రజిత, తన చిన్నతనంలో తన తండ్రి, తాతయ్యలు చిన్నపిల్లలకు శిక్షణనివ్వడాన్ని కిటికీలోంచి తొంగి చూసేది. వాళ్ళతో పాటు తనెందుకు లేదని ఆశ్చర్యపోయేది కూడా. ఆ చిన్నారి కళ్ళను మరీ ముఖ్యంగా తోలుబొమ్మలు ఆకర్షించాయి. ఆ పద్యాల ప్రత్యేకమైన లయను ఆమె చెవులు ఇష్టపడ్డాయి.
“తోలుబొమ్మలాటపై నాకున్న మక్కువను గమనించి, మా తాత నాకు పద్యాలు నేర్పించడం మొదలుపెట్టారు,” ముప్పై మూడేళ్ళ రజిత అన్నారు.
రజితా పులవర్, షర్నూర్‌లోని తన కుటుంబానికి చెందిన స్టూడియోలో, ఒక చెక్క బల్లపై కూర్చొని, తోల్‌పావకూత్తు తోలుబొమ్మపై ముఖ కవళికలను చెక్కుతున్నారు. ఆమె ముందున్న మేజాబల్లపై అరె, ఉలి, సుత్తి లాంటి రకరకాల ఇనుప పనిముట్లు ఉన్నాయి.
మధ్యాహ్న సమయం, స్టూడియోలో ప్రశాంతత నెలకొంది. బొమ్మలు తయారుచేసే సాలలో రజిత పక్కన గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ చప్పుడు మాత్రమే వినబడుతోంది. బయట, తోలుబొమ్మలు చెక్కడానికి ముందు తోలు పట్టాలు బాగా ఎండేందుకు విశాలమైన మిద్దె మీద ఆరబెట్టారు.
“ఆధునిక ఇతివృత్తాలపై మేమిచ్చే ప్రదర్శనల కోసం ఈ తోలుబొమ్మలు చేసున్నాను,” రజిత తను చేస్తున్న తోలుబొమ్మ గురించి చెప్పారు. తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాట, భారతదేశంలోని మలబార్ తీరానికి చెందిన ఒక సంప్రదాయ కళారూపం. దీనిని భద్రకాళి దేవత వార్షిక ఉత్సవంలో, ఆలయ ప్రాంగణంలో ప్రదర్శిస్తారు.














