కారదగ గ్రామంలో ఎవరికైనా బిడ్డ పుడితే, కుటుంబీకులు ముందుగా సోమక్క పూజారికి తెలియజేస్తారు. దాదాపు 9,000 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో, ఇప్పటికీ గొర్రె వెంట్రుకలతో గాజులు తయారుచేసే అతికొద్దిమంది కళాకారులలో ఆమె ఒకరు. స్థానికంగా కండ అని పిలిచే ఈ ఆభరణాలను శుభప్రదంగా పరిగణిస్తారు, వాటిని నవజాత శిశువుల మణికట్టు చుట్టూ కడతారు.
"గొర్రెలు తరచుగా కఠినమైన వాతావరణంలో, పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ గ్రామాలన్నీ తిరుగుతాయి, రకరకాల ప్రజలతో కలుస్తాయి" అని మలి 50ల వయసులో ఉన్న సోమక్క చెప్పారు. గొర్రెలను సహనానికి చిహ్నంగా పరిగణిస్తారు, వాటి వెంట్రుకలతో చేసిన కండ చెడును దూరం చేస్తుందని విశ్వసిస్తారు
ధనగర్ సముదాయానికి చెందిన మహిళలు సంప్రదాయకంగా ఈ గాజులను తయారుచేస్తారు. నేడు, కారదగలోని ఎనిమిది ధనగర్ కుటుంబాలు మాత్రమే ఈ కళను కొనసాగిస్తున్నాయి. “నిమ్మ గావాలా ఘత్లా ఆహే [ఈ ఊరిలో సగం మంది పిల్లల మణికట్టులను ఈ గాజులతోనే అలంకరించాను],” అని సోమక్క మరాఠీలో చెప్పారు. కారదగ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బెళగావీ జిల్లాలో ఉంది. అందువల్ల సోమక్క వంటి చాలామంది కన్నడ, మరాఠీ రెండు భాషలూ మాట్లాడగలరు.
"కండ కోసం అన్ని కులమతాల ప్రజలూ మా దగ్గరకు వస్తారు," అని సోమక్క చెప్పారు.
చిన్నతనంలో సోమక్క తన తల్లి కిస్నాబాయి బణ్‌గర్, కారదగలోకే అందమైన కొన్ని కండలను తయారుచేయడాన్ని చూశారు. "కండను తయారుచేసే ముందు ఆమె ప్రతి గొర్రె వెంట్రుకను [లోకర్ అని కూడా పిలుస్తారు] ఎందుకు తనిఖీ చేసేదో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉండేది," అని తన తల్లి మెత్తటి వెంట్రుకలను ఎలా ఉపయోగించేదో గుర్తు చేసుకుంటూ చెప్పారామె. మొదటిసారి కత్తిరించిన గొర్రె వెంట్రుకలు బిరుసుగా ఉంటాయి. "వంద గొర్రెలలో, సరైన వెంట్రుకలు కేవలం ఒకదానిలోనే కనిపిస్తాయి."
సోమక్క తన తండ్రి అప్పాజీ బణ్‌గర్ వద్ద కండను తయారుచేయడాన్ని నేర్చుకున్నారు. అప్పుడామె వయస్సు 10 సంవత్సరాలు, దాన్ని నేర్చుకోవడానికి ఆమెకు రెండు నెలలు పట్టింది. నాలుగు దశాబ్దాల తర్వాత, సోమక్క ఈ కళను ఇంకా అభ్యసిస్తూనే ఉన్నారు. కానీ దానికి ప్రజాదరణ క్షీణించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు: “ఈ రోజుల్లో యువ కాపరులు గొర్రెలనే మేపడం లేదు. ఇక గొర్రె వెంట్రుకలతో చేసే కళ గురించి వాళ్ళకేం తెలుస్తుంది?"














