శశి రుపేజా మరీ కచ్చితంగా చెప్పలేకపోవచ్చు కానీ, తాను కుట్టుపని చేస్తూ అతని కంటపడినప్పుడే తన భర్తను ఆకర్షిం చివుంటానని ఆమె భావన. "అతను నన్ను ఫుల్కారీని కుట్టేటప్పుడు చూసి, నేను చాలా కష్టజీవినని అనుకొని ఉండాలి," ఆ ఆనందకరమైన జ్ఞాపకాన్ని నవ్వుతూ చెప్పారు శశి. ఆమె చేతుల్లో సగం పూర్తయిన ఫుల్‌కారీ ఉంది.
అది పంజాబ్‌లో ఒక చల్లని శీతాకాలపు రోజు. శశి తన పొరుగింటి స్నేహితురాలైన బిమలతో కలిసి కూర్చొని చలికాలపు నులివెచ్చని సూర్యకాంతిని అనుభవిస్తున్నారు. తమ రోజువారీ జీవితాల గురించి చర్చించుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటోన్న వారి చేతులు మాత్రం తీరికలేకుండా ఉన్నాయి. అయితే వారు తాము పట్టుకొని ఉన్న రంగుదారాలు ఎక్కించివున్న పదునైన సూదుల మీది నుంచి దృష్టి మరల్చటంలేదు. అవి వస్త్రం మీద ఫుల్‌కారీ నమూనాలను రూపొందిస్తున్నాయి.
"ప్రతి ఇంటిలోని మహిళలు ఫుల్‌కారీ కుట్టుపని చేసిన సమయమొకటి ఉండేది," అన్నారు పటియాలా నగరంలో నివసించే ఆ 56 ఏళ్ళ మహిళ. ఆమె ఒక ఎర్రని దుపట్టాపై తాను కుడుతోన్న పువ్వుకు జాగ్రత్తగా మరో కుట్టును జతచేస్తున్నారు.
ఫుల్‌కారీ అనేది దుపట్టాలు, సల్వార్ కమీజ్, చీరల వంటి వస్త్రాలపై పువ్వులను కుట్టే ఒక ఎంబ్రాయిడరీ శైలి. ముందుగా ఆకృతులు చెక్కివున్న కొయ్య అచ్చుదిమ్మకు సిరా పూసి, వస్త్రంపై ముద్రిస్తారు. కళాకారులు ఆ ఆకృతి పైనా, చుట్టూ రంగు రంగుల పట్టు, నూలు దారాలను ఉపయోగించి కుట్టుపని చేస్తారు. ఈ దారాలు వారికి స్థానికంగా పటియాలా నగరంలోనే దొరుకుతాయి.










