పట్నా ఒకప్పుడు వారంపాటు జరిగే తిలంగీ [గాలిపటం] పోటీలను నిర్వహించేది. లఖ్‌నవూ, దిల్లీ, హైదరాబాద్‌ల నుండి గాలిపటాలను ఎగరేసేవారిని ఆహ్వానించేవారు. అది ఒక పండుగ," అంటారు సయ్యద్ ఫైజాన్ రజా. మేం గంగానది వెంబడి నడుస్తూండగా ఆయన మాట్లాడుతున్నారు. నిశ్చలంగా పరచుకొని ఉన్న నది నీటిలో స్వేచ్ఛాకాశం ప్రతిబింబిస్తోంది. అక్కడ ఒకప్పుడు వేలాది గాలిపటాలు ఎగిరేవని అతను చెప్పారు.
పట్నాలోని నది ఒడ్డున ఉన్న దూలీఘాట్‌కు చెందిన వృద్ధుడైన రజా, కులీనుల నుండి తవాయిఫ్‌ల వరకు అన్ని సామాజిక తరగతుల ప్రజలు ఈ క్రీడను ఆదరించారని చెప్పారు. “బిస్మిల్లా జాన్ [తవాయిఫ్] ప్రోత్సాహాన్ని అందించేవారు. మీర్ అలీ జమిన్, మీర్ కెఫాయత్ అలీలు పతంగ్-సాజీ [గాలిపటాలు తయారు చేయడం], పతంగ్-బాజీ [గాలిపటాలను ఎగురువేసే ఆట]కి చెందిన ప్రసిద్ధ ఉస్తాదులలో [నిష్ణాతులు] కొందరు," అంటూ ఆయన వరసగా పేర్లను వల్లించారు.
ఈ అభిరుచి అభివృద్ధి చెందడానికి కారణం, పట్నాలోని అశోక్ రాజ్‌పథ్‌లోని గుర్‌హట్టా నుండి ఖ్వాజాకలాఁ మధ్య 700-800 మీటర్ల ప్రాంతం ఒకప్పుడు గాలిపటాల వ్యాపారులతో నిండి ఉండటమే. వారి రంగురంగుల గాలిపటాలు దుకాణాల వెలుపల ఆకర్షణీయంగా అల్లల్లాడుతూ అందరినీ ఆహ్వానించేవి. “గాలిపటాలు ఎగరేసేటందుకు పట్నాలో దొరికే దారాలు సాధారణంగా దొరికే దారాల కంటే మందంగా ఉంటాయి, వీటిని నూలు, పట్టు కలిపి తయారుచేస్తారు. ఈ దారాలను నఖ్ అని పిలుస్తారు,” అన్నారు రజా.
బలూ మాస పత్రిక 1868 నాటి సంచికలో పట్నా గాలిపటాలకు ప్రసిద్ధి చెందిన నగరంగా పేర్కొన్నారు. “వీలైనంత త్వరగా ధనవంతుడు కావాలనుకునే ప్రతి వ్యక్తి తన జీవితంలో పట్నా గాలిపటాలను చేర్చుకోవాలి. మార్కెట్‌లోని ప్రతి పదవ దుకాణం గాలిపటాలను విక్రయిస్తుంది, మొత్తం జనాభా గాలిపటాలు ఎగురవేస్తున్నారా అన్నట్లు మీకు అనిపిస్తుంది. "వజ్రం ఆకారంలో ఉండే ఈ గాలిపటాలు ఈకల వలె తేలికగా ఉంటాయి. వీటికి తోకలు ఉండవు, తేలికపాటి పట్టు దారాల సహాయంతో వీటిని ఎగురవేస్తారు."
వందేళ్ళు దాటిన తర్వాత, అనేక విషయాలు మారిపోయాయి కానీ పట్నా తిలంగీలు మాత్రం తమ ప్రత్యేక లక్షణాన్ని - అవి తోకలుండని గాలిపటాలు - నిలుపుకున్నాయి. దుమ్ తో కుత్తే కా న హోతా హై జీ, తిలంగీ కా థోడే [తోకలు కుక్కలకు ఉంటాయి, గాలిపటాలకు కాదు]," గాలిపటాలు తయారుచేసే శబీనా నవ్వుతూ అన్నారు. డెబ్బైల వయసులో ఉన్న ఆమె, తన కంటిచూపు బలహీనం కావటంతో తిలంగీలను తయారుచేయటం మానేశారు.




















