ ఇళ్ళకు రావడం ఇష్టంలేని ఈ సముదాయంలోని చాలామంది సభ్యులకు ఇది సమస్యగా మారింది,” అని చెప్పారామె.
అయితే సల్మాకు తన వోటర్ గుర్తింపు కార్డును పొందడంలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. "నేను నా కుటుంబంతో గానీ, నా గుర్తింపు తెలియనివారితో గానీ కలిసి జీవించటంలేదు," అని ఆమె చెప్పింది.







